నీరు ప్రాణాధారం!

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నీళ్లు బాగానే తాగుతుంటాం. చల్లగా ఉన్నప్పుడు మాత్రం పెద్దగా పట్టించుకోం.....

Published : 11 Oct 2016 02:12 IST

నీరు ప్రాణాధారం!

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నీళ్లు బాగానే తాగుతుంటాం. చల్లగా ఉన్నప్పుడు మాత్రం పెద్దగా పట్టించుకోం. దాహం వేస్తే గానీ నీళ్ల గురించి ఆలోచించం. నిజానికి దాహం వేయటానికి ముందుగానే.. మన ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. పరిస్థితి ఇంతవరకు రాకుండా తరచుగా నీళ్లు తాగటం మంచిదన్నది నిపుణుల సూచన. కానీ మనలో చాలామంది.. ముఖ్యంగా వృద్ధులు తగినంత నీరు తాగరు. వయసులో ఉన్నప్పటి కన్నా వృద్ధాప్యంలో దాహం వేస్తున్న విషయాన్ని గుర్తించటం తగ్గుతుంది. ఇక మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు కూడా వేసుకుంటుంటే ఇది మరింత సమస్యాత్మకంగా పరిణమిస్తుంది.

మన ఒంట్లో ప్రతి వ్యవస్థా సక్రమంగా పనిచేయటానికి నీరు ఎంతగానో తోడ్పడుతుంది. ఇది కణాలన్నింటికీ పోషకాలు, ఆక్సిజన్‌ను చేరవేయటం దగ్గర్నుంచి.. మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు వెళ్లగొట్టటం వరకు రకరకాల పనులు చేస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకాన్ని దరిజేరనీయదు. రక్తపోటును, గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. అవయవాలను, కణజాలాలను రక్షిస్తూ.. కీళ్లు ఒరుసుపోకుండా చూస్తుంది. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ.. సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంది. ఇంత కీలకమైంది కాబట్టే నీటి శాతం తగ్గితే బలహీనత, రక్తపోటు పడిపోవటం, తికమక, తలతిప్పు వంటి లక్షణాలు బయలుదేరతాయి. కాబట్టి రోజుకు సుమారు 2 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. ఇది కూడా ఆయా వ్యక్తులను బట్టి మారుతుంది. కొన్ని జబ్బులు గలవారు మరింత ఎక్కువగా తాగాల్సిన అవసరం ఉండొచ్చు. అలాగే వ్యాయామం, శారీరక శ్రమ చేసేవారు చెమట రూపంలో బయటకు వెళ్లే నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి. మొత్తమ్మీద మూత్రం ముదురు రంగులో రాకుండా చూసుకుంటే తగినంత నీరు తాగుతున్నట్టే. ఎప్పుడైనా సరే.. కూల్‌డ్రింకుల కన్నా నీరు తాగటమే ఉత్తమం. పండ్లు, సలాడ్ల వంటివీ తినొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని