నిద్ర.. వీర్యానికి బాసట

నిద్ర తక్కువైతేనే కాదు..ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు.

Published : 06 Jun 2017 01:10 IST

నిద్ర.. వీర్యానికి బాసట

నిద్ర తక్కువైతేనే కాదు..ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు. అనంతరం వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు. వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం. ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హానికరం. ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్‌ (యాంటీస్పెర్మ్‌ యాంటీబాడీ) స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, అదీ త్వరగానే పడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయటం.. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల వంటివి కనీసం 45 నిమిషాల ముందే కట్టేయటం.. నిద్ర పోవటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం.. గదిలో ప్రకాశవంతమైన లైట్లు లేకుండా చూసుకోవటం.. మనసుకు నచ్చిన సంగీతాన్ని వినటం.. వదులుగా ఉండే దుస్తులు ధరించటం..వంటి వాటితో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని