సుఖం వెంట..అంటుతుంది మంట!

యుగయుగాలుగా మానవాళిని గడగడలాడించిన సుఖవ్యాధుల గురించి ఎంత చెప్పినా తక్కువే! చరత్ర తిరగేస్తే ఇవి మనుషులకు శతాబ్దాల తరబడి మనశ్శాంతి లేకుండా చెయ్యటమే కాదు.. ఎందరో మహోన్నత వ్యక్తులను సైతం బలి తీసుకున్నాయి. పెన్సిలిన్‌ వంటి అద్భుత యాంటీబయాటిక్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనదే జయం అనుకున్నాం! కానీ ఇటీవలి కాలంలో మళ్లీ పరిస్థితి తిరగబడుతోంది. సుఖవ్యాధుల్లో ‘వైరల్‌’ సమస్యల విజృంభణ మొదలైంది.

Published : 13 Sep 2016 01:24 IST

సుఖం వెంట..అంటుతుంది మంట!

యుగయుగాలుగా మానవాళిని గడగడలాడించిన సుఖవ్యాధుల గురించి ఎంత చెప్పినా తక్కువే! చరత్ర తిరగేస్తే ఇవి మనుషులకు శతాబ్దాల తరబడి మనశ్శాంతి లేకుండా చెయ్యటమే కాదు.. ఎందరో మహోన్నత వ్యక్తులను సైతం బలి తీసుకున్నాయి. పెన్సిలిన్‌ వంటి అద్భుత యాంటీబయాటిక్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనదే జయం అనుకున్నాం! కానీ ఇటీవలి కాలంలో మళ్లీ పరిస్థితి తిరగబడుతోంది. సుఖవ్యాధుల్లో ‘వైరల్‌’ సమస్యల విజృంభణ మొదలైంది.వైరల్‌ వ్యాధులను పూర్తిగా నయం చేసే మందులేం లేకపోవటం.. ఒకసారి సంక్రమిస్తే ఇవి జీవితాంతం ఒంట్లోనే తిష్ఠ వేసి తరచూ తిప్పలు పెట్టేవి కావటంతో నేడు సుఖవ్యాధులంటే మళ్లీ కలవరం మొదలైంది. ముఖ్యంగా తెలిసీతెలియని యువతే ఎక్కువగా వీటి బారిన పడుతోంది. దీంతో భవిష్యత్తు అయోమయంలో పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా మసలుకోవటం తక్షణావసరం.
కాలంతో పాటే సుఖవ్యాధుల తీరుతెన్నుల్లోనూ చాలా మార్పులొచ్చాయి. ఒకప్పుడు సిఫిలిస్‌, గనోరియా, షాంక్రాయిడ్‌ వంటివే ఎక్కువగా కనబడేవి. కానీ ఇటీవలి కాలంలో లైంగికంగా సంక్రమించే వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ‘హెర్పిస్‌ సింప్లెక్స్‌’ అనేది నేటి యువతలో చాలా ఎక్కువగా కనబడుతోంది. ఆ తర్వాత జననాంగ పులిపిర్లూ (కాండీలోమా అక్యుమనేటా) పెరుగుతున్నాయి. ఈ రెండూ కూడా లైంగికంగా సంక్రమించే వైరస్‌ వల్ల తలెత్తే సమస్యలే. ఒకసారి ఒంట్లో చేరితే మనం వీటిని నియంత్రణలో ఉంచగలమేగానీ పూర్తిగా నిర్మూలించలేం. అలాగే షాంక్రాయిడ్‌, సిఫిలిస్‌ వంటి వ్యాధులతో పాటు అప్పుడప్పుడు లింఫో గ్రాన్యులోమా వెనీరియం, గ్రాన్యులోమా వెనీరియం వంటివీ కాస్త తరచుగానే కనబడుతున్నాయి. ఇక హెచ్‌ఐవీ బాధితులు పెరగటంతో సిఫిలిస్‌ కేసులూ పెరుగుతూ వస్తున్నాయి. పైగా వీరిలో లక్షణాలు చాలా తీవ్రంగా కూడా ఉంటున్నాయి. సమాజంలో జరిగిన విస్తృత ప్రచారం కారణంగా నేటి యువతరం సుఖవ్యాధులంటే కేవలం హెచ్‌ఐవీ ఒక్కటే అనుకుంటోందిగానీ వాస్తవానికి ఈ సుఖవ్యాధులన్నీ ప్రమాదకరమైనవే. అయినా చాలామంది యువతీయువకులు వీటి గురించి బయటకు చెప్పుకోవటానికి ఇబ్బంది పడుతూ, నలుగురికీ తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతూ తమలో తామే కుంగిపోతున్నారు. కొందరు వైద్యుల వద్ద కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ తీవ్ర సమస్యల్లోకి జారిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. చక్కటి లైంగిక ప్రవర్తన అలవరచుకోవటం ద్వారా అసలు ఇలాంటి సుఖ సమస్యల బారినపడకుండా చూసుకోవటం అత్యుత్తమం. ఒకవేళ ఇవి సంక్రమిస్తే సత్వరమే గుర్తించి చికిత్స తీసుకోవటం చాలా అవసరం. లేకపోతే ఇవి జీవితాన్ని నరకప్రాయం చెయ్యటమే కాదు.. వీరి ద్వారా ఇతరులకూ వ్యాపించి సమాజం మొత్తాన్ని విష వలయంలోకి నెట్టేస్తాయి.

వెంటనే కనబడవు!

  సుఖవ్యాధులకు కారణమయ్యే సూక్ష్మక్రిములు ఒంట్లో ప్రవేశించినా వెంటనే లక్షణాలు కనబడాలనేం లేదు. ఉదాహరణకు హెర్పిస్‌ సింప్లెక్స్‌ సంక్రమిస్తే 3 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. కానీ షాంక్రాయిడ్‌ లక్షణాలు 5-8 రోజుల్లో, సిఫిలిస్‌ లక్షణాలు 9 రోజుల తర్వాత మొదలవుతాయి. అదే లింఫో గ్రాన్యులోమా వెనీరియం (ఎల్‌జీవీ) లక్షణాలు బయటపడటానికి దాదాపు 3-4 వారాలు పడుతుంది. అలాగే గ్రాన్యులోమా వెనీరియం (జీవీ) లక్షణాలు 90 రోజుల తర్వాత కూడా కనబడొచ్చు. కాబట్టి సుఖవ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

పుండ్లు, బిళ్లలు
షాంక్రాయిడ్‌
నేడు ఎక్కువగా కనబడుతున్న, లైంగిక సంపర్కం ద్వారా చాలా వేగంగా వ్యాపించే సమస్య ఇది. దీనికి ‘హీమోఫిలస్‌ డుక్రేయి’ అనే బ్యాక్టీరియా మూలం. ఇది సంక్రమించిన 3-4 రోజుల్లోనే అంగం మీద బుడిపెలాంటిది కనబడుతుంది. క్రమేపీ అది పగిలి ఎర్రగా పుండ్లుపడతాయి. విపరీతమైన నొప్పి. కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులూ ఉండొచ్చు. చికిత్స తీసుకోకపోతే గజ్జల్లో బిళ్ల కట్టి, తీవ్రమైన నొప్పి, బాధ మొదలవుతాయి. దీన్ని భరించటం చాలా కష్టం. అప్పటికీ చికిత్స తీసుకోకపోతే బిళ్ల పగిలి.. చీము, రక్తం వెలువడతాయి. 15-40 మధ్య వయసు వారిలో, పురుషుల్లో ఎక్కువగా కనబడే సమస్య ఇది. స్త్రీలకు వచ్చినా పుండ్లు పైకి కనబడవు. పైగా వీరిలో నొప్పి వంటి లక్షణాలూ అంత స్పష్టంగా ఉండవు. దీంతో వీళ్లు తొందరగా బయటపడరు. కానీ వీరి నుంచి ఇన్‌ఫెక్షన్‌ వేగంగా వ్యాపిస్తుంటుంది.

చికిత్స: యాంటీబయాటిక్స్‌ పూర్తి మోతాదుల్లో తీసుకుంటే ఇది నయమైపోతుంది. అయితే ఈ చికిత్స భాగస్వామి కూడా తీసుకోవాలి. లేకపోతే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ మళ్లీమళ్లీ తిరగబెడుతుంది.

నిర్లక్ష్యం చేస్తే: దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే అంగం మీద పుండ్లు, రకరకాల ఇన్ఫెక్షన్లు ప్రబలి, ఆ భాగం దానంతటదే వూడి పడిపోవచ్చు. దీన్నే ‘ఆటో యాంప్యుటేషన్‌’ అంటారు. ఇంత కాలం నిర్లక్ష్యం అరుదే అయినా బయటకు చెప్పుకోలేక దాచిపెట్టి ఈ దుస్థితికి చేరుకుంటున్నవాళ్లు అప్పుడప్పుడు కనబడుతూనే ఉన్నారు.

సవాయి పుండ్లు
సిఫిలిస్‌
చిరకాలంగా మానవాళిని వేధిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ఈ సుఖవ్యాధికి మూలం ‘ట్రెపోనెమా పాలిడమ్‌’ బ్యాక్టీరియా. ఇది ఒంట్లో ఉన్నవారితో సంపర్కం జరిపితే- 9 నుంచి 90 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు మొదలవ్వచ్చు. ముందు జననాంగం మీద గట్టి పుండు పడుతుంది, తాకితే రసి కారుతుంది గానీ నొప్పేం ఉండదు. ఇది సిఫిలిస్‌ ప్రత్యేకత. ఈ దశలో చికిత్స చేసినా చేయకపోయినా పుండు మానిపోతుంది. దీంతో సమస్య తగ్గిపోయిందనుకుంటారుగానీ.. లోపల బ్యాక్టీరియా వ్యాపిస్తూనే ఉంటుంది. అంగం మీద పుండు ఉన్నప్పుడు కలిస్తే.. సిఫిలిస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పుండు మానిన తర్వాత ఇతరులకు వ్యాపించదు. కానీ వారి లోపల మాత్రం బ్యాక్టీరియా ఇతర భాగాలకు విస్తరిస్తూ, వారిని కబళిస్తుంటుంది.

చికిత్స: తొలిదశలో బెంజిథీన్‌ పెన్సిలిన్‌ ఒక మోతాదు ఇస్తే సరిపోతుంది. మలిదశలో రెండు మోతాదులు ఇవ్వాల్సి ఉంటుంది.

నిర్లక్ష్యం చేస్తే: తొలిదశలో తగ్గినట్టే తగ్గినా... బాధలేం కనబడకపోయినా.. లోలోపలే బ్యాక్టీరియా విజృంభిస్తూ.. వ్యాధి మలిదశ ఆరంభమవుతుంది. అరిచేతుల్లో అరికాళ్లలో, ఒంటి మీద అక్కడక్కడ దద్దు కనబడుతుంది. కొందరికి అక్కడక్కడ జుట్టు వూడిపోవచ్చు. నోట్లో పుండ్లు, గజ్జల్లో, చంకల్లో, మెడ దగ్గర నొప్పి లేకుండా బిళ్లలు కనబడతాయి. కొందరిలో ఇది 8 నుంచి 20 ఏళ్ల తర్వాత- తీవ్రమైన గుండె జబ్బుకు, తీవ్రమైన నాడీమండల సమస్యలకు (న్యూరో సిఫిలిస్‌) కూడా దారి తీస్తుంది. వీటిని గుర్తించి చికిత్స చెయ్యకపోతే ప్రాణాలకు కూడా ప్రమాదం.

నీటి పొక్కులు
హెర్పిస్‌ సింప్లెక్స్‌
హెర్పిస్‌ సింప్లెక్స్‌ (హెచ్‌సీవీ) అనేది లైంగికంగా, ముద్దుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వైరస్‌. ఇది ఒంట్లో చేరిన 3 రోజుల్లో జననాంగాల మీద, పెదవి చివర్లలో నీటి పొక్కులు, తీవ్రమైన నొప్పి, మంట, జ్వరం వంటి లక్షణాలు బయలుదేరతాయి. దీన్ని గుర్తించి 24 గంటల్లో చికిత్స తీసుకుంటే మళ్ళీమళ్లీ రావు. లేకపోతే ఈ వైరస్‌ నాడుల్లో చేరి, నాడీ మూలల్లో (నెర్వ్‌ గాంగ్లియా) స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కానీ బయటకు లక్షణాలేం ఉండవు. ఆ తర్వాత- తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, జ్వరాల వంటి ఇతరత్రా సమస్యల కారణంగా ఒంట్లో రోగనిరోధక శక్తి కొద్దిగా బలహీనపడిందంటే చాలు..ఇది విజృంభించి, తిరిగి ఉద్ధృతమై మళ్లీ జననాంగాల వద్ద, పెదవుల కొనల్లో పొక్కులు తెచ్చిపెడుతుంటుంది. వీటివల్ల తీవ్ర మానసిక వేదనకు లోనవుతుంటారు. కొందరు పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం సజావుగా సాగుతుందా? లేదా? వంటి ఎన్నో సందేహాల్లో కూరుకుని, డిప్రెషన్‌లోకీ వెళ్లిపోతుంటారు.

చికిత్స: నీటిపొక్కులు కనపడ్డప్పుడు ఒక వారం యాంటీవైరల్‌ మందులు తీసుకుంటే పొక్కులు చాలావరకూ తగ్గుతాయి. అయితే కొందరిలో ఆ తర్వాతా మళ్లీమళ్లీ వస్తుంటాయి. ఏడాదికి 1-2 సార్లు వస్తుంటే- వచ్చినప్పుడు మందులు తీసుకుంటే సరిపోతుంది. 6 కంటే ఎక్కువసార్లు వస్తుంటే మాత్రం దీర్ఘకాలం యాంటీవైరల్‌ మందులు తప్పవు. భాగస్వాములకూ పొక్కులు కనబడితే వాళ్లూ ఇదే చికిత్స తీసుకోవాలి.

నిర్లక్ష్యం చేస్తే.. పొక్కులు తరచూ వేధించటమే కాదు.. అరుదుగా మెదడు పొరల్లో వాపు (మెనింజైటిస్‌) వంటి తీవ్ర సమస్యలూ రావొచ్చు. కొన్నిసార్లు పురుషుల్లో ఈ వైరస్‌ ఒంట్లో ఉన్నా పైకి ఏ లక్షణాలూ ఉండకపోవచ్చు. కానీ వారి ద్వారా భాగస్వామికి సంక్రమించొచ్చు. గర్భిణులు హెర్పిస్‌ సింప్లెక్స్‌ బారినపడితే.. ఈ వైరస్‌ పిండానికీ సోకొచ్చు. దీంతో పిండం మెదడు పొరల్లో వాపు, అవయవ లోపాలు, తక్కువ బరువుతో పుట్టటం, మృత శిశువు జన్మించటం వంటి ముప్పులూ పొంచి ఉంటాయి. కాబట్టి ముందే దీనికి చికిత్స తీసుకోవటం అవసరం. అలాగే గర్భిణికి నీటిపొక్కులుంటే కాన్పు సమయంలో వారి ద్వారా పిల్లలకూ సోకే అవకాశం ఉంటుంది కాబట్టి వీరికి సిజేరియన్‌ కాన్పు సూచిస్తారు. హెర్పిస్‌ సింప్లెక్స్‌ ఉన్నవారు సంభోగ సమయంలో కండోమ్‌ ధరించటం, పొక్కులున్నప్పుడు ముద్దుల వంటివి పెట్టుకోకపోవటం మంచిది.

జననాంగ పులిపిర్లు
జెనిటల్‌ వార్ట్స్‌
సంభోగం ద్వారా వ్యాపించే మరో తీవ్రమైన సమస్య జననాంగ పులిపిర్లు. దీనికి మూలం హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌. దీనివల్ల జననాంగాలు, మలద్వారం వద్ద పులిపిర్ల వంటివి మొలుస్తుంటాయి. చూడటానికి సాధారణ పులిపిర్లలాగే ఉన్నా నొక్కితే మెత్తగా ఉంటాయి. వైరస్‌ సంక్రమించిన 3 వారాలకే పులిపిర్లు మొదలవ్వచ్చు, కొన్నిసార్లు నెలల తర్వాతా రావచ్చు. వీటితో పెద్ద నొప్పి, బాధలేం ఉండవు కాబట్టి చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వీటివల్ల జననాంగాలు వికారంగా కనిపించటం మొదవుతుంది.

చికిత్స: కరెంట్‌, మందులు, లేజర్‌ వంటి పద్ధతులతో ఈ పులిపిర్లను తొలగిస్తారు. రోగనిరోధకశక్తి తగ్గినవారికి, పులిపిర్లు మూత్రమార్గంలోనూ వచ్చి తీవ్రంగా బాధపడుతున్న వారికి యాంటీవైరల్‌ మందులతో చికిత్స అవసరం.

నిర్లక్ష్యం చేస్తే.. పులిపిర్లతో ఆయా భాగాలు వికారంగా తయారవుతాయి. వీరి నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది. ఒకోసారి ఇన్‌ఫెక్షన్‌తో దుర్వాసన మొదలవ్వచ్చు. అరుదుగా మెదడు పొరల్లో వాపు రావొచ్చు. గర్భిణుల నుంచి ఈ వైరస్‌ పిండానికీ వ్యాపించొచ్చు. దీంతో పిల్లల నోట్లో పాపిలోమాస్‌, బరువు తక్కువగా పుట్టటం, మెదడు పొరల్లో వాపు వంటివే కాదు.. అరుదుగా మృత శిశువులూ పుట్టొచ్చు.

పుండు నుంచి బోద
లింఫోగ్రాన్యులోమా వెనీరియం
సంపర్కం ద్వారా సంక్రమించే చికాకు సమస్య ఇది. సంభోగం ద్వారా ‘క్లమీడియా ట్రాకోమాటిస్‌’ అనే బ్యాక్టీరియా ఒంట్లో చేరితే 8-21 రోజుల్లో జననాంగం మీద చిన్న పుండు కనబడుతుంది. కానీ చిత్రంగా 2-3 రోజుల్లో అదే తగ్గిపోతుంది. చాలామందికి అసలు పుండు పడినట్టే తెలియదు. కానీ పుండు మానిన 2-3 వారాల తర్వాత మళ్లీ కథ మొదలవుతుంది. గజ్జల్లో వాపు, ఎరుపు, తీవ్రమైన నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, వణుకు వంటి లక్షణాలు ప్రారంభమవుతాయి.

చికిత్స: కచ్చితంగా గుర్తించి ఎరిత్రోమైసిన్‌, జెంటామైసిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌ 3-4 వారాలు ఇస్తే పూర్తిగా నయమవుతుంది. భాగస్వామినీ గమనిస్తూ- వ్యాధి లక్షణాలు కనబడితే వారికీ చికిత్స ఇవ్వటం అవసరం.

నిర్లక్ష్యం చేస్తే.. గజ్జలో బిళ్ల పగిలి, చీము కారుతుంది. పుండు పడి, మచ్చ ఏర్పడుతుంది. వీరి నుంచి వ్యాధి ఇతరులకూ వ్యాపిస్తుంది. అంతే కాదు.. క్రమేపీ లింఫ్‌ నాళాలు మూసుకుపోతాయి. ఫలితంగా లింఫ్‌ ద్రవం ఎక్కడిదక్కడే నిల్చిపోయి.. వృషణాలు, అంగం బోదకాలులాగా పెద్దగా ఉబ్బిపోతాయి. మలద్వారం వద్ద వాపు, భగందరం (ఫిస్టులా), ద్వారం అక్కడక్కడ మూసుకుపోవటం (స్ట్రిక్చర్‌) వంటి తీవ్ర సమస్యలూ తలెత్తొచ్చు.

సెగ, మంట
గనోరియా
లైంగిక సంపర్కం ద్వారా సంప్రాప్తించే అతిపెద్ద సమస్య, శతాబ్దాలుగా మనుషులను వేధిస్తున్న సమస్య ఈ గనోరియా. ఒక్క సంపర్కమే కాదు, శారీరక స్రావాల ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా (నిసేరియా గనోరియే) ఒకరి నుంచి మరొకరికి చాలా తేలికగా సంప్రాప్తిస్తుంది. ఇది ఒంట్లో చేరిన 3-8 రోజుల్లో లక్షణాలు మొదలవుతాయి. జననాంగం నుంచి తెల్లటి, పచ్చటి స్రావాలు, మూత్రం పోస్తున్నప్పుడు మంట, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలుంటాయి. మంట భరించలేని స్థాయిలో ఉంటుంది. పురుషుల్లో కంటే స్త్రీలలో లక్షణాల తీవ్రత తక్కువ. దీనివల్ల వీరి నుంచి ఇది తేలికగా వ్యాపిస్తుంటుంది. పురుషుల్లో వృషణాల వాపూ ఉండొచ్చు.

చికిత్స: పెన్సిలిన్‌ వంటి యాంటీబయోటిక్స్‌ ఇస్తే తగ్గిపోతుంది. భాగస్వామికీ చికిత్స తప్పనిసరి.

నిర్లక్ష్యం చేస్తే: సత్వర చికిత్స తీసుకోకపోతే స్త్రీలలో ఇది పొత్తికడుపు వాపు సమస్యలకు దారి తీస్తుంది. ఫలోపియన్‌ ట్యూబులు దెబ్బతిని సంతాన రాహిత్యం రావచ్చు. పురుషుల్లో వృషణాల వాపు, సంతాన సామర్థ్యం తగ్గటం, ప్రోస్టేటు గ్రంథి దెబ్బతినటం, ముఖ్యంగా మూత్ర మార్గం అక్కడక్కడ మూసుకుపోయి మూత్ర విసర్జన ఇబ్బంది కావటం వంటి సమస్యలన్నీ వేధిస్తాయి. కొందరిలో కాలేయం, మెదడు వంటి అవయవాలూ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ధోరణి మారుతోంది!

  సుఖవ్యాధులు.. నేటి యువతలో పైకి కనబడకుండా చాపకింద నీరులా విస్తరించిపోతున్నాయి. 15-45 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఎక్కువగా కనబడుతున్నాయి.

* హెర్పిస్‌ సింప్లెక్స్‌, జననాంగ పులిపిర్లు వంటి వైరల్‌ సుఖవ్యాధుల కేసులు ఇటీవల చాలా పెరిగాయి.
* సిఫిలిస్‌ వంటి వ్యాధులకు నేడు సమర్థమైన మందులున్నా.. చాలామంది బయటకు చెప్పుకోలేక చికిత్సకు ముందుకు రాకపోవటంతో ఇవీ మొండిగా తయారవుతున్నాయి.
* ఒకప్పుడు లైంగికంగా సంక్రమించి, జననాంగాల వద్ద సమస్యలు సృష్టించిపెట్టే జబ్బులే ఎక్కువ. వీటిని ‘ఎస్‌టీడీ’లనే వాళ్లు. ఇటీవలి కాలంలో జనానాంగాల వద్ద ఏ లక్షణాలూ లేకుండా.. శరీరం మొత్తాన్ని దెబ్బతీసే వైరల్‌ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే హెచ్‌ఐవీ, కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్‌-సి వంటివీ లైంగికంగా సంక్రమించే సమస్యలే. అందుకని వీటన్నింటినీ కలిపి ఇప్పుడు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు (ఎస్‌టీఐ) అంటున్నారు. జననాంగాల వద్ద వచ్చే గజ్జి (స్కేబిస్‌), తెలుపు (క్యాండిడియాసిస్‌), ట్రైకోమోనియాసిస్‌ వంటివీ సంపర్కం ద్వారా వ్యాపిస్తాయి కాబట్టి వీటినీ ఎస్‌టీఐలుగానే పరిగణిస్తున్నారు. అందువల్ల ఒకప్పుడు సుఖవ్యాధుల కింద నాలుగైదు సమస్యలే ఎక్కువగా వినిపించేవి, ఇప్పుడు వీటి సంఖ్య 20కి పైగా పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని