మోకాలి లిగమెంట్‌ దెబ్బతింటే?

అస్థిబంధనం (లిగమెంట్‌) దెబ్బతిన్నప్పుడు ముందుగా మోకీలు ఎంతవరకు స్థిరంగా ఉంటోందనేది చూడాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్థ్రోస్కోపీ చేసి లోపల లిగమెంట్ల తీరుతెన్నులను పరిశీలించాల్సి వస్తుంది....

Published : 10 Jul 2018 01:37 IST

సమస్య - సలహా
మోకాలి లిగమెంట్‌ దెబ్బతింటే?

సమస్య: నా వయసు 57 ఏళ్లు. పాతికేళ్ల కిందట కింద పడిపోవటం వల్ల మోకాలి కీలులో ఒక అస్థిబంధనం(లిగమెంట్‌) దెబ్బతింది. ఇటీవల మళ్లీ కింద పడ్డాను. ఎంఆర్‌ఐ పరీక్షలో లిగమెంట్‌ అసలే కనబడలేదు. ఇప్పుడేం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- నళిని (ఈమెయిల్‌ ద్వారా)

సలహా: అస్థిబంధనం (లిగమెంట్‌) దెబ్బతిన్నప్పుడు ముందుగా మోకీలు ఎంతవరకు స్థిరంగా ఉంటోందనేది చూడాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్థ్రోస్కోపీ చేసి లోపల లిగమెంట్ల తీరుతెన్నులను పరిశీలించాల్సి వస్తుంది. దాన్ని బట్టి సమస్య ఫిజియోథెరపీతో కుదురుకుంటుందా? పట్టీలు ధరించాలా? సర్జరీతో మరమ్మతు చేయాలా? అనేది నిర్ణయిస్తారు. మోకీలులో ప్రధానంగా.. రెండు క్రుషియేట్‌ లిగమెంట్లు, రెండు కొలేటరల్‌ లిగమెంట్లు ఉంటాయి. ఇవి మోకాలి కీలు స్థిరంగా, అటూఇటూ జారిపోకుండా ఉండటానికి తోడ్పడతాయి. నడిచేటప్పుడు, పరుగెత్తేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు మనం పడిపోకుండా, కాలు ఊగిపోకుండా చూసేవి ఇవే. కింద  పడిపోవటం వల్లనో, ప్రమాదాల్లో గాయపడటం వల్లనో కొన్నిసార్లు ఇవి తెగిపోతుంటాయి. ఇలాంటి సమయాల్లో ముందుగా లిగమెంట్లు ఎంతమేరకు దెబ్బతిన్నాయనేది చూస్తారు. స్వల్పంగా తెగిపోతే ప్రత్యేకమైన వ్యాయాయాలతో కూడిన ఫిజియోథెరపీ బాగా ఉపయోగపడుతుంది. దీంతో మోకాలి చుట్టూరా ఉండే కండరాలు బలోపేతమవుతాయి. లిగమెంట్లు చేసే పనిని కండరాలు తీసుకుంటాయి. ఫలితంగా మోకీలు స్థిరంగా, పట్టుతప్పిపోకుండా ఉంటుంది. ఒకవేళ మోకీలు బాగా అస్థిరంగా ఉంటే ప్రత్యేకమైన పట్టీలు ధరించుకోవచ్చు. ఇవి మోకీలును గట్టిగా పట్టి ఉంచుతూ కదిలిపోకుండా చూస్తాయి. అస్థిబంధనాలు పూర్తిగా తెగిపోతే సర్జరీతో మరమ్మతు చేయొచ్చు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే వస్తేనే ఇది సాధ్యం. సమస్యను ఆలస్యంగా గుర్తించటం వల్ల చాలామందిలో దీనికి అవకాశం ఉండటం లేదు. ఇలాంటివారికి తొడలోని కండర బంధనాన్ని (టెండన్‌) తెచ్చి అమర్చాల్సి (రీకన్‌స్ట్రక్షన్‌) ఉంటుంది. లేకపోతే కీలు అటూఇటూ కదలిపోతూ త్వరగా అరిగిపోయి మున్ముందు మోకాళ్ల నొప్పులకు దారితీస్తుంది. కాకపోతే సర్జరీతో రీకన్‌స్ట్రక్షన్‌ చేయటం చిన్న వయసువారికే బాగా ఉపయోగపడుతుందని గుర్తించాలి.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని