అమ్మతనానికి అద్భుతవరమే కానీ..

‘‘నా బంగారు పాపకు జన్మనిచ్చిన తర్వాత నేను దాదాపుగా మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయా!’’ సిజేరియన్‌ కాన్పు అనంతరం తలెత్తిన విపరీత ప్రభావానికి గురైన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. సిజేరియన్‌ ఆపరేషన్లు సహజ కాన్పులంత సహజమైన వ్యవహారంగా మారిపోయిన నేటి రోజుల్లో ఇలాంటి మాట కాస్త ఆశ్చర్యంగానే అనిపించొచ్చు. నొప్పుల భయంతోనో, ముహూర్తాల పేరుతోనో సిజేరియన్‌ను సులభమైన, తేలికైన మార్గంగా భావించేవారికిది విచిత్రంగానూ అనిపించొచ్చు.

Published : 27 Feb 2018 01:20 IST

అమ్మతనానికి అద్భుతవరమే కానీ..

‘‘నా బంగారు పాపకు జన్మనిచ్చిన తర్వాత నేను దాదాపుగా మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయా!’’ సిజేరియన్‌ కాన్పు అనంతరం తలెత్తిన విపరీత ప్రభావానికి గురైన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. సిజేరియన్‌ ఆపరేషన్లు సహజ కాన్పులంత సహజమైన వ్యవహారంగా మారిపోయిన నేటి రోజుల్లో ఇలాంటి మాట కాస్త ఆశ్చర్యంగానే అనిపించొచ్చు. నొప్పుల భయంతోనో, ముహూర్తాల పేరుతోనో సిజేరియన్‌ను సులభమైన, తేలికైన మార్గంగా భావించేవారికిది విచిత్రంగానూ అనిపించొచ్చు. సిజేరియన్‌ అనేది అత్యవసర సమయంలో తల్లినీ బిడ్డను ఆదుకొనే అద్భుత వరమే తప్ప అనవసరంగా, ఎడాపెడా వాడే విధానం కాదు. ముఖ్యంగా దీంతోనూ పలు దుష్ప్రభావాలు తలెత్తే అవకాశముందనీ తెలుసుకొని ఉండటం అవసరం. అందుకే సిజేరియన్ల మూలంగా ముంచుకొచ్చే సమస్యలపై సమగ్ర కథనం అందిస్తోంది ఈవారం సుఖీభవ.
 

స్త్రీ జీవితంలో గర్భధారణ మరపురాని ఘట్టం. కాన్పు మరింత మధురమైన జ్ఞాపకం. నవమాసాలు కడుపులో పెరిగిన నలుసు కళ్ల ముందు కదలాడిన క్షణంలో అమ్మ ముఖంలో కనిపించే ఆనందాన్ని వర్ణించటానికి ఎన్ని మాటలైనా సరిపోవు. ఇంతటి అపురూపమైన అనుభవంలో ఎలాంటి అపశ్రుతి దొర్లినా తట్టుకోవటం కష్టం. ముఖ్యంగా కాన్పు కష్టమైతే తల్లి పడే బాధ వర్ణనాతీతం. బిడ్డ తల, శరీరం పెద్దగా ఉండి, తల్లి కటిభాగం నుంచి సురక్షితంగా బయటకు రాలేని పరిస్థితి తలెత్తటం.. బిడ్డ సైజు కంటే తల్లి కటిభాగం చిన్నగా ఉండటం.. తల్లికి గుర్రపువాతం (ప్రి ఎంక్లాప్సియా) ఉన్నప్పుడు బిడ్డ పరిస్థితి ప్రమాదకరంగా మారటం.. ఇద్దరి కన్నా ఎక్కువమంది కవలలు పుట్టే అవకాశం ఉండటం.. వంటి పరిస్థితుల్లో కాన్పు కష్టమవుతుంది. ఇది తల్లికీ బిడ్డకూ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేయటానికి అందుబాటులోకి వచ్చిందే సిజేరియన్‌ ఆపరేషన్‌. తల్లికి సమస్యలు రాకుండా, బిడ్డకు కష్టం కలగకుండా చూడటం కోసమే ఇవి మొదలయ్యాయి. వీటి రాకతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోయాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కుటుంబసభ్యుల ఒత్తిళ్లో, ముహూర్త సమయాలో.. కారణాలేవైనా గానీ ప్రస్తుతం సిజేరియన్ల సంఖ్య బాగా పెరిగింది. ఆసుపత్రుల లాభాపేక్ష కూడా ఇందుకు దోహదం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తుండటమూ తెలిసిందే. అవసరమైనప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్‌ చేయటం ఎంత అవసరమో.. అనవసరంగా, ఎడాపెడా  చేయకూడదన్నదీ అంతే అవసరం. మొత్తం కాన్పుల్లో సిజేరియన్‌ కాన్పులు 15% కన్నా మించకూడదని ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు చేసింది కూడా.
ఎందుకు పెరుగుతున్నాయి?
ఒకప్పుడు సిజేరియన్‌ చేయటం చాలా తక్కువ. ఒకవేళ చేసినా తల్లి ప్రాణాలను కాపాడటానికే దీన్ని ప్రయత్నించేవారు. బిడ్డ లోపల మరణించినా కూడా ఎలాగోలా సహజ పద్ధతిలోనే బయటకు తీయటానికి ప్రయత్నించేవారు. అయితే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష అందుబాటులోకి వచ్చాక పరిస్థితి గణనీయంగా మారిపోయింది. కడుపులో ఉండగానే బిడ్డ ఎలా ఉంది? సరిగా ఎదుగుతోందా? అవయవ లోపాలున్నాయా? అనేవి ముందే తెలుస్తున్నాయి. తల్లికి గుర్రపువాతం వంటి రక్తపోటు సమస్యలుంటే బిడ్డ లోపల ఎలా ఉందనేదీ స్పష్టంగా బయటపడుతోంది. అందువల్ల బిడ్డను కాపాడుకోవటానికి అవసరమైతే కాస్త ముందుగానే కాన్పయ్యేలా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పుట్టిన వెంటనే బిడ్డకు ఏదైనా సమస్య వస్తే కాపాడుకోవటానికి నియోనేటల్‌ సంరక్షణ సదుపాయాలూ బాగా పెరిగాయి. ఇవన్నీ ధైర్యంగా సిజేరియన్‌ ఆపరేషన్లు చేయటానికి ఆస్కారం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆలస్యంగా.. 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకునేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. సంతానం కలగనివారికి ఐవీఎఫ్‌ వంటి అధునాతన చికిత్సలూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఎంతోమంది 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా తొలి సంతానాన్ని కంటున్నారు. ఇలా ఆలస్యంగా గర్భం ధరించేవారికి అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉండొచ్చు. శారీరకంగానూ ఎన్నో మార్పులు తలెత్తొచ్చు. సాధారణంగా 21-29 ఏళ్ల మధ్యలో తొలి కాన్పు జరిగితే సమస్యలు తక్కువ. ఆ తర్వాత నుంచీ సమస్యలు పెరుగుతూ వస్తుంటాయి. 40 ఏళ్ల తర్వాత తొలిసారి గర్భం ధరిస్తే కాన్పు సమయంలో చాలా సమస్యలు తలెత్తొచ్చు. అందువల్ల బిడ్డను, తల్లిని కాపాడటానికి సిజేరియన్‌ చేయాల్సిన అవసరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్‌ అవసరమైతే తప్పకుండా చేయాల్సిందే. కాదనటానికి వీల్లేదు. అయితే ఫలానా సమయంలో బిడ్డ పుడితే భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకాలతో, ముహూర్తాల పేరుతో సిజేరియన్‌ కోసం పట్టుబడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కాన్పు నొప్పులకు భయపడి సిజేరియన్‌కు పట్టుబట్టటమూ (సిజేరియన్‌ ఆన్‌ డిమాండ్‌) ఎక్కువైంది. ఇలా అడగ్గానే సిజేరియన్‌ చేయాలా? మామూలు కాన్పుకు ప్రయత్నించొద్దా? అన్నది ఇప్పుడు డాక్టర్లకు నైతిక ప్రశ్నగానూ మారిపోయింది. ఇలాంటి సమయాల్లో అడగ్గానే సిజేరియన్‌ చేయటం కన్నా దీంతో తలెత్తే దుష్ప్రభావాల గురించి ముందుగానే గర్భిణికి, బంధువులకు వివరించి చెప్పటం మంచిది.

ముందే చేస్తే ముప్పు 

మామూలుగా గర్భస్థ శిశువు 40 వారాల పాటు తల్లి కడుపులో ఉంటుంది. ఒకప్పుడు 37 వారాలు దాటితే నెలలు నిండినట్టుగానే (టర్మ్‌) భావించేవారు. అయితే ఇప్పుడు 39-41 వారాల సమయాన్ని టర్మ్‌గానూ.. 37-39 వారాలను ముందస్తు కాన్పు కాలంగానూ (అర్లీ టర్మ్‌) పరిగణిస్తున్నారు. ఇలా 37-39 వారాల సమయంలో పుట్టినవారిలోనూ నెలలు నిండకముందే పుట్టే పిల్లల్లో మాదిరి లక్షణాలే కనిపిస్తున్నాయి. కాబట్టి సిజేరియన్‌ కోసం ప్రయత్నించేవారు ఈ విషయాన్ని కూడా గుర్తించటం అవసరం.

బిడ్డకు ప్రమాదాలు

ముహూర్త సమయాలు చాలావరకు రాత్రి పూటో, తెల్లవారుజామునో ఉంటాయి. అప్పుడు డాక్టర్లు, నిపుణులు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇదీ తల్లీ బిడ్డ ప్రాణాలకు ముప్పు తేవొచ్చు. రాత్రిపూట జరుగుతున్న కాన్పుల్లోనే మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉంటున్న విషయాన్ని అంతా గుర్తించాలి. ఇదొక్కటే కాదు. ఇతరత్రా సమస్యలూ చాలానే ఉంటున్నాయి.
* శ్వాస సరిగా తీసుకోలేకపోవటం
సహజకాన్పులో గర్భసంచి కదలికలకు అనుగుణంగా బిడ్డ ఊపిరితిత్తులు కూడా సంకోచిస్తూ.. వ్యాకోచిస్తూ ఉంటాయి. దీంతో ఊపిరితిత్తులు బలపడి బాగా పనిచేస్తాయి. అయితే సిజేరియన్‌ కాన్పులో బిడ్డను వెంటనే బయటకు తీయటం వల్ల ఊపిరితిత్తులు అంత సమర్థంగా పనిచేయవు. దీంతో శ్వాస తీసుకోవటం కాస్త కష్టమవుతుంది (రెస్పిరేటరీ డిస్ట్రస్‌ సిండ్రోమ్‌).
* అనుబంధం కొరవడటం
సిజేరియన్‌ అయినా కూడా పుట్టిన వెంటనే వీలైనంత త్వరగా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. కొందరు తల్లి బాగా నీరసంగా ఉందనో, మరే కారణాలతోనో రెండు మూడు రోజుల వరకూ పాలు పట్టరు. ఇది తల్లీబిడ్డల మధ్య అనుబంధం కొరవడటానికి దారితీస్తుంది. తల్లికి పాలు కూడా పడవు. దీంతో పోతపాలు పడుతుంటారు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ల వంటివీ ముంచుకొస్తాయి.
* ముందుగానే కాన్పు
గర్భం ధరించిన తర్వాత తొలిసారి చేసే స్కానింగ్‌ చాలా కీలకం. మంచి నిపుణులైన సోనాలజిస్టుతో తొలి 10 వారాల్లో పరీక్ష చేయిస్తే కాన్పయ్యే సమయాన్ని కచ్చితంగా అంచనా వేయొచ్చు. లేకపోతే సిజేరియన్‌ చేయించుకోవాలని అనుకునేవారు కాన్పు సమయానికి ముందుగానే ఆపరేషన్‌కు సిద్ధపడే అవకాశముంది. దీంతో గర్భం ధరించిన 39 వారాల్లోపు సిజేరియన్‌ చేస్తే నెలలు నిండకముందే పుట్టే పిల్లలకు వచ్చే సమస్యలన్నీ తలెత్తొచ్చు.

తొలికాన్పు సిజేరియన్‌ అయినా..

ననాంగ మార్గం నుంచి బిడ్డ బయటకు వచ్చే మార్గం సరిగా లేకపోవటం, బిడ్డ పొజిషన్‌ సరిగా లేకపోవటం, తల్లికి రక్తపోటు లేదా గ్లూకోజు స్థాయులు బాగా పెరిగిపోయి బిడ్డకు ప్రమాదం పొంచి ఉండటం, నెలలు నిండకముందే ఉమ్మనీరు బయటకు వెళ్లిపోవటం.. వంటి పరిస్థితుల్లో (నాన్‌ రికరెంట్‌ ఇండికేషన్‌) తప్పకుండా సిజేరియన్‌ చేయాల్సిందే. అయితే తర్వాతి కాన్పులో ఇలాంటి పరిస్థితులే ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే నిపుణుల సమక్షంలో సహజకాన్పు కోసం ప్రయత్నించొచ్చు. ఒకవేళ కుట్లు చీలటం వంటివి గమనిస్తే 15 నిమిషాల్లోనే సిజేరియన్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో తీవ్రమైన సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చు.

అనర్థాలు ఎన్నెన్నో

ప్రస్తుతం సిజేరియన్‌ను చాలామంది తేలికగానే తీసుకుంటున్నారు. ఒకట్రెండు రోజులు కోత నొప్పులు భరిస్తే చాలు.. తర్వాత అంతా కుదురుకుంటుందని భావిస్తున్నారు. నిజమే.. ఇప్పుడు మత్తుమందు ఇవ్వటం, ఆపరేషన్‌ సదుపాయాలు, ఐసీయూ ఏర్పాట్ల వంటివి బాగా మెరుగయ్యాయి. మంచి యాంటీబయోటిక్‌ మందులు వచ్చాయి. కాన్పు తర్వాత బిడ్డను చూసుకోవటానికి నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగాలు బాగా అభివృద్ధి అయ్యాయి. దీంతో చాలావరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఆపరేషన్‌ పూర్తి చేయటం సాధ్యమవుతోంది. అయితే ఆపరేషన్లు సవ్యంగా జరగానికి, తర్వాత ఏవైనా సమస్యలు తలెత్తితే బయటపడేయటానికే ఇలాంటి సదుపాయాలు ఉన్నాయనే సంగతిని అంతా తెలుసుకోవాలి. వీటిని ఆసరా చేసుకొని సిజేరియన్లతో ఎలాంటి ప్రమాదం ఉండదనే భావనను వదిలిపెట్టాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు అనర్థాలు తప్పవనే విషయాన్ని గుర్తించాలి.
1. మత్తుమందు దుష్ప్రభావాలు
ఆపరేషన్‌ సమయంలో మత్తుమందు ఇవ్వటంలో మంచి పురోగతి సాధించాం. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తినా తప్పించటంలో నైపుణ్యం సాధించాం. అయినా కూడా కొందరిలో మత్తుమందు విపరీత పరిణామాలకు దారితీయొచ్చు. ఇది తల్లి ప్రాణాలకే ముప్పు తేవొచ్చు. వెన్నెముకలోకి మత్తుమందు ఇచ్చినపుడు అది కొందరికి కిందివైపునకు కాకుండా పైభాగాలకూ వెళ్లొచ్చు. దీంతో శ్వాస తీసుకోవటం కష్టం కావొచ్చు. నూటికి 99 మందికి ఇలాంటి సమస్యలేవీ ఉండకపోవచ్చు గానీ కొందరిలో పెద్ద ప్రాణానికే ప్రమాదం తెచ్చిపెట్టొచ్చు.
2. రక్తం ఎక్కువగా పోవటం
మామూలు కాన్పులో 500 ఎం.ఎల్‌. రక్తం పోతే.. సిజేరియన్‌లో కనీసం 1500 ఎం.ఎల్‌. రక్తం పోతుంది. అప్పటికే రక్తహీనత గలవారికిది ప్రమాదకరంగా పరిణమించొచ్చు. వీరికి రక్తం ఎక్కించాల్సిన అవసరముంటుంది. ఇలా రక్తమార్పిడి మూలంగానూ తర్వాత కొన్ని సమస్యలు తలెత్తొచ్చు.
3. రక్తం గూడు కట్టటం
గర్భధారణ సమయంలో సహజంగానే రక్తం గడ్డకట్టటానికి తోడ్పడే ప్రోటీన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కాన్పు అనంతరం త్వరగా రక్తం గడ్డకట్టటానికివి తోడ్పడతాయి. ఒకరకంగా ఇది రక్తస్రావం మరీ ఎక్కువగా కాకుండా శరీరం ఏర్పరచుకున్న రక్షణ వ్యవస్థ. దీంతో చిక్కేంటంటే- రక్తం గూడు కట్టే ముప్పు పెరగటం. బాలింతల్లో రక్తం గూడు కట్టటానికి తోడ్పడే ప్రోటీన్ల స్థాయులు ఎక్కువగా ఉండటమే కాదు. కాన్పు తర్వాత ఒంట్లో ఎక్కువగా ఉన్న నీరంతా బయటకు వెళ్లిపోతుంది. దీంతో రక్తం చిక్కబడటం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతగా కదలకపోతే కాళ్లలో రక్తం గూడుకట్టే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఊబకాయం, అధికబరువు గలవారికి ఈ ముప్పు ఎక్కువ. ఇలా రక్తనాళాల్లో ఏర్పడే రక్తం గడ్డలు అక్కడ్నుంచి ఊపిరితిత్తుల్లోకీ వెళ్లిపోయి (పల్మనరీ ఎంబోలిజమ్‌) తీవ్ర సమస్యకూ దారితీయొచ్చు. ఇలాంటి రక్తం గడ్డలకు రక్తహీనత కూడా దోహదం చేయొచ్చు. అందువల్ల అవసరమైతే రక్తం గూడు కట్టకుండా ఉండటానికి కాన్పయ్యాక ముందుజాగ్రత్తగా ఇంజెక్షన్లు (థ్రాంబోప్రొఫైలాక్సిక్‌) కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ చికిత్స అన్నిచోట్లా అందుబాటులో లేకపోవటం, దీనిపై అవగాహన లేకపోవటం పెద్ద సమస్య.
4. ఇతర భాగాలు దెబ్బతినటం
కోత పెట్టే సమయంలో పొరపాటున మూత్రాశయం, పేగుల వంటివి చీరుకుపోయే ప్రమాదమూ ఉంది. ముఖ్యంగా చివరి నిమిషంలో అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాల్సినవారికి ఇలాంటి ముప్పు ఎక్కువ. ఎక్కడో నొప్పులు మొదలై ఆసుపత్రికి వచ్చేసరికి చాలా సమయం పట్టటం వల్ల వీరిలో కాన్పు జరిగే భాగమంతా వాచిపోయి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిజేరియన్‌ చేసేటప్పుడు మూత్రాశయం, పేగులకు గాయాలయ్యే అవకాశముంటుంది. దీన్ని వెంటనే గుర్తించి, మరమ్మతు చేయకపోతే రక్తస్రావం మూలంగా లోపల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. కొందరికి గర్భాశయం నుంచి ఇతర భాగాలకు మార్గం (ఫిస్ట్యులా) ఏర్పడొచ్చు. అలాగే సిజేరియన్‌ చేసేటప్పుడు బిడ్డకు కూడా పొరపాటున గాయాలయ్యే అవకాశముంది.
5. ఇన్‌ఫెక్షన్లు
కొందరికి కోత పెట్టిన చోట ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. దీంతో జ్వరం, కడుపునొప్పి వంటివి బయలుదేరొచ్చు. చీము పడితే కోతను తిరిగి తెరచి బయటకు తీయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమై ఇతర భాగాలకూ విస్తరించే అవకాశముంది. ఇది ప్రమాదకరంగానూ పరిణమించొచ్చు. కొందరికి గర్భసంచిలో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి రక్తంలో కలిసి ఒళ్లంతా వ్యాపించొచ్చు. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే ప్రాణాలకూ ముప్పు ముంచుకొస్తుంది.

దీర్ఘకాల సమస్యలు

సిజేరియన్‌ మూలంగా అప్పటికప్పుడు తలెత్తే సమస్యలతో పాటు దీర్ఘకాల సమస్యల ముప్పూ పొంచి ఉంటుంది కూడా.
* మాయ కిందిభాగాన పెరగటం
సాధారణంగా మాయ గర్భసంచి పైభాగంలో పెరుగుతుంటుంది. అయితే సిజేరియన్‌ అనంతరం ఇది కిందిభాగంలో పెరిగే అవకాశం ఎక్కువవుతుంది. అసలు మాయ కిందిభాగంలో ఉండటమే (ప్లసెంటా ప్రీవియా) ఒక సమస్య. ఇక అది కుట్లు వేసిన చోట అతుక్కుపోతే మరింత పెద్ద సమస్యగానూ మారుతుంది. అంతేకాదు.. మాయ లోపలి భాగాలకు చొచ్చుకొని వెళ్లటానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఇది గర్భసంచిని దాటుకొని మూత్రాశయం వరకూ విస్తరించొచ్చు (ప్లసెంటా అక్రీటా    స్పెక్ట్రమ్‌). గతంలో చాలా అరుదుగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు తరచుగానూ కనబడుతోంది. సిజేరియన్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ దీని ముప్పూ పెరుగుతూ వస్తోంది. దీంతో అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది.
* కుట్లు విచ్చుకుపోవటం
కొందరు సర్జన్లు గర్భసంచికి పైభాగాన కోత పెట్టి (క్లాసికల్‌) ఆపరేషన్‌ చేస్తుంటారు. దీంతో కుట్లు సరిగా మానవు. మళ్లీ గర్భం ధరించినపుడు కుట్లు విచ్చుకుపోవచ్చు. ఇది తల్లికీ బిడ్డకూ ప్రమాదకరంగా పరిణమించొచ్చు. అదే గర్భాశయం కిందిభాగంలో కోత పెట్టి (లోయర్‌ సెగ్మెంట్‌) ఆపరేషన్‌ చేస్తే ఇలాంటి సమస్యలకు అవకాశముండదు. ఇలాంటి ఆపరేషన్లను గైనకాలజిస్టులే బాగా చేయగలుగుతారు. మామూలు సర్జన్లకు ఇది అంతగా అలవాటు ఉండదు.

సమస్యల నుంచి బయటపడినా..

కొందరు కాన్పు అనంతరం తీవ్ర దుష్ప్రభావాలతో మరణం అంచుల వరకూ వెళ్లినా అదృష్టం కొద్దీ బయటపడుతుంటారు. దీన్నే సామ్‌ (సివియర్‌ ఆక్యూట్‌ మెటర్నల్‌ మార్బిడిటీ) అంటారు. ఇదీ మున్ముందు సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. వీరికి మళ్లీ సంతానం కలగకపోవచ్చు, ఒకవేళ పిల్లలు పుడితే తల్లికి ప్రమాదం తలెత్తొచ్చు, కుట్లు ఊడిపోయి అడ్డదిడ్డంగా చిరిగిపోతే గర్భసంచినే తీసేయాల్సి రావొచ్చు. దీంతో సంతానం కలిగే అవకాశమే ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని