చెడు గాలికి ఆహార కవచం!

తినే తిండి, తాగే నీరు మాత్రమే కాదు.. పీల్చే గాలీ పరిశుభ్రంగా ఉండాలి. తిండి తినకుండా కొద్దిరోజులు, నీళ్లు తాగకుండా కొన్ని గంటలు ఉండొచ్చేమోగానీ గాలి పీల్చకుండా నిమిషమైనా నిలబడలేం. ఇంతటి కీలకమైన గాలి స్వచ్ఛంగా లేకపోతే? నైట్రోజెన్‌ డయాక్సైడ్‌, నుసి పదార్థం...

Published : 07 Nov 2017 01:39 IST

చెడు గాలికి ఆహార కవచం!

తినే తిండి, తాగే నీరు మాత్రమే కాదు.. పీల్చే గాలీ పరిశుభ్రంగా ఉండాలి. తిండి తినకుండా కొద్దిరోజులు, నీళ్లు తాగకుండా కొన్ని గంటలు ఉండొచ్చేమోగానీ గాలి పీల్చకుండా నిమిషమైనా నిలబడలేం. ఇంతటి కీలకమైన గాలి స్వచ్ఛంగా లేకపోతే? నైట్రోజెన్‌ డయాక్సైడ్‌, నుసి పదార్థం వంటి కాలుష్య కారకాలు వూపిరితిత్తులోకి చేరిపోతే? పలు శ్వాస సమస్యలు ముంచుకొస్తాయి. మన వూపిరితిత్తులు, దానిలోని గాలి గొట్టాల పొర చాలా సున్నితంగా ఉంటుంది. దీన్ని యాంటీఆక్సిడెంట్లు నిరంతరం కాపాడుతుంటాయి. సాధారణంగా మనం కలుషితమైన గాలిని పీల్చుకుంటే వెంటనే ఈ యాంటీఆక్సిడెంట్లు రంగంలోకి దిగి కాలుష్య కారకాలతో పోరాడటం మొదలెడతాయి. అయితే కాలుష్య కారకాల స్థాయులు మితిమీరితే ఇవీ చేతులెత్తేస్తాయి. ఇవి బలహీన పడగానే కాలుష్య కారకాలు విజృంభించి వూపిరితిత్తులు, గాలిగొట్టాల లోపలి పొరపై దాడిచేస్తాయి. ఫలితంగా పొర ఉబ్బుతుంది. ఇది దీర్ఘకాల బ్రాంకైటిస్‌, ఎంఫెసీమా, ఆస్థమా, పిల్లికూతలు, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలకు దారితీస్తుంది. గుండెజబ్బు, వూపిరితిత్తుల క్యాన్సర్‌కూ దారితీయొచ్చు. ప్రస్తుతం మన నగరాల్లో, పట్టణాల్లో గాలి కాలుష్యం ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయికి ఎగబాకింది. ఇలాంటి సమయంలో మనం ఆహార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విశృంఖల కణాల (ఫ్రీ రాడికల్స్‌) పనిబట్టే సహజ యాంటీఆక్సిడెంట్లతో కూడిన పదార్థాలను తీసుకుంటే కొంతవరకైనా కాలుష్య కారకాల అనర్థాల నుంచి తప్పించుకోవచ్చు.

విటమిన్‌ సి: మన శరీరాన్ని కాపాడే సమర్థవంతమైన యాంటీఆక్సిడెంటు. నీటిలో కరిగే రకానికి చెందిన ఇది శరీరమంతటా ఉంటుంది. విశృంఖల కణాలను ఎప్పటికప్పుడు ఏరి పారేస్తుంటుంది. అందువల్ల వూపిరితిత్తుల్లో దీని స్థాయులు పడిపోకుండా ఉండటానికి మనం ఆహారం ద్వారా తగినంత విటమిన్‌ సి తీసుకోవటం చాలా కీలకం. నిమ్మజాతి పండ్లు, జామ, ఉసిరి, కొత్తిమీర, తోటకూర, మునక్కాడలు, క్యాబేజీ వంటివి తరచుగా తినటం మంచిది.

విటమిన్‌ ఇ: ఇది కొవ్వులో కరిగే విటమిన్‌. కణజాలం దెబ్బతినకుండా చూడటంలో ఎంతగానో తోడ్పడుతుంది. పొద్దుతిరుగుడు నూనె, తవుడు నూనెలో విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉంటుంది. అలాగే వేరుశనగ నూనె, ఆలివ్‌ నూనెలతోనూ ఇది లభిస్తుంది. బాదం పప్పు, సాల్మన్‌ చేపలు తిన్నా మేలే. కారం, లవంగాల వంటి మసాలా దినుసుల్లోనూ విటమిన్‌ ఇ ఉంటుంది. అయితే మసాలాలు కొద్దిగానే తీసుకుంటాం కాబట్టి వీటిని రోజూ వంటకాల్లో వాడుకోవటం ఉత్తమం.

బీటా కెరొటిన్‌: యాంటీఆక్సిడెంట్ల మూలంగా తలెత్తే వాపు ప్రక్రియను నియంత్రించటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బీటా కెరొటిన్‌ మన ఒంట్లోకి చేరిన తర్వాత విటమిన్‌ ఎ రూపంలోకీ మారుతుంది. క్యారెట్లతో పాటు తోటకూర, కొత్తిమీర, మెంతికూర, పాలకూర వంటి ఆకుకూరల్లో ఇది దండిగా ఉంటుంది.

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు: గుండె, రక్తంలో కొవ్వుల స్థాయులపై గాలి కాలుష్యం చూపే దుష్ప్రభావాల నుంచి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కాపాడతాయి. బాదం, అక్రోట్లు, అవిసె గింజల వంటి గింజపప్పులు (నట్స్‌), గింజల్లో ఇవి దండిగా ఉంటాయి. మెంతులు, ఆవాలు, తాజా ఆకుకూరలు, రాజ్మా, శనగలు, సజ్జల వంటి వాటితోనూ ఈ కొవ్వులు లభిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని