అశ్లీల చిత్రాలు తరచుగా చూస్తున్నారా? అయితే...

అశ్లీల చిత్రాలను చూడటం కూడా ఒకరకంగా కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాల వ్యసనం లాంటిదే అనుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

Updated : 14 Mar 2024 19:57 IST

అశ్లీల చిత్రాలు తరచుగా చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఇది పురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గటానికి, స్తంభనలోపానికి దారితీయొచ్చు! అశ్లీల చిత్రాలను చూడటం కూడా ఒకరకంగా కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాల వ్యసనం లాంటిదే అనుకోవచ్చు. మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మన మెదడులో ‘హాయి భావన’ కలిగించే భాగాలు ప్రేరేపితమవుతుంటాయి. అందుకే మాదక ద్రవ్యాలను మళ్లీ మళ్లీ తీసుకోవాలని మనసు తహతహలాడిపోతుంటుంది. అయితే చిక్కేటంటే.. ఒకసారి వీటికి అలవాటుపడితే క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకునే’ సామర్థ్యమూ పెరుగుతూ వస్తుండటం. మొదట్లో మాదిరిగా హాయి కలగదు. అందువల్ల తరచుగా.. మరింత ఎక్కువ మోతాదులో మాదక ద్రవ్యాలను తీసుకోవటమూ మొదలవుతుంది.

అశ్లీల చిత్రాలను తరచుగా చూసేవారిలోనూ ఇలాగే జరుగుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. అశ్లీల చిత్రాలను చూసినప్పుడు కూడా మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే ప్రేరేపితమవుతాయి. వీటిని తరచుగా చూసేవారిలో క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకోవటం’ సంభవిస్తోందని.. దీంతో శృంగార స్పందనలు, శృంగారంపై ఆసక్తి తగ్గుతూ వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది నిజ జీవితంలో శృంగారానుభూతిపై విపరీత ప్రభావం చూపుతుండటం గమనార్హం. నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా ‘అలాంటి దృశ్యాలే’ మనసులో కదలాడుతుండటం, సహజ శృంగారానికీ వాటికీ పోలిక లేకపోవటం మూలంగా చాలామంది అసంతృప్తికి, ఆందోళనలకు లోనవుతున్నారని పరిశోధకులు వివరిస్తున్నారు. కాబట్టి అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని