Published : 02 Aug 2016 01:20 IST

మాయదారి వల!

మాయదారి వల!

పిల్లలు ఉత్సాహానికి, ఉత్సుకతకు మారుపేరు. ప్రతిదాన్నీ పట్టుకొని చూడాలని, వీలైతే వాటిని విప్పదీసి లోపల ఏముందో చూడాలని ప్రయత్నిస్తుంటారు. పెద్దల మాటలను, చేతలను అనుకరిస్తూ ఆయా విషయాలను నేర్చుకోవాలని తహతహలాడుతుంటారు. ఇలా నవ్వుతూ, కేరింతలు కొడుతూ తిరగాల్సిన పిల్లలు స్తబ్ధుగా ఉండిపోతుంటే? లేదంటే విపరీతంగా స్పందిస్తూ.. చీటికీ మాటికీ మారం చేస్తుంటే? ఆరు నెలలు దాటినా నవ్వటం చేతకాకపోతుంటే? కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతుంటే? ఏడాది వరకైనా అత్తాత్తా.. తాత్తాతా.. అంటూ ముద్దుముద్దు మాటలు పలకలేకపోతుంటే? తప్పకుండా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఎదుగుదలను దెబ్బతీసే ఆటిజమ్‌ సమస్యకు సూచికలు కావొచ్చు.

ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌. పిల్లల ఎదుగుదల సమస్య. వివిధ లక్షణాలు, సమస్యలతో చుట్టుముట్టే వల! ఒకప్పుడు మనదేశంలో దీని పేరు అంతగా వినబడేది కాదు. కానీ ఇప్పుడు చాలామంది పిల్లల్లో.. ప్రతి 85 మందికి ఒకరిలో ఇది బయటపడుతోంది. నిజానికి ఆటిజమ్‌ను రెండేళ్ల లోపే గుర్తించొచ్చు. కానీ చాలామందిలో బడిలో చేర్పించే వయసు వచ్చేంతవరకూ పట్టుకోలేపోతున్నారు. ఆటిజమ్‌ గురించి సమాజంలో అవగాహన లేకపోవటం.. దీని లక్షణాలు, వాటి తీవ్రత ఒకరిలో ఒకోలా కనిపించటం వంటివి ఆలస్యంగా గుర్తించటానికి దోహదం చేస్తున్నాయి. ఆటిజమ్‌ పిల్లలు ఇతరుల కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడటంలో ఇబ్బంది పడుతుంటారు. నవ్వటం, సంతోషంతో కేరింతలు కొట్టటం వంటివి అంతగా ఉండకపోవచ్చు. ఎత్తుకోవటానికి ప్రయత్నిస్తే విసిరికొడుతుండొచ్చు. మిగతా పిల్లల మాదిరిగా చుట్టుపక్కల పరిసరాలపై, వస్తువులపై అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. వీళ్లు ఆడుకోవటం కూడా వింతగా ఉంటుంది. ఆటబొమ్మలో ఏదో ఒక భాగం (ఉదా: కారు చక్రం) మీదే ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. ఆయా వస్తువుల పరిమాణాలను బట్టి వరుసగా పేరుస్తుంటారు. ఇతరులతో కలవటానికి ఇష్టపడరు. వారితో మాట్లాడటం, ఆడుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రవర్తన కూడా దురుసుగా, తీవ్రంగా ఉంటుంది. కొందరు పిల్లల్లో అప్పటికే వచ్చిన మాటల వంటివీ పోవచ్చు. ఇలాంటి లక్షణాలు కనబడితే ఆటిజమ్‌ ఉందేమోనని అనుమానించాలి. ఇది మున్ముందు పిల్లల భవిష్యత్తు మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది కాబట్టి సమస్యను నిర్ధరించటం అవసరం. ఇందుకు డీఎస్‌ఎం (డయాగ్నస్టిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మాన్యువల్‌ ఆఫ్‌ మెంటల్‌ డిజార్డర్స్‌) పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. వీటిల్లో కనీసం 6 లక్షణాలు కనబడితే ఆటిజమ్‌గా నిర్ధరిస్తారు. బుద్ధి కుశలతను తెలిపే ఐక్యూ పరీక్ష కూడా ఇందుకు ఉపయోగపడుతుంది. లక్షణాలు, వాటి తీవ్రతను బట్టి డాక్టర్లు చికిత్స చేస్తారు. దీంతో ముడిపడిన ఇతరత్రా సమస్యలకూ చికిత్స చేయాల్సి ఉంటుంది. మందులతో పాటు ప్రవర్తనను చక్కదిద్దటం వంటి మానసిక చికిత్స కూడా మేలు చేస్తుంది.

ఆటిజమ్‌ ఎందుకు వస్తుందో కచ్చితంగా తెలియదు. దీనికి జన్యుపరమైన అంశాలతో పాటు పర్యావరణ ప్రభావాలూ దోహదం చేసే అవకాశముంది. పర్యావరణ కాలుష్యం, గర్భిణులు తినే ఆహారంలో పురుగుమందుల అవశేషాల వంటివి దీనికి కారణమవుతుండొచ్చని అనుమానిస్తున్నప్పటికీ ఇంకా రుజువు కాలేదు. ఆటిజమ్‌ పిల్లల కుటుంబాలను పరిశీలిస్తే మిగతా పిల్లల్లోనూ ఒకటో రెండు లక్షణాలు స్వల్పంగా కనిపిస్తుంటాయి కూడా. ఆటిజమ్‌ పిల్లల పెంపకంలో, చదువుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారికి అవసరమైన తోడ్పాటు అందిస్తూ.. చేదోడు వాదోడుగా ఉంటే లక్షణాలు స్వల్పంగా గల పిల్లలు యుక్తవయసుకు వచ్చేసరికి చాలావరకు అధిగమించే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు