పోషకాలు పోనివ్వని ‘మైక్రో’ వంటకం!

మన ఆహార అలవాట్లే కాదు.. వండే పద్ధతులూ మారాయి. కట్టెలు, బొగ్గుల పొయ్యిల స్థానంలో గ్యాస్‌ స్టవ్‌లు వచ్చి చేరాయి. ఇప్పుడు చాలా ఇళ్లల్లో మైక్రోవేవ్‌ ఓవెన్‌లూ

Published : 19 Apr 2016 02:18 IST

పోషకాలు పోనివ్వని ‘మైక్రో’ వంటకం!

న ఆహార అలవాట్లే కాదు.. వండే పద్ధతులూ మారాయి. కట్టెలు, బొగ్గుల పొయ్యిల స్థానంలో గ్యాస్‌ స్టవ్‌లు వచ్చి చేరాయి. ఇప్పుడు చాలా ఇళ్లల్లో మైక్రోవేవ్‌ ఓవెన్‌లూ కనబడుతున్నాయి. వీటిల్లో ఎంత ఉష్ణోగ్రతలో, ఎంతసేపు వండాలో ముందుగానే సెట్‌ చేసుకుంటే వాటంతటవే వంటకాలు సిద్ధమవుతాయి. ఇది తేలికైన, సులభమైన, సురక్షితమైన పద్ధతి కావటంతో చాలామంది వీటిని బాగానే ఇష్టపడుతున్నారు. అయినప్పటికీ.. వీటి వాడకంపై కొన్ని అపోహలున్నాయి. మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వండితే పోషకాలు తగ్గిపోతాయని, ఆరోగ్యానికి అంత మంచిది కాదని భావిస్తుంటారు. నిజంగా ఇవి హాని చేస్తాయా?

మైక్రోవేవ్‌ ఓవెన్‌ పనిచేసే తీరును తెలుసుకుంటే పోషకాలు తగ్గుతాయా.. లేదా? అనేది ఇట్టే అర్థమవుతుంది. మైక్రోవేవ్‌ ఓవెన్లు రేడియో తరంగాల వంటి శక్తి తరంగాల సాయంతో పదార్థాలు ఉడికేలా చేస్తాయి. ఈ తరంగాలు కొన్నింటి మీదనే.. ప్రధానంగా నీరు, ఒక చివర ధనావేశం మరో చివర రుణావేశం గల ఇతర అణువులను ఎంచుకొని పనిచేస్తాయి. అణువులను కంపించేలా చేసి, చాలా త్వరగా వేడిని పుట్టిస్తాయి. సాధారణంగా పదార్థాలు వేడికి గురైనప్పుడు వాటిల్లోని విటమిన్‌ సి, విటమిన్‌ బి 12 వంటి కొన్ని పోషకాలు తగ్గిపోతాయి. మైక్రోవేవ్‌ ఓవెన్‌తో ఇలాంటి అనర్థం తక్కువ. ఎందుకంటే ఇందులో పదార్థాలు త్వరగా వేడెక్కి, ఉడుకుతాయి. నీరు కూడా తక్కువ పడుతుంది. పదార్థాలు లోలోపలే ఆవిరి ద్వారా ఉడుకుతాయి. కాబట్టి పోషకాలు, ఖనిజాలు పెద్దగా తగ్గవు. కానీ మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పదార్థం మొత్తం ఒకే స్థాయిలో వేడెక్కదు. దీంతో అతిగా వేడెక్కిన చోట పోషకాలు మరింత ఎక్కువగా విడివడతాయి. కాబట్టి పాత్రలపై మూత పెట్టి, విద్యుత్తును తక్కువ స్థాయిలో సెట్‌ చేసుకుంటే పదార్థాలు అతిగా వెడెక్కవు. అదే సమయంలో వేగంగా ఉడుకుతాయి కూడా. మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ప్లాసిక్‌ పాత్రలను వాడటం మంచిది కాదని, పాస్టిక్‌లోని క్యాన్సర్‌ కారక డయాక్సిన్లు పదార్థాలకు చేరుకుంటాయని కొందరు భావిస్తుంటారు. నిజానికి చెత్త, ప్లాస్టిక్‌, లోహాలు, చెక్క వంటి వాటిని మండించినపుడు డయాక్సిన్లు విడుదలవుతుంటాయి. మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పదార్థాలు మండిపోనంతవరకు డయాక్సిన్ల ప్రభావానికి గురయ్యే అవకాశం లేదు. ప్లాస్టిక్‌లోనూ రెండు రకాలున్నాయి. బీపీఏతో తయారుచేసినవి గట్టిగా, థాలేట్స్‌తో చేసినవి మృదువుగా ఉంటాయి. బీపీఏ, థాలేట్లు మన శరీరంలో హార్మోన్లను అస్తవ్యస్తం చేసే అవకాశముంది. కాబట్టి ప్లాస్టిక్‌ వాడకంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వాడుకోవటానికి సురక్షితమైన ప్లాస్టిక్‌ పాత్రలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటితో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ప్లాస్టిక్‌ పాత్రలపై అనుమానాలుంటే మైక్రోవేవ్‌ ఓవెన్‌లో వాడుకోవటానికి వీలైన గాజు, సిరమిక్‌ పాత్రలు ఉపయోగించొచ్చు. పాత్రలపై పరిచే ప్లాస్టిక్‌ పొరలు పదార్థాలకు అంటుకోకుండా చూసుకోవాలి. వేడికి మెత్తబడే నీళ్ల బాటిళ్లు, ప్లాస్టిక్‌ బుట్టలు, జగ్గులు, పాస్టిక్‌ బ్యాగుల వంటివి ఓవెన్‌లో పెట్టొదు. అలాగే పాత, గీతలు పడిన, పగిలిన, చాలాసార్లు ఓవెన్‌లో వాడిన పాస్లిక్‌ పాత్రలను ఉపయోగించొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని