వైద్యులతో భేటీ.. సర్వం సిద్ధం కండి!

డాక్టరు దగ్గరకు వెళ్లటమంటేనే చాలామందికి ఏదో గుబులుగా ఉంటుంది. డాక్టరు చాలా హడావుడిగా....

Published : 27 Dec 2016 01:38 IST

సలహా
వైద్యులతో భేటీ.. సర్వం సిద్ధం కండి!

డాక్టరు దగ్గరకు వెళ్లటమంటేనే చాలామందికి ఏదో గుబులుగా ఉంటుంది. డాక్టరు చాలా హడావుడిగా ఉంటారేమో? తన బాధలన్నీ వింటారో, వినరో? అన్న ఆందోళన వేధిస్తుంటుంది. ఇందులో నిజం లేకపోలేదు. చాలామంది వైద్యులు రకరకాల రోగులతో బిజీగానే ఉంటారు. మనకు కేటాయించిన కొద్దిసమయంలోనే వైద్యులకు మనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మొత్తం చెప్పటం చాలా అవసరం. దీనికోసం ముందే కొంత కసరత్తు చేసుకోవటం అవసరం. దీనివల్ల తీరా డాక్టరు గది నుంచి బయటకు వచ్చిన తర్వాత ‘‘అయ్యో! ఈ విషయం చెప్పలేకపోయానే? ఫలానా మందు వేసుకుంటున్నప్పుడు ఈ మందు వేసుకోవచ్చో లేదో అడగ లేదే?..’’ ఇలాంటి రకరకాల శంకలతో మథనపడాల్సిన అవసరం ఉండదు.
బాధలన్నీ రాసుకోండి: డాక్టరుగారి దగ్గరకు వెళ్లేసరికి కొన్నికొన్ని బాధలు మర్చిపోవటమన్నది చాలామందికి ఎదురయ్యే అనుభవమే. అందుకే మన బాధలు, మనం వైద్యులను అడగాలనుకుంటున్న అంశాలన్నీ ఒక క్రమంలో చిన్న చీటీ మీద, సాధ్యమైనంత క్లుప్తంగా రాసుకోవాలి. ముఖ్యమైనవే ముందుగా చెప్పాలి.
మార్పులు చెప్పండి: గతంలో వైద్యులను కలిసినప్పటికీ, ఇప్పటికీ మధ్య కొత్తగా వచ్చిన మార్పు లేమిటో గుర్తు పెట్టుకుని వైద్యులకు చెప్పటం అవసరం. దానివల్ల తాము ఇచ్చిన చికిత్సతో ఫలితాలు ఎలా ఉంటున్నాయన్నది వైద్యులకు తేలికగా అవగతమవుతుంది. ఈ మధ్యలో ఏదైనా సమస్యలు తలెత్తి, దగ్గర్లోని మరో వైద్యునికి చూపించుకుంటే ఆ విషయాన్ని కూడా తప్పని సరిగా చెప్పాలి. ఆకలి, బరువు, నిద్ర, నీరసం, చూపు, వినికిడి.. ఇలాంటి విషయాల్లో ఏవైనా మార్పులు తలెత్తితే తప్పకుండా చెప్పాలి. అయితే ప్రస్తుత సమస్యకు ఏ సంబంధం లేని, ఎప్పటివో చిన్ననాటి విషయాలన్నీ చెప్పటం మొదలెడితే సమయం వృథా కావచ్చు. కాబట్టి ఏం చెప్పాలన్నది ముందుగా మనసులో కసరత్తు చేసుకుని ఉండటం మంచిది.
చీటీ అస్సలు మరవద్దు: చాలామంది వైద్యుల వద్దకు వచ్చినప్పుడు గతంలో రాసిచ్చిన మందుల చీటీ వెంట తెచ్చుకోవటం మర్చిపోతుంటారు. ఫలితంగా- వైద్యులకు అసలు రోగికి తలెత్తిన సమస్య ఏమిటో, గతంలో ఏమేం పరీక్షలు చేయించారో, వాటి ఫలితాలేమిటో, అప్పుడు ఇచ్చిన మందులేమిటో.. ఇవేవీ తెలియకుండా పోతుంది. దీంతో వైద్యుల చేతులు కట్టేసినట్టయిపోతుంది. ఏదేదో వూహించుకుని వైద్యం చెయ్యటం కష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాత చీటీలు, గతంలో చేసిన పరీక్షల రిపోర్టులు వెంట తెచ్చుకోవటం పొరపాటున కూడా మర్చిపోవద్దు.
ఏకాగ్రత ముఖ్యం: వైద్యుల వద్ద గడిపే సమయం తక్కువ. కానీ అది చాలా కీలక సమయం. కాబట్టి వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు మన దృష్టి మళ్లించే విషయాలేమీ లేకుండా చూసుకోండి. ముఖ్యంగా సెల్‌ఫోన్లు ఆపెయ్యండి. కళ్లజోడు, వినికిడి యంత్రాల వంటివి ఉంటే వాటిని తప్పకుండా పెట్టుకోండి. ఒకవేళ వైద్యులు చెబుతున్నది అర్థం కాకపోతే మరోసారి అడగటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాట పడొద్దు. అవసరమైతే ఈ విషయంలో వైద్యుల వద్ద ఉండే సహాయకులు, నర్సుల సహాయం తీసుకోండి.
తోడు తెచ్చుకోండి: వీలైనంత వరకూ సన్నిహితులను ఎవరినైనా తోడు తీసుకువెళ్లొచ్చు. వైద్యులు ఏదైనా తక్షణ చికిత్స సూచించినా, పరీక్షలు చెయ్యాల్సి వచ్చినా, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా తోడుగా ఉన్నవారు ఎంతగానో ఉపయోగపడతారు. అయితే వైద్యులతో ఏదైనా సమస్య గురించి ఏకాంతంగా చర్చించాల్సి ఉంటే... ఆ సమయంలో తోడు వచ్చిన వారిని సున్నితంగా, కొద్దిసేపు బయట వేచి ఉండాల్సిందిగా కోరేందుకు వెనకాడకూడదు.
అనవసర చర్చలు వద్దు: వైద్యుల వద్దకు మనం వెళ్లేది అత్యంత కీలకమైన సలహా సంప్రదింపుల కోసం. ఇలాంటి సమయంలో ఏవేవో లోకాభిరామాయణాలను చర్చకు పెట్టటం సరికాదు. దానివల్ల మన సమయమే వృథా అవుతుంది. వైద్యుల ఏకాగ్రతా దెబ్బతింటుంది. కాబట్టి మనకున్న కొద్ది సమయంలో వైద్యులు ఇచ్చిన సలహా సూచనలను జాగ్రత్తగా వినటం, వాటిని సరిగా అర్థం చేసుకోవటం, అర్థం కాకపోతే మళ్లీ అడిగి తెలుసుకోవటం.. మన దృష్టి మొత్తం వీటి మీదే కేంద్రీకరించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని