అన్నం ‘మలి’ బ్రహ్మం!

అన్నం ఆరోగ్య స్వరూపం! పుట్టినప్పట్నుంచీ.. మరణించేవరకూ మనకు ఆహారమే ఆధారం. అందుకే ‘కలౌ అన్నగతాః ప్రాణాః’ అని నిర్వచించారు శాస్త్రకారులు. మన శరీర స్థితికీ, శరీర వృద్ధికీ ఆహారమే ప్రధానం. ఆరోగ్యవంతులు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నా.. రోగులు వ్యాధుల బారి నుంచి విముక్తం

Published : 18 Sep 2018 01:38 IST

అన్నం ‘మలి’ బ్రహ్మం!

అన్నం ఆరోగ్య స్వరూపం! పుట్టినప్పట్నుంచీ.. మరణించేవరకూ మనకు ఆహారమే ఆధారం. అందుకే ‘కలౌ అన్నగతాః ప్రాణాః’ అని నిర్వచించారు శాస్త్రకారులు. మన శరీర స్థితికీ, శరీర వృద్ధికీ ఆహారమే ప్రధానం. ఆరోగ్యవంతులు ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నా.. రోగులు వ్యాధుల బారి నుంచి విముక్తం పొందాలన్నా ఆహారమే కీలకం. జీవితంలో అన్నిదశల్లోనూ అడుగడుగునా శక్తినిస్తూ.. మనల్ని వెన్నంటి నడిపించే ఈ ఆహారం గురించి ఆయుర్వేదం విపులంగా చర్చించింది. ఎలా తినాలి? ఎంత తినాలి? ఏయే వయసులో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనేవీ వివరించింది. ముఖ్యంగా వార్ధక్యంలో ఆహార నియమాల ప్రాముఖ్యతను విస్పష్టంగా పేర్కొంది. వయసు మీద పడుతున్నకొద్దీ మందగించే జఠరాగ్ని, జీర్ణక్రియలను పెంచుకోవటానికి మార్గాలనూ సూచించింది.

‘ధ ర్మ, అర్థ, కామ, మోక్ష సాధనకు ఆరోగ్యమే అత్యావశ్యకం. ఇది మనఆహార, విహారాల మీదే ఆధారపడి ఉంది. అందుకే ఆయుర్వేదం ఆహారానికి విశిష్టమైన ప్రాధాన్యమిస్తుంది. ‘ఆహార సంభవం వస్తు, రోగాశ్చాహార సంభవా’ అనీ నొక్కి చెబుతుంది. అంటే మన శరీరం.. అలాగే మనల్ని పీడించే వ్యాధులూ ఆహారం నుంచే పుట్టుకొస్తాయని అర్థం. సక్రమమైన పద్ధతిలో తీసుకుంటే ఆహారం శరీర పోషణకు తోడ్పడుతుంది. ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. అదే అనియమితంగా తీసుకుంటే రోగాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. దీన్నే ఆయుర్వేదం ‘పథ్యాపథ్యం’ అని పేర్కొంటుంది. పథ్యమనగానే చాలామంది తినకూడనివని భావిస్తుంటారు. కానీ పథ్యమంటే తీసుకోవాల్సినవి, అపథ్యమంటే తీసుకోకూడనివని అర్థం. వైద్యశాస్త్రంలో పథ్యానికి చాలా ప్రాధాన్యముంది. దీన్ని ‘చికిత్సితం వ్యాధిహరం, పథ్యం, సాధనం, ఔషధం, ప్రాయశ్చితం, ప్రశమనం, ప్రకృతి స్థాపనం, హితం’.. అంటూ చికిత్స పర్యాయపదాల్లోనూ చేర్చింది. పథ్యం (ఆహార నియమాలు) పాటించేవారికి.. అలాగే పథ్యం చేయనివారికి మందుల అవసరమే లేదు (పథ్యే సతి గదార్తస్య కిమౌషధ నిషేవణం, పథ్యే అసతి గదార్తస్య కిమౌషధ నిషేవణం) అని పేర్కొంటుంది. ఆహార నియమాలు పాటిస్తే అదే ఔషధంగా పనిచేస్తుంది. అదే సరైన ఆహార నియమాలు పాటించకపోతే రోగకారకంగా పరిణమిస్తుంది. వేసుకునే మందులూ సరిగా పనిచేయవు. మన ఆరోగ్యంలో ఆహారానికి ఎంత విశిష్టమైన స్థానముందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

పద్ధతి ప్రకారమే భోజనం

 ‘ఆహ్రియతే అన్న నళికయా ఇతి ఆహారః’.. అంటే అన్ననాళిక ద్వారా తీసుకునేది ఆహారమని అర్థం. దీన్ని ఎంత తినాలి? ఎలా తినాలి? అనే విషయాలనూ ఆయుర్వేదం విస్పష్టంగా పేర్కొంది.
* కడుపు పూర్తిగా నిండేలా ఆహారం తీసుకోవటం తగదు. జీర్ణాశయాన్ని 3 భాగాలుగా భావించుకొని.. ఒక భాగం ఘన పదార్థాలు, ఒక భాగం ద్రవాలు తీసుకోవాలి. మిగతాది ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. దీన్నే ‘త్రిభాగ సౌహిత్యం’ అంటారు. కాస్త ఆలస్యంగా జీర్ణమయ్యే గురు పదార్థాలు (నెయ్యి, నూనె, కొవ్వులతో కూడుకున్నవి) తీసుకున్నప్పుడు ఈ నియమాన్ని పాటించాలి. అదే తేలికగా జీర్ణమయ్యే లఘు పదార్థాల విషయంలోనైతే జీర్ణాశయంలో సగభాగం వరకు ఆహారం తీసుకోవచ్చు (అర్ధ సౌహిత్యం). మిగతా సగాన్ని ద్రవాలు, ఖాళీ భాగానికి వదిలేయాలి.

* కొందరు అన్నం పూర్తిగా తిన్నాక ఒకేసారి నీళ్లు తాగుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. భోజనం చేసేటప్పుడు మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు తాగుతుండాలి. దీంతో ఆహారం మొత్తానికి నీరు సమంగా అందుతుంది. ఒకేసారి నీళ్లు తాగితే ఆహారం కిందే ఉంటుంది. నీరు పైకి తేలుతుంది. ఫలితంగా ఆహారం సరిగా పచనం కాదు.

* ఒకప్పుడు భోజనం చేయటానికి ముందు అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఐదు ముద్దలు తినేవారు. దీన్నే ఆజ్య సంస్కారం అంటారు. నెయ్యితో ఆకలి (జఠరాగ్ని) వృద్ధి చెందుతుంది. అన్నవాహిక మృదువుగా అయ్యి ముద్ద తేలికగా కిందికి దిగుతుంది. వైద్యశాస్త్రం ప్రకారం ఐదు రకాల వాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన) ఉన్నాయి. మనకు ఆకలి వేస్తోందంటే జీర్ణాశయంలో ఆహారమేమీ లేదని అర్థం. లోపల ఖాళీగా ఉన్నప్పుడు వాయువు ఉత్పన్నమవుతుంది. ఇది తీక్షణంగా (రూక్షత్వం) ఉంటుంది. దీన్ని నెయ్యి మృదువుగా (స్నిగ్ధంగా) మారుస్తుంది. అంటే జీర్ణాశయం ఖాళీగా ఉన్న సమయంలో పుట్టుకొచ్చే వాత ప్రకోపం తగ్గటానికి నెయ్యి తోడ్పడుతుందన్నమాట. నెయ్యి కొంచెంగా తీసుకుంటే జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. అదే ఎక్కువగా తీసుకుంటే జఠరాగ్ని మందగిస్తుందని గుర్తుంచుకోవాలి.

* మరీ వేగంగా గానీ మరీ ఆలస్యంగా గానీ భోజనం చేయరాదు (న అతి ద్రుతం.. న అతి విలంబితం). మరీ వేగంగా తింటే పొర పోయే అవకాశముంది. ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. అలాగే ఆలస్యంగా తిన్నా సరిగా జీర్ణం కాదు.

* భోజనం చేసేటప్పుడు దాని మీదే దృష్టి పెట్టాలి (తన్మనా భుంజీత). మాట్లాడుకుంటూనో.. టీవీ, ఫోన్‌ చూసుకుంటూనో.. మరో పని చేసుకుంటూనో తినటం మంచిది కాదు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఇష్టమైనవారితో కలిసి భోజనం చేయటం మంచిది.

* వేడి వేడిగా ఉన్న ఆహారమే తినాలి. ఇది రుచికరంగా ఉండటమే కాదు, త్వరగానూ జీర్ణమవుతుంది. వేడి ఆహారం వాయువును బయటకు వెళ్లగొడుతుంది, కఫాన్ని కూడా తగ్గిస్తుంది.
* భోజనానికీ భోజనానికీ మధ్యలో కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. ఈ సమయంలో తిన్నది జీర్ణమవుతుంది. ఒకవేళ ముందు తిన్నది జీర్ణం కాకముందే మళ్లీ తిన్నారనుకోండి. సరిగా జీర్ణం కాని అన్నరసం కొత్త ఆహారంతో కలిసిపోయి దోషాలు పెరిగేలా చేస్తుంది.

* సమయానికి ఆకలి వేయటం, ఎలాంటి రుచి లేని త్రేన్పులు రావటం, ఒంట్లో ఉల్లాసం, మల విసర్జన సాఫీగా అవటం, దాహం వేయటం.. ఇవన్నీ ఆహారం సరిగా జీర్ణమవుతోందనటానికి సూచనలని గుర్తించాలి.

ధాతు శక్తి కారకం

 మన శరీరంలో రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర.. అని ఏడు రకాల ధాతువులుంటాయి. శరీరాన్ని ధరింపజేసేవి, పోషించేవి ఇవే. ఇక మనల్ని పీడించే వ్యాధులకు మూలం కఫ, పిత్త, వాత దోషాలు. తినే ఆహారం, నడిచే నడవడి- ఏదైనా కానివ్వండి.. అవి ధాతువులకు విరుద్ధమైనవైతే దోషాలు బలపడి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ధాతువులను పెంపొదింపజేయటం ముఖ్యం. దీంతో దోషాల వికారాన్ని తట్టుకునే శక్తి ధాతువులకు లభిస్తుంది. దీన్నే వ్యాధి నిరోధకశక్తి అనుకోవచ్చు. ఇది వ్యాధులు పుట్టకుండానే కాదు (వ్యాధి వ్యుత్పాదక ప్రతిబంధకంగా).. ఒకవేళ వ్యాధుల బారినపడ్డా అవి పెరగకుండా (వ్యాధి బల విరోధిత్వంగా), వ్యాధులను తట్టుకునేలా (వ్యాధి క్షమత్వ శక్తిగా) కూడా తోడ్పడుతుంది. మరి ధాతువుల శక్తిని పెంపొందిచుకోవటమెలా? దీనికి ముఖ్యమైన సాధనం ఆహారమే. ‘పంచభూతాత్మకే దేహే ఆహారః పాంచభౌతికః। విపక్వ పంచదా సమ్యక్‌ స్వానుగుణాన్‌ అభివర్ధయేత్‌’.. మన శరీరం భూమి, ఆకాశం, నీరు, అగ్ని, గాలి అనే పంచభూతాలతో నిర్మితమైంది. ఆహారం కూడా పంచభూతాత్మకమైనదే. అంటే ఆహారం రూపంలో మనలోకి ప్రవేశించే పంచభూతాలు జీర్ణమై.. పంచభూతాల రూపాల్లోకి విడిపోయి.. ఆయా ధాతువులకు చేరుకుంటాయి. అనంతరం ధాతువుల్లో ఆయా భూతాల అంశాలు విలీనమవుతాయి. అయితే వార్ధక్యంలో ధాతువులు క్షీణించటం.. ముఖ్యంగా వాత ప్రకోపం మూలంగా రూక్షగుణం పెరిగిపోయి రసధాతువు బలహీనపడుతుంది. దీంతో జీర్ణక్రియ మందగించటం వంటి రకరకాల సమస్యలు బయలుదేరతాయి. అందువల్ల రసధాతువును కాపాడుకోవటం కీలకం. రసధాతువును కాపాడుకుంటే మిగతా అన్ని ధాతువులూ పటిష్ఠంగా ఉంటాయి. దీన్ని పుంజుకునేలా చేసుకోవటానికి ఆహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టటం అవసరం.

వార్ధక్యంలో మరింత జాగ్రత్తగా..

మన శరీరంలో 13 రకాల అగ్నులు ఉంటాయి. వీటిలో జఠరాగ్ని ప్రధానమైంది. ఆకలి పుట్టటానికి, ఆహారం జీర్ణం కావటానికి ఇదే కీలకం. అయితే వృద్ధాప్యంలో వాత ప్రకోపం మూలంగా జఠరాగ్ని వికృతి చెందుతుంది. దీంతో ఆకలి, పచనశక్తి తగ్గుతాయి. అంతేకాదు.. వాత ప్రకోపంతో మిగతా అవయవాల మాదిరిగా జీర్ణాశయం కూడా కుంచించుకుపోతుంటుంది. దీనికి సాగే గుణం తగ్గుతుంది. దీంతో ఆహారం తీసుకోవటమే తగ్గుతుంది. కొంచెం తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఇవి వయసుతో పాటు సహజంగా తలెత్తే మార్పులే కావొచ్చు. వీటిని మనం వెనక్కి మళ్లించలేకపోవచ్చు. కానీ ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వీటి ప్రభావాలను కొంతవరకు నివారించుకోవచ్చు.

* రోజుకు రెండు సార్లు ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలు, రాత్రి 8 గంటల లోపు భోజనం ముగించటం మంచిది. చలికాలంలో రాత్రి సమయం ఎక్కువ కాబట్టి ఉదయం పూట కాస్త పెందరాళే భోజనం చేయాలి.
* కాస్త తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంటుంది కాబట్టి ఆకలిగా అనిపిస్తే వృద్ధులు కొంచెం కొంచెంగా నాలుగైదు సార్లు తినొచ్చు.
* రాత్రిపూట ఆహారం ఆలస్యంగా జీర్ణమవుతుంది. అందువల్ల తేలికైన ఆహారం తీసుకోవాలి.
* జీర్ణ సమస్యల వంటి ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే భోజనం చేసేప్పుడు అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని నాలుగైదు ముద్దలు తినాలి. ఆవు నెయ్యి అయితే మరీ మంచిది. ‘ఘృతం అగ్ని మేధే కరోతి’.. అంటే ఇది జఠరాగ్నిని మాత్రమే కాదు.. మేధస్సునూ పెంపొందిస్తుంది.

* భోజనానికి ముందు రెండు మూడు గుటకలు గోరువెచ్చటి నీళ్లు తాగాలి. దీంతో అన్నవాహిక వదులై ముద్ద తేలికగా కిందికి దిగుతుంది.
* వరి లేదా జొన్న పేలాలను పొడిగా చేసుకొని (సత్తు పిండి) పాలలో గానీ మజ్జిగలో గానీ కలుపుకొని తీసుకోవాలి. ధాతువులను తప్తి పరచటంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
* రాగులు కూడా ఎంతో మేలు చేస్తాయి. రాగులను శుభ్రంగా కడిగి మూట కడితే 3 రోజులకు మొలకలు వస్తాయి. వీటిని ఎండించి పొడి చేసి పెట్టుకోవాలి. దీన్ని పాలతో తీసుకోవచ్చు. గట్కగానూ చేసుకోవచ్చు. ఇది రక్తవృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. దీంతో మిగతా ధాతువులూ పుంజుకుంటాయి.

* పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కాయగూరల్లో పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, చిక్కుడు, వంకాయ బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో పీచు పదార్థం దండిగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం తలెత్తకుండా చూసుకోవచ్చు. పాలు, పలుచటి మజ్జిగ తీసుకోవటం మంచిది. ఆవు పాలైతే తేలికగా జీర్ణమవుతాయి.

* కొత్త బియ్యానికి బదులు పాత బియ్యం తీసుకోవటం మంచిది. ఇవి తేలికగా జీర్ణమవుతాయి. గంజి, చారు తీసుకోవటమూ మంచిదే.
* ఆయా కాలాల్లో దొరికే పండ్లు, పండ్ల రసాలు తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలు గలవారికి పుల్లటి పండ్లు సరిపడవు. కాబట్టి అజీర్ణం, మధుమేహం వంటి సమస్యలు గలవారు పండ్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
* వాత ప్రకోపాన్ని తగ్గించే మునగాకు, మునక్కాడలు తీసుకోవటం మంచిది. వృద్ధాప్యంలో తేనె ఎక్కువగా తీసుకోకపోవటమే ఉత్తమం. ఎందుకంటే ఇది కఫాన్ని హరిస్తుంది. దీంతో వాతదోషం ప్రకోపిస్తుంది. ఫలితంగా ధాతువుల శక్తి సన్నగిల్లుతుంది.

చిట్కా మార్గం!

వృద్ధాప్యంలో ఆకలి మందగిస్తుంది. ఆహారమూ సరిగా పచనం కాదు. పచనమైన ఆహారం కూడా ధాతువుల్లోకి సరిగా చేరుకోదు. కాబట్టి ఆకలి పెరగటానికి, సరిగా జీర్ణం కావటానికి కొన్ని చిట్కాలు ఎంతో మేలు చేస్తాయి.
* కాస్త సోంపు, జీలకర్రను నీటిలో వేసి మరిగించి.. చల్లారాక వడపోసుకొని తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే ఆకలి, జీర్ణక్రియ వృద్ధి చెందుతాయి.
* జీలకర్ర చూర్ణం కూడా ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. దీన్ని ఒక చెంచాడు తీసుకొని నీటిలో కలుపుకొని తాగాలి. మందుల దుకాణాల్లో ఇది జీరకాది చూర్ణం రూపంలోనూ దొరుకుతుంది.
* ఉసిరికాయలో సప్త ధాతువులను పరిపుష్టం చేసే గుణముంది. కాబట్టి వృద్ధులకు ఉసిరికాయ ఎంతో మేలు చేస్తుంది. విడిగా ఉసిరికాయ తినొచ్చు. ఉసిరి చూర్ణం, ఉసిరి పచ్చడి రూపంలోనూ తీసుకోవచ్చు.
* అల్లం ఆకలిని పెంపొందిస్తుంది. అందువల్ల అల్లం రసం, అల్లం పచ్చడి తినొచ్చు. అల్లం ముక్కను నోట్లో వేసుకొని చప్పరించినా మంచిదే.


ఔషధ సాయం!

వార్ధక్యంలో జఠరాగ్ని వృద్ధి చెందటానికి కొన్ని ఔషధాలు బాగా ఉపయోగపడతాయి.
* చ్యవనప్రాశ: ఇది ధాతువృద్ధికి తోడ్పడుతుంది. రోజూ ఉసిరికాయంత చ్యవనప్రాశను తిని.. తర్వాత పాలు తాగాలి. మధుమేహుల కోసం ఇప్పుడు చక్కెరలేని చ్యవనప్రాశ కూడా అందుబాటులో ఉంటోంది.
* ఇతర ఔషధాలు: బ్రాహ్మీ రసాయనం, బ్రాహ్మీ వటి, అశ్వగంధావలేహ్యం, అశ్వగంధ చూర్ణం, శతావరి చూర్ణం వంటివీ తీసుకోవచ్చు. మాంసాహారులైతే చాగల్యాది ఘృతం తీసుకోవచ్చు. వీటిని వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని