స్టెంట్లు వేశారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

స్టెంటు అమర్చటమనేది గుండెకు రక్తసరఫరా మెరుగుపడటానికి చేసే చికిత్స. ఇది గుండె తిరిగి సజావుగా పనిచేయటానికి తోడ్పడుతుంది. దీంతో అప్పటికి సమస్య కుదురుకుంటుంది.....

Published : 03 Jul 2018 01:34 IST

సమస్య - సలహా
స్టెంట్లు వేశారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సమస్య: నాకు గత మార్చిలో రెండు స్టెంటులు అమర్చారు. మధుమేహం కూడా ఉంది. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

-హంసిక ప్రియ (ఈమెయిల్‌ ద్వారా)

సలహా: స్టెంటు అమర్చటమనేది గుండెకు రక్తసరఫరా మెరుగుపడటానికి చేసే చికిత్స. ఇది గుండె తిరిగి సజావుగా పనిచేయటానికి తోడ్పడుతుంది. దీంతో అప్పటికి సమస్య కుదురుకుంటుంది గానీ మున్ముందు వేరేచోట పూడిక ఏర్పడే అవకాశం లేకపోలేదు. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ‘స్టెంటు వేశారు కదా, అంతా బాగైపోయిందిలే’ అనుకుంటూ కొందరు మందులు వేసుకోవటం మానేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. క్రమం తప్పకుండా దీర్ఘకాలం మందులు వేసుకోవటం చాలా ముఖ్యమనే సంగతిని మరవరాదు. ఇవి స్టెంటు బాగా పనిచేయటానికి, కొత్తగా వేరేచోట పూడికలు ఏర్పడకుండా ఉండటానికి తోడ్పడతాయి. మందులను మానేస్తే రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడి గుండెపోటు వంటి ముప్పులు ముంచుకురావొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు మానెయ్యరాదు. మీకు మధుమేహం కూడా ఉందంటున్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మధుమేహుల్లో ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్‌, హైబీపీ కూడా ఉండే అవకాశముంది. కాబట్టి ఆహారంలో కొవ్వులు, ఉప్పు తగ్గించుకోవటం మంచిది. బాగా పాలిష్‌ పట్టిన పదార్థాలతో చేసి మార్కెట్లో అమ్మే ఆహార ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలు. వీటిల్లో ఉప్పు, చక్కెర, ట్రాన్స్‌ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు, గ్లూకోజు పెరిగేలా చేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరింత ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా రోజుకు కనీసం అరగంట చొప్పున వారంలో 5 రోజుల పాటు వ్యాయామం చేయాలి. కఠినమైన వ్యాయామాలే చేయాలనేమీ లేదు. కొద్దిగా చెమటలు పడుతూ.. పక్కవాళ్లతో మాట్లాడటానికి కాస్త కష్టంగా అనిపించేంత స్థాయిలో 20 నిమిషాల సేపు నడిచినా సరిపోతుంది. దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండటంతో పాటు గుండె సామర్థ్యమూ పెంపొందుతుంది. మరో ముఖ్య విషయం- అప్పుడప్పుడు డాక్టర్‌ను కలిసి తగు పరీక్షలు చేయించుకోవటం. ప్రతి 6 నెలలకు ఒకసారైనా డాక్టర్‌ను సంప్రతించాలి. రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ స్థాయులతో పాటు బీపీని పరీక్షించుకోవాలి. గుండె ఎలా పనిచేస్తోందనేదీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటుంటే స్టెంటు మరింత ఎక్కువకాలం పనిచేసేలా కాపాడుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని