మందులు సరిగా పోస్తున్నారా?

పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే ఇంట్లో అంతా కంగారు పడిపోతాం. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తాం. వీలైనంత త్వరగా జబ్బు తగ్గాలనీ కోరుకుంటాం. అయితే...

Published : 01 Nov 2016 01:20 IST

మందులు సరిగా పోస్తున్నారా?

పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే ఇంట్లో అంతా కంగారు పడిపోతాం. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తాం. వీలైనంత త్వరగా జబ్బు తగ్గాలనీ కోరుకుంటాం. అయితే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లటమే కాదు.. మందులను జాగ్రత్త చేయటం, వాటిని సరైన మోతాదులో ఇవ్వటం కూడా చాలా అవసరం. ఎందుకంటే మందుల మోతాదుల్లో తేడాలు, పొరపాట్లు కొన్నిసార్లు పిల్లల ప్రాణాల మీదికీ తేవొచ్చు.

* తల్లిదండ్రులు తమ పిల్లలకు మందులు ఇవ్వటంలో సుమారు 47% వరకు తప్పులు చేస్తున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం మందులను కొలవటంపై తికమక పడటం. ఎలా ఇవ్వాలో సరిగా తెలియకపోవటం.

* మందులను కొన్నప్పుడు వాటి మీద రాసి ఉండే వివరాలను ఒకసారి చదవటం మంచిది. అవి పిల్లలకు వాడటం సురక్షితమేనా అనేదీ చూసుకోవాలి.

* సిరప్‌ల వంటి ద్రవరూపంలోని మందులను చాలామంది చెంచాలతో కొలిచి పోస్తుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. టీ స్పూన్లు, టేబుల్‌ స్పూన్లు అన్నీ ఒకే సైజులో ఉండవు. వీటితో పోస్తే మందు మోతాదు ఎక్కువ, తక్కువ కావొచ్చు. కాబట్టి కొలత పాత్రలతోనే మందును కొలవాలి. చాలాసార్లు మందు సీసాలతోనే కొలత పాత్రలు కూడా వస్తుంటాయి. వాటి మీద మోతాదుల గుర్తులూ ఉంటాయి. వాటి ప్రకారమే సూచించిన మోతాదు మేరకు మందును ఇవ్వాలి. కొలత పాత్రలు లేకపోతే సూదిలేని సిరంజీలతోనూ కొలవచ్చు.

* ఒక మోతాదు అంటే ఒకసారికి ఇవ్వాల్సిన మందు అని అర్థం. అయితే కొందరు జబ్బు తగ్గటం లేదని ఎక్కువెక్కువగా పోస్తుంటారు. ఎక్కువసార్లు కూడా ఇస్తుంటారు. ఇలా చేయటం తగదు. సూచించిన మోతాదుకు ఎక్కువగానీ తక్కువగానీ ఇవ్వొద్దు. రోజుకు ఎన్నిసార్లు ఇవ్వమంటే అన్నిసార్లే ఇవ్వాలి.

* మందు మోతాదు శరీర బరువును బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకే వయసు పిల్లలైనా కొందరు ఎక్కువ బరువు, కొందరు తక్కువ బరువు ఉండొచ్చు. అందువల్ల అందరికీ ఒకే మోతాదు సరిపోదు. కాబట్టి డాక్టర్‌ సూచించిన ప్రకారమే మందు పోయాలి. మోతాదులను గుర్తుంచుకోవటం కష్టంగా అనిపిస్తే ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకోవాలి. అవసరమైతే కాగితం మీద రాసుకోవాలి.

* చాలారకాల మందుల సీసాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. కాబట్టి ఏది ఎప్పుడు ఇవ్వాలో గుర్తుంచుకోవాలి. ఒకసారి వాడాల్సింది మరోసారి వాడటం.. ఒకరికి ఇవ్వాల్సింది మరొకరికి ఇవ్వటం చేయొద్దు.

* మందులను ఎల్లప్పుడూ చల్లటి, నీడ ప్రదేశంలోనే జాగ్రత్త చేయాలి. వాటిపై ఎండ, వేడి పడకుండా చూసుకోవాలి. కొన్ని మందులను ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందువల్ల మందులపై సూచించిన విధంగా జాగ్రత్త చేయాలి. అలాగే పిల్లల చేతికి అందకుండానూ చూసుకోవాలి.

* కొందరు జబ్బు లక్షణాలు తగ్గగానే మందులు ఆపేస్తుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. డాక్టర్‌ సూచించినన్ని రోజులు తప్పకుండా మందులను వాడాలి. మందులు వాడుతున్నప్పుడు ఒకవేళ వాంతి, వికారం వంటివి కనిపిస్తే తమకు తామే మందులు ఆపేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్‌ మందును మార్చటమో లేదా మోతాదు తగ్గించటమో చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని