నాకెందుకీ అబార్షన్ల బాధ

నా వయసు 28 సంవత్సరాలు. నాకు పదకొండేళ్ల క్రితం పెళ్లయ్యింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. రెండో కాన్పులో బాబు లోపలే చనిపోయి పుట్టాడు. ఆ తర్వాత గర్భం నిలబడలేదు....

Published : 22 May 2018 01:43 IST

సమస్య-సలహా
నాకెందుకీ అబార్షన్ల బాధ

ప్రశ్న: నా వయసు 28 సంవత్సరాలు. నాకు పదకొండేళ్ల క్రితం పెళ్లయ్యింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. రెండో కాన్పులో బాబు లోపలే చనిపోయి పుట్టాడు. ఆ తర్వాత గర్భం నిలబడలేదు. వరుసగా నాలుగు సార్లు అబార్షన్లు అయ్యాయి. దీనికి కారణమేంటో తెలియటం లేదు. డాక్టర్లు కూడా కచ్చితమైన కారణమేంటో చెప్పటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో దయచేసి చెప్పండి.

-జాహిద, గుంతకల్లు, అనంతపురం

జవాబు: రెండో కాన్పులో బాబు కడుపులోనే చనిపోవటానికి దారితీసిన పరిస్థితులేంటో తెలిస్తే గానీ కచ్చితమైన కారణాన్ని చెప్పలేం. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు వెంట వెంటనే అబార్షన్లు అయ్యాయంటే ముందస్తు ప్రణాళికలేవీ లేకుండానే గర్భధారణకు ప్రయత్నించారని అర్థమవుతోంది. నిజానికిలా వరుసగా మూడు సార్ల కన్నా ఎక్కువగా గర్భం పోవటమనేది చాలా తక్కువ. మీలాంటివారికి ప్రత్యేకమైన సమస్యలేవైనా ఉన్నాయేమోనని నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది. కొన్ని రక్తపరీక్షలు, క్రోమోజోమ్‌ల పరీక్షలు, అల్ట్రాసౌండ్‌ వంటివి చేసి లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. ఫ్యాక్టర్‌ 5 లీజ్డ్‌ మ్యుటేషన్‌ వంటి జన్యుపరమైన లోపాలేవైనా ఉన్నాయేమో కూడా చూడాలి. అలాగే గర్భాశయ నిర్మాణం ఎలా ఉందన్నదీ పరిశీలించాల్సి ఉంటుంది. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం కాన్పుయ్యే సమయం వరకూ బిగువుగా ఉండాలి. కానీ కొందరిలో ఇది మధ్యలోనే బిగువు సడలిపోవటం వల్ల గర్భం నిలబడలేని స్థితి తలెత్తుతుంది. ఇలాంటి సమస్యను అల్ట్రాసౌండ్‌ పరీక్షతో ముందుగానే గుర్తించొచ్చు. మేనరికం వివాహాలు.. మాయ సరిగా పనిచేయక పిండానికి తగినంత ఆక్సిజన్‌, పోషకాలు అందకపోవటం.. బీపీ ఎక్కువగా ఉండటం.. వంటివి కూడా అబార్షన్‌కు దారితీయొచ్చు. అలాగే అంతకుముందు గర్భం ధరించినపుడు ఇన్‌ఫెక్షన్లు రావటం వంటి ఇతరత్రా సమస్యలు కూడా తర్వాత గర్భం మీద ప్రభావం చూపొచ్చు. తరచూ గర్భాలు పోతున్న వారిలో కొందరికి ‘యాంటీ ఫాస్ఫోలిపిడ్‌ యాంటీబోడీలు’ కనబడుతుంటాయి. వీటివల్ల గర్భం నిలబడే అవకాశాలు తక్కువ. కాబట్టి పరిస్థితిని బట్టి చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా తరచుగా అబార్షన్లు అవుతున్నాయంటే కచ్చితమైన కారణాన్ని గుర్తించటం చాలా కీలకం. గర్భం ధరించటానికి ప్రయత్నం చేసే ముందే ఒకసారి డాక్టర్‌ను సంప్రతించి, అవసరమైన పరీక్షలన్నీ చేసుకోవటం మంచిది.

మీ సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా:
సమస్య - సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని