ఒంటికి ఇటుకలు

మాంసకృత్తులు : ఇటుకల్లేని ఇంటిని వూహించగలమా? ఇప్పుడు మన దేహం పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఎందుకంటే మన దేశంలో దాదాపు....

Published : 17 Jan 2016 11:19 IST

ఒంటికి ఇటుకలు

మాంసకృత్తులు ఇటుకల్లేని ఇంటిని వూహించగలమా? ఇప్పుడు మన దేహం పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఎందుకంటే మన దేశంలో దాదాపు 90% మంది మాంసకృత్తుల లోపంలోనే ఉంటున్నారని ఇటీవలే ఒక సర్వే బయటపెట్టింది. అసలు మన శరీరానికి మాంసకృత్తులు ఎంత ముఖ్యమో తెలిస్తే.. ఇదెంత ప్రమాదకరమైన పరిస్థితో మనం తేలికగానే అర్థం చేసుకోవచ్చు. చాలామంది మాంసకృత్తుల లోపం శాకాహారుల్లోనే ఎక్కువగా ఉంటుందని భావిస్తుంటారుగానీ అది నిజం కాదని సర్వే నిగ్గుతేల్చింది. ఇది ఒక రకంగా మన జాతిని నిర్వీర్యం చేసే పెద్ద సమస్య. మనం ఏం తింటున్నాం? మన రోజువారీ ఆహారంలో ఏమేముండాలన్న అవగాహన ప్రతి ఒక్కరికీ చాలా అవసరం!

ఇంటికి ఇటుకలు ఎంత ముఖ్యమో.. మన శరీరానికి మాంసకృత్తులు అంత ముఖ్యం! మన శరీర నిర్మాణంలో మాంసకృత్తులదే ప్రధాన పాత్ర. సులభంగా చెప్పుకోవాలంటే మన ఆహారాన్ని ప్రధానంగా పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్‌లు), కొవ్వులు (ఫ్యాట్స్‌), మాంసకృత్తులు (ప్రోటీన్లు) అని మూడు విభాగాలుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఎదుగుదలకు, చక్కటి ఆరోగ్యానికి ‘పెద్ద మొత్తం’లో అవసరమయ్యే పోషకాలు! ఇక వీటితో పాటు మన ఆహారంలో విటమిన్లు, ఖనిజాల వంటివీ ఉంటాయి, ఇవీ కీలకమేగానీ ‘స్వల్ప మోతాదు’లోనే అవసరం. ఈ పోషకాలన్నింటికీ దేని ప్రత్యేక ప్రయోజనాలు దానికున్నాయి. ఇవన్నీ కూడా మన ఆహారంలో తగుపాళ్లలో ఉండటం చాలా అవసరం. అందుకే వైద్యులు, పోషకాహార నిపుణులంతా కూడా రోజూ ‘సమతులాహారం’ తినటం అవసరమని నొక్కి చెబుతుంటారు. వీటిలో- పిండి పదార్థాలు మనకు ప్రధానంగా శక్తిని అందిస్తాయి. కొవ్వులు అధికంగా శక్తినివ్వటంతో పాటు మన శరీరంలోని జీవక్రియలను నడిపించటంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక మాంసకృత్తులనేవి- మన శరీరంలో కండరాలకు, ఎముకలకు, చర్మానికి.. అన్నింటికీ కీలకమైన వనరు! ఒక రకంగా శరీర నిర్మాణానికి ఈ మాంసకృత్తులే మౌలికం. అందుకే మన శరీరంలో కణాల వృద్ధికి.. అంటే శారీరక ఎదుగుదలకూ, అలాగే ఒంట్లో నిరంతరం జరుగుతుండే మరమ్మతులకు.. రెంటికీ కూడా మాంసకృత్తులే మౌలిక అవసరం. శారీరక దృఢత్వం, సామర్థ్యం బాగుండేందుకు మాంసకృత్తులు తప్పనిసరి. అలాగే జీర్ణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ సజావుగా పని చేసేందుకు కూడా ఈ మాంసకృత్తులు అవసరం.

అందుకని....
మన ఆహారంలో మాంసకృత్తులు తగినంతగా లేకపోతే... శారీరక సామర్థ్యం తగ్గి, అలసట ఆవరించేస్తుంది. కండరాలు క్షీణించటం మొదలుపెడతాయి. కండర క్షీణతతో మనుషులు శుష్కించినట్లవుతుంటారు. రక్తహీనత వస్తుంది. గాయాలు, పుండ్ల వంటివి ఒక పట్టాన మానవు. ముఖ్యంగా- రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి.. తరచూ నానా రకాల ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి. చర్మం పాలిపోయినట్లుగా తయారవుతుంది. శక్తిసామర్థ్యాలు కొరవడి, ఎప్పటికప్పుడు ఉత్తేజాన్ని తెచ్చుకునేందుకు తీపి పదార్థాలు ఎక్కువగా తినాలన్న తహతహ మొదలవుతుంది. మాంసకృత్తులు మరీ తగ్గిపోతే తీవ్రమైన వ్యాధులు చుట్టుముట్టటమే కాదు.. అపస్మారంలోకీ వెళ్లిపోవచ్చు.

ఎదిగే వారికి ఎక్కువ!
మాంసకృత్తులు మనకు నిత్యావసరం. ప్రతి రోజూ ఆహారంలో మాంసకృత్తులు ఉంటేనే మన శరీరం సజావుగా నడుస్తుంది. మన వయసును బట్టి, శారీరక స్థితిని బట్టి, మనం చేసే పనిని బట్టి ఈ మాంసకృత్తుల అవసరం పెరుగుతుంటుంది. ఎదిగే వయసులో ఉన్న పిల్లలు, యుక్తవయస్కులందరికీ మాంసకృత్తులు చాలా ఎక్కువగా అవసరం. అలాగే గర్భిణులకు, జబ్బు పడిన వ్యక్తులకు, ఆపరేషన్ల వంటి వాటి నుంచి కోలుకుంటున్న వారికి, శారీరక కష్టం ఎక్కువగా చేసేవారికి కూడా మాంసకృత్తుల అవసరం మరి కాస్త ఎక్కువగా ఉంటుంది.

శాకాహారులకు సరిపోతుందా: మాంసకృత్తులు- జంతు సంబంధ ఆహార పదార్థాలైన పాలు, గుడ్లు,  మాంసం, చేపల ద్వారా దండిగా లభిస్తాయి. ఇక వృక్ష సంబంధ శాకాహార పదార్థాల్లో రకరకాల పప్పులు, చిక్కుడు జాతి గింజల్లో ఎక్కువగా ఉంటాయి.  అయితే వీటిలో జంతు సంబంధ పదార్థాల నుంచి వచ్చే మాంసకృత్తులు నాణ్యంగా ఉంటాయి, చక్కగా ఒంటబడతాయి కూడా.  మన శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలన్నీ జంతు సంబంధ మాంసకృత్తుల్లో దండిగా, అదీ సరైన పాళ్లలో  

లభిస్తుండటమే దీనికి కారణం. శాకాహార పదార్థాల నుంచి ఇంత సమృద్ధిగా లభించవనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిలో కొన్నికొన్ని అమైనో ఆమ్లాల స్థాయులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగని శాకాహారులు తమకు మాంసకృత్తులు లభించవని అపోహ పడాల్సిన పనేం లేదు. నిత్యం తమ ఆహారంలో- కంది, శెనగ వంటి పప్పులు.. బియ్యం, గోధుమ వంటి తృణధాన్యాలు.. సజ్జలు, జొన్నల వంటి చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవటం ద్వారా అన్ని రకాల అమైనో ఆమ్లాలనూ పొందొచ్చు, వీటి ద్వారా శరీరానికి అవసరమైన మాంసకృత్తులన్నీ చాలా వరకూ లభిస్తాయి. కాకపోతే శాకాహారులు ఇందుకోసం కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం తప్పనిసరి.

శ్రద్ధగా శాకాహారం: శాకాహార పదార్థాల్లో మాంసకృత్తులు ఉండవని కాదు. ఉంటాయిగానీ నాణ్యంగా అధిక మొత్తాల్లో ఉండవు. ఉదాహరణకు పండ్లలోనూ, గుడ్లలోనూ రెంటిలోనూ మాంసకృత్తులు ఉంటాయిగానీ మన శరీరం గుడ్ల నుంచి గ్రహించినంత సులభంగా, ఎక్కువగా పండ్ల నుంచి మాంసకృత్తులను గ్రహించలేదు. అందుకని శాకాహార పదార్థాల్లో వేటిలో మాంసకృత్తులు దండిగా ఉంటాయో గుర్తించి.. రోజూ ఆహారంలో అది ఒక్కటన్నా తప్పకుండా చూసుకోవటం మంచిది. కంది, పెసర, మినుము, శెనగ, వేరుశెనగ, బఠాణీ వంటి పప్పుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవచ్చు. వీటిని వండుకోవటం తేలిక, రకరకాల కూరగాయలతో కలపొచ్చు. సూపులు చేసుకోవచ్చు. సోయా బీన్స్‌తో చేసిన ఉండలు, మీల్‌మేకర్‌ వంటివాటిలో మంచి మాంసకృత్తులుంటాయి, వీటిని అన్ని రకాల కూరల్లో కలుపుకోవచ్చు. ప్రతి పూటా ఆహారంలో ఇలాంటివి ఏదో ఒకటి, అదీ మొత్తం ఆహారంలో కనీసం నాలుగో వంతైనా ఉండేలా చూసుకోవటం అవసరం.

‘ఫాస్ట్‌’ తెచ్చే తిప్పలు
ఆధునికత పేరుతో మన జీవనశైలి మారిపోయిన తర్వాత వేగంగా చకచకా వండుకునే పదార్థాలకు ఆదరణ పెరుగుతోంది. ఇలా ఫాస్ట్‌గా వండే వాటిల్లో చాలావరకు పిండి పదార్థాలూ, అదీ తేలికగా జీర్ణమైపోయే రకమే ఎక్కువగా ఉంటాయి. వీటిలో మాంసకృత్తులు చాలా తక్కువ. కాబట్టి అల్పాహారంగా కూడా ఫాస్ట్‌ ఫుడ్స్‌, బిస్కట్లు, చిప్స్‌, నూడిల్స్‌ వంటి వాటిని ఆశ్రయించే బదులు- వేయించిన శెనగలు, పల్లీల చిక్కీ వంటివి తినటం వల్ల మాంసకృత్తులు లభిస్తాయి. 50 గ్రాముల వేయించిన శెనగల నుంచి దాదాపు 11 గ్రాముల వరకూ మాంసకృత్తులు లభిస్తాయి. ఎక్కడకన్నా వెళ్లేటప్పడు కూడా మాంసకృత్తులు కాస్త ఎక్కువగా ఉండే ఉడికించిన మొలకలు, ఉడికించిన పప్పులు, వేయించిన శెనగలు, ఉడికించిన గుడ్లు, మజ్జిగ వంటివి తేలికగా తీసుకువెళ్లొచ్చు.
* మాంసకృత్తులు దండిగా ఉన్న ఆహారం తీసుకుంటే... చాలాసేపు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది, వెంటవెంటనే ఆకలి వెయ్యదు. దీనివల్ల అనవసరంగా, అధికంగా క్యాలరీలు తీసుకోవటమన్నది ఉండదు. దీనికి తోడు మాంసకృత్తులు దండిగా ఉండే ఆహారం తీసుకుంటే రక్తపోటు, కొలెస్ట్రాల్‌, మధుమేహం వంటివీ కూడా అదుపులో ఉంటున్నాయని అధ్యయన పూర్వకంగా గుర్తించారు.
* సంప్రదాయంగా మనం తినే పప్పు-అన్నం, ఇడ్లి-సాంబార్‌, పూరీ - శెనగల కూర వంటి వాటిలో పప్పులు, తృణ ధాన్యాలు కలగలిసి ఉంటాయి. కాబట్టి వీటి ద్వారా మాంసకృత్తులు అందుతాయి, అవి చక్కగా ఒంటబడతాయి కూడా. కాబట్టి ఫాస్ట్‌ఫుడ్స్‌ కంటే కూడా వివిధ రకాల పప్పులు-ధాన్యాలను కలిపి వండే సంప్రదాయ వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వటం అవసరం.

అతి పనికి రాదు!
మంచిది కదా అని మరీ ఎక్కువగా మాంసకృత్తులు/ప్రోటీను పదార్థాలే తినటం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ. వీటిని అవసరానికి మించి అతిగా తింటే కిడ్నీల మీద భారం ఎక్కువగా పడుతుంది. ఒకవేళ ఎవరైనా కావాలని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం (హైప్రోటీన్‌ డైట్‌) తీసుకుంటుంటే కిడ్నీల మీద భారం పడకుండా ఉండేందుకు నీళ్లు కూడా ఎక్కువగా తాగుతుండాలి. రెండోది- ఏ రకం ఆహారమైనా అవసరానికి మించి తింటే ఆ మిగిలిన శక్తి అంతా కొవ్వు రూపంలో ఒంట్లో చేరి, బరువు పెరిగిపోతారు. కాబట్టి అతిగా అదే తినక్కర్లేదుగానీ అవసరమైనంత ఉండేలా చూసుకోవటం మాత్రం చాలా అవసరం.

ఎంత తినాలి?
నం రోజువారీ మాంసకృత్తులు ఎంత తీసుకోవాలన్నది మన బరువును బట్టి ఉంటుంది. మన బరువు ప్రతి కేజీకీ 1 గ్రాము చొప్పున మాంసకృత్తులు తీసుకోవటం అవసరం. అంటే మనం 50 కేజీల బరువుంటే రోజువారీ మన ఆహారంలో కనీసం 50 గ్రాముల మాంసకృత్తులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి!

హెచ్చరిస్తున్న సర్వే
లోటు 9/10 న ఆహారంలో మాంసకృత్తుల కొరత తీవ్రంగా ఉంటోంది. దేశంలోని ప్రతి 10 మందిలో- 9 మంది మాంసకృత్తులను తీసుకోవాల్సిన దానికంటే తక్కువ తీసుకుంటున్నారని తాజా సర్వే ఒకటి విస్పష్టంగా బయటపెట్టింది. ‘భారత విపణి పరిశోధనా విభాగం (ఐఎంఆర్‌బీ)’ దేశవ్యాప్తంగా అహ్మదాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, విజయవాడ వంటి పలు ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించింది. స్త్రీలు, పురుషులు, అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారూ సర్వేలో ఉండేలా దాదాపు 1300 మందిని పలకరించింది. వీరిలో 41% శాకాహారులు, 59% మాంసాహారులు. చివరికి తేలిందేమంటే- సగటున 90% మంది ఆహారంలో మాంసకృత్తులు తక్కువగా ఉండగా.. శాకాహారుల్లో 91% మందిలో, మాంసాహారుల్లో 85% మందిలో ఈ లోపం కనబడుతోంది. కాబట్టి మాంసకృత్తుల లోపం శాకాహారుల్లోనే ఎక్కువని అనుకోవటానికి లేదని, ఈ లోపం అందరిలోనూ కనబడుతోందని సర్వే స్పష్టం చేసింది. ఇది ఏమాత్రం విస్మరించటానికి వీల్లేని విషయం. ఇటీవల ‘బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌’లో ప్రచురితమైన మరో అధ్యయనం కూడా- మన దేశంలో ప్రజలు పిండి పదార్థాలు, కొవ్వులు అవసరాన్ని మించి అధికంగా తీసుకుంటూ, కీలకమైన మాంసకృత్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టం చేసింది. శాకాహారులు, మాంసాహారులు కూడా తక్షణం రోజువారీ ఆహారంలో మాంసకృత్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సర్వేలు నొక్కి చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని