సంతోషం ‘సగం’ ఆరోగ్యం!

ఉల్లాసంగా, సంతోషంగా గడిపేవారు సహజంగా ఆరోగ్యంగానూ ఉంటారు. దీనికి సానుకూల దృక్పథం ఒక్కటే కాదు.. అన్నిపనుల్లోనూ చురుకుగా పాల్గొనటం, మంచి ఆహారం తీసుకోవటం కూడా కారణమే. ఇలాంటివారు పక్కవారి ఆరోగ్యానికీ....

Published : 25 Jul 2017 01:35 IST

సంతోషం ‘సగం’ ఆరోగ్యం!

ల్లాసంగా, సంతోషంగా గడిపేవారు సహజంగా ఆరోగ్యంగానూ ఉంటారు. దీనికి సానుకూల దృక్పథం ఒక్కటే కాదు.. అన్నిపనుల్లోనూ చురుకుగా పాల్గొనటం, మంచి ఆహారం తీసుకోవటం కూడా కారణమే. ఇలాంటివారు పక్కవారి ఆరోగ్యానికీ.. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడతారు తెలుసా? ప్రతిదానికీ చింతించే భాగస్వామి గలవారితో పోలిస్తే.. ఆనందంగా, సంతోషంగా ఉండే భాగస్వామి గలవారు 34% ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నట్టు మిషిగన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. వీరికి శారీరక బాధలు తక్కువగా ఉంటున్నట్టు.. మరింత తరచుగా వ్యాయామం, శారీరకశ్రమలు చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు మరి. వ్యక్తిగత సంతోషం, ఇతర జీవితానుభవాలను పక్కనపెట్టి చూసినా ఈ ప్రభావం కనబడుతుండటం గమనార్హం. దీనికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. ఒకటి- ఆనందంగా ఉండేవారు తమ భాగస్వామిని బాగా చూసుకోవటం. భాగస్వామి భావోద్వేగాలను పంచుకుంటూ.. సమయానికి మందులు వేసుకునేలా చేయటం వంటి చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తుంటారని పరిశోధకులు చెబుతున్నారు. రెండోది- భాగస్వామి ఏదైనా బాధపడుతున్నప్పుడు వారికి భరోసా ఇస్తూ దాన్నుంచి తేలికగా బయటపడేలా తోడ్పడుతుండటం. ఇది వారి భాగస్వామి ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి లోనవకుండా కాపాడుతోందనీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే.. ఈ విషయంలో భార్యాభర్తలనే తేడా లేకపోవటం. అంటే భార్య ఆనందం భర్త పైన, భర్త ఆనందం భార్య పైన ప్రభావం చూపుతున్నాయన్నమాట. జీవితంలోనే కాదు.. ఆరోగ్యంలోనూ సగ భాగం కావటమంటే ఇదేనేమో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని