తవుడు.. పోషకాల తోడు

ఒకప్పుడు మనవాళ్లు దంపుడు బియ్యం తినేవారు. రాన్రానూ పరిస్థితి మారిపోయింది

Published : 06 Jun 2017 01:08 IST

తవుడు.. పోషకాల తోడు

కప్పుడు మనవాళ్లు దంపుడు బియ్యం తినేవారు. రాన్రానూ పరిస్థితి మారిపోయింది. పూర్తిగా పాలిష్‌ పట్టిన తెల్లటి బియ్యం తినటం అలవాటైంది. దీంతో బియ్యానికి పట్టుకొని ఉండే తవుడు పొరలోని పోషకాలు కూడా దూరమయ్యాయి. నిజానికి తవుడు తినటం ఎంతో మంచిదని, దీన్ని ఒకసారి తీసుకున్నా ఆ రోజుకు అవసరమైన పోషకాలు లభిస్తాయని తాజా అధ్యయనం సూచిస్తోంది. చాలామంది తవుడును తేలికగా తీసిపారస్తుంటారు గానీ ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాపు ప్రక్రియను, సూక్ష్మక్రిములను నివారించే గుణాలు కూడా అధికమే. ఇందులో 400కు పైగా రసాయనాలు ఉంటాయని కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన ఎలిజబెత్‌ ర్యాన్‌ చెబుతున్నారు. మన శరీరానికి అవవసరమైన థైమిన్‌, నియాసిన్‌, విటమిన్‌ బి6 వంటి కీలకమైన విటమిన్ల మోతాదులో సగం వరకు ఒక్క తవుడుతోనే లభిస్తాయని వివరిస్తున్నారు. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. తవుడులో పీచు కూడా దండిగానే ఉంటుంది. కాబట్టి దీంతో జీర్ణశక్తి పెంపొందుతుంది. మలబద్ధకం దరిజేరదు. ఫలితంగా పేగుల సమస్యలూ దూరంగా ఉంటాయి. ఇందులో కేలరీలు దండిగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇక దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఒంట్లో విశృంఖలంగా సంచరించే కణాలను అడ్డుకుంటాయి. రోగనిరోధకశక్తినీ పెంపొందిస్తాయి. మరి తవుడును ఆహారంలో భాగం చేసుకోవటమెలా? దీన్ని పిండి వంటి వాటిల్లో కలుపుకొని తీసుకోవచ్చు. ప్రస్తుతం తవుడు నూనె కూడా బాగానే అందుబాటులో ఉంది. దీనిలోని మంచి కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ.. గుండె ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని