అబ్బాయిల్నీ ఏడవనివ్వండి!

అదో దట్టమైన అడవి. అప్పుడే పుట్టిన మీ బాబుతో అందులోకి అడుగుపెట్టారు. అతనిపై మీకెన్నో కలలు. తొమ్మిది నెలలు మీ రక్తాన్ని పంచుకున్నవాడూ.....

Published : 12 Apr 2016 22:10 IST

అబ్బాయిల్నీ ఏడవనివ్వండి!

అదో దట్టమైన అడవి. అప్పుడే పుట్టిన మీ బాబుతో అందులోకి అడుగుపెట్టారు. అతనిపై మీకెన్నో కలలు. తొమ్మిది నెలలు మీ రక్తాన్ని పంచుకున్నవాడూ.. మీ గుండెచప్పుళ్లు విన్నవాడూ కాబట్టి మీ భావోద్వేగాలు తెలుసుకుంటాడన్న ఆశ మీది. వాణ్ని స్త్రీలని గౌరవించే ఓ మంచివ్యక్తిగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అడవిలోకి అడుగు వేసీవేయగానే ఓ సింహం వచ్చి మీ ఎదుట నిల్చుంది! పురుషాధిక్యత భావజాలమనే సింహం అది. స్త్రీ ద్వేషాన్ని వాడిలోకి ఎక్కించాలని చూస్తోంది. దాన్నుంచి మీవాణ్ని కాపాడుకోవడం ఎలా?... అదే చెబుతున్నారు నిపుణులు

ఇంటి నుంచే మొదలుపెడదాం..  అందాల నవ్వుల మాధురీదీక్షిత్‌ గుర్తుంది కదా! ఆ మధ్య తను ‘బాయ్స్‌ డోన్ట్‌ క్రై’ అనే లఘుచిత్రంలో నటించింది. చిన్నప్పుడు బడికెళ్లేటప్పుడో, ఇంక దేనికో భయపడ్డప్పుడో మగపిల్లలు ఏడుస్తుంటే ‘అబ్బాయిలు అలా ఏడవకూడదు!’ అని చెబుతూ ఉంటాం కదా! అలా ప్రతి దశలోనూ దుఃఖాన్ని అణచేసుకున్న, ‘నువ్వు మగాడివి..’ అనే పదం వింటూ పెరిగిన ఓ అబ్బాయి పెళ్లయ్యాక ఎలా మారతాడో చెప్పే కథ ఇది. ఇంతకీ ఎలా మారతాడు అతను.. క్రూరుడిగా, భార్యని సిగరెట్‌తో కాల్చి హింసించేవాడిగా!! ‘మగపిల్లల్ని ‘అబ్బాయిలు ఏడవకూడదు..!’ అనికాకుండా ‘అబ్బాయిలెప్పుడూ అమ్మాయిల్ని ఏడిపించకూడదు!’ అని చెబుతూ పెంచితే మంచిది!!’ - అంటూ మాధురీదీక్షిత్‌ చెబుతూ ఉండటంతో ఈ లఘుచిత్రం ముగుస్తుంది. అబ్బాయిలకంటూ ప్రత్యేకమైన కొన్ని ‘సూపర్‌హీరో’ ముద్రలు వేసి పెంచకండీ అన్నది దీని సారాంశం. పెంచితే ఏమవుతుంది అంటారా..?

ఈ గణాంకాలు చూడండి..
అమ్మాయిలపై అఘాయిత్యాల లెక్కలు తీస్తే.. మనదేశానిది ప్రపంచంలోనే మూడో స్థానం! ఇక్కడ ప్రతి 1.7 నిమిషాలకో నేరం జరుగుతోంది. ప్రతి పదహారు నిమిషాలకో అత్యాచారం చోటుచేసుకున్నట్టు అంచనా. ప్రతి నాలుగు నిమిషాలకు ఓ మహిళ.. గృహహింసకు గురవుతోంది! జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తాజా లెక్కలు చెబుతున్న నిజాలివి. 2013 లెక్కల ప్రకారం ఈ నేరాలు అత్యధికంగా నమోదైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే! వీటన్నింటికీ పైపై కారణాలు ఎన్నున్నా, అసలైంది మాత్రం, మన పెంపకంలో వేళ్లూనుకున్న పితృస్వామ్య భావజాలమే అంటున్నారు సామాజికశాస్త్ర నిపుణులు! ‘అమ్మాయిలు చాలా బలహీనులు. అబ్బాయిలు ఉన్నతులు’ అనే భావన అది. తరతరాల నుంచి మన కుటుంబాల్లో వినిపిస్తున్న కొన్ని మాటలూ, పాటిస్తున్న ఆచారాలూ, నేర్పిస్తున్న అలవాట్ల కారణంగా అది మగపిల్లల అంతఃచేతనలోకి వెళ్లిపోతోంది. కానీ ఇప్పుడు కాలం మారింది. వైమానిక దళంలో పోరాటాలకు స్త్రీలు కూడా వెళ్లొచ్చని నిన్ననే కేంద్రప్రభుత్వం ప్రకటించింది కదా! మగవాడికి మహిళలు అన్నింటా సర్వసమానమనే భావన పిల్లల్లోకి తీసుకెళ్లాలి. ‘అమ్మాయిల్ని చాలా పద్ధతిగా పెంచాలి..’ అనే మాట వింటుంటాం. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్తతో అబ్బాయిల్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భార్యాభర్తలుగా మీరు! : కడుపున ఉండగానే పిల్లలు మీ భావోద్వేగాల్ని అర్థం చేసుకుంటారనే విషయం తెలుసుగా! కాబట్టి, మన ప్రయత్నాలు పెళ్లైనప్పటి నుంచే మొదలుకావాలి. పనుల్లో ఆడా, మగా తేడాలేదనే విషయం భార్యాభర్తలు గ్రహించాలి. వంట చేయడం, అంట్లు తోమడం వంటివాటిలో భర్త కూడా పాలుపంచుకోవాలి. అలాంటి కుటుంబాల్లో పెరిగే మగపిల్లలు మిగతావారికంటే అమ్మాయిల్నెక్కువగా గౌరవిస్తారనీ.. జీవితంలోనూ రాణిస్తారనీ ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. మీ భర్తలాగే స్కూటర్‌ నడపడం దగ్గర్నుంచి, ఎలక్ట్రిక్‌ పనులు చేయడందాకా.. మీ భర్త చేయగల పనులూ మీరూ నేర్చుకోవాలి. ఇంటాబయటా అన్ని పనులూ ధైర్యంగా చక్కబెట్టుకోగలగాలి. ఇది మిమ్మల్ని చూస్తూ పెరిగే అబ్బాయిలపై మంచి ప్రభావం చూపిస్తుంది. అమ్మాయిలు తనకు సమానమే అనే భావన తీసుకొస్తుంది.

దానికి అడ్డుకట్ట వేయాలి : రెండో సంతానంగా పుట్టే అబ్బాయిలు ఒక్కోసారి నెలల నుంచే ‘అగ్రెసివ్‌’గా ఉంటారు. అక్కని కొట్టేస్తూ ఉంటారు. తమ్ముడే కదాని ఆడపిల్ల వూరుకోవచ్చు. కానీ తల్లిదండ్రులుగా ఇలాంటివాటికి అడ్డుకట్ట వేయాలి. అలా చేయకపోతే కనిపించే ప్రతి అమ్మాయీ తాను కొట్టేందుకే పుట్టిన మనిషనే భావన అబ్బాయిల్లో స్థిరపడిపోతుంది.

ఇద్దరికీ అన్నీ! : ఇంట్లో పాపా, బాబూ ఇద్దరూ ఉంటే బొమ్మల దగ్గర నుంచి తినుబండారాల దాకా అన్నీ సమానంగా తీసుకురావాలి. మీరు చేసే ప్రతి షాపింగ్‌లోనూ అది కనిపించాలి. పాపకి అది ఇష్టం ఉండదనో.. ఫలానా వస్తువు నచ్చదనో బాబుకి మాత్రమే తీసుకురావడం మగపిల్లల్లో ఆధిక్య భావాన్ని రాజేస్తుంది.

తేడా ఉన్నా..! : అమ్మాయిలకి సహజంగానే బార్బీ బొమ్మలంటే ఇష్టం ఉంటుంది. గులాబీ రంగంటే మక్కువ చూపొచ్చు. అబ్బాయిలకి మెషిన్‌ గన్‌లూ, తుపాకుల్లాంటి బొమ్మలూ, బాగా ముదురు రంగులపై ఆసక్తి ఉండొచ్చు. ప్రకృతి సహజమైన ఇష్టాయిష్టాలూ, తేడాలవి. కానీ తేడాలు వేరు.. ఎక్కువ తక్కువలు వేరు! ఎదుటివారి అభిరుచి మనకంటే వ్యత్యాసంగా ఉన్నంత మాత్రాన.. వాళ్లని తక్కువగా చూడాల్సిన అవసరంలేదని అబ్బాయిలకి చెప్పాలి ్ద ఏడవనివ్వండి : మొదట్లోనే చెప్పినట్టు ‘నువ్వు మగాడివి ఏడవకూడదు..!’ అని చెబుతూ అబ్బాయిల్లోని దుఃఖాన్ని అణచివేస్తున్నాం. ఇలా అణచివేయడం వాళ్లలో హింసగా బయటపడుతుంది. అంతేకాదు ‘మగవాళ్లంటే చాలా ప్రత్యేకమేమో! అమ్మాయిలు మనకంటే తక్కువేమో!’ అనే అభిప్రాయం స్థిరపడిపోతుంది. అది స్త్రీలపట్ల చులకనగా మారుతుంది.

ఆ పదాలొద్దు : మగమహరాజు, ‘ఆడ’పిల్ల, ఆడంగితనం వంటి పదాలూ, ఆడదంటే అబల, భరించేవాడు భర్త వంటి వాక్యాలూ, ‘ఒసే§ý, ఏమే..’ వంటి సంబోధనలు ఇంట్లో పొరపాటున కూడా వొద్దు. అబ్బాయిలతో ఏ అమ్మాయి గురించైనా చెప్పేటప్పుడూ ‘అదీ.. ఇదీ’ అనే మాటలు వాడకండి. పదాలు మనం వూహించినదానికంటే పిల్లల అంతఃచేతనలోకి తొందరగా వెళ్లిపోతాయి. వాళ్ల స్వభావంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

సమాజం.. సినిమా : ఇంట్లో మనమెంతగా సమానత్వం చూపినా, మాటలూ, చేతల్లో కట్టుదిట్టం చేసినా.. సమాజం, సినిమా పురుషాధిక్యతనే నూరిపోస్తూనే ఉన్నాయింకా. వాటి ప్రభావం నుంచి బయటపడటం కొంత కష్టమే.. కానీ అసాధ్యం కాదు. మీ అక్కింట్లోనో, పక్కింట్లోనో భార్యని భర్త కొడుతుంటేనో, సినిమాల్లో అమ్మాయిల్ని తక్కువచేసి చూపిస్తుంటేనో అది తప్పనే విషయం ప్రతిసారీ ఓపిగ్గా చెప్పండి.

లైంగిక విద్య : అమ్మాయిలపై తక్కువ భావన రావడానికి అబ్బాయిలకి సరైన లైంగిక విజ్ఞానం లేకపోవడం ఓ ప్రధాన కారణం. దీన్ని బయట ఫ్రెండ్స్‌ ద్వారా పొందాలనుకునే క్రమంలో.. కొన్ని వెబ్‌సైట్‌ల కారణంగా లైంగిక అంశాలపరంగా అమ్మాయిలపై చులకనభావం ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి రానీయకుండా తండ్రి చేతే స్త్రీ, పురుష శరీర ధర్మాల గురించి, హార్మోన్‌లతో ఏర్పడే మార్పుల గురించి చెప్పించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు