పిరమిడ్‌ నుంచి ప్లేట్‌!

ఆహారంపై ఇప్పుడు జరుగుతున్నంత చర్చ.... చరిత్రలో మరెప్పుడూ జరగలేదేమో! ఒకప్పుడు...

Published : 17 Jan 2016 11:54 IST

  పిరమిడ్‌ నుంచి ప్లేట్‌!

ఆహారంపై ఇప్పుడు జరుగుతున్నంత చర్చ.... చరిత్రలో మరెప్పుడూ జరగలేదేమో! ఒకప్పుడు మనకు తిండి దొరకటమే గగనం. కరువు కాటకాల మధ్య కొట్టుమిట్టాడుతూ.. అన్నమోయని  అలమటిస్తూ.. తీవ్ర పోషక లోపంతో తంటాలు పడ్డాం! కానీ ఆధునిక వ్యవసాయ విప్లవాల ఫలితంగా ఇప్పుడా స్థితిని దాటేశాం. ఆహార లభ్యత బాగానే పెరిగింది. ఆ మాటకొస్తే... మనం ఏం కావాలంటే దాన్ని ప్లేటులో ప్రత్యక్షం చేసుకునేంత స్థితిమంతులమయ్యామనీ చెప్పుకోవచ్చు. కానీ..  దీన్నుంచే కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అవసరాన్ని మించి.. ఆకలిని మించి.. ఆహారం తీసుకోవటం పెరిగిపోతోంది. అదీ చాలా నాజూకు తిండి! ఫలితమే నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న లబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం...! ఈ రుగ్మతలన్నీ కూడా ఏదో రూపంలో, నేరుగా మన ఆహారంతో ముడిపడిన తీవ్రస్థాయి ఆరోగ్య సమస్యలే. అందుకే ఇప్పుడు మనం ఏం తినాలి; ఎలా తినాలన్నది అత్యంత కీలకమైన అంశంగా... అడుగడుగునా చర్చనీయాంశంగా తయారైంది. దీనిపై పోషకాహార పరిశోధనా రంగం ఎన్నో కుస్తీలు పడుతోంది. ఏది మంచిదో తేల్చటం ఒక ఎత్తైతే... ఏది ఎంత తినాలో సులభంగా, ‘ఆచరణాత్మకంగా’ సూచించటం మరో క్లిష్టమైన వ్యవహారం. ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలతో రూపొందించిన ‘ఆహార పిరమిడ్‌’ దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే మారుతున్న కాలానికి.. మారుతున్న శాస్త్రీయ సమాచారానికి అనుగుణంగా ఆ ‘పిరమిడ్‌’ స్థానే ఇప్పుడు ‘ప్లేటు’ వచ్చి కూర్చుంది. ఆహారంపై కొద్దిపాటి అవగాహన ఉంటే చాలు.. దీన్ని తేలికగా మన ప్లేటులో ఆవాహన చేసుకోవచ్చు. అందుకే ‘జాతీయ పోషకాహార వారోత్సవాల’ సందర్భంగా దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది సుఖీభవ!

నమేం తినాలో మనకు ఎవరూ చెప్పక్కర్లేదు! ప్రతి సమాజంలోనూ తరతరాలుగా ఎవరి ఆహారపుటలవాట్లు వారికున్నాయి. ఎవరి రుచులు, ఎవరి అభిరుచులు వారివి. ప్రతి నాగరికతకూ.. దానికంటూ ప్రత్యేకమైన సనాతన తిండి పద్ధతులూ-ఆహార విధానాలూ ఉంటాయి, అవి ఎంతోకొంత ఆరోగ్యకరంగానే ఉంటాయి. కాకపోతే ఈ ఆధునిక కాలంలో మన జీవన విధానం, సరళి మొత్తం మారిపోతున్నట్టే మన ఆహార పద్ధతులూ మారిపోతున్నాయి. ఆధునిక రుగ్మతలన్నింటికీ ఒక రకంగా మూలం ఇక్కడే ఉందని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు ప్రతి రోజూ ఏమేం తినాలి? ఎలా తినాలి? ఎంత తినాలి? వంటి ప్రశ్నలన్నీ పెద్దఎత్తున మన ముందుకొస్తున్నాయి. దశాబ్దాలుగా వైద్య పరిశోధనా రంగం కూడా దీనిపైనే విస్తృతంగా పరిశోధనలు, అధ్యయనాలు చేస్తోంది. ఎక్కడ, ఎవరి ఆహారం చూసుకున్నా కూడా.. దానిలో ప్రధానంగా ఉండేది పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు. వీటికి తోడు పండ్లు, కూరగాయలు తోడైతే శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాల వంటి పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయి. మన ఆహారంలో వీటన్నింటికీ భాగం ఉండాలి, కాకపోతే ఏది ఎంత తీసుకోవాలన్నదే చిరకాలంగా నలుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ‘సమతులాహార’ ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది పోషకాహార ‘పిరమిడ్‌’!

 ఎక్కడో స్వీడన్‌లో 1974లో పుట్టి, అమెరికాలో వ్యవసాయ విభాగం సమర్థనతో మెరుగులు దిద్దుకుని 1992లో సమగ్రంగా ముందుకొచ్చిన ‘పోషకాహార పిరమిడ్‌’ అందరి మన్ననలందుకుని, ప్రామాణికమైన ఆహార మార్గదర్శిగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నిన్నమొన్నటి వరకూ ఎవరేం తినాలి, ఏది పోషకాహారమంటే అంతా ఈ ‘పిరమిడ్‌’ వైపే చూశారు. స్కూళ్లలో దీన్నే బోధించారు, ఆసుపత్రుల్లో, వైద్య వ్యాసాల్లో, చివరికి ఆహారం డబ్బాల మీద కూడా దీన్నే వాడారు. మనం ఆరోగ్యంగా ఉండేందుకు- మన దైనందిన ఆహారంలో ఏది ఎంత మొత్తంలో ఉండాలో స్పష్టంగా, చాలా తేలికగా అర్థమయ్యేలా సూచిస్తుండటమే ఈ ‘పిరమిడ్‌’ ప్రత్యేకత. 6 అంచెలుగా ఉండే ఈ పిరమిడ్‌- ఒక్కో వర్గం నుంచి ఏయే పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలన్నది సూచిస్తుంటుంది. పిరమిడ్‌ కింద భాగంలో ఉన్న పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలనీ, పైకి వెళ్లిన కొద్దీ ఆయా పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవాలన్న సూచన దీనిలో తేలికగా తెలుస్తుంటుంది. అయితే- మన జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి, అలాగే ఆహార పదార్థాలకు సంబంధించిన అవగాహన కూడా చాలా మారుతూ వచ్చింది. ఆహారానికీ, మన ఆరోగ్యానికీ మధ్యనున్న సంబంధం ఎంత బలమైనదో బయటపడుతున్న నేపథ్యంలో- 2005లో యూఎస్‌డీఏ పాత పిరమిడ్‌ను సమూలంగా సవరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా వ్యాయామాన్ని కూడా దీనిలో అంతర్భాగం చెయ్యటంతో పాటురంగురంగుల్లో ధాన్యం, కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం వంటి విడివిడి విభాగాలు పైనుంచి కిందికి గీతల్లా ఇచ్చారు. కొవ్వును గణనీయంగా తగ్గించి.. చిన్న గీత చేశారు. అయితే దీనిలో స్పష్టత కొరవడిందని, చాలా లోపాలు కూడా ఉన్నాయని తీవ్రస్థాయి విమర్శలు రావటంతో 2011లో జూన్‌లో ‘మై ప్లేట్‌’ పేరుతో అత్యంత సులభమైన ఆహార మార్గదర్శక చిత్రాన్ని విడుదల చేసింది యూఎస్‌డీఏ. దీన్ని అచ్చం.. మనం అన్నం తినే ప్లేటే అనుకుంటే.. దానిలో ఏది ఎంత ఉండాలో సులభంగా చెప్పేస్తుంది ఈ చిత్రం! ఆధునిక పరిశోధనల ఆధారంగా మారిన ఈ నూతన ఆహార విధానంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కొట్టొచ్చినట్టు కనబడతాయి. 

ఇవీ ప్లేటు ప్రత్యేకతలు ..

* పిరమిడ్‌ కంటే కూడా ఈ ప్లేటులో పండ్లు, కూరగాయలకు చాలా ఎక్కువ చోటివ్వటం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం.

* అలాగే మాంసకృత్తుల కంటే కూడా ధాన్యానికి, ముఖ్యంగా ముడిధాన్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం మరో కీలకమైన మార్పు. గతంలో పిండి పదార్థాల కంటే మాంసకృత్తులే అధికంగా తీసుకోవాలని (హైప్రోటీన్‌ డైట్‌) బాగా ప్రచారం జరిగింది. కానీ తాజా పరిశోధనల నేపథ్యంలో ఈ భావనలో ఇప్పుడు మార్పు వచ్చింది. పిండి పదార్థాలను, అదీ ముడి ధాన్యాల వంటివి అధికంగా తీసుకోవటమే ఉత్తమమని ఇప్పుడు స్పష్టంగా గుర్తిస్తున్నారు.

* మాంసాహారం కంటే కూడా ఈ ప్లేటులో వృక్షసంబంధమైన పదార్థాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం గుర్తించాల్సిన మార్పు. ఆధునిక పోషకాహార రంగం.. కూరగాయలు, పండ్లు, ధాన్యాల వంటి వృక్షసంబంధ ఆహారాన్ని పెంచాల్సిన అవసరాన్ని గుర్తించింది.

* మాంసాహారంలో కూడా చికెన్‌, మటన్‌ వంటివాటికంటే కూడా నూనెలు, వేపుడు ఎక్కువగా లేని చేపలు తీసుకోవటం మంచిదని శాస్త్రరంగం నొక్కి చెబుతోంది, అది ఈ మార్గదర్శకాల్లోనూ ప్రతిఫలించింది.

* మాంసకృత్తుల్లో కూడా- మాంసాహార ప్రోటీన్ల కంటే వృక్షసంబంధ ప్రోటీన్లకు మళ్లటం మరింత ఆరోగ్యకరమని గుర్తించటం మరో విశేషం. మటన్‌, చికెన్‌, గుడ్ల వంటి వాటి నుంచి మాంసకృత్తులు దండిగా అందినా, వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటున్నందున వీటిని తగ్గించి గింజధాన్యాలు, పప్పులు పెంచాలని సూచిస్తున్నారు.

ఆధునిక అవగాహన.. మారాల్సిన ఆహారం!!

* ముడి ధాన్యాలు: మన శరీరం శక్తి కోసం ప్రధానంగా పిండి పదార్థాల మీదే ఆధారపడుతుంది. కాబట్టి రకరకాల ధాన్యం, కూరగాయలు, పండ్ల వంటివన్నీ మనకు శక్తినిచ్చేవే. అయితే ఇందుకోసం ధాన్యంలో- ముడిధాన్యం (అంటే ముడి గోధుమలు, ముడిబియ్యం వంటివి) అత్యుత్తమైనదని వైద్యరంగం నొక్కి చెబుతోంది. వీటి నుంచి కేవలం శక్తినిచ్చే పిండి పదార్థంతో పాటు గింజపైన ఉండే తౌడు(బ్రాన్‌), బీజం(జెర్మ్‌) వంటి పొరలూ లభ్యమవుతాయి. బాగా శుద్ధిచేసిన తెల్లబియ్యం, పొట్టు తీసిన గోధుమల వంటివాటి కంటే కూడా ఈ ‘ముడి’ పదార్థాలను జీర్ణించుకోవటానికి శరీరానికి మరికాస్త ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల రక్తంలో గ్లూకోజు స్థాయి వేగంగా పెరగదు, ఇన్సులిన్‌ తూకం తప్పదు. దీనివల్ల మధుమేహం, వూబకాయం, గుండెజబ్బుల వంటివి దరిజేరకుండా ఉంటాయి. మన ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా వాడకంలో ఉన్న కొర్రలు, సజ్జలు, జొన్నల వంటి తృణ ధాన్యాలనూ విరివిగా తీసుకోవటం ఉత్తమం.

* కొవ్వులు: కొత్తగా రూపొందించిన ప్లేటులో కొవ్వులకు ప్రత్యేక స్థానం లేదు. మన శరీరానికి కొవ్వు కచ్చితంగా అవసరమే, కాకపోతే వండిన పదార్థాలన్నింటా నూనెల రూపంలో కొవ్వు ఉంటుంది కాబట్టి- ఆలివ్‌, కనోల, రైస్‌బ్రాన్‌, సోయా, సన్‌ఫ్లవర్‌ వంటి ఆరోగ్యకరమైన నూనెలైనా వాటిని మితంగా వాడుకోవటం, అదీ ఒకటే నూనె కాకుండా పలురకాల నూనెలను కలిపి (బ్లెండ్‌) వాడుకోవటం, అదీ ఎప్పుడూ ఒకటే కాకుండా తరచూ మారుస్తుండటం ఉత్తమమని నేటి వైద్యరంగం స్పష్టంగా భావిస్తోంది. ఈ ఆరోగ్యకరమైన నూనెలు కొలెస్ట్రాల్‌ స్థాయులను మెరుగుపరుస్తాయి.

* పండ్లు, కూరలు: కొత్త ప్లేటులో సగభాగం వీటిదే! మన దైనందిన ఆహారంలో వీటికి ఉన్న ప్రాధాన్యమేమిటో ప్లేటు చూస్తూనే అర్థమైపోతుంది. వీటినే అధికంగా తీసుకుంటే- గుండెపోటు, పక్షవాతం ముప్పులు తగ్గుతాయి. కొన్ని రకాల క్యాన్సర్లు దరిజేరవు. రక్తపోటు తగ్గుతుంది, జీర్ణసమస్యలు రావు. కాబట్టి కూరలు, పండ్లు రోజువారీ ఆహారంలో సగానికిపైగా ఉండాలి. ఒక్క బంగాళ దుంపలు మాత్రం వీటి కిందకు రావు- ఇవి శుద్ధిచేసిన, వేగంగా జీర్ణమైపోయే పిండిపదార్థం లాంటివే కాబట్టి వీటిని బాగా తగ్గించటం ఉత్తమం.

* వీటికి తోడు- మాంసాన్ని మితంగా తినటం, కొవ్వు తీసిన పాలను వాడుకోవటం, ఉప్పు తక్కువగా తినటం, తీపి తగ్గించటం, శుద్ధిచేసిన పదార్థాలను తగ్గించటం.. వీటిని దైనందిన ఆహార విధానంలో భాగం చేసుకోవటం ఉత్తమం!

మారిన జీవనంతోటే మన ఆహారమూ మారాలి!

కప్పుడు మనదేశంలో అంటువ్యాధులు ఎక్కువగా ఉండేవి. గత దశాబ్ద కాలంగా మొట్టమొదటిసారిగా వీటికంటే జీవనశైలీ వ్యాధులు 1% పెరిగాయి. అందువల్ల ప్రభుత్వాలు, వైద్యులు, ప్రజలు వీటి మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం తలెత్తింది. సాంక్రమికేతర సమస్యల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది వూబకాయం. మధుమేహం, గుండె జబ్బు, అధిక రక్తపోటు, క్యాన్సర్లు సైతం ఎక్కువవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆహారంతో ముడిపడిన సమస్యలే కావటం, అదీ ఆహారం అధికం/అస్తవ్యస్తమవటం వల్ల వచ్చే సమస్యలే కావటం గుర్తించాల్సిన అంశం! ఒకప్పుడు పోషకాహార లేమిని (అండర్‌ న్యూట్రిషన్‌) అనుభవించిన మనం ఇప్పుడు అధిక పోషణ (ఓవర్‌ న్యూట్రిషన్‌) దశకు వస్తున్నామనటానికి సంకేతాలు ఈ జబ్బులన్నీ. అందుకే ఇప్పుడు మనం పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 ఆహార కొరతను అధిగమించేందుకు ఒకప్పుడు వరి, గోధుమలను, నూనె గింజలను అధికంగా పండించటం, పాల దిగుబడి పెంచటం వంటి చర్యలు చేపట్టటం మేలే చేసిందిగానీ దీనివల్ల తృణధాన్యాల లభ్యత పెరిగి... కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నల వంటి చిరుధాన్యాల కన్నా వరి, గోధుమల దిగుబడి అధికమైపోయింది. వీటి వినియోగం పెరిగింది. అలాగే క్షీర విప్లవం తర్వాత పాల సంబంధ కొవ్వుల (పన్నీర్‌, వెన్నవంటివన్నీ) వినియోగమూ, నూనె వాడకమూ ఎక్కువైంది. ఇవన్నీ ‘ఓవర్‌ న్యూట్రిషన్‌’కు దారితీస్తున్నాయి.

మనదేశంలో 70 ఏళ్ల క్రితం మధుమేహం దాదాపు లేదనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మధుమేహులు గల దేశంగా మారిపోయింది. గుండెజబ్బుల విషయంలోనూ ముందే ఉన్నాం. మన దగ్గర వూబకాయం ఇంకా ఉద్ధృత స్థాయిలో లేదుగానీ.. త్వరలోనే దీని విషయంలోనూ మిగతా దేశాలతో సమానమయ్యే అవకాశముంది. కాబట్టి మనం మన ఆహారాన్ని ‘సమీక్షించుకోవటం’ చాలా అవసరం.

మనం తీసుకునే ఆహారంలో 60-70% పిండి పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 20% కొవ్వు పదార్థాలు, 10-15% పప్పుల నుంచి లభించే మాంసకృత్తులు ఉంటున్నాయి. ఇది సరైన పద్ధతే. సంప్రదాయంగా పప్పులు, ధాన్యాలు కలిపి వాడటం మనకు అలవాటు. ఉత్తరాదిలో దాల్‌ రోటీ, దక్షిణాదిలో కర్రీ రైస్‌.. ఇలా మనం పిండి పదార్థాలను, మాంసకృత్తులను కలిపి వాడుకుంటున్నాం. ఇది మంచిదేగానీ బియ్యం, గోధుమలను బాగా పాలిష్‌ పట్టి వాడుకోవటం, చిరుధాన్యాలను అంతగా తీసుకోకపోవటం, పాల కంటే వెన్న, నెయ్యి ఎక్కువగా తీసుకోవటం వంటి మార్పులు వస్తున్నాయి. ఇది మంచిది కాదు, ఆహారపరంగా వస్తున్న ఈ మార్పులు పెద్ద ప్రభావాన్నే చూపిస్తున్నాయి. బాగా పాలిష్‌ పట్టిన పిండి పదార్థాలు తీసుకోవటం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయులు పెరిగిపోయి మధుమేహం, గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పండ్లు, కూరగాయలతో పాటు ముడిధాన్యాల వాడకం, వృక్షసంబంధ మాంసకృత్తుల వాడకం పెంచుకోవటం అవసరం. పాశ్చాత్య దేశాల్లో కూడా ఇప్పుడీ విధమైన మార్పులే తీసుకువస్తున్నారు. ఇటీవల ప్రచారంలోకి తీసుకువచ్చిన ‘ఫుడ్‌ ప్లేట్‌’ భావన దీన్నే పట్టిచూపిస్తోంది. ఇందులో 50% పండ్లు కూరగాయలు, మిగిలిన 50%లో మాంసకృత్తులు, కొవ్వులు, ధాన్యాలున్నాయి. దీన్ని పాటించటం మంచిది. అయితే కూరలను వండేటప్పుడు దానిలో నూనె మితి మీరకూడదన్న విషయం మరవకూడదు. 100 గ్రాముల కూరలో సుమారు 30 గ్రాముల నూనె ఉంటోంది, దీనివల్ల కేలరీలు పెరిగిపోతాయి. కాబట్టి వంటకు నూనె మితంగా వాడాలి. మన ఆహారంలో పండ్లు కూరగాయల పరిమాణం పెంచటం, ధాన్యంలో ముడిధాన్యానికి మళ్లటం, మాంసకృత్తుల్లో వృక్షసంబంధ పప్పులకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం అవసరమని గుర్తించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని