బి12 ఇంజెక్షన్లతో బలం పెరుగుతుందా?

బలం పెరుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, బరువు తగ్గటం ఆగుతుందని కొందరు విటమిన్‌ బి12 ఇంజెక్షన్లు తీసుకుంటుంటారు. ఇలాంటి ధోరణి పల్లెటూళ్లలో ఎక్కువ.

Published : 14 Feb 2017 02:06 IST

బి12 ఇంజెక్షన్లతో
బలం పెరుగుతుందా?

లం పెరుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, బరువు తగ్గటం ఆగుతుందని కొందరు విటమిన్‌ బి12 ఇంజెక్షన్లు తీసుకుంటుంటారు. ఇలాంటి ధోరణి పల్లెటూళ్లలో ఎక్కువ. నిజానికి రక్తంలో బి12 మోతాదులు మామూలుగా ఉంటే వీటితో ప్రయోజనమేమీ ఉండదు. అయితే బి12 మోతాదులు తగ్గినవారు మాత్రం దాన్ని భర్తీ చేసుకోవటం చాలా అవసరం. దీని లోపం వృద్ధుల్లో, పూర్తి శాకాహారుల్లో, బరువు తగ్గటానికి బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నవారిలో తరచుగా కనబడుతుంది. తేలికైన రక్తపరీక్ష ద్వారా దీని మోతాదులు తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షను అంతగా చేయరు. అందువల్ల ఒకవేళ లోపం ఉన్నా కూడా ఏళ్లకేళ్లు తెలియకుండానే ఉండిపోతుంటుంది. బి12 లోపం మూలంగా రక్తహీనత తలెత్తుతుంది. లోపం స్వల్పంగా ఉంటే పైకి లక్షణాలేమీ కనబడవు. తీవ్రమవుతున్నకొద్దీ బలహీనత, అలసట, తల తేలిపోవటం, ఆయాసం, చర్మం పాలిపోవటం, నాలుక నునుపుగా మారటం, మలబద్ధకం, విరేచనాలు, ఆకలి తగ్గటం, గ్యాస్‌, తిమ్మిర్లు, మొద్దుబారటం, సరిగా నడవలేకపోవటం, చూపు తగ్గటం, కుంగుబాటు, మతిమరుపు, ప్రవర్తనలో మార్పుల వంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఇలాంటివి కనబడినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి బి12 మోతాదులు పరీక్షించుకోవటం మంచిది. లోపం ఉంటే బి12 ఇంజెక్షన్లు, మాత్రలు బాగా ఉపయోగపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని