శరీరం ఫిట్‌ మనసూ ఫిట్‌!

వృద్ధాప్యంలో ఎలాంటి జబ్బులు లేకుండా.. ఇతరుల మీద ఆధారపడకుండా హాయిగా జీవించాలనే అంతా కోరుకుంటారు. కానీ దీనికి ముందు నుంచే సన్నద్ధం కావాలనే సంగతిని మాత్రం అంతగా పట్టించుకోరు.....

Published : 10 Jul 2018 01:36 IST

శరీరం ఫిట్‌ మనసూ ఫిట్‌!

వృద్ధాప్యంలో ఎలాంటి జబ్బులు లేకుండా.. ఇతరుల మీద ఆధారపడకుండా హాయిగా జీవించాలనే అంతా కోరుకుంటారు. కానీ దీనికి ముందు నుంచే సన్నద్ధం కావాలనే సంగతిని మాత్రం అంతగా పట్టించుకోరు. నిజానికి ఇదెంతో అవసరం. ముఖ్యంగా తీవ్ర నిరాశలో ముంచేసే కుంగుబాటు.. ఉన్నట్టుండి మృత్యువు కోరల్లోకి తోసే గుండెజబ్బుల విషయంలో మరింత ముఖ్యం కూడా. అధ్యయనాలన్నీ ఈ విషయాన్నే బలపరుస్తున్నాయి. మధ్యవయసులో శారీరక సామర్థ్యం మెరుగ్గా ఉన్నవారికి వృద్ధాప్యంలో కుంగుబాటు, గుండెజబ్బు మరణాల ముప్పులు తగ్గుతున్నాయని చెబుతున్నాయి. సాధారణంగా వృద్ధుల్లో గుండెజబ్బులు, కుంగుబాటు ఎక్కువ. గుండె రక్తనాళాల సమస్యలు.. ముఖ్యంగా పక్షవాతం బాధితుల్లో కుంగుబాటు మరింత ఎక్కువగానూ కనబడుతుంటుంది. అంతేకాదు.. గుండెజబ్బు బాధితులకు కుంగుబాటు మరింత శరాఘాతంగానూ పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యవయసులో శారీరక సామర్థ్యం మూలంగా ఒనగూడుతున్న ప్రయోజనాలపై శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. సగటున 50 ఏళ్ల వయసువారిని ఎంచుకొని సుదీర్ఘ కాలం పరిశీలించారు. మధ్యవయసులో శారీరక సామర్థ్యం స్థిరంగా ఉన్నవారిలో గుండెజబ్బు, కుంగుబాటు గణనీయంగా తగ్గుతున్నట్టు తేలటం గమనార్హం. ఒకవేళ కుంగుబాటు బారినపడ్డా కూడా గుండెజబ్బు మరణాలు తగ్గుముఖం పట్టటం విశేషం. ఇలాటి జబ్బుల విషయంలో జన్యువుల వంటి వాటిని మనం మార్చలేం గానీ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవటమన్నది మన చేతుల్లోని పనే. కాబట్టి ఆలస్యం చేయకుండా వ్యాయామం, శారీరక శ్రమలపై దృష్టి సారించటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని