క్యాల్షియానికి ‘డి’ తోడు!

వృద్ధుల్లో ఎముక పటుత్వం తగ్గటం, క్షీణించటం (ఆస్టియోపోరోసిస్‌) సహజమే. అంతమాత్రాన ఇది అనివార్యమేమీ కాదు. కొన్ని జాగ్రత్తలతో దీని బారినపడకుండా చూసుకోవచ్చు.

Published : 20 Sep 2016 01:36 IST

క్యాల్షియానికి ‘డి’ తోడు!

వృద్ధుల్లో ఎముక పటుత్వం తగ్గటం, క్షీణించటం (ఆస్టియోపోరోసిస్‌) సహజమే. అంతమాత్రాన ఇది అనివార్యమేమీ కాదు. కొన్ని జాగ్రత్తలతో దీని బారినపడకుండా చూసుకోవచ్చు.
ష్టపడే వయసులో డబ్బు దాచుకుంటే వృద్ధాప్యంలో అక్కరకొస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఇది ఎముక పటుత్వానికీ వర్తిస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే 30 ఏళ్ల వరకు ఎముక సాంద్రత పెరుగుతుంటుంది. ఆ తర్వాత క్రమంగా క్షీణించటం మొదలవుతుంది. అందువల్ల 30ల్లో వీలైనంత వరకు ఎముక సాంద్రతను పెంచుకుంటే వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్‌ బారినపడకుండా చూసుకోవచ్చు. కానీ ఇప్పటికే మధ్యవయసు కూడా దాటేసింది కదా.. ఇప్పుడెలా అనుకుంటున్నారా? అయినా మించి పోయిందేమీ లేదు. రోజూ నడక వంటి వ్యాయామాలు చేయటంతో పాటు తగినంత క్యాల్షియం, విటమిన్‌ డి తీసుకుంటే ఎముక పుష్టిని కాపాడుకోవచ్చు.

ఎముకల నిర్మాణంలో, అవి త్వరగా క్షీణించకుండా చూడటంలో క్యాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా పెద్దవారికి 50 ఏళ్ల వయసు వరకు రోజుకు వెయ్యి మిల్లీగ్రాములు.. 51 ఏళ్ల తర్వాత రోజుకు 1,200 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం. 50 ఏళ్ల తర్వాత ఎముక క్షీణించే వేగం పెరుగుతుంది. అలాగే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తిన్న ఆహారం నుంచి పేగులు క్యాల్షియాన్ని గ్రహించుకోవటమూ తగ్గుతుంటుంది. కిడ్నీలు కూడా మునుపటిలా క్యాల్షియాన్ని అంతగా పట్టి ఉంచలేవు. ఫలితంగా శరీరం తన జీవక్రియలకు అవసరమైన క్యాల్షియాన్ని ఎముకల నుంచి తీసుకోవటం ఆరంభిస్తుంది. అయితే ఈ వయసులో క్యాల్షియం లేదా పాల ఉత్పత్తులు మితిమీరి తీసుకోవటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా క్యాల్షియం అధికంగా తీసుకుంటే పురుషులకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్టు చెబుతున్నాయి. మరి దీనికి పరిష్కారమేంటి? క్యాల్షియంతో పాటు ఎముక పుష్టిని కాపాడే ఇతర పోషకాలు కూడా లభించేలా చూసుకోవటం. ముఖ్యంగా విటమిన్‌ డి ఎముకల నిర్మాణ ప్రక్రియలో ఎంతగానో తోడ్పడుతుంది. ఇది మన శరీరం క్యాల్షియాన్ని గ్రహించుకునేలానూ చేస్తుంది.

విటమిన్‌ డి పొందటానికి మనం పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. రోజూ కాసేపు ఎండలో గడిపితే చాలు. ఎండ తగిలినపుడు మన చర్మమే దీన్ని తనకుతానుగా తయారు చేసుకుంటుంది. ప్రస్తుతం విటమిన్‌ డి కలిపి తయారు చేసిన అల్పాహారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరీ అవసరమైతే డాక్టర్ల సలహా మేరకు విటమిన్‌ డి మాత్రలూ తీసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని