పొంచి ఉంది పంజరం

ఇది సుఖవ్యాధులపై అవగాహనా మాసం సుఖం మానవ సహజాతం! అయితే ఆ సుఖం వెంటే.. సుఖవ్యాధుల రూపంలో పైకి కనిపించని ఓ పెను ముప్పు ....

Published : 17 Jan 2016 12:09 IST

పొంచి ఉంది పంజ‌రం!

 ఇది సుఖవ్యాధులపై అవగాహనా మాసం  ‘సుఖం’ మానవ సహజాతం! అయితే ఆ సుఖం వెంటే.. ‘సుఖవ్యాధుల’ రూపంలో పైకి కనిపించని ఓ పెను ముప్పు కూడా పొంచి ఉంటుంది. వీటి గురించి బయటకు చెప్పుకోలేక.. ఆ బాధ అనుభవించలేక ఎంతోమంది నిత్యం నరకం చూస్తున్నారు. ఇవి లైంగికంగా సంక్రమించే సమస్యలు కాబట్టి వీటి గురించి వైద్యులను సంప్రదించేందుకు కూడా వెనకాడుతుంటారు. దీంతో ఇవి ముదిరిపోయి.. భాగస్వాములకు కూడా అంటుకుని.. అంతిమంగా సంసారం దుర్భరంగా తయారవుతుంది. అందుకే సుఖవ్యాధుల విషయంలో దాపరికాలు మంచివి కాదన్నది తెలుసుకోవటం అవసరం.

ఒకప్పుడు సిఫిలిస్‌, గనోరియా వంటి బ్యాక్టీరియా కారణంగా సంక్రమించే సుఖవ్యాధులు మానవాళిని భయంకరంగా కబళించాయి. అయితే శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌ కనిబెట్టిన తర్వాత.. ఇక సుఖవ్యాధులను జయించటం చాలా తేలిక అనుకున్నారు అంతా. అది కొంత నిజం కూడా. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు వైరస్‌ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి. వీటిని నిర్మూలించటం మహా కష్టం. నియంత్రించటమూ తేలిక కాదు. మరోవైపు ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏమాత్రం లొంగకుండా.. మొండిగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అసలు సుఖవ్యాధులు దరిజేరకుండా పూర్తి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటించటం ఒక్కటే సరైన మార్గం. అందుకే ఈ ఏప్రిల్‌ నెల రోజులూ అమెరికా తదితర దేశాల్లో సుఖవ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుఖీభవ అందిస్తున్న కథనం.. ఈ వారం ప్రత్యేకం!

సుఖవ్యాధులతో పెద్ద చిక్కేమంటే చాలా సందర్భాల్లో భాగస్వాములు ఇద్దరూ ఒకే సమయంలో చికిత్స తీసుకుంటేనే వాటిని పూర్తిగా నియంత్రించటం సాధ్యమవుతుంది. లేకపోతే అవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ... ఓ విష వలయంలా, విడదీయలేని చిక్కుముడిలా తయారవుతాయి. సుఖవ్యాధులు రావటానికి వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌.. ఇలా రకరకాల సూక్ష్మక్రిములు కారణం కావచ్చు. ఒకసారి ఒంట్లో చేరితే.. పూర్తిగా నయం కానివీ చాలానే ఉన్నాయి. అందువల్ల సుఖవ్యాధుల విషయంలో చికిత్స కన్నా నివారణే ప్రధానమని వైద్యరంగం ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉంది. దీనికోసం ఉత్తమమైన లైంగిక పద్ధతులేమిటో, సురక్షిత విధానాలేమిటో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుఖవ్యాధులంటే ఇప్పటికీ చాలామంది చాలామంది సిఫిలిస్‌, గనోరియా వంటివాటినే గుర్తుచేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, హెపటైటిస్‌ వంటి ప్రమాదకర సమస్యలూ వీటిల్లో భాగమేనని మరువకూడదు.

బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే సిఫిలిస్‌, గనేరియా, క్లమీడియా, ట్రైకోమొనాసిస్‌ వంటి సుఖవ్యాధులకు ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే తొలిదశలో సరైన చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో ఇవి కూడా చాలా ప్రమాదాలు తెచ్చిపెడతాయి. వైరస్‌ల కారణంగా వచ్చే హెర్పిస్‌ పొక్కులు, పులిపుర్ల వంటి సమస్యలకు ఇప్పటికీ పూర్తిస్థాయి చికిత్స లేదు. ఇవి రాన్రానూ మహా మొండిగా తయారవుతున్నాయి కూడా. ఇక లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే హెపటైటిస్‌-బి వంటి వైరల్‌ వ్యాధులు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఇలాంటి వైరల్‌ వ్యాధులను పూర్తిగా నయం చేసే చికిత్స అందుబాటులో లేకపోవటం వల్ల నివారణ ఒక్కటే సరైన మార్గం.

ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమంటే- హెర్పిస్‌, సిఫిలిస్‌ వంటి సుఖవ్యాధులున్న వారికి హెచ్‌ఐవీ సోకే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి సుఖవ్యాధులను ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు.

శరీర నిర్మాణపరంగా స్త్రీలకు సహజంగానే సుఖవ్యాధులు సంప్రాప్తించే అవకాశం ఎక్కువ. పైగా వీరికి సుఖవ్యాధులు సోకినా వెంటనే పెద్దగా లక్షణాలేమీ కనబడకపోవచ్చు కూడా. దీంతో వ్యాధి బాగా ముదిరే వరకూ కూడా చాలామంది వైద్యసహాయం తీసుకోవటం లేదు. కొన్ని రకాల సుఖవ్యాధుల మూలంగా దీర్ఘకాలంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, సంతాన రాహిత్యం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వంటివి ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిరకాల సుఖవ్యాధుల బారినపడిన స్త్రీలకు పుట్టే బిడ్డలకూ ఆ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి సుఖవ్యాధుల విషయంలో స్త్రీలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు.

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దాదాపు 25 ఏళ్లకే యువతీయువకులు ఏదో ఒక రకమైన సుఖవ్యాధి బారినపడుతున్నారని, పైగా ఆ విషయాన్ని వారు గుర్తించే పరిస్థితి కూడా ఉండటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా దేశాల్లో సుఖవ్యాధులు 15-24 ఏళ్ల మధ్య వయసు వారిలో వేగంగా వ్యాపిస్తున్నాయి. అందుకే చాలా దేశాల్లో ఇప్పుడు సుఖవ్యాధులకు తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. బయటి వ్యక్తులతో అసురక్షిత శృంగారంలో పాల్గొన్న వారు తప్పకుండా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలనీ సూచిస్తున్నారు.

శృంగారం అంటే కేవలం సంభోగమే కావాల్సిన అవసరం లేదు. సిఫిలిస్‌, హెర్పిస్‌, హెచ్‌ఐవీ వంటివి ముద్దులు, అంగచూషణం వంటి వాటి ద్వారానూ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవటం చాలా అవసరం. సుఖవ్యాధులు రాకుండా చూసుకోవటానికి దీన్ని మించిన మార్గం మరోటి లేదు. ఒకవేళ ఇతరులతో ఎప్పుడైనా సెక్స్‌లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్‌ ధరించాలి. భార్యాభర్తల్లో ఎవరికైనా జననాంగాల వద్ద ఇబ్బందిగా అనిపించినా, ఇతరత్రా లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించటం మేలు. నిర్లక్ష్యం చెయ్యకుండా చికిత్స తీసుకోవాలి. మందులు కూడా పూర్తికాలం వేసుకోవాలి. దీర్ఘకాలిక దుష్ప్రభావాల నివారణకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

ఇవి గుర్తుంచుకోండి!

* మనిషి చూడటానికి బాగున్నంత మాత్రాన వారికి ఎలాంటి సుఖవ్యాధులూ లేనట్లు కాదు. చాలామందికి సుఖవ్యాధి ఉన్నా అసలా విషయం వారికి తెలియకపోవచ్చు కూడా. కొందరిలో పైకి ఎలాంటి లక్షణాలూ లేకుండా కూడా సుఖవ్యాధులు ఉండొచ్చు. కొందరిలో లక్షణాలున్నా కూడా వాటిని మూత్రనాళ ఇన్ఫెక్షన్లుగా, ఏదో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లుగా పొరబడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి కొత్త వారితో లైంగిక సంపర్కం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

* ఏరకమైన అనుమానం ఉన్నా అరమరికలు, దాపరికాలు లేకుండా భాగస్వామితో మాట్లాడటం, సంభోగానికి ముందు సురక్షిత విధానాల చర్చించటం మంచిది. ‘మనకు ఇలాంటి సమస్యలు రావులే’ అన్న లేనిపోని భరోసా పెట్టుకోవద్దు. సుఖవ్యాధులు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. మీరు ప్రతిసారీ ఒక్క భాగస్వామితోనే సంభోగంలో పాల్గొంటుండొచ్చుగానీ.. ఆ భాగస్వామికి ఇతరులతో సంబంధాలు లేవన్న భరోసా కష్టం. కాబట్టి ఎవరితోనైనా తగు జాగ్రత్తలు ముఖ్యం. యోని సంభోగమే కానవసరం లేదు.. మలద్వార సంభోగం, అంగచూషణం వంటివి కూడా సుఖవ్యాధులు సంక్రమించటానికి మార్గాలే!

* సుఖవ్యాధులకు సంబంధించి ఏ కొంచెం అనుమానంగా ఉన్నా ప్రామాణికమైన చికిత్స అందించే వైద్యులకు చూపించుకుని, పరీక్షలు చేయించుకోవటం మంచిది. అంతేగానీ నాటువైద్యుల వంటివారిని ఆశ్రయించటం మంచిది కాదు.

* కండోమ్‌ వాడకం చాలా విధాలుగా శ్రేయస్కరం. కానీ ప్రపంచవ్యాప్తంగా సుఖవ్యాధుల నివారణ విషయంలో కండోమ్‌ల ప్రాధాన్యాన్ని చాలామంది గుర్తించటం లేదని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. చాలామంది కండోమ్‌లను కేవలం గర్భనిరోధక సాధనాలుగానే గుర్తిస్తున్నారు. సుఖవ్యాధుల నివారణ విషయంలో వీటికి ఉన్న ప్రాధాన్యం చాలా ఎక్కువ. వీటితో గనోరియా, క్లమీడియా, ట్రైకోమొనియాసిస్‌ వంటి చాలా రకాల సుఖవ్యాధులను నివారించుకోవచ్చు. ప్రతిసారీ, సక్రమంగా వాడుతుంటే కండోమ్‌లతో 98% వరకూ సుఖవ్యాధులను నివారించుకోవచ్చు. ప్రతిసారీ కండోమ్‌ వాడుతున్నాం కదా అనుకుంటూ ఒక్కసారి దాన్ని నిర్లక్ష్యం చేసినా సుఖవ్యాధి సంక్రమించొచ్చు. కాబట్టి ప్రతిసారీ సురక్షితచర్యలు తీసుకోవటం ముఖ్యమని తెలుసుకోవాలి.

* జననాంగాల మీద పండ్లు, రసి, దద్దు, స్రావాల వంటి అసహజ లక్షణాలున్న వారితో సంభోగానికి దూరంగా ఉండటం మంచిది. కొత్తవారితో సంభోగానికి దూరంగా ఉండటం అవసరం. ఎందుకంటే గనోరియా వంటి వ్యాధులున్నా కూడా మహిళల్లో పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. అలాగే పురుషుల్లో కూడా చాలా సుఖవ్యాధుల లక్షణాలు కనబడకపోవచ్చు. కానీ వారి నుంచి సంక్రమించే అవకాశాలు ఉంటాయి.

* సుఖవ్యాధి ఏదైనా ఉందని గుర్తించిన తర్వాత.. అది పూర్తిగా తగ్గే వరకూ వైద్యుల సలహా లేకుండా సంభోగంలో పాల్గొన వద్దు. భాగస్వాములిద్దరూ వైద్యులను సంప్రదించటం అవసరం. సుఖవ్యాధులకు చికిత్స సూచిస్తే ఆ చికిత్స పూర్తయిన తర్వాత మళ్లీ వైద్యులను కలిసి, పూర్తిగా నయమైందని నిర్ధారించుకోవటం ముఖ్యం.

* ఎదిగే పిల్లలకు సురక్షిత శృంగార పద్ధతుల గురించి, ప్రయోగాలు చేస్తే పొంచి ఉండే ప్రమాదాల గురించి తెలియజెప్పటం చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సుఖవ్యాధుల వ్యాప్తి యుక్తవయుసు వారిలోనే చాలా ఎక్కువగా కనబడుతోంది.

* హెపటైటిస్‌-బి, హెపీవీ వంటివి సంక్రమించకుండా ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యుల సలహా మేరకు వీటిని పిల్లలకు, యుక్తవయస్కులకు ఇప్పించటం అన్ని విధాలా శ్రేయస్కరం.

వైరల్‌ వ్యాధులు

వైరస్‌ల కారణంగా వచ్చే ఈ వ్యాధులను అదుపులో పెట్టేందుకైతే మందులున్నాయి గానీ.. వీటిని శరీరం నుంచి పూర్తిగా నిర్మూలించి, సంపూర్ణంగా నయం చేయటం కష్టం.

* హెర్పిస్‌ 

ఇది హెర్పిస్‌ సింప్లెక్స్‌ టైప్‌-2 అనే వైరస్‌ మూలంగా వస్తుంది. దీని బారినపడ్డ వారితో సెక్స్‌లో పాల్గొంటే.. 2-7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ముందుగా పురుషాంగం మీద, స్త్రీ జననావయాల మీద నీటి పొక్కుల్లాంటివి వస్తాయి. తర్వాత ఇవి చితికి పుండ్లు పడతాయి. చికిత్స తీసుకుంటే అప్పటికి తగ్గినప్పటికీ.. ఒంట్లో రోగనిరోధకశక్తి తగ్గినప్పుడల్లా ఈ పొక్కులు మళ్లీ మళ్లీ వస్తుండటం గమనార్హం. హెర్పిస్‌కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే వైరస్‌ శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. దీంతో మెదడు పొరల వాపు, నడుము వద్ద నాడులు దెబ్బతినటం, పురుషుల్లో నంపుసకత్వం కూడా రావొచ్చు. గర్భిణులకైతే అబార్షన్‌ ముప్పూ పెరుగుతుంది. ఇది తల్లి ద్వారా బిడ్డకు సంక్రమించి రకరకాల సమస్యలు తెచ్చిపెడుతుంది.

* జననాంగాలపై పులిపిర్లు
వీటినే ‘వైరల్‌ వార్ట్స్‌’ అంటారు. ఇవి హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) కారణంగా వస్తాయి. సెక్స్‌లో పాల్గొన్న ఐదారు నెలల్లో జననావయాలపై పులిపిర్లు వస్తాయి. రోగనిరోధకశక్తి తక్కువగా గలవారిలో నెలలోపే బయటపడొచ్చు. దీనివల్ల రకరకాల బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు తేలికగా వస్తాయి కూడా. సమస్య తీవ్రమైతే మూత్రం నిలిచిపోవచ్చు. కొన్నిరకాల పులిపిర్లు మూత్ర మార్గంలోనూ పెరుగుతాయి. వీటితో జననావయాల్లో క్యాన్సర్ల ముప్పూ ఎక్కువ అవుతుంది. స్త్రీలల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో దాదాపు 40% వీటి మూలంగా వచ్చేవే కావటం గమనార్హం.

* హెచ్‌ఐవీ
ఎయిడ్స్‌ కారక హెచ్‌ఐవీ ముఖ్యంగా సెక్స్‌ ద్వారానే సంక్రమిస్తుంది. పరీక్షల్లో వైరస్‌ సోకినట్టు బయటపడినా కొన్ని సంవత్సరాల వరకూ పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. దీనివల్ల ఒంట్లో రోగనిరోధకశక్తి వేగంగా తగ్గిపోయి రకరకాల జబ్బులు, ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడతాయి.

* హెపటైటిస్‌-బి
సెక్స్‌తో పాటు ఇతరత్రా మార్గాల్లోనూ ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కానీ దీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా కామెర్లు, లివర్‌ గట్టిపడటం, లివర్‌ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్యలు చుట్టుముడతాయి.

* మొలస్కం కంటేజియాజం
ఇది ‘పాక్స్‌ వైరస్‌’ ద్వారా సంక్రమిస్తుంది. దీనిలో అంగం మీద మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి, ముత్యపు రంగులో మొటిమల్లాంటి పొక్కులు వస్తాయి. ఇది అంత ప్రమాదకరమైంది కాకపోయినా బాగా ఇబ్బంది పెడుతుంది.

బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు సమర్థవంతమైన యాంటీబయాటిక్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను నయం చేసే అవకాశమైతే ఉంది గానీ.. ఇవి బాగా ముదిరితే ఇతరత్రా చాలా దుష్ప్రభావాలు జీవితాంతం బాధించొచ్చు.

* సిఫిలిస్‌
ట్రిపనోమా పాలిడమ్‌ అనే బ్యాక్టీరియా మూలంగా ఇది వస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత 9-90 రోజుల్లో దీని లక్షణాలు ఆరంభమవుతాయి. ముందుగా అంగం మీద మచ్చలా వస్తుంది. తర్వాత పుండుగా మారుతుంది. నొప్పి ఉండదు. చికిత్స తీసుకోకపోయినా కొద్దిరోజులకు పుండు తగ్గిపోతుంది. రెండు మూడు నెలల తర్వాత రెండో దశలో ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. దురద ఉండదు. కీళ్లనొప్పులు, నోటిలో పుండ్లు, కంజెక్టివైటిస్‌, తల వెంట్రుకలు రాలిపోవటం వంటి లక్షణాలు కనబడతాయి. కొందరిలో జ్వరం, కామెర్లు, లింఫ్‌ గ్రంథుల్లో వాపూ ఉండొచ్చు. చికిత్స తీసుకోకపోతే కొన్నేళ్ల తర్వాత ఒంటి మీదా, నాలుక పైనా, ఇంకా శరీరం లోపలి అవయవాలపైనా పెద్ద పెద్ద పుండ్లు పడొచ్చు. జబ్బు లోపల్లోపలే ముదిరిపోతే సిఫిలిస్‌ బారినపడ్డ పదేళ్లకు కొన్ని రకాల గుండెజబ్బులూ వస్తాయి.

* గనోరియా
దీనికి మూలం నైసీరియా గనోరియా అనే బ్యాక్టీరియా. సెక్స్‌లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, మూత్రమార్గం సన్నబడి కుంచించుకుపోవటం, మూత్ర మార్గానికి రంధ్రం పడి దానిలోంచి మూత్ర విసర్జన కావటం వంటి సమస్యలు ముంచుకొస్తాయి. అంతేకాదు.. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో పెలోపియన్‌ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు. ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి. స్త్రీలల్లో పొత్తికడుపు నొప్పి, తెల్లమైల అధికం కావటం, నెలసరి క్రమం తప్పిపోవటం, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి.

* ఖాంక్రాయిడ్‌
హీమోఫిలస్‌ డుక్రియీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న 2-7 రోజుల్లో జననావయావల మీద ఎక్కువ సంఖ్యలో పుండ్లు పడతాయి. నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. గజ్జల్లో బిళ్ల కట్టినట్టు వాపు కనిపిస్తుంది. పురుషాంగం మీది చర్మం కదలికలు బిగుసుకుపోతాయి. మూత్ర విసర్జన కూడా ఇబ్బందిగా ఉంటుంది.

* క్యాండిడియాసిస్‌
ఇది ఫంగస్‌ కారణంగా వచ్చే సమస్య. దీన్ని పూర్తిగా నయం చెయ్యొచ్చు. ప్రధానంగా ‘క్యాండిడా అల్బికాన్స్‌’ అనే సూక్ష్మజీవి మూలంగా వస్తుంది. జననాంగాలపై పూత రావటం దీని లక్షణం. పురుషుల్లో అంగంపై ఎర్రటి పూత, స్త్రీలల్లో పెరుగులా చిక్కగా తెల్ల మైల అవుతుంటుంది. బయటి సంబంధాలు లేకున్నా భార్యాభర్తల్లో కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చు.

* ట్రైకోమొనియాసిస్‌
ఇది ట్రైకోమొనాస్‌ వజైనాలిస్‌ అనే సూక్ష్మక్రిమి వల్ల వస్తుంది. ఇది సంక్రమిస్తే పురుషులకు అంగంలో ఏదో చెప్పలేని అసౌకర్యం (టింగ్లింగ్‌ సెన్సేషన్‌) కలుగుతుంది. స్త్రీలల్లో తెల్లమైల, యోనిలో మంట, దురద వంటివి కనబడతాయి. ఇది భార్యాభర్తల్లో ఒకరి నుంచి మరొకరికీ సంక్రమిస్తుంది కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని