పెద్దలకు మాత్రమే కాదు!
పెద్దలకు మాత్రమే కాదు!
మన తిండి మారిపోయింది. మన నడక మారిపోయింది. మన నిద్ర మారిపోయింది. మొత్తంగా మన జీవన విధానమే తిరగబడిపోయింది. మనతో పాటే మన పిల్లల జీవనశైలీ మారిపోయింది. మరి దీని ప్రభావాలెక్కడికి పోతాయి? పిల్లల మీదా ప్రతాపం చూపుతున్నాయి. ఒకప్పుడు పెద్దవారిలోనే కనబడే సమస్యలను చిన్నతనంలోనే మోసుకొస్తున్నాయి. ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, కాలేయ కొవ్వు.. ఇలా ఎన్నెన్నో జబ్బులను వెంటబెట్టుకొస్తున్నాయి. ఇవి రోజురోజుకీ విజృంభిస్తుండటం మరింత కలవరం పుట్టిస్తోంది. ఇప్పటికైనా మేలుకోకపోతే మన భవిష్యత్తు మన కళ్ల ముందే చేతులెత్తేయటం ఖాయం.కొన్ని విషయాలు మనలో బలంగా నాటుకుపోతాయి. జీవనశైలితో ముడిపడిన జబ్బులపై గల నమ్మకమూ అలాంటిదే. ఇవి ‘పెద్దలకు మాత్రమే’ పరిమితమని చాలామంది అనుకుంటుంటారు. నిజానికివి పిల్లలకూ రావొచ్చు. ఒకప్పుడు జీవనశైలితో ముడిపడిన సాంక్రమికేతర జబ్బులు అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఎక్కువని అనుకునేవారు. ఇప్పుడివి మనదగ్గరా ఇబ్బడి ముబ్బడిగా కనబడుతున్నాయి. ఇవి రోజురోజుకీ అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్నాయే తప్ప తగ్గటం లేదు. పెద్దవారిలో కనబడే మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు శ్వాసకోశ, గుండె, కాలేయ, కిడ్నీ జబ్బుల వంటివన్నీ పిల్లలనూ చుట్టుముడుతున్నాయి. మన ఆహార, విహారాలు గణనీయంగా మారిపోవటం.. టీవీల ముందు కూలబడటం.. ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు ముందేసుకొని గంటల తరబడి కాలక్షేపం చేయటం.. ఫలితంగా ఊబకాయం పెరగటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఒక్క ఊబకాయం మాత్రమే కాదు.. పిల్లలు తక్కువ బరువుతో పుట్టటమూ మనకు శాపంగా మారుతోంది. కాబట్టి పిల్లల్లో జీవనశైలి జబ్బుల తీరుతెన్నులపై అవగాహన కలిగుండటం ఎంతైనా అవసరం.
రెండువైపులా దెబ్బ! మనదేశంలో ఒకవైపు పిల్లలకు సరైన పోషణ, తిండి లభించటం లేదు. మరోవైపు అధికబరువు.. ముఖ్యంగా పట్టణప్రాంతాల్లో ఊబకాయ పిల్లల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి విచిత్ర పరిస్థితే ఇప్పుడు కొత్త సమస్యలకు దారితీస్తోంది. గతంలో వెలువడిన బార్కర్స్ హైపోథిసీస్ ప్రకారం- తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండానికి తగినంత పోషణ అందక తక్కువబరువుతో పుట్టిన వారికి మున్ముందు మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం, బొజ్జ వచ్చే అవకాశం ఎక్కువ. పిండానికి తగినంత పోషణ లభించకపోతే కణాల్లో మార్పులు తలెత్తి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. అంటే పెద్దయ్యాక వచ్చే పలు జబ్బులకు తల్లికడుపులో ఉండగానే బీజం పడుతోందన్నమాట. 10-18 సంవత్సరాల వయసులోనే దీని ప్రభావం కనబడుతుండటం గమనార్హం. |
‘పిల్ల’ మధుమేహం చాలామంది మధుమేహం పెద్దలకే వస్తుందని భావిస్తుంటారు. పిల్లలకు మధుమేహమేంటి? అని కొట్టిపారేస్తుంటారు. బొద్దుగా ఉన్న పిల్లలకు రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించమంటే ఆశ్చర్యంగా చూస్తుంటారు. అసలు విషయం ఏంటంటే- ఊబకాయ పిల్లల్లో చాలామంది ముందస్తు మధుమేహ (ప్రిడయాబెటిస్) దశలోనే ఉంటున్నారు. తల్లిదండ్రులకు ఈ విషయం తెలియక, సమస్య తీవ్రమయ్యాక లబోదిబోమంటున్నారు. చిన్నవయసులోనే మధుమేహం బారినపడుతున్నవారి సంఖ్య గత 30 ఏళ్లలో పదింతలు పెరగటం గమనార్హం. దీన్ని ముందుగానే గుర్తించి, తగు జాగ్రత్తలు తీసుకోవటం, అవసరమైతే మందులు వాడుకోవటం మంచిది. నిర్లక్ష్యం చేస్తే మున్ముందు తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. పెద్దవాళ్లలో మాదిరిగానే మధుమేహ దుష్ప్రభావాలు దాడిచేస్తాయి. రక్తనాళాలు దెబ్బతిని కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోవచ్చు. దీంతో రక్తపోటు పెరగొచ్చు. కంటి రక్తనాళాలు దెబ్బతిని చూపు మందగించొచ్చు. మెదడు పనితీరు మారిపోవచ్చు. |
పిల్లల మెడను పరిశీలించటం ద్వారా మధుమేహం వచ్చే అవకాశాన్ని గుర్తించొచ్చు కూడా. మెడ వెనక చర్మం నల్లగా కమిలిపోయినట్టు, మొద్డుబారినట్టు కనిపిస్తుంటే (అకాంతోసిస్ నైగ్రికాన్స్) వెంటనే జాగ్రత్త పడాలి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు సంకేతం. అప్పటికే ఒంట్లో మధుమేహానికి దారితీసే మార్పులు మొదలయ్యాయనటానికి నిదర్శనం. కాబట్టి డాక్టర్లు లావుగా ఉన్న పిల్లలందరినీ మెడ వెనక భాగం ఎలా ఉందో ఒకసారి చూడాలి. చర్మం నల్లబడుతున్నట్టు కనబడితే వెంటనే తల్లిదండ్రులను హెచ్చరించాలి. |
పక్షవాత కలకలం |