Published : 16 Jan 2016 18:20 IST

దద్దు భయం వద్దు!

దద్దు భయం వద్దు!

 ముట్టుకుంటే కందిపోయే పసిపాపడి అతి సున్నిత చర్మంపైన.. ఓ చిన్న దద్దు.. ఓ చిన్న పొక్కు.. అది చాలు మన వెన్నులో వణుకుపుట్టించటానికి! బిడ్డ ఒంటి మీద ఎలాంటి దద్దు వచ్చినా దాని ఆనుపానులేమిటో తెలియక తల్లిదండ్రులు కంపించిపోతుంటారు. అదేదో ‘అమ్మవారనుకుని’ నానా భయాలూ పెట్టుకుంటుంటారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జ్వరంతో పాటు మచ్చ కనబడిందంటే చాలు.. ‘డెంగీ’ భయం కమ్ముకొచ్చేస్తోంది. నిజానికి పిల్లల్లో కనబడే చాలా రకాల దద్దుర్లు ప్రమాదకరమైనవేం కాదు. అలాగని అన్ని దద్దుర్లనూ పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యటానికీ లేదు. కొన్ని ప్రమాదకరమైన సమస్యలు కూడా దద్దు రూపంలో బయటపడొచ్చు. అందుకే ఈ మచ్చలు, దద్దుపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవటం, వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం చాలా అవసరం.

 పిల్లలకు చర్మంపై దద్దు.. రాష్‌.. తరచుగా ఎదురయ్యే సమస్యే. ఇది చూస్తూనే తల్లిదండ్రులు ‘అమ్మో దద్దు.. అమ్మవారు పోసిందేమో’ అని కంగారు పడిపోతుంటారు. పిల్లల్లో వచ్చే అన్ని దద్దులూ అమ్మవారేం కాదు. పైగా వీటిలో చాలాభాగం ఇన్ఫెక్షన్లు, అలర్జీల వంటి చిన్న చిన్న సమస్యల కారణంగానే తలెత్తుతుంటాయి. కాబట్టి దద్దు కనబడిన ప్రతిసారీ బెంబేలెత్తాల్సిన పనిలేదు. అలాగని ప్రతి దద్దునీ నిర్లక్ష్యం చెయ్యటానికీ లేదు. కొన్నిసార్లు తీవ్రమైన సమస్యల్లో కూడా దద్దు కనబడుతుంటుంది.

ప్రస్తుతం దద్దు పెద్ద సమస్యగా తయారైంది. డెంగీ, మామూలు తట్టు, ఆటలమ్మ, హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ డిసీజ్‌, లేదంటే తీవ్రమైన మినింగో కాకల్‌ ఇన్‌ఫెక్షన్‌.. ఇలా రకరకాల కారణాలతో దద్దు సమస్యలు పెరుగుతున్నాయి కూడా. కానీ దద్దులో ఇలా చాలా రకాలు ఉంటాయన్న శాస్త్రీయ అవగాహన లేకపోవటం వల్ల ఎంతోమంది తల్లిదండ్రులు ప్రతి దద్దునూ ‘అమ్మవారు’గా భావించి, సరైన వైద్యం చేయించకుండా నిర్లక్ష్యం చేస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. దీనివల్ల ఒక్కోసారి పరిస్థితి ప్రాణాల మీదికీ వస్తోంది. కాబట్టి ప్రతి దద్దునూ అమ్మవారే అనుకొని పిల్లలను ఇంట్లో కూచోబెట్టద్దు. చర్మం మీద దద్దు.. మచ్చ.. పొక్కు.. ఇలా ఏది కనబడిన సత్వరమే వైద్యులకు చూపించి.. కారణం తెలుసుకుని.. సరైన వైద్యం చేయించటం ఇప్పుడు మరింత ముఖ్యం.

 ఆటలమ్మ :   టాపాటా వయసులో వచ్చే అతిసాధారణ సమస్య ఆటలమ్మ.. చికెన్‌ పాక్స్‌! వైరస్‌ కారణంగా తలెత్తే ఈ సమస్య ముందు చిన్నగా జ్వరం, గొంతునొప్పితో ఆరంభమవుతుంది. తర్వాత ఒంటి మీద అక్కడక్కడ చిన్నచిన్న దద్దు, నీటి పొక్కుల్లాంటివి కనిపిస్తాయి. కొత్తగా వచ్చిన దద్దు నిగనిగలాడుతుంటే నిన్నమొన్న వచ్చినవి వాడిపోయి ఉండటం దీని ప్రత్యేకత. నాలుగోరోజు చూస్తే మొదట్లో వచ్చినవి చెక్కులు కట్టి ఉంటాయి. రెండోరోజు వచ్చినవి చీము పట్టి ఉంటే, మూడోరోజు వచ్చినవి నీటి బుగ్గలా ఉంటాయి. ఇక అదే రోజున వచ్చింది దద్దు మాదిరి కనిపిస్తుంటుంది. ఆటలమ్మ వచ్చినా పిల్లలు ఏమంత నలతగా ఉండరు. బాగానే ఆడుకుంటూ ఉంటారు. ఈ పొక్కులన్నీ వారం పదిరోజుల్లో చెక్కు కట్టి, వూడిపోతాయి. ఇదేమంత ప్రమాదకరమైనది కాదు. కాబట్టి అంతగా భయపడాల్సిన పనిలేదు. మందుల అవసరమూ అంతగా ఉండదు. కాకపోతే పొక్కులు గిల్లకుండా, గోక్కుండా చూడాలి. ఇతరులకు అంటుకోకుండా సమస్య తగ్గేవరకూ పిల్లలను ఇంట్లోనే ఉంచుకోవాలి.

తట్టు, తడపర
  వైద్యపరిభాషలో ‘మీజిల్స్‌’గా పిలిచే ఈ సమస్య కాస్త ప్రమాదకరమైనది. లక్షణాలు తెలిసుంటే తట్టును గుర్తుపట్టటం చాలా తేలిక. ముందుగా పిల్లలు బాగా నలతగా, నీరసంగా ఉంటారు. తిండి తినబుద్ధి కాదు. కళ్లు, ముక్కు, నోరు ఎర్రగా అవుతాయి. దగ్గుతుంటారు. రెండు, మూడు విరేచనాలూ కావొచ్చు. పైగా తీవ్రమైన జ్వరం. నాలుగో రోజున సన్నగా దద్దు ప్రారంభమవుతుంది. ముందు ముఖం మీద, తర్వాత చెవుల వెనక, ఒకట్రొండు పూటల్లో ఛాతీ మీద.. ఆ తర్వాతి రోజు కాళ్లకు.. ఇలా క్రమేపీ తల నుంచి కాళ్ల వరకూ శరీరమంతా దద్దు వ్యాపిస్తుంది. ఈ లక్షణాలను బట్టి తట్టును గుర్తించి, అత్యవసరంగా చికిత్స ఆరంభించాలి. చాలామంది ఇలాంటి సమయాల్లో పిల్లలను ఇంట్లోనే కూచోబెట్టి నానా పథ్యాలూ చేయిస్తుంటారు. ఇది సరికాదు. ఎందుకంటే దీనిమూలంగా ఇతరత్రా ముప్పులు పొంచి ఉంటాయి. తట్టు వచ్చినవారిలో విటమిన్‌-ఏ లోపం చాలా ఎక్కువ. దీంతో చూపు పోయే ప్రమాదముంది. మనదేశంలో చాలామంది తట్టు వచ్చినపుడే విటమిన్‌-ఎ లోపం మరింత పెరిగి, చూపు కోల్పోతున్నారు. తట్టు మూలంగా న్యుమోనియా, చెవిలో చీము, మెదడు వాపూ వస్తుంది. కాబట్టి తప్పకుండా డాక్టర్‌కు చూపించాలి. ఈ పిల్లలందరికీ విటమిన్‌ ఏ, బీ కాంప్లెక్స్‌ తప్పకుండా ఇవ్వాలి. తగినన్ని నీళ్లు తాగించాలి. ఏ రూపంలోనైనా ఆహారం ఇవ్వాలి. నోటితో తీసుకోలేకపోతే సెలైన్‌ పెట్టాల్సి ఉంటుంది. తట్టు చాలా ప్రమాదకరమైంది కాబట్టే జాతీయ టీకా కార్యక్రమంలో తట్టు టీకాను చేర్చారు. బిడ్డకు 9 నెలలు నిండగానే దీన్నిస్తారు. దీంతో చాలావరకూ సమస్య దరిజేరదు. కానీ మన దేశంలో కేవలం 60 శాతానికి పైబడి మాత్రమే పిల్లలు ఈ టీకాను తీసుకున్నారు. ఇంకా దాదాపు 40% మంది తీసుకోవాల్సి ఉంది. దేశంలో 80% మంది పిల్లలు ఈ టీకాను తీసుకునేలా చేయగలిగితే.. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించటం తగ్గుతుంది. అప్పుడు దీన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశమూ ఉంటుంది. చాలా దేశాల్లో తట్టును ఇప్పటికే పూర్తిగా నిర్మూలించారు గానీ మనం ఇంకా ఆ దశకు చేరలేదు. పోషకాహారలోపం గలవారికి ఇది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

కంచుక
  టలమ్మ సమస్యను తెచ్చిపెట్టే ‘వారిసెల్లా జోస్టర్‌’ వైరస్‌ శరీరంలో ఒక భాగంలోనే దాడి చేయటం వల్ల వచ్చే సమస్య ఈ హెర్పిస్‌ జోస్టర్‌. దీన్నే వాడుకలో కంచుక, చల్ది, సర్పి అని రకరకాలుగా పిలుస్తారు. ఇది ముఖానికి, ఛాతీకి, నడుముకు ఇలా ఎక్కడో ఒకచోట ఒక లైనులా రావొచ్చు. పిల్లల్లో రోగనిరోధకశక్తి తక్కువైనపుడు ఇది బయటపడుతుంది. గతంలో దీని గురించి సరైన అవగాహన లేక దీనికి మంత్రాలు వేయటం, జాజు పెట్టటం చేసేవారు. ఇది సరైన పద్ధతి కాదు. చల్ది కనిపిస్తే వెంటనే డాక్టర్‌కి చూపించాలి. ఈ పొక్కులు ముందు ఎర్రగా, తర్వాత నీటి బుడగలుగా, ఆ తర్వాత పక్కులు కట్టి మానిపోతాయి. ఇది వృద్ధుల్లో తరచుగా కనిపిస్తుంది గానీ పిల్లల్లోనూ రావొచ్చు. ఇలాంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల మూలంగా వచ్చే దద్దుకు ప్రత్యేకించి మందులేమీ ఉండవు. జ్వరం బాధలు తగ్గటానికి మాత్రలు, దురద లేకుండా ‘క్యాలమైన్‌ లోషన్‌’ వంటి పూత మందులు ఇస్తారు.

రుబెల్లా
  లా వచ్చి.. అలా వెళ్లిపోయే చిన్న సమస్య ఈ ‘జర్మన్‌ మీజిల్స్‌’. కొన్నిసార్లు ఇది వచ్చిందనే సంగతి కూడా తెలియదు. అందుకే దీన్ని ‘త్రీ డే మీజిల్స్‌’ అనీ అంటారు. కొద్దిగా జ్వరం వస్తుంది. మెడ వెనక భాగంలోని లింఫ్‌ గ్రంథులు ఉబ్బుతాయి. ఒకట్రొండు రోజుల్లో దద్దు కనబడుతుంది. మూడోరోజు మాయమైపోతుంది. మామూలు తట్టులో వచ్చిన దద్దు నల్లబడి, పూర్తిగా కనబడకుండా ఉండేందుకు దాదాపు నెల పడుతుంది. కానీ ఇది మూడు రోజుల్లోనే కనిపించకుండా పోతుంది. ఇది రాకుండా ఎంఎంఆర్‌ (మీజిల్స్‌-మంప్స్‌-రూబెల్లా) టీకా అందుబాటులో ఉంది. రూబెల్లా చిన్న సమస్యేగానీ.. ఇది గర్భిణులకు వస్తే మాత్రం వారికి పుట్టే బిడ్డలు అవకరాలతో పుడతారు. ఎదుగుదల లోపం, బుద్ధిమాంద్యం, కంట్లో శుక్లం, గుండె జబ్బుల వంటివి వేధిస్తాయి. కాబట్టి అసలీ ప్రమాదం తలెత్తకుండా ఆడపిల్లలందరరికీ ‘ఎంఎంఆర్‌’ టీకా ఇప్పించటం తప్పనిసరి. ఈ టీకా- ఏడాది నిండిన తర్వాత ఒక మోతాదు, ఐదేళ్ల తర్వాత రెండో మోతాదు ఇస్తారు.

హెచ్‌ఎఫ్‌ఎం
  త 35 ఏళ్లలో ఎన్నడూ లేనంత ప్రబలంగా ఈ ఏడాది ముంచుకొచ్చిన సమస్య ఈ హ్యాండ్‌, పుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ ‘హెచ్‌ఎఫ్‌ఎం’. ఇది ‘ఎంటరో వైరస్‌’ జాతికి చెందిన ‘కాక్సాకీ వైరస్‌’ మూలంగా వస్తుంది. దగ్గు, తుమ్ము ద్వారా, మల కలుషితాల ద్వారా వ్యాపిస్తుంది. ఇందులో జ్వరంతో పాటు నోట్లో పొక్కులు వస్తాయి. దీంతో పిల్లలు తినటానికీ, తాగటానికీ చాలా ఇబ్బంది పడతారు. నోటి నుంచి చొంగ కారుతుంది. చేతులు, కాళ్లు, మోకాళ్లు, మోచేతులు, పిరుదుల మీద కూడా చిన్న చిన్న నీటి పొక్కులు వస్తాయి. ఈ సమస్య వారం పది రోజుల్లో తగ్గిపోతుంది గానీ ఒక్కోసారి ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. దీంతో మెదడు వాపు, గుండె జబ్బు (మయోకార్డైటిస్‌) వచ్చే ప్రమాదమూ ఉంది. కాబట్టి దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకూడదు. ప్రమాదకర దద్దు:   ళ్లంతా దద్దుతో వచ్చే మరో ప్రమాదకర సమస్య- ‘టాక్సిక్‌ షాక్‌ ఇండ్రోమ్‌’ లేదా ‘స్టీవెన్‌ జాన్సన్‌’ సిండ్రోమ్‌. ఇది చాలా వరకూ కొన్ని రకాల మందులు సరిపడక, లేదా కొన్ని రకాల ఇన్షెక్షన్లు, రియాక్షన్ల వల్ల వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. చేత్తో కాస్త గట్టిగా రాస్తే చాలు.. తోలు వూడిపోతుంది, నోట్లో చర్మం వూడివస్తుంటుంది. పెదాలు పగులుతాయి. జననాంగాలు కూడా ప్రభావితమవుతాయి. రక్తంలోని ద్రవం నాళాల్లో నుంచి బయటకు లీక్‌ అవుతూ రక్తపరిమాణం తగ్గి, తీవ్రంగా ‘షాక్‌’లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇది చాలావరకూ సల్ఫా డ్రగ్స్‌, మలేరియాకు వాడే సల్ఫోడాక్సిన్‌ పైరిమిథమీన్‌, లేకపోతే టెట్రాసైక్లిన్స్‌.. కొందరికి చివరికి ఆస్పిరిన్‌తో కూడా రావచ్చు. కొందరికి గార్డినాల్‌, ఫెనటాయిన్‌ వంటి ఫిట్స్‌కు వాడే మందులతో రావచ్చు. ఇవేకాదు, నిజానికి ఏ మందుతోనైనా రావచ్చు. కొందరికి టెట్రసైక్లిన్స్‌, పెన్సిలిన్స్‌తో వస్తాయి. కాబట్టి దేనివల్ల ఇలా వచ్చిందన్నది తెలుసుకుంటే మున్ముందు మళ్లీ ఇలాంటి విపత్తు రాకుండా చూసుకోవచ్చు. సమస్య తలెత్తినప్పుడు వెంటనే ఆ మందేదో గుర్తించి ఆపెయ్యటం, వాపు తగ్గించే మందులు, సెకండరీ ఇన్ఫెక్షన్లు రాకుండా మందులు ఇవ్వటం, ఒంట్లో నీరు తగ్గకుండా చూడటం, కళ్లు-పేగులు-మూత్రపిండాల వంటివేవీ దెబ్బతినకుండా వైద్యం అందించటం అవసరం. చాలామంది ఈ ఉపశమన చికిత్సతో బయటపడతారు, కొందరి విషయంలో ఎంత చేసినా ప్రాణాలు దక్కటం కష్టం కావచ్చు.

స్కార్లెట్‌ ఫీవర్‌
  జ్వరంతో వచ్చే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లలో ‘స్కార్లెట్‌ ఫీవర్‌’ ఒకటి. నిజానికిది స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియా వల్ల వచ్చే గొంతు ఇన్‌ఫెక్షన్‌. దీంతో టాన్సిల్స్‌ వాస్తాయి. నొప్పి, జ్వరం, మింగటం కష్టమవుతుంది. ఆ తర్వాత ముఖం, ఛాతీ, శరీరం మీద ఎర్రగా తివాచీ పరచినట్టు దద్దు వస్తుంది. ఈ దద్దు మీద చేయి పెడితే గరుకుగా అనిపిస్తుంది. గొంతు ఇన్‌ఫెక్షన్‌తో దద్దు కూడా ఉంటే ‘స్కార్లెట్‌ ఫీవర్‌’ ఉందేమోనని అనుమానించాలి. దీనికి ఏడు రోజుల పాటు యాంటీబయోటిక్‌ మందులు ఇస్తే తగ్గిపోతుంది. అయితే సరైన మందులు వేసుకోకపోతే ఈ ఇన్‌ఫెక్షన్‌ గుండెకు వ్యాపించి ప్రమాదకరమైన ‘రుమాటిక్‌ ఫీవర్‌’కు దారి తీస్తుంది.

డెంగీ
  ప్రస్తుతం ప్రజలను విపరీతంగా భయపెడుతున్న సమస్య డెంగీ. జ్వరంతో పాటు ఒంటి మీద చిన్నచిన్న నల్లమచ్చలు వస్తే విస్మరించకూడదు. తీవ్రమైన జ్వరం, చాలా తీవ్రమైన ఒళ్లు నొప్పులు (బోన్‌ బ్రేకింగ్‌ ఫీవర్‌), దానితో పాటు దాహం, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి.. ఈ లక్షణాలతో జ్వరం ఆరంభమై ఒంటి మీద దద్దు వస్తే దాన్ని విస్మరించకూడదు. మొదట్లో ఈ దద్దు కేవలం చర్మం ఎర్రగా కందినట్లుగా ఉంటుంది. చెవులు, చెంపలు, ఛాతీ వంటివన్నీ ఎర్రగా కందినట్లు అవుతాయి. నొక్కితే చెయ్యి అరవడి, ఆ అద్దు కనబడుతుంది. ఇలా వచ్చిన అందరికీ దద్దు రావాలనేం లేదు. కానీ కొందరిలో రక్తనాళాల నుంచి రక్తం లీక్‌ అవుతూ.. నల్లమచ్చలు (పర్పూరా) రావచ్చు. ఇల వచ్చిన వాళ్లకు చేతితో నొక్కినా మచ్చ అలాగే ఉంటుంది. వీరిలో రక్తం గడ్డకట్టే స్వభావం తగ్గుతుంది. కానీ ప్లేట్‌లెట్ల గురించి విపరీతంగా ఆందోళన చెందాల్సిన పని లేదు. మామూలుగా ప్లేట్‌లెట్లు 1.5-3.5 లక్షల మధ్య ఉండొచ్చు. కానీ డెంగీ జ్వరంలో అది 90 వేలకు తగ్గినా ఏమీ ఫర్వాలేదు. 60 వేల కంటే పడిపోతే మాత్రం రక్తస్రావమయ్యే ప్రమాదముందని, 20 వేల కంటే తగ్గితే కీలక అవయవాల్లో రక్తస్రావం అవుతుందేమోనని భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మామూలుగా డెంగీ జ్వరం రాగానే అందరూ ప్లేట్‌లెట్‌ కణాల గురించి విపరీతంగా ఆందోళన పడిపోతుంటారు. కానీ ఇక్కడ పట్టించుకోవాల్సింది ప్లేట్‌లెట్ల గురించి కాదు.. డెంగీలో రక్తంలో ఉన్న ద్రవం (ప్లాస్మా) బయటకు లీక్‌ అయిపోవటం వల్ల రక్తం పరిమాణం తగ్గి, అది చిక్కగా తయారవుతుంది. దీంతో రక్త సాంద్రత (పీసీవీ) పెరిగిపోయి, బీపీ పడిపోతుంది. దీనివల్ల మెదడు, కిడ్నీ, గుండె, లివర్‌ వంటి కీలక అవయవాలకు రక్తప్రసారం తగ్గిపోతుంది. ఇది ప్రమాదకర స్థితి. వీరు ‘డెంగీ షాక్‌ సిండ్రోమ్‌’లోకి వెళతారు. కాబట్టి వీరిలో పోయిన ప్లాస్మాను సెలైన్‌ పెట్టటం ద్వారా తిరిగి నింపటం, రక్తం చిక్కబడకుండా చూడటం ముఖ్యం. దీనికి సెలైన్‌ పెట్టటం వంటి చర్యలు కీలకం గానీ అనవసరంగా వణికిపోతూ ప్లేట్‌లెట్లు ఎక్కించటం కీలకం కానేకాదు. అది అశాస్త్రీయం కూడా! సాధారణంగా డెంగీలో వచ్చే దద్దు ఎర్రగా కందినట్లు అవుతుంది. లోపల రక్తస్రావం అయితేనే.. అరుదుగానే.. చర్మం కింద రక్తం చిమిర్చే నల్లమచ్చలు వస్తాయి. అవి వస్తే మాత్రం జబ్బు తీవ్రంగా ఉందని గుర్తించి ఆసుపత్రిలో ఉంచటం మంచిది. బీపీ చూడటం, సెలైన్‌ పెట్టటం ముఖ్యం.. ప్లేట్‌లెట్లు ఎక్కించటం కాదు! అంటుపుండ్లు (ఇంపెటిగో) :   ముక్కుల్లో వేళ్లు పెట్టుకునే పిల్లలకు ‘బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు’ ఎక్కువ. ఇలా స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్య ఇంపెటిగో. ఈ బ్యాక్టీరియా ముక్కులో ఉంటూ మనతోపాటే సహజీవనం చేస్తుంటుంది. ముక్కులో ఉన్నంత వరకూ ఇది మనల్నేమీ చేయదు గానీ ముక్కులో వేళ్లు పెట్టి కెలికితే.. ఆ వేళ్లకు అంటుకొని ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. దీంతో అక్కడ ముందు చిన్న నీటి బుడగ మాదిరిగా ఏర్పడుతుంది. తర్వాత చిట్లి, తేనె రంగులో పక్కు కడుతుంది. ఈ రసి ఎక్కడ అంటితే అక్కడ బుడగ పుట్టుకొస్తుంది. కొన్నిసార్లు ఇవి ఒళ్లంతానే కాదు.. ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది కూడా. అందుకే దీన్ని ‘ఇంపెటిగో కంటాజియోసా’ అనీ అంటారు. దీన్ని తేలికగానే గుర్తించొచ్చు. దీనికి మాత్రల అవసరం ఉండదు, పైపూత మందు రాస్తే చాలు. వేడినీటిలో ఉప్పు వేసి కాపడం పెట్టటం, పైపూత మందుల ద్వారా దీన్ని 2, 3 రోజుల్లో తేలికగా తగ్గించుకోవచ్చు కూడా. చాలామంది ఇవి అంటుపుండ్లు అని తెలియక కంచుకగా భావించి మంత్రాలు, జాజు, మట్టి పూస్తుంటారు. దీంతో అవి తగ్గకపోగా మరింత ఎక్కువవుతాయి.

జ్వరం గుల్లలు
  తీవ్ర జ్వరం వచ్చినపుడు కొందరికి మూతి చుట్టూ గుల్లలు వస్తుంటాయి. దీన్ని ‘హెర్పిస్‌ సింప్లెక్స్‌’ అంటారు. తీవ్ర జ్వరం వచ్చినపుడు ఇది బయటపడుతుంది. నోటి చుట్టే కాదు.. కాళ్లకు, చేతులకు ఎక్కడైనా పొక్కులు రావొచ్చు. జ్వరం తగ్గగానే పక్కులు కట్టి, ఎండి, వూడిపోతాయి. హెర్పిస్‌ సింప్లెక్స్‌ అరుదుగా శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపించొచ్చు.

అలర్జీల దద్దు :   పిల్లలకు అలర్జీల వల్ల దద్దుర్లు రావటం (అటోపిక్‌ డెర్మటైటిస్‌/ అర్టికేరియా) ఎక్కువ. చర్మం బాగా పొడిగా ఉండే వారికి, చెంపలు, చేతులు, కాళ్లు పొడిగా ఉండే ప్రాంతాల్లో ఈ దద్దుర్లు ఎక్కువ. వంశపారంపర్యంగా అలర్జీలున్న వాళ్లకు కూడా ఎక్కువే. ఇంట్లో పెద్దవాళ్లకు అలర్జిక్‌ రైనైటిస్‌, సైనుసైటిస్‌, ఆస్థమా, అలర్జిక్‌ కంజెక్టివైటిస్‌ వంటివి ఉంటే పిల్లలకు ఈ రకం దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి చర్మం తడిగా ఉండేలా మాయిశ్చరైజర్‌ క్రీములు, మాయిశ్చరైజింగ్‌ సబ్బుల వంటివి వాడితే తగ్గిపోతుంది. గోకకుండా గోళ్లు కత్తిరించటం, సింథటిక్‌ బట్టలు మానేసి నూలు దుస్తులు వెయ్యటం అవసరం. మెనింగో కాక్సీమియా జ్వరంతో దద్దు వచ్చే ప్రమాదకర సమస్యల్లో ఇదొకటి. దీనికి మూలం ‘మెనింగోకాకస్‌’ బ్యాక్టీరియా. ముందు గొంతు ఇన్‌ఫెక్షన్‌ మాదిరిగా మొదలై.. తర్వాత తలనొప్పి, వాంతులు, కొద్దిగా దద్దు వంటివి బయటపడతాయి. మొదట్లో దద్దు స్వల్పంగానే ఉంటుంది గానీ.. 24 గంటల్లోనే తీవ్రంగా పరిణమిస్తుంది. రక్తస్రావం కావటం వల్ల చర్మం కింద దద్దులాంటి నల్లటి మచ్చలు (పర్పూరా) కనబడతాయి. సాధారణంగా దద్దుపై కొద్దిగా నొక్కితే అక్కడ తెల్లగా అవుతుంది. కానీ ఈ దద్దు అలా కాదు. వీరిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి, యాంటీబయోటిక్స్‌ ఇస్తే తిరిగి గాడినపడతారు. లేకపోతే మెదడు దెబ్బతినటం, సెప్టిసీమియాతో ప్రాణాంతకంగా మారటం వంటి ముప్పులుంటాయి. కాబట్టి గొంతు ఇన్ఫెక్షన్‌తో చర్మంపై నల్లటి మచ్చలు కనబడితే తక్షణం మేల్కొనటం అవసరం.

‘టిక్‌’లతో జ్వరం
  ‘టిక్‌’లనేవి చిన్నచిన్న కీటకాలు. ఇవి కుట్టిన చోట నల్లటి మచ్చబడి, పుండు పడుతుంది. జ్వరం మొదలవుతుంది. ఇటీవలికాలంలో ఈ జ్వరాలు (రికెన్షియల్‌ ఫీవర్‌) పెరుగుతున్నాయి. పర్వత, అటవీ ప్రాంతాలకు ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారికి ఒంటి మీద దద్దు, తగ్గకుండా జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనబడితే విస్మరించటానికి లేదు. ముందు చేతుల మీదా, కాళ్ల మీదా, తర్వాత ఛాతీ మీదా దద్దు రావచ్చు. కొందరికి ఒళ్లు నొప్పులూ ఉండొచ్చు. వీటిని గుర్తిస్తే.. టెట్రాసైక్లిన్‌ లేదా అజిత్రోమైసిస్‌ వంటి మందులు ఒక్క కోర్సు ఇస్తే తగ్గిపోతుంది. సమస్యను గుర్తించటం, తక్షణం మందులు ఆరంభించటం ముఖ్యం.

కవాసాకి
  టీవలి కాలంలో ఎక్కువగా కనబడుతున్న ప్రమాదకరమైన సమస్య ఇది. గతంలో దీన్ని ‘మ్యూకో క్యుటేనియస్‌ లింఫ్‌ నోడ్‌ సిండ్రోమ్‌’ అనేవారు. జ్వరంతో పాటు చర్మం మీద, నోటిలోని జిగురు పొరల మీద దద్దు కనబడటం, లింఫ్‌ గ్రంథులు వాచి ఉంటే ‘కవాసాకి’గా అనుమానించేవారు. కానీ ఇప్పుడిది రకరకాల రూపాల్లో బయటపడుతోంది. చిన్నపిల్లలకు తీవ్రమైన జ్వరం, దద్దుతో పాటు కళ్లు బాగా ఎర్రబడితే- కవాసాకిని అనుమానించాలి. కళ్లు బాగా ఎర్రబడతాయి గానీ పుసులు కట్టవు, రెప్పలు అతుక్కోవు. నాలుక ఎర్రగా, స్ట్రాబెర్రీ పండు మాదిరిగా ఉంటుంది. దద్దు ఎక్కువగా అరి చేతులు, అరి పాదాల్లో వస్తుంది. మెడ దగ్గర లింఫ్‌ గ్రంథులు వాచి, బిళ్ల కట్టినట్టు ఉంటాయి. తీవ్రమైన జ్వరం, అదీ మామూలు జ్వరం మందులు, యాంటీబయాటిక్స్‌తో తగ్గకపోవటం, అరిచేతులు అరిపాదాల్లో ర్యాష్‌, మెడ దగ్గర బిళ్లలు.. ఈ లక్షణాలు కనబడినప్పుడు వెంటనే వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకోవాలి. వీరిలో రక్తంలో ప్లేట్‌లెట్లు చాలాఎక్కువగా లేదా తక్కువగా ఉండొచ్చు. ఈఎస్‌ఆర్‌, సీఆర్‌పీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి కవాసాకిలో గుండె ప్రభావితమై, మున్ముందు తీవ్రమైన గుండె పోటు వచ్చే ప్రమాదమూ పొంచి ఉంటుంది. ముఖ్యంగా గుండెలోని కరోనరీ రక్తనాళాలు వాచి, బెలూన్ల మాదిరిగా ఉబ్బి (అనూరిజమ్స్‌), వాటిలో రక్తం గడ్డకట్టి, రక్తప్రసారం ఆగి, గుండెపోటు వంటివి ముంచుకురావచ్చు. కాబట్టి దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకూడదు. జ్వరం వచ్చిన వారం పది రోజుల్లో ‘ఇమ్యూనో గ్లోబ్యులిన్లు’ ఇస్తే భవిష్యత్తులో గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది ఖర్చుతో కూడుకున్నదైనా నివారించదగ్గ సమస్య. ఇమ్యూనోగ్లోబ్యులిన్లు ఇవ్వలేని స్థితిలో కనీసం ‘మిథైల్‌ ప్రెడ్నిసలోన్‌’ వంటివైనా రక్తనాళాల్లోకి ఇవ్వాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు