ఒక్కరే అయితే.. భయమెందుకు!

‘పాపో బాబో కుటుంబానికి ఒక్కరు చాలు..!’ నేటి యువదంపతులు చాలామందిలో వినిపిస్తున్న మాట! ప్రధానంగా దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి.....

Published : 12 Apr 2016 22:14 IST

ఒక్కరే అయితే.. భయమెందుకు!

‘పాపో బాబో కుటుంబానికి ఒక్కరు చాలు..!’ నేటి యువదంపతులు చాలామందిలో వినిపిస్తున్న మాట! ప్రధానంగా దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఆర్థిక పరిమితులు. రెండు.. ఆ ఆర్థిక పరిమితుల్లోనే తమకున్న కొద్దిపాటి వనరుల్లోనే.. పిల్లలకి అన్నింటా ‘ది బెస్ట్‌’ ఇవ్వాలనుకునే తపన ఇంకొకటి. ఇలా ఒక్కరే సంతానం చాలు అనుకుంటున్న దంపతుల్ని కొన్ని అభిప్రాయాలూ, అపోహలూ అయోమయంలో పడేస్తున్నాయి. ‘పిల్లలకు ఎవరో ఒకరు తోడుండాలిగా..’ అనే సలహాతో మొదలై ‘ఒంటరిపిల్లలు పెద్దయ్యాక చాలా స్వార్థపరులవుతారు..’ అనే కుహనా విశ్లేషణదాకా ఇవి రకరకాలు. వాటిలో నిజమెంత? తోడెవ్వరూ లేకపోవడం వల్ల పిల్లలు నిజంగానే ఒంటరితనం అనుభవిస్తారా?

వరెన్ని విశ్లేషణలు చేసినా, సలహాలూ అందించినా తమకు ఒక్కరే సంతానం ఉండాలా.. ఇంకొకర్ని కనాలా? వద్దా? అన్నది పూర్తిగా దంపతుల వ్యక్తిగత నిర్ణయం. ఆ నిర్ణయానికి సమాజం పోకడా, ఆర్థిక వసతులూ, దంపతులిద్దరి ఇష్టాయిష్టాలు వంటివే ఆధారం కావాలి. అంతేకానీ.. అపోహలూ, భయాలూ, దురభిప్రాయాలూ కావు. ఇలాంటి కారణాలతో రెండోసంతానానికి వెళితే.. ఆర్థిక నష్టాలు అటుంచితే, పిల్లల మధ్య అనవసరమైన పోటీకీ, శత్రుత్వానికీ కారణమవుతాం. ఇవి పైకి కనిపించే పొట్లాటలే అనుకునేరు.. అంతర్లీనంగానూ ఇవి తీవ్రంగా ఉంటాయి. అసలు ఒక్కరే సంతానంపై ఉన్న అపోహల్లో నిజానిజాలేమిటో చూద్దామా?

స్వార్థపరులుగా ఉంటారు!

ఒకప్పుడు మన భారతీయ సమాజంలో ఒక్కరే సంతానం ఉండాలని కోరుకోవడం చాలా అరుదు. అనారోగ్యం కారణంగానో, వరుస గర్భస్రావాల వల్లనో మరోసారి సంతానం పొందే అవకాశం లేకే ఒకే బిడ్డకి పరిమితమయ్యేవారు. అలాంటివాళ్లు మొదటి బిడ్డని మహరాజులా చూస్తారు. అడుగు కిందపెట్టనివ్వరు. అడిగినవీ, అడగనివన్నీ కొనిపెడతారు. అందుకే దీన్ని పాశ్చాత్యదేశాల్లో ‘లిటిల్‌ ఎంపెరర్స్‌ సిండ్రోమ్‌’ అనంటారు! ఈ తల్లిదండ్రులు పిల్లలకి తీసుకోవడం తప్ప.. ఇవ్వడం నేర్పరు. సహజంగానే అలాటి పిల్లలు స్వార్థపరులుగానే ఉంటారు. ఇది పెంపకం సమస్య తప్ప.. ఒంటరి పిల్లల సమస్య కాదు. నిజానికి ఒకే సంతానమైనా.. మంచి విలువలతో పెంచగలిగితే దానకర్ణులు అనిపించున్నవాళ్లున్నారు.

 పెంకిగా తయారవుతారు

‘టీచర్లు చెప్పింది వినరు. పెంకిగా తయారవుతారు. చదువులో వెనకపడతారు..!’ అని కొందరు అంటూ ఉంటారు. ఇది నిజం కాదు. ఒకే సంతానంగా ఎదిగినవారు మిగతావారికంటే చదువులో చురుగ్గా ఉంటారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క చదువులోనే కాదు.. వీళ్ల శక్తియుక్తుల్ని చక్కగా మంచిదారిపట్టించగలిగితే అద్భుతాలు చేస్తారు. తిరుగులేని విజయాలు సాధిస్తారు. జగమెరిగిన చిత్రకారుడు లియనార్డో డావిన్సీ, ప్రఖ్యాత పాప్‌ గాయకుడు ఎల్విస్‌ ప్రిస్లే వీళ్లంతా ఒంటరి సంతానమే అంటే

 తల్లికి ఎప్పుడూ భయమే

‘నాకుండేది ఒకటే బిడ్డ తనకేమన్నా అయితే.. ఈ భయం తల్లికి ఎప్పుడూ ఉంటుంది..!’ అని చాలామంది చెబుతుంటారు. నిజానికిలా చీటికీమాటికీ భయపడటం, పిల్లలకి చిన్నపాటి సమస్యవస్తేనే విపరీతంగా ఆందోళన చెందడం ‘న్యూరోసిస్‌’ అనే మానసిక సమస్య. దానికి చిన్నపాటి మానసిక చికిత్స చాలు! వీరికి ఒక్క సంతానం ఉంటేనే కాదు.. ఇద్దరుముగ్గురున్నా అనవసరమైన భయాలూ, ఆందోళనలూ తప్పవు. అధ్యయనాల ప్రకారం ఇద్దరు పిల్లలతో పోలిస్తే ఒంటరి పిల్లలున్న మహిళలు మాతృత్వపు మాధుర్యాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. ఆ ఆనందాన్ని పిల్లలకీ పంచగలుగుతారు.

 ఒంటరితనం..

ఒకే సంతానంగా పెరిగినవాళ్లు తీవ్రమైన ఒంటరితనం అనుభవిస్తారనీ.. కలివిడితనం ఉండదనే అపోహ ఎక్కువమందిలో ఉంటుంది. నిజానికి ఈ పిల్లల్లో ఉండేది ఒంటరితనం కాదు. ఏకాంతాన్ని ఆస్వాదించే గుణం. ఎంతగా స్నేహాలు చేసినా, తలమునకలుగా ప్రేమించినా వీళ్లు తమకంటూ కొంత సమయాన్ని కోరుకుంటారు. ఆ సమయాన్ని తమదైన ప్రత్యేకత సాధించుకునే పనులకే వినియోగిస్తారు. అందుకే వీరిలో కళాకారులు ఎక్కువ! కలివిడితనం పేరుతో ఏమాత్రం వ్యక్తిత్వంలేని గుంపు మనస్తత్వం వీళ్లలో చూడలేం!

మరి సమస్యలే ఉండవా? 
మరి ఒంటరి పిల్లల పెంపకంలో సమస్యలే ఉండవా.. ఉంటాయి! వాటిని చాలా సున్నితంగా ఎదుర్కోవాలి. మనలోని ప్రేమాశ్రద్ధాసక్తులు పిల్లలకు నష్టంరాని రీతిలో అందించాలి. అందుకు వీటిపై దృష్టిసారించండి..

అతి సంరక్షణ వద్దు

 ఒక్కరే సంతానం కాబట్టి.. ప్రేమా, సంరక్షణా, డబ్బూ అన్నీ వాళ్లపై ఒక్కసారే కుమ్మరించకండి. ఒకస్థాయిలో ఇదివారికి వూపిరి సలపనివ్వదు. తమ పని తాము చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారు. దాంతో ప్రతిదానికీ ఎదుటివాళ్లపై ఆధారపడటం అలవాటవుతుంది. ఏ విషయంలోనూ స్వేచ్ఛగా ఉండలేరు.

నీకంతా వృధా..

 పిల్లలకి అడగక ముందే అన్ని తెచ్చిపెట్టే తల్లిదండ్రులు వాళ్లు చదువులోనో, ఇంకేదైనా రంగంలోనో వెనకపడితే ‘నీకింత చేస్తున్నాం.. అయినా మొద్దులా ఉన్నావు!’ అనడం మొదలుపెడతారు. సహజంగానే ఇదివారిలో ఆత్మన్యూనత పెంచుతుంది. తాము అసలు ఎందుకూ పనికిరామనే భావనలోకి వెళ్లిపోతారు. వారి వ్యక్తిత్వంలో ఇదో పెద్ద లోపంగా మారుతుంది.

డబ్బూ..పొదుపూ

 మీకు ఒక్కరే సంతానమైనా.. వారికి ఖర్చుపెట్టే డబ్బు విషయంలో ఇద్దరు పిల్లలున్నట్టు భావించండి. అంటే మీ స్థోమతకు మించిన బడీ, వస్త్రాలూ, ఇతర వసతులూ కల్పించడం కాకుండా.. ఇద్దరు పిల్లలుంటే వారిలో ఒకరికి ఎంత ఖర్చుపెడతారో అంతే పెట్టండి. అతి గారాబంతో అన్నీ కొనిపెట్టకండి. ఆ డబ్బుని పొదుపు చేయండి. అప్పుడే వాళ్లపై ఎక్కువ ఖర్చుపెడతున్నామనే భావన మీలో రాదు. ఆ పేరుతో వారిపై మీరు ఒత్తిడి తేవాల్సిన అవసరమూ రాదు.

సోదరభావం వస్తుందిలా.. 

ఒక్కరే సంతానంకాబట్టి కొందరు తల్లిదండ్రులు వాళ్లని ఎవరితోనూ కలవనివ్వరు. ఓ రకంగా వారికి ‘బంగారు పంజరం’ సృష్టిస్తారు. అలాకాకుండా మీ చెల్లెళ్లు, అన్నదమ్ముల పిల్లలతో వారినెక్కువగా ఆడుకోనివ్వండి. స్నేహితులతోనూ అంతే కలసిమెలసి ఉండనివ్వండి. వీళ్లద్వారా అసలైన సోదరభావాన్ని ఆస్వాదించనివ్వండి.

రెక్కలు ఎదగనివ్వండి..

నాకు నువ్వుక్కడివే సంతానం కాబట్టి ఈ వ్యాపారం నువ్వే చూసుకోవాలి...’ అంటూనే పెంచుతారు చాలామంది తల్లిదండ్రులు. ఇది కొన్నిసార్లు పిల్లల్లో వాళ్లకంటూ సొంత ఆశయాలూ, కలలూ లేకుండా చేస్తుంది. టీనేజీ వచ్చాక తమకు వేరే ఆశలు ఎన్నున్నా.. అన్నీ వదిలపెట్టాలనే నిస్పృహలోకి నెడుతుంది. ఇదివాళ్లని అన్నిరకాలుగా వెనకపడేలా చేస్తుంది. ఇలాంటి కుటుంబాల్లోనే ఒంటరి సంతానం అన్నది శాపంగా మారుతుంది. మీ పిల్లల్ని అలాంటి పరిస్థితుల్లోకి నెట్టకండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని