సంతాన సమస్యలతో జీవక్రియల జబ్బులు

సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఇలాంటి పురుషులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే వీరికి మున్ముందు మధుమేహం....

Published : 29 Mar 2016 02:46 IST

సంతాన సమస్యలతో జీవక్రియల జబ్బులు

సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఇలాంటి పురుషులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే వీరికి మున్ముందు మధుమేహం వంటి జీవక్రియల జబ్బులు ముంచుకొచ్చే ప్రమాదముంది. ఇటీవల స్వీడన్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీర్యంలో వీర్యకణాల సంఖ్య తక్కువగా గలవారిని ఎంచుకొని, ఇతరులతో పోల్చి చూడగా కొన్ని కొత్త సంగతులు బయటపడ్డాయి. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల లోపు వారిలో మూడింటి ఒక వంతు మందిలో టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల స్థాయులు ఏడు రెట్లు తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. వీరిలో ఎముక సాంద్రత కూడా తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గినవారిలో ఇది ప్రముఖంగా కనబడుతోంది. దీని మూలంగా ఎముక క్షీణించటం, తేలికగా విరగటం వంటివి తలెత్తుతాయి. అంతేకాదు.. గ్లూకోజు స్థాయులను సూచించే హెచ్‌బీఏ1సీ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇన్సులిన్‌ నిరోధకతా పెరుగుతోంది. ఇవి రెండూ మధుమేహం ముప్పును పెంచేవే కావటం గమనార్హం. అందువల్ల సంతాన చికిత్సలు తీసుకునే పురుషులంతా ఒకసారి సెక్స్‌ హార్మోన్ల పరీక్షలు చేయించుకోవటం మంచిదని అధ్యయన నేత డాక్టర్‌ అలెగ్జాండర్‌ గివర్క్‌మ్యాన్‌ సూచిస్తున్నారు. తీవ్రమైన జబ్బుల ముప్పులు గలవారు సంతాన చికిత్సల అనంతరం వాటిపై ఒక కన్నేసి ఉండటమూ మేలని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని