కడుపులో బిడ్డకు గుండె జబ్బా?

మీ కడుపులోని శిశువుకు గుండెజబ్బు ఉండొచ్చని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారని అంటున్నారు కాబట్టి ఒకసారి చిన్నపిల్లల గుండె నిపుణులను సంప్రతించటం మంచిది. ఎకో కార్డియోగ్రామ్‌ పరీక్ష చేస్తే సమస్య ఉన్నదీ లేనిదీ నిర్ధరణ అవుతుంది...

Published : 26 Jun 2018 02:20 IST

సమస్య - సలహా
కడుపులో బిడ్డకు గుండె జబ్బా?

సమస్య: నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం 22 వారాల గర్భిణిని. డాక్టర్లు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేశారు. కడుపులో శిశువుకు గుండెజబ్బు ఉండొచ్చని చెప్పారు. మాకు భయంగా ఉంది. ఇప్పుడేం చేయాలి?

- ఒక పాఠకురాలు, హైదరాబాద్‌

సలహా: మీ కడుపులోని శిశువుకు గుండెజబ్బు ఉండొచ్చని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారని అంటున్నారు కాబట్టి ఒకసారి చిన్నపిల్లల గుండె నిపుణులను సంప్రతించటం మంచిది. ఎకో కార్డియోగ్రామ్‌ పరీక్ష చేస్తే సమస్య ఉన్నదీ లేనిదీ నిర్ధరణ అవుతుంది. గర్భం ధరించిన తర్వాత 18-22 వారాల సమయంలో ‘ఫీటల్‌ ఎకో’ పరీక్ష చేయటం ఉత్తమం. దీని కోసం ముందుగా ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సిన పనేమీ లేదు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె లోపాలు పలు రకాలుగా ఉండొచ్చు. వీటిల్లో చాలా లోపాలను నయం చేయొచ్చు కూడా. కొందరు పిల్లలకు గుండె గదుల మధ్య గోడకు రంధ్రాలు పడుతుంటాయి. ఇవి మామూలుగా ఉంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడు గుర్తించటం కష్టం. పుట్టిన తర్వాతే బయటపడుతుంటాయి. ఒకవేళ ఏవైనా రంధ్రాలున్నా కూడా శస్త్రచికిత్సతో మూసేయొచ్చు. నిజానికి కొన్ని రంధ్రాలు వాటంతటవే మూసుకుపోతుంటాయి కూడా. గుండె నుంచి రక్తాన్ని బయటకు తీసుకెళ్లే ధమనులు అస్తవ్యస్తంగా అతుక్కొని ఉండటం వంటి తీవ్ర లోపాలనూ పుట్టిన వెంటనే శస్త్రచికిత్స చేసి సరిచేయొచ్చు. ఇక కవాటాల లోపం (అయోర్టిక్‌ స్టెనోసిస్‌, పల్మనరీ అట్రీషియా) వంటి సమస్యలకు బిడ్డ తల్లి కడుపులో ఉండగానే బయటి నుంచి చికిత్స చేసి సరిచేసే అవకాశమూ ఉంది. ఇందులో సున్నితమైన సూదిని తల్లి కడుపులోంచి పోనిచ్చి, దాని ద్వారా శిశువు ఛాతీలోని గుండె లోపల బుడగను ప్రవేశపెడతారు. దీంతో కుంచించుకుపోయిన కవాటం వెడల్పు అవుతుంది. ఫీటల్‌ ఎకో పరీక్ష చేయటం ద్వారా ఇలాంటి సమస్యలేవైనా ఉంటే బయటపడతాయి.
ఇవేకాకుండా కొన్ని క్లిష్టమైన సమస్యలూ ఉండొచ్చు. పుట్టుకతో వచ్చే గుండెలోపాల్లో సుమారు 20% లోపాలు చాలా సంక్లిష్టంగానూ ఉంటుంటాయి. అందువల్ల అవసరమైతే కొన్ని జన్యు పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. క్రోమోజోముల్లో పెద్ద మార్పులేవైనా ఉంటే వీటి ద్వారా పట్టుకోవచ్చు. జన్యువులతో ముడిపడిన ఇలాంటి సమస్యలకు పుట్టిన తర్వాత చికిత్స చేయటం కష్టం. వీటికి ప్రస్తుతం కచ్చితమైన చికిత్సలేవీ అందుబాటులో లేవు. ఇలాంటి జబ్బులతో బిడ్డకు మున్ముందు తలెత్తే అనర్థాలు, సమస్యల గురించి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించటం అవసరం. కాబట్టి చిన్నపిల్లల గుండె నిపుణులను కలిస్తే అవసరమైన పరీక్షలు చేసి సమస్యను నిర్ధరిస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని