జారకపోతే అనర్థమే!

వృషణాలు తిత్తిలోకి జారకపోతే వీర్యకణాలను తయారు చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇలాంటి వాటితో కణితుల ముప్పూ ఎక్కువే.

Published : 12 Jul 2016 01:46 IST

జారకపోతే అనర్థమే!

వృషణాలు తిత్తిలోకి జారకపోతే వీర్యకణాలను తయారు చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇలాంటి వాటితో కణితుల ముప్పూ ఎక్కువే.
పుట్టిన వెంటనే మగపిల్లలకు వృషణాలు సరిగా ఉన్నాయా? లేవా? అని పరిశీలించటం తప్పనిసరి. ఎందుకంటే కొంతమంది పిల్లల్లో వృషణాలు తిత్తిలో కాకుండా శరీరం లోపలే ఉండిపోతుంటాయి. దీన్ని ముందుగానే గుర్తిస్తే చికిత్సలతో తేలికగా సరిచేయొచ్చు. కానీ కొందరు తల్లిదండ్రులకు అవగాహన లేకపోవటం వల్ల పిల్లల్లో వృషణాలు తిత్తిలోకి జారలేదనే సంగతిని గుర్తించలేకపోతున్నారు. అరుదుగానే అయినా.. చాలామందిలో పెద్దయ్యాక కూడా ఇలాంటి సమస్య కనిపిస్తుండటమే దీనికి నిదర్శనం.

నిజానికి పిండం ఏర్పడుతున్న తొలిదశలో వృషణాలు కడుపులోనే ఉంటాయి. అవి క్రమంగా కిందికి జారుతూ చివరికి వృషణాల తిత్తిలోకి చేరుకుంటాయి. వృషణాల ప్రధానమైన పని వీర్యకణాలను, పురుష హార్మోన్లను ముఖ్యంగా.. టెస్టోసీరాన్‌ను తయారు చేయటం. సాధారణంగా మన శరీరంలో కన్నా వృషణాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇది వీర్యకణాల తయారీకి అనువైన వాతావరణం ఏర్పడేలా చూస్తుంది. ఒకవేళ వృషణాలు తిత్తిలోకి జారకుండా శరీరం లోపలే ఉండిపోతే.. పిల్లలకు ఏడాది వయసు వచ్చేసరికే అవి వీర్యకణాలను తయారుచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే ఇలాంటి సమస్యను గుర్తిస్తే వైద్యులు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేసి వృషణాలను తిరిగి తిత్తిలోకి చేరుస్తారు. గజ్జలో చిన్న కోత పెట్టి చేసే ఈ శస్త్రచికిత్స (ఆర్కియోపెక్సీ) చాలా తేలికైంది. చాలామంది పిల్లలను అదే రోజు ఇంటికి పంపిస్తారు కూడా. ఇక కొంతమంది పిల్లలకు హెచ్‌సీజీ అనే హార్మోన్‌ ఇంజెక్షన్లతోనూ మంచి ఫలితం కనబడొచ్చు. హెచ్‌సీజీ పురుష హార్మోన్లను పెద్దమొత్తంలో విడుదలయ్యేలా చేసి వృషణాలు కిందికి దిగేలా చేస్తుంది. ఇలా వీలైనంత త్వరగా వృషణాలను తిరిగి తిత్తిలోకి చేరిస్తే.. పెద్దయ్యాక సంతానలేమి బారినపడకుండా పిల్లలను కాపాడుకోవచ్చు. కొందరిలో సమస్యను చిన్నప్పుడు పొరపాటున గుర్తించకపోవటం వల్లనో, ఒకవేళ గుర్తించినా ఏమవుతుందిలే అని తల్లిదండ్రులు తాత్సారం చేయటం వల్లనో పిల్లలు అలాగే పెద్దవాళ్లవుతున్నారు. ఇలా తిత్తిలోకి జారని వృషణాలతో తలెత్తే మరో సమస్య ఏంటంటే.. వీటిల్లో కణితులు ఏర్పడే అవకాశం ఉండటం. శరీరం లోపల వృషణాలు గల ప్రతి 2వేల మందిలో ఒకరికి వృషణాల క్యాన్సర్‌ రావొచ్చని అంచనా. కాబట్టి పెద్దవారిలో ఎవరికైనా వృషణాలు తిత్తిలోకి జారకుండా ఉంటే వాటిని శస్త్రచికిత్సతో తొలగించటమే మంచిది. ఎందుకంటే వాటిని తిత్తిలోకి చేర్చినా వీర్యకణాలను తయారుచేసే సామర్థ్యం తిరిగి రాదు. వీటిని తొలగిస్తే మున్ముందు వృషణాల క్యాన్సర్‌ బారినపడకుండానూ చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని