పడిపోనివ్వద్దు!

పెద్దవయసు వారిలో ‘పడిపోవటం’ పెద్ద సమస్య! మెట్ల మీద, స్నానాల గదుల్లో, నునుపుగా ఉండే బండల మీద.. ఇలా ఎక్కడో చోట వృద్ధులు జారి పడిపోవటం.. ఎముకలు విరగటం, ముఖ్యంగా తుంటి కీలు విరిగి వారి...

Published : 23 Jan 2018 01:29 IST

మలివయసు..
పడిపోనివ్వద్దు!

పెద్దవయసు వారిలో ‘పడిపోవటం’ పెద్ద సమస్య! మెట్ల మీద, స్నానాల గదుల్లో, నునుపుగా ఉండే బండల మీద.. ఇలా ఎక్కడో చోట వృద్ధులు జారి పడిపోవటం.. ఎముకలు విరగటం, ముఖ్యంగా తుంటి కీలు విరిగి వారి జీవితం ఉన్నట్టుండి సమస్యల వలయంగా మారిపోవటం.. తరచూ చూస్తుండేదే! పైగా ఈ వయసుకు వచ్చేసరికి చాలామందికి ఎముకలు బోలుగా తయారై (ఆస్టియోపొరోసిస్‌) అవి తేలికగా కొద్దిపాటి ఒత్తిడికే విరిగిపోతుంటాయి. తర్వాత- త్వరగా అతకవు కూడా! దీనివల్ల కొన్నిసార్లు మంచానికే పరిమితమవ్వాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతుంటాయి. వీటన్నింటి కారణంగా మలివయసులో జారిపడటం, తుంటిఎముక విరగటమన్నది అతి పెద్ద వృద్ధాప్య సమస్యగా తయారవుతోంది. కాబట్టి అసలీ విపత్తు తలెత్తకుండా చూసుకోవటమే మేలు. ఇంట్లో వృద్ధులు ఉన్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు అనివార్యం.

* ఇంట్లో ఎక్కడకపడితే అక్కడ వైర్లు, తాళ్లు, బట్టల వంటివి పడేసి ఉంటే.. అవి కాళ్లకు అడ్డుపడి వృద్ధులు పడిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వైర్లు, తాళ్ల వంటివాటన్నింటినీ నిర్లక్ష్యంగా నేల మీద వదిలెయ్యకుండా జాగ్రత్తగా ఒక చోట చుట్టి పెట్టడం ముఖ్యం.

* చాలా ఇళ్లలో మెట్ల ప్రాంతం చీకటిగా ఉంటుంది. గదుల్లో తప్పించి, మెట్ల దగ్గర ప్రత్యేకించి లైట్లేమీ ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పెద్దవాళ్లు రాత్రిపూట నిద్రమత్తులో పొరపాటున ఒక చోట అడుగు వేయబోయి మరోచోట వేస్తుంటారు. దీంతో జారిపడి గాయాల పాలవుతుంటారు. కాబట్టి మెట్ల దగ్గర- మంచి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. బద్ధకించకుండా లైటు వేసుకునే.. మెట్ల మీద నడవాలి.

* ఒక వేళ పొరపాటున నీళ్ల లాంటివి ఇంట్లో నేల మీద ఒలికిపోతే అవే ఆరిపోతాయిలే అనే నిర్లక్ష్యం పనికిరాదు. మార్బుల్‌ గచ్చు మీద జారిపడితే గాయాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.

* వృద్ధులు తరచూ ఉపయోగించే మందుల వంటివాటిని ఎక్కడో అందనంత ఎత్తులో పెట్టొద్దు. స్టూల్‌ వేసుకుని వాటిని అందుకునే క్రమంలో వాళ్లు పైనుంచి పడిపోవచ్చు.

* చాలామంది ఇంట్లో సాక్సులు ధరించి నడుస్తుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. నునుపైన నేల మీద అవి తేలికగా జారిపోతుంటాయి. రబ్బరు సోల్‌ ఉన్న పాదరక్షలు ధరించడం మంచిది. ఇవి అంతగా జారే అవకాశం ఉండదు.

* స్నానాల గదిలో ‘నాన్‌స్కిడ్‌ టైల్స్‌’ని వాడాలి. దీనివల్ల అక్కడ పాకుడు పట్టటం, జారిపోవటం వంటి సమస్యలుండవు.

* ఇంట్లో పెంపుడు కుక్కలు, పిల్లులు కూడా చాలాసార్లు దారిలో అడ్డంగా పడుకుంటూ ఉంటాయి. పెద్దవాళ్లు వీటిని చూడక, కాలు తగిలి పడిపోతుంటారు. కాబట్టి పెంపుడు జంతువులకు ఇంట్లో ఏదో ఒక పక్కగా పడుకోవటం అలవాటు చెయ్యాలి.

* కొన్నిసార్లు మనం వాడే మందులు కూడా మగతకు కారణం అవుతాయి. అవి కూడా ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి కనుక.. వైద్యుల్ని మగతగా ఉండని మందులు సిఫార్సు చెయ్యమని కోరాలి. వృద్ధులు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా అవసరం.

* చాలాసార్లు పక్క మీంచి లేచేటప్పుడు దుప్పట్లు కాళ్లకు చుట్టుకుని పడిపోతుంటారు. కాబట్టి హడావుడిగా లేవకుండా.. దుప్పట్లను జాగ్రత్తగా తీసి, పక్కనబెట్టి అప్పుడు నిదానంగా లేచి కూర్చుని, అప్పుడు నిలబడటం అలవాటు చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని