బాల నిద్ర తగ్గనీయొద్దు

పిల్లలు టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతూ.. తగినంత నిద్రపోవటం లేదా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా..

Published : 21 Mar 2017 01:30 IST

బాల నిద్ర తగ్గనీయొద్దు

పిల్లలు టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతూ.. తగినంత నిద్రపోవటం లేదా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా.. ఏడేళ్ల లోపు పిల్లలు తగినంత నిద్రపోకపోతే పెద్దయ్యాక ఏకాగ్రత లోపించటం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవటం, సమాచారాన్ని విడమరచుకోలేకపోవటం వంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు బడిలోనూ ఇంట్లోనూ పిల్లల చురుకుదనాన్ని, నైపుణ్యాన్ని దెబ్బతీస్తాయి. తోటి పిల్లలతో సంబంధాలనూ చెడగొట్టే ప్రమాదం లేకపోలేదు. పిల్లల్లో మెదడు ఎదుగుదలలో నిద్ర చాలా కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా 3-4 ఏళ్ల పిల్లలకు రోజుకు 11 గంటల నిద్ర అవసరం. వయసు పెరుగుతున్నకొద్దీ నిద్ర అవసరం తగ్గుతూ వస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఎంతోమంది పిల్లలు తగినంత నిద్రపోవటం లేదు. దీంతో పరిసరాల ప్రభావాలకు, అనుభవాలకు తగినట్టుగా మెదడు స్పందించే సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పోతున్నప్పుడు మన మెదడు అనవసరమైన విషయాలను తొలగించుకొని, అవసరమైన వాటిని జ్ఞాపకాలుగా స్థిరపరచుకుంటుంది. కాబట్టి పిల్లలు రాత్రిపూట త్వరగా పడుకునేలా చూడటం చాలా అవసరం. దీంతో వారి భవిష్యత్తూ బాగుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని