అంగం స్తంభిస్తే నొప్పి.. క్యాన్సరా?

సమస్య: నా వయసు 60 ఏళ్లు. గత పదేళ్లుగా ప్రోస్టేట్‌ ఉబ్బుతో బాధపడుతున్నాను. గత మూడేళ్లుగా మాడు మీద, అంగం చివరన చర్మం నల్లబడుతోంది. అంగం

Published : 28 Aug 2018 01:37 IST

సమస్య - సలహా
అంగం స్తంభిస్తే నొప్పి.. క్యాన్సరా?

సమస్య: నా వయసు 60 ఏళ్లు. గత పదేళ్లుగా ప్రోస్టేట్‌ ఉబ్బుతో బాధపడుతున్నాను. గత మూడేళ్లుగా మాడు మీద, అంగం చివరన చర్మం నల్లబడుతోంది. అంగం స్తంభించినపుడు లోపల ఏదో గట్టి గడ్డలాంటిది ఉన్నట్టుగా అనిపిస్తోంది. నొప్పిగానూ ఉంటోంది. ఇదేమైనా అంగం క్యాన్సరా? ఏం చెయ్యాలి?

- మనోహర్‌ రెడ్డి, హైదరాబాద్‌

సలహా: ప్రోస్టేట్‌ ఉబ్బునకూ అంగం చివరన చర్మం నల్లబడటానికి ఎలాంటి సంబంధం లేదు. ఇక అంగం స్తంభించినపుడు లోపల ఏదో గట్టిగా గడ్డలాగా ఉన్నట్టు అనిపించటం, నొప్పి వంటివి చూస్తుంటే ఇవి పైరోనీస్‌ జబ్బు లక్షణాలుగా కనబడుతున్నాయి. దీనికి మూలం అంగం లోపల కణజాలం మచ్చలాగా ఏర్పడటం. ఇలా ఎందుకు జరుగుతుందనేది కచ్చితంగా తెలియదు. అంగానికి ఏదైనా గట్టిగా దెబ్బ తగలటం లేదా బాగా వంగిపోవటం వల్ల లోపల రక్తస్రావం జరిగి మచ్చ ఏర్పడే అవకాశముంది. కొందరిలో జన్యుపరమైన అంశాలూ దీనికి కారణం కావొచ్చు. కణజాలం మచ్చలాగా మారిపోతుంటే సాగే గుణం తగ్గుతుంది. దీంతో అంగం స్తంభించినపుడు నొప్పి పుడుతుంటుంది. కొన్నిసార్లు అంగం ఒక పక్కకు వంగిపోతుండొచ్చు కూడా. అయితే ఇది ప్రమాదకరమైందేమీ కాదు. అరవై ఏళ్ల వయసులో దీనికి చికిత్సలు, మందుల అవసరం కూడా లేదు. అదే చిన్న వయసులోనైతే అంగం బాగా ఒక పక్కకు వంగిపోతున్నప్పుడు సర్జరీ చేసి సరిదిద్దొచ్చు. అలాగే మీరు అంగం మీద పుండు ఉందో లేదో చెప్పలేదు. పుండు గనక లేకపోతే క్యాన్సర్‌ అయ్యే అవకాశం చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఒకవేళ పుండు ఉన్నట్టయితే అక్కడ్నుంచి చిన్నముక్క తీసి పరీక్షించాల్సి (బయాప్సీ) ఉంటుంది. దీంతో క్యాన్సర్‌ ఉన్నదీ లేనిదీ నిర్ధరణ అవుతుంది. అప్పుడు తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా మీరు ఒకసారి యూరాలజిస్టును సంప్రతించి పరీక్షించుకోవటం మంచిది.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని