Published : 17 Jan 2016 12:36 IST

పసిబిడ్డకు ఫిట్స్‌?

పసిబిడ్డకు ఫిట్స్‌?


 పసిబిడ్డ అంటే పంచప్రాణాలు. అందుకే ఫిట్స్‌ వంటి సమస్యలు ఎదురైనప్పుడు మరింత ఆందోళనలో కూరుకుపోతుంటారు. అయితే పిల్లల్లో ఫిట్స్‌ మరీ అంత అరుదైన సమస్యేం కాదు. ఈ ఫిట్స్‌లో ఎన్నో రకాలున్నాయి. కొన్ని చికిత్సతో పూర్తిగా నయమైపోతాయి. మరికొన్నింటిని కచ్చితంగా నియంత్రణలో ఉంచొచ్చు. కాబట్టి బిడ్డకు ఫిట్‌ వస్తుంటే కచ్చితంగా నిపుణులైన వైద్యులకు చూపించి సమర్థమైన చికిత్స ఇప్పించటం అవసరం. లేకపోతే బిడ్డ ఎదుగుదల, భవిష్యత్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని గుర్తించాలి. 

 మన మెదడులో కోట్లాది నాడీకణాలుంటాయి. మన మెదడు పనితీరు చక్కగా ఉండేందుకు ఈ నాడీకణాల మధ్య విద్యుత్‌ ప్రేరణలు ఒక క్రమపద్ధతిలో సాగుతుండటం ముఖ్యం. మెదడులోని ఈ విద్యుత్తు వ్యవస్థ చాలా సమన్వయంతో పనిచేస్తుంటుంది. అయితే ఎప్పుడైనా ఈ విద్యుత్‌ ప్రసారం అసాధారణంగా తయారై, ఈ వ్యవస్థలో ఎక్కడైనా ఆటంకాలు తలెత్తితే విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. దీని ప్రభావం అవయవాలు అస్తవ్యస్తంగా కొట్టుకోవటం, అసాధారణ కదలికల వంటి రూపంలో బయటపడుతుంది. దీన్నే మనం సాధారణ పరిభాషలో ‘ఫిట్‌’ అంటాం. మామూలుగా ఈ ఫిట్‌ 5 నిమిషాల కన్నా తక్కువసేపే ఉంటుంది. కొన్నిసార్లు ఇది చాలా ఎక్కువసేపు కొనసాగొచ్చు. అప్పుడు మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గి తీవ్ర ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే చాలావరకూ ఫిట్స్‌ 5, 10 నిమిషాల్లోపే, వాటంతట అవే ఆగిపోతాయి. ముఖ్యంగా గుర్తించాల్సిందేమంటే ఫిట్స్‌ జ్వరంతోనూ, జ్వరం లేకుండానూ రావొచ్చు. వీటిలో కూడా చాలా రకాలున్నాయి. సమర్థమైన చికిత్సకు ఫిట్‌ ఏ రకమైనదన్నది గుర్తించటం చాలా అవసరం.

జ్వరం లేకుండా వచ్చే ఫిట్స్‌
జ్వరం లేకుండా ఫిట్స్‌ రావటానికి 3 అంశాలు దోహదం చేయొచ్చు.

1. మెదడులో మార్పులు: కొందరికి పుట్టుకతోనే మెదడు నిర్మాణాల్లో మార్పులు ఉండొచ్చు. మున్ముందు ఫిట్స్‌ రావటానికి ఇది దోహదం చేయొచ్చు. అలాగే కాన్పు సమయంలో శిశువుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోయినా, రక్తంలో చక్కెర తక్కువైనా మెదడులోని కొంతభాగం దెబ్బతినొచ్చు. మెదడులో రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా మెదడు దెబ్బతినొచ్చుగానీ ఇలాంటి వారికి- పుట్టిన రెండు మూడురోజుల్లో ఫిట్స్‌ వచ్చి తగ్గిపోతుంటాయి. ఇలా కాకుండా ఆక్సిజన్‌ అందకపోవటం వంటి కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న వారిలో ఆర్నెల్లు, ఏడాది, ఆరేళ్లు.. ఇలా ఆ తర్వాత హఠాత్తుగా ఫిట్స్‌ రావచ్చు. దీన్ని ‘రిమోట్‌ సింప్టమాటిక్‌ ఎపిలెప్సీ’ అంటారు.

2. జీవక్రియల్లో లోపాలు: మెదడులో నిర్మాణపరమైన లోపాలేవీ లేకపోయినా జీవక్రియల్లో లోపాల వల్ల ఫిట్స్‌ రావొచ్చు. మన మెదడులో, శరీరంలో కొన్ని రసాయనాలుంటాయి. కొందరిలో ఎంజైమ్‌ల లోపాలుంటాయి. ముఖ్యంగా మేనరికం దంపతులకు పుట్టే పిల్లల్లో ఇవి మరీ ఎక్కువ. ఈ ఎంజైమ్‌ లోపాలు గలవారిలో జీవక్రియలకు అవసరమైన ఆమ్లాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఫిట్స్‌ రావొచ్చు. ఈ లోపాలను గుర్తించే పరీక్షలు ఇప్పుడు మనదేశంలోనూ అందుబాటులో ఉన్నాయి. వీటిని గుర్తిస్తే ఎంజైమ్‌లు, విటమిన్ల మాత్రలతో చికిత్స చేస్తారు.

3. జన్యు అంశాలు: జన్యువుల్లో లోపాలుంటే మెదడు సమస్యకు దారితీస్తాయి. దీంతో ఫిట్స్‌ వచ్చే అవకాశముంది.

జ్వరంతో వచ్చే ఫిట్స్‌ను ‘ఫిబ్రైల్‌ సీజర్‌’ అంటారు. ఇది సాధారణంగా 6 నెలల నుంచి 5, 6 ఏళ్ల వయసు పిల్లల్లో కనబడుతుంది. ఈ రకం ఫిట్‌ జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు, అదీ సాధారణంగా జ్వరం ఆరంభమైన ఒకట్రెండు రోజుల్లోపే వస్తుంది. కొన్నిసార్లు 3 రోజుల తర్వాతా రావొచ్చుగానీ ఒకవేళ నాలుగైదు రోజుల అనంతరం ఫిట్‌ వస్తే అది జ్వరంతో వచ్చే రకం ఫిట్‌ కాకపోవచ్చని అనుమానించటం, అందుకు ఇతరత్రా కారణాలు ఉన్నాయేమో అనుమానించటం అవసరం. ఫిబ్రైల్‌ సీజర్‌ వచ్చే పిల్లల్లో ఎదుగుదల, మాట వంటివాటిలో తేడాలేమీ ఉండవు. ఈ రకం ఫిట్‌ వచ్చినప్పుడు చాలావరకు కొద్ది సెకన్ల పాటే ఉంటుంది. కొందరిలో కాస్త ఎక్కువగా, కొన్ని నిమిషాల సేపు ఉండొచ్చు. కేవలం 5% మంది పిల్లల్లోనే ఈ ఫిట్‌ 15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు కనబడుతుంది. దీన్ని ‘ఫిబ్రైల్‌ స్టేటస్‌ ఎపిలిప్టికస్‌’ అంటారు. ఇలాంటి వారికి ఆసుపత్రిలో చేర్చి, అత్యవససర చికిత్స అందించాల్సి ఉంటుంది.

ఫిబ్రైల్‌ రకం ఫిట్‌ వచ్చినప్పుడు- పిల్లలు రెండు చేతులనూ వేగంగా కదిలిస్తారు. కనుగుడ్లు పైకి వెళ్లిపోతాయి. శరీరం బిగుసుకుంటుంది. జ్వరంతో వచ్చే ఫిట్‌ 70% మందిలో జీవితంలో ఒకసారే వస్తుంది. 30% మందికి ఒకటి కన్నా ఎక్కువసార్లు రావొచ్చు. ఇంతకుముందు కుటుంబంలో ఎవరికైనా ఆరేళ్ల లోపు ఫిట్‌ వచ్చిఉంటే ఇలా ఎక్కువసార్లు వచ్చే అవకాశముంది. మిగతావారితో పోలిస్తే వీరిలో పెద్దయ్యాక మూర్ఛ వచ్చే ముప్పు రెట్టింపు ఉంటుంది.

జ్వరంతో పాటు ఫిట్‌ వచ్చినపుడు ముందుగా చుట్టుపక్కల కత్తుల వంటి పదునైన, ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా చూడాలి. చొక్కా కాలర్‌, టై వంటివి బిగుతుగా ఉంటే వదులు చేయాలి. తడిబట్టతో గానీ, స్పాంజ్‌ని నీటిలో ముంచి గానీ ఒళ్లంతా తుడవాలి. ఫిట్‌ నుంచి కోలుకున్నాక కుడి వైపునకు తిప్పి పడుకోబెట్టాలి. దీంతో వాంతి అయినా ఆ ద్రవాలు వూపిరితిత్తుల్లోకి వెళ్లకుండా బయటకు వచ్చేస్తాయి. పారాసిటమాల్‌ వంటి మందులతో జ్వరం తగ్గేలా చూడాలి. తప్పకుండా డాక్టరుకు చూపించాలి. ఒకసారి ఫిట్‌ వచ్చిన పిల్లలకు 5-6 ఏళ్లు లోపు మళ్లీ వచ్చే ప్రమాదముంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఫిట్‌ రాకుండా చూసేందుకు జ్వరం ఆరంభమయ్యాక రెండు రోజుల వరకు క్లోబజామ్‌ (ఫ్రిజియమ్‌) మాత్రలు ఇస్తారు. అలాగే ముక్కులోకి ఇచ్చే ‘మిడజోలమ్‌ నాజల్‌ స్ప్రే’ కూడా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు దీన్ని ఫిట్‌ వచ్చినపుడు కూడా ఇవ్వొచ్చు. ఇది ఫిట్‌ని వెంటనే నిలువరిస్తుంది. ఇది 70-80% వరకూ బాగా పనిచేస్తున్నట్టు.. అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరాన్ని తప్పిస్తుండటంతో పాటు మెదడు దెబ్బతినకుండానూ చూస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఒకసారి ఫిట్‌ వచ్చిన పిల్లలకు మరోసారి వచ్చే అవకాశముంది కాబట్టి ఈ నాజల్‌ స్ప్రేని అందుబాటులో ఉంచుకోవటం అవసరం. తరచుగా ఫిట్స్‌ వచ్చే పిల్లలు దీన్ని బడికి వెంట తీసుకువెళ్లటం మంచిది. దీన్ని వాడే విధానం గురించి టీచర్లకు కూడా చెప్పటం మేలు. ఈ నాజల్‌ స్ప్రేతో పెద్దగా దుష్ప్రభావాలు ఉండవు. వాడే విధానమూ తేలికే. 2-3 నిమిషాల్లోపే ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ అప్పటికీ కోలుకోకపోతే మరోసారి స్ప్రే ఇవ్వొచ్చు. అయితే ఆ తర్వాత కూడా ఫిట్‌ వస్తుంటే తాత్సారం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఫిట్‌ తగ్గనపుడు ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళితే అంత మంచిది. నిపుణులైన వైద్యుల కోసమంటూ సమయం వృథా చెయ్యటం కాకుండా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లిపోవటం ఉత్తమం. తల్లిదండ్రులు ముందుగానే దగ్గర్లో, అన్నివేళలా డాక్టర్లు అందుబాటులో ఉండే ఆసుపత్రిని చూసి ఉంచుకోవాలి. దీంతో అప్పటికప్పుడు ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న కంగారు ఉండదు.

జ్వరం వచ్చాక ఐదారు రోజులకు ఫిట్స్‌ వస్తే మాత్రం దాన్ని ఫిబ్రైల్‌ రకంగా భావించి తేలికగా తీసుకోకుండా కారణమేమిటో గుర్తించటం; బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వంటివి కారణమవుతున్నాయేమో చూడటం అవసరం. సాధారణంగా ఫిబ్రైల్‌ సీజర్‌ వచ్చాక పిల్లలు కొద్దిసేపట్లోనే దాన్నుంచి బయటపడి సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఒకవేళ అరగంట తర్వాత కూడా దాన్నుంచి బయటపడలేకపోతుంటే మెదడుకు స్కానింగ్‌, లంబార్‌ పంక్చర్‌ వంటి పరీక్షలు చేసి కారణాన్ని గుర్తించాల్సి ఉంటుంది.

జ్వరంతో వచ్చే ఫిట్స్‌లో రెండు వైపులా కాళ్లు, చేతులు కొట్టుకోవటం కనిపిస్తుంది. కొందరు ఒక వైపు కాళ్లు, చేతులనే కదిలిస్తారు. మెదడులో ఒక భాగంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఇలా ఒకవైపు అవయవాలు కదిలించే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తించాల్సిన అవసరముంది. కొందరిలో కాళ్లు, చేతులు అదేపనిగా కొట్టుకోకుండా ఒకసారి మాత్రమే గుంజుకున్నట్టు కదలటం (జెర్క్‌) కనిపిస్తుంది. ఇది కూడా పెద్ద ప్రమాదకరమైందేం కాదు.

కుటుంబంలో చిన్నప్పుడు ఎవరికైనా ఫిబ్రైల్‌ సీజర్‌ వచ్చి ఉంటే ఆ కుటుంబంలోని పిల్లలకు ఇది వచ్చే అవకాశముంది. దీనికి జన్యుపరమైన కారణాలు దోహదం చేస్తాయి. ఫిబ్రైల్‌ సీజర్‌ వచ్చిన పిల్లల్లో చాలామందికి దీర్ఘకాలం మందులు వాడాల్సిన అవసరం లేదు. తరచుగా వచ్చేవారికి, అదీ 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండేవారికి, జ్వరం లేకపోయినా ఫిట్స్‌ వచ్చేవారికి మాత్రమే ‘ఈఈజీ’ పరీక్ష చేసి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతావారికి ఎలాంటి పరీక్షలుగానీ, రోజువారీ మందులుగానీ వాడాల్సిన అవసరం ఉండదు.

జ్వరంలో ఫిట్స్‌ సూచన * పిల్లలకు ఫిట్స్‌ వస్తున్నప్పుడు తల్లిదండ్రులు దాన్ని వీడియోలో రికార్డు చేయటం మంచిది. ఇది డాక్టరు దగ్గరికి తీసుకెళ్లినపుడు బాగా ఉపయోగపడుతుంది. దీంతో అది ఫిట్‌ అవునో కాదో.. ఒకవేళ ఫిట్‌ అయితే ఎలాంటి రకానికి చెందిందో గుర్తించటం వైద్యులకు సులభమవుతుంది. వర్ణించటానికి వీలు కాని శరీర కదలికలనూ స్పష్టంగా వైద్యులకు చూపించొచ్చు. నిజానికి మొదటిసారి ఫిట్‌ వచ్చినపుడు వీడియో తీయటం సాధ్యం కాదు. కానీ తరచుగా ఫిట్స్‌ వచ్చేవారికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎలా వస్తుందో తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు దీన్ని రికార్డు చేసుకుంటే నిర్ధరణకు బాగా ఉపయోగపడుతుంది.

2 నెలల వయసు నుంచి 16 ఏళ్ల మధ్య వచ్చే ఫిట్స్‌ను ‘పీడియాట్రిక్‌ అండ్‌ అడాలసెంట్‌ ఫిట్స్‌’ అంటారు. అది కూడా జ్వరం లేకుండా, రెండు కంటే ఎక్కువ సార్లు ఫిట్స్‌ వచ్చి ఉంటేనే దీని కింద పరిగణిస్తారు. ఫలితం ఫిట్స్‌ రావటానికి దోహదం చేస్తున్న అంశాలను బట్టి చికిత్స ఫలితాలు ఆధారపడి ఉంటాయి. జన్యుపరమైన లోపాలు, మెదడుకు దెబ్బ తగలటం, మెదడు నిర్మాణంలో లోపాల వల్ల వచ్చే ఫిట్స్‌ దీర్ఘకాలం కొనసాగొచ్చు. వీటిని 70-80% మందిలో మందులతోనే నియంత్రించొచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే ఇతర సమస్యల బారినపడకుండా ఉండేందుకు మెదడుకు ఆపరేషన్‌ చేయాల్సిన అవసరముంటుంది. కాన్పు సమయంలో ఇబ్బందులు (బర్త్‌ట్రామా), మెదడులో లోపాల వల్ల వచ్చే ఫిట్స్‌ను నియంత్రించకపోతే ప్రవర్తన పరమైన సమస్యలు, చదువులో వెనకబడిపోవటం వంటి వాటికి దారితీయొచ్చు. మెటబాలిక్‌ కారణాల వల్ల ఫిట్స్‌ వచ్చే వారిలో స్వల్పంగా ఎదుగుదల దెబ్బతినొచ్చు. ఎలాంటి కారణాలు లేకుండా (ఇడియోపతిక్‌) వచ్చే బినైన్‌ సెంట్రోటెంపోరల్‌, జువైనల్‌ మయోక్లోనిక్‌, ఆబ్సాన్స్‌ వంటి ఫిట్స్‌లో చికిత్స ద్వారా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇలాంటి పిల్లలు స్కూలుకు వెళ్లటం, చదువుకోవటం వంటివి మామూలుగానే ఉంటాయి. ఇన్‌ఫాంటైల్‌ స్పాజమ్స్‌లో చికిత్సతో ఫలితం అంతంత మాత్రమే కనబడుతుంది. విషయగ్రహణ లోపం, కదలికల్లో ఇబ్బందులు, చూపు, వినికిడి సమస్యలు ఉంటాయి. ఫిట్స్‌ రకరకాలు

స్వభావరీత్యా ఫిట్స్‌లో చాలా రకాలున్నాయిగానీ సాధారణంగా పిల్లల్లో- బినైన్‌ సెంట్రోటెంపోరల్‌, జువైనల్‌ మయోక్లోనిక్‌ రకం ఫిట్స్‌ ఎక్కువమందిలో కనిపిస్తాయి. ఫిట్స్‌ ఏ వయసువారికైనా రావొచ్చుగానీ జువైనల్‌ మయోక్లోనిక్‌ ఎపిలెప్సీ ఎక్కువగా యుక్తవయసులోనే వస్తుంది. మరో రకమైన ఇన్‌ఫాంటైల్‌ స్పాజమ్స్‌ 4 నెలల నుంచి ఏడాది లోపు వయసు వారిలో ఎక్కువ.

* జనరలైజ్డ్‌ సీజర్స్‌: చాలామందిలో కనబడే రకం ఫిట్స్‌ ఇవి. ఇందులో శరీరంలోని రెండువైపుల భాగాలూ కొట్టుకుంటాయి. కనుగుడ్లు పైకి వెళ్లిపోతాయి, స్పృహ కోల్పోతారు. ఫిట్స్‌ వస్తున్నట్టు ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ కనబడవు. పిల్లలు హఠాత్తుగా కింద పడిపోతారు.

* సింపుల్‌ పార్షియల్‌ సీజర్స్‌: ఇందులో పిల్లలు తలను కొద్దిగా వణికిస్తారు. కళ్లు పూర్తిగా ఒకవైపునకు మళ్లుతాయి. రెండు చేతులూ కొట్టుకుంటాయి. ఫిట్స్‌ వచ్చే ముందు ఆ విషయం వీరికి తెలుస్తుంటుంది గానీ ఆపుకోలేరు. స్పృహలోనే ఉంటారు. ఈ సమయంలో మాట్లాడలేకపోవచ్చు గానీ పక్కవారి మాటలు అర్థమవుతుంటాయి.

* కాంప్లెక్స్‌ పార్షియల్‌ సీజర్స్‌: ఇందులో ఫిట్స్‌ వస్తున్నట్టు పిల్లలకు ముందుగానే తెలుస్తుంటుంది. భయపడిపోయి దగ్గర ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆలోపే ఫిట్‌ రావొచ్చు కూడా. ఈ సమయంలో మెడ ఒకవైపునకు తిప్పుతారు. నాలుక, మూతి వంకరపోతాయి. తర్వాత స్పందించటం మానేస్తారు. ఫిట్స్‌ వచ్చే ముందు కడుపునొప్పీ ఉండొచ్చు. ఏదో చెడు వాసన వస్తున్న భావన కలుగుతుంది. ఒకవైపు కాళ్లూ చేతులూ కొట్టుకుంటాయి. కేవలం కొన్ని సెకన్ల పాటే ఫిట్‌ వస్తే ఆ తర్వాత వెంటనే మామూలుగా అవుతారు. ఒకవేళ ఎక్కువసేపు ఫిట్‌ ఉంటే కొందరు అరగంట, గంటసేపు నిద్రపోతుంటారు. అయితే వీళ్లు కింద పడిపోవటమన్నది ఉండదు.

* మయోక్లోనిక్‌: ఈ రకం ఫిట్స్‌లో హఠాత్తుగా చేతులు పైకి లేస్తూ వణుకుతాయి. బ్రష్‌ చేసుకుంటున్నప్పుడు ఇలా జరిగితే ముఖానికి దెబ్బ తగలొచ్చు. టిఫిన్‌ చేస్తున్నప్పుడొస్తే చెమ్చాలోని పదార్థాలు ఎగిరి పడుతుంటాయి. ఇందులో మిగతా ఫిట్స్‌ లక్షణాలేవీ ఉండవు. సాధారణంగా చేతుల కదలిక ఒకసారే కనిపిస్తుంది. అదేపనిగా కొట్టుకోవటం ఉండదు. అయితే కొందరిలో ఇది మాటిమాటికీ రావొచ్చు. ఈ ఫిట్‌ వచ్చినపుడు స్పృహలోనే ఉంటారు. చాలాసార్లు ఫిట్‌ వచ్చి పోయినట్టూ తెలియదు. ఎందుకంటే వీళ్లు మరుక్షణం మామూలుగా అయిపోతారు.

* టోనిక్‌ సీజర్స్‌: ఇలాంటి ఫిట్స్‌లో పిల్లల శరీరం గట్టిగా కొయ్యబారుతుంది. దీన్ని ‘లెనాక్స్‌ గ్యాస్ట్రో సిండ్రోమ్‌’ అంటారు. ఇది ముఖ్యంగా నిద్రపోయే ముందు వస్తుంటుంది. నిమిషం పాటు శరీరం కొయ్యబారి తగ్గిపోతుంది. ఈ ఫిట్‌ దాదాపు జీవితాంతం ఉంటుంది. ఇది తీవ్రమైనదే కానీ చాలా అరుదుగా కనబడుతుంది.

* ఇన్‌ఫెంటైల్‌ స్పాస్మ్స్‌: ఇది చాలా వరకూ 4 నెలల నుంచి ఏడాది వయసు పిల్లల్లో కనబడుతుంది. పుట్టినపుడు రక్తంలో గ్లూకోజు తక్కువగా ఉండటం (హైపోగ్లైసీమియా), తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం (ఆస్‌ఫిక్సియా), పుట్టగానే ఏడ్వకపోవటం వంటి సమస్యలు గలవారిలో ఈ రకం ఫిట్స్‌ వస్తుంటాయి. ఇలాంటి పిల్లలు నిద్ర నుంచి లేస్తూనే చేతులు బిగబట్టి, మెడను ఒకవైపునకు తిప్పుతారు. ఇది తగ్గిన తర్వాత ఏడ్వటమో, నవ్వటమో చేస్తారు. అనంతరం కొద్ది సెకన్ల తర్వాత మళ్లీ ఫిట్‌ వస్తుంది. నిద్ర నుంచి లేచిన ప్రతిసారీ ఇది రావొచ్చు. చాలామంది దీన్ని ఫిట్‌ అనుకోరు. నిద్ర నుంచి లేవగానే వస్తుంటుంది కాబట్టి కడుపునొప్పో, మరేదో అనుకుంటూ ఉంటారు. దీనిని గుర్తించి చికిత్స చేయకపోతే- పిల్లల ఎదుగుదల తీవ్రంగా ప్రభావితమవుతుంది. చిరునవ్వులాంటి స్పందనలు లేకపోవటం, మెడ నిలబెట్ట లేకపోవటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం వంటి లక్షణాలు మొదలవుతాయి. అందువల్ల ఈ రకం ఫిట్‌ని వీలైనంత త్వరగా గుర్తించటం అవసరం. దీనికి చికిత్స మిగతా వాటికన్నా భిన్నంగా ఉంటుంది. ఫిట్‌ రాకుండా ఉండేందుకు కొన్ని నెలల పాటు ‘యాక్టాన్‌ ప్రొలాంగేటమ్‌’ అనే స్టిరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. దీంతో మెదడు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. తర్వాత ‘వైగాబాట్రిన్‌’ మందు ఇస్తారు. వీటిని దీర్ఘకాలం వాడాల్సిన పనిలేదు. కొంతకాలం తర్వాత ఫిట్స్‌ తగ్గిపోతాయి.

* ఆబ్జాన్స్‌ ఎపిలెప్సీ: పిల్లలు ఆడుకుంటున్నప్పుడో, చదువుకుంటున్నప్పుడో మాట్లాడుతున్నప్పుడో ఉన్నట్టుండి ఒక సెకను పాటు ఈ లోకాన్ని మరచిపోయి అలాగే ఉండిపోతారు. ఆ తర్వాత తేరుకొని ‘ఏమైంది’ అని అనుకుంటూ ఉంటారు. ఇలా కొందరికి రోజులో 10-15 సార్లు రావొచ్చు. స్పృహ కోల్పోవటం వంటి లక్షణాలేవీ ఉండవు. సాధారణంగా ఇది 3-8 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంది. ఇందులో మెదడు ఎదుగుదల మామూలుగానే ఉంటుంది. ఈ రకం ఫిట్స్‌ను ‘ఈఈజీ’ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. 2-3 ఏళ్ల పాటు చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా తగ్గిపోతుంది.

* బినైన్‌ సెంట్రోటెంపోరల్‌ ఎపిలెప్సీ: పిల్లల్లో తరచుగా కనిపించే ఫిట్స్‌లో ఇదొకటి. 10-15% పిల్లల్లో ఇవి కనిపిస్తాయి. సాధారణంగా 4-8 ఏళ్ల పిల్లల్లో మొదటిసారి వస్తాయి. ముఖ్యంగా పడుకునే ముందు కనిపిస్తాయి. ఇందులో నోరు, కళ్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. పడుకోగానే నోరు ఒకవైపునకు వంకర తిరుగుతుంది. 5-10 నిమిషాల వరకు ఫిట్స్‌ కొనసాగుతాయి. కాళ్లు, చేతులు కొట్టుకోవటం ఉండదు గానీ ఎక్కువసేపు ఫిట్స్‌ ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపించొచ్చు. కానీ చాలా అరుదు. వీరికి మెదడు స్కాన్‌ చేస్తే మామూలుగానే ఉంటుంది. నిద్రపోయినప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు ఈఈజీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. నిద్రలో ఫిట్స్‌ వచ్చినట్టు సంకేతాలు కనబడతాయి. ఒకసారి మాత్రమే ఫిట్‌ వచ్చి, ఈఈజీ పరీక్ష అస్పష్టంగా ఉంటే వెంటనే మందులు వాడాల్సిన పనిలేదు. రెండు మూడు సార్లు ఫిట్స్‌ వచ్చేంతవరకూ వేచి ఉండొచ్చు. కానీ తరచుగా ఫిట్స్‌ వస్తుంటే, ఈఈజీలోనూ మార్పులు కనిపిస్తే మందులు ఆరంభించాలి. లేకపోతే పిల్లలు చదువులో వెనకబడే అవకాశముంది. ఎందుకంటే ఈ ఫిట్స్‌ తరచుగా వస్తుంటే నిద్ర బాగా దెబ్బతింటుంది. దీంతో నేర్చుకున్న విషయాలను మెదడు మననం చేసుకోలేకపోవటం వల్ల చదువులు దెబ్బతినే ప్రమాదముంది. ప్రవర్తన సమస్యలకూ దారితీయొచ్చు.

* జువైనల్‌ మయోక్లోనిక్‌ ఎపిలెప్సీ: ఇది యుక్త వయసు పిల్లల్లోనే కనిపిస్తుంది. నిద్ర నుంచి లేచాక కొన్ని నిమిషాల తర్వాత మాత్రమే ఫిట్స్‌ వస్తాయి. మిగతా సమయాల్లో పూర్తిగా మామూలుగా ఉంటారు. అందరిలా బడికి వెళ్లటం, ఆడుకోవటం చేస్తారు. ఫిట్స్‌ ఉదయం పూట మాత్రమే వస్తాయి. ఎక్కువగా చేతుల కదలికలు కనిపిస్తాయి. (అందుకే దీన్ని ఫ్లైయింగ్‌ కార్న్‌ఫ్లేక్స్‌ సిండ్రోమ్‌ అనీ పిలుస్తుంటారు.) వీరిలో ఎదుగుదల బాగానే ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఫిట్స్‌ ఉంటే ఇవి రావొచ్చు. ఈఈజీ పరీక్ష ద్వారా వీటిని నిర్ధరిస్తారు. మిగతా ఫిట్స్‌ల్లో కొంతకాలం మందులు వాడిన తర్వాత ఆపేసే వీలుంది. కానీ జువైనల్‌ మయోక్లోనిక్‌ ఎపిలెప్సీని నిర్ధరిస్తే.. జీవితాంతం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. మందులు ఆపేస్తే తిరిగి వచ్చే ప్రమాదముంది.

* ఇన్‌ఫాంటల్‌ ఎపిలెప్సీ: ఈ రకం ఫిట్స్‌ 2 నెలల నుంచి 2 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి, తీవ్రంగా వస్తుంటాయి. చాలాసార్లు దీనికి కారణం ఇదమిత్థంగా తెలియదు. దీర్ఘకాలం ఎదుగుదల సమస్యలు బాధిస్తాయి. ఇన్‌ఫాంటల్‌ ఎపిలెప్సీగా అనుమానిస్తే శిశువుల్లోనైతే రక్తంలో క్యాల్షియం, ఫాస్పరస్‌, గ్లూకోజు మోతాదులను పరీక్షిస్తారు. ఎలక్ట్రోలైట్స్‌ మోతాదులతో పాటు జ్వరం ఉంటే ఇన్‌ఫెక్షన్లు ఏవైనా ఉన్నాయేమో కూడా పరీక్షించాలి. ఈఈజీ, మెదడు స్కాన్‌ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కేవలం మెలకువగా ఉన్నప్పుడు ఈఈజీ చేస్తే కచ్చితమైన ఫలితాలు కనబడవు. అందువల్ల నిద్రపోతున్నప్పుడు కూడా ఈఈజీ చేయాల్సి ఉంటుంది. ఇందులో నిద్రకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడతాయి. స్కాన్‌లో లోపాలు బయటపడినా, కుటుంబంలో ఫిట్స్‌తో బాధపడేవారు ఉన్నా ఇతర పరీక్షలేవీ అవసరం లేదు. అయితే కొందరిలో కారణాలేవీ బయటపడకుండా ఫిట్స్‌ వస్తుండొచ్చు. ఇలాంటివారికి మెటబాలిక్‌ పరీక్ష చేయాల్సి రావొచ్చు. దీంతో ఖనిజాలు, లవణాల వంటి వాటి లోపాలుంటే బయటపడతాయి. ఇందుకోసం టాండమ్‌మాస్‌ స్పెక్ట్రోమెట్రీ, యూరిన్‌ ఆర్గానిక్‌ యాసిడ్స్‌ పరీక్షిస్తారు. ఇందులోనూ ఎలాంటి కారణాలు బయటపడకపోతే జన్యుపరీక్షలూ అవసరమవుతాయి.

చికిత్స 

* అత్యవసర చికిత్స: జ్వరంతో గానీ మిగతా సమయంలోగానీ ఫిట్స్‌ వస్తే ముందు మిడజోలమ్‌ నాజల్‌ స్ప్రే ద్వారా ముక్కులోకి మందును ఇవ్వాలి. 5-10 నిమిషాల్లోపు ఫిట్‌ తగ్గిపోతే ఫర్వాలేదు. కానీ తగ్గకపోతే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఫిట్‌ తగ్గిపోయినా పిల్లలు స్పృహలోకి రాకపోతే కుడివైపునకు తిప్పి పడుకోబెట్టాలి. ఫిట్‌ నుంచి పిల్లలు పూర్తిగా బయటపడినట్టు అనిపిస్తే, హాయిగా పడుకుంటే తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నిద్ర నుంచి లేచాక బయటికి వెళ్లనీయకుండా చూడాలి. సాధ్యమైనంత త్వరలో వైద్యులకు చూపించటం అవసరం.

* నియంత్రణ చికిత్స: ఫిట్స్‌ తరచుగా వస్తున్నట్టయితే ఆయా రకాలను బట్టి చికిత్స చేస్తారు. జనరలైజ్డ్‌ ఫిట్స్‌కు సోడియం వాల్‌ప్రోయేట్‌ (వాల్‌ప్రిన్‌) ఇస్తారు. అయితే దీన్ని చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఒకట్రెండు ఏళ్ల లోపు పిల్లలకు ముఖ్యంగా నిర్ధరణ పరీక్షలు పూర్తిగా చేయని వారికి దీన్ని ఇవ్వరు. కారణాన్ని గుర్తిస్తే, అది అంత హానికరం కాదని భావిస్తే ఈ మందు ఇస్తారు. సింపుల్‌ పార్షియల్‌, కాంప్లెక్స్‌ పార్షియల్‌ సీజర్లలో ఆక్స్‌కార్బమజెపీన్‌ ఎక్కువగా ఇస్తారు. గతంలో కార్బమజెపీన్‌ అందుబాటులో ఉండేది. దీంతో చర్మంపై దద్దుర్లు, ఇతర దుష్ప్రభావాలు ఉండేవి. అందువల్ల ఇప్పుడు దీన్ని వాడటం లేదు. ఈ విషయంలో ఆక్స్‌కార్బమజెపీన్‌ సురక్షితమైన మందుగా ఉపయోగపడుతోంది. వైద్యులు అత్యవసర సమయాల్లో గార్డినాల్‌, ఫినాబార్బిటోన్‌, ఫినటాయిన్‌, సోడియం వాల్‌ప్రోయేట్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. వాల్‌ప్రిన్‌ వంటివి దీర్ఘకాలం ఇవ్వటానికి పనికొస్తాయి. ఫిట్స్‌ వచ్చినపుడు ఎప్టాయిన్‌ కూడా బాగా ఉపయోగపడుతోంది. చాలామంది దీన్ని దీర్ఘకాలం వాడుతుంటారు కానీ ఇంతకన్నా మంచి మందులు ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. ఇంజెక్షన్‌ రూపంలో లీవెటైరసిటమ్‌ అనే కొత్త మందు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల కొందరిలో ప్రవర్తన పరమైన సమస్యలు కనబడొచ్చు గానీ పెద్దగా దుష్ప్రభావాలు ఉండవు. విదేశాల్లో దీన్ని ఫిట్స్‌ ప్రధానమైన మందుగా వాడుతున్నారు. దీన్ని శిశువులకూ ఇవ్వొచ్చు. అత్యవసర సమయాల్లో జనరలైజ్డ్‌ ఫిట్స్‌కు సోడియం వాల్‌ప్రోయేట్‌.. సింపుల్‌ పార్షియల్‌, కాంప్లెక్స్‌ పార్షియల్‌కు ఆక్స్‌కార్బమజెపీన్‌.. ఇన్‌ఫెంటైల్‌ స్పాజమ్స్‌కు ఏసీటీహెచ్‌, వైగోబాటరిన్‌ బాగా ఉపయోగపడతాయి. జువైనల్‌ మయోక్లోనిక్‌ ఎపిలెప్సీలో మగపిల్లలకు సోడియం వాల్‌ప్రోయేట్‌ ఇస్తారు. ఇది ఆడపిల్లల్లో అండాశయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల సాధ్యమైనంతవరకు దీన్ని ఆడపిల్లలకు ఇవ్వకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు. లీవెటైరసిటమ్‌ వంటి మందులు ఇస్తారు.

ఎప్పుడు నయమైనట్టు: ఫిట్స్‌కు చికిత్స ఆరంభించాక రెండేళ్ల వరకూ ఫిట్స్‌ రాకపోతే.. ఈఈజీ మామూలుగానే ఉండి, పిల్లలు అందరిలానే ఉంటే తాత్కాలికంగా మందులు ఆపేస్తారు. ఆ తర్వాత ఆర్నెల్లు, ఏడాది వరకూ ఒక్కసారి కూడా ఫిట్స్‌ రాకపోతే నయమైందని భావించొచ్చు. 80-90% మంది పిల్లలు ఈ కోవలోనే ఉంటారు. అయితే తరచుగా ఫిట్స్‌ వస్తుంటే మాత్రం ఐదేళ్లు, ఎనిమిదేళ్లు ఇలా దీర్ఘకాలం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివారికి ఒక మందుతో ఫలితం కనబడకపోతే దాన్ని మార్చి మరోటి ఇస్తారు. అవసరమైతే రెండు మందులూ ఇవ్వాల్సి రావొచ్చు. అరుదుగా కొందరికి మూడు మందులు అవసరపడొచ్చు. అవసరమైతే మందుల మోతాదూ పెంచుతారు. అప్పటికీ ఫలితం కనబడకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది.

* ఆహారం: కొన్ని రకాల ఫిట్స్‌లో కొందరికి కొవ్వు ఎక్కువగా, పిండి పదార్థాలు, ప్రోటీన్లు తక్కువగా ఉండే ‘కీటోజెనిక్‌ ఆహారం’ బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆహారంతో ఇబ్బందులు తలెత్తకుండా కేలరీల మోతాదు సరిపోయేలా చూస్తారు. దీంతో మంచి ఫలితం కనబడుతుంది. ఈ ఆహారంతో పాటు ఆర్నెల్ల వరకు మందులూ ఇస్తారు. ఆ తర్వాత మందుల మోతాదు తగ్గిస్తారు. ఇలా ఒకట్రెండు ఏళ్ల వరకూ ఇస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు