పిల్లలు పక్కెందుకు తడుపుతారు?

కొందరు పిల్లలు కాస్త పెద్దయ్యాక కూడా పక్క తడుపుతుంటారు. దీంతో పెద్దవాళ్లు ‘హవ్వ.. ఇదేం పని?’ అని చిన్నబుచ్చుతుంటారు. ఇంకొందరు ‘పక్కలో మూత్రం పోశావంటే చూడు’ అని బెదిరిస్తుంటారు. ఎంత చెప్పినా వినరని, కావాలనే పక్కలో మూత్రం పోస్తున్నారని ఈసడించుకుంటుంటారు.

Published : 13 Jun 2017 01:42 IST

పిల్లలు పక్కెందుకు తడుపుతారు?

కొందరు పిల్లలు కాస్త పెద్దయ్యాక కూడా పక్క తడుపుతుంటారు. దీంతో పెద్దవాళ్లు ‘హవ్వ.. ఇదేం పని?’ అని చిన్నబుచ్చుతుంటారు. ఇంకొందరు ‘పక్కలో మూత్రం పోశావంటే చూడు’ అని బెదిరిస్తుంటారు. ఎంత చెప్పినా వినరని, కావాలనే పక్కలో మూత్రం పోస్తున్నారని ఈసడించుకుంటుంటారు. పిల్లలను దారిలోకి తేవాలని భావిస్తూ క్రమశిక్షణ పేరుతో మరికొందరు వేధిస్తుంటారు. కానీ ఇలాంటి ప్రయత్నాలేవీ పిల్లల మీద పనిచేయవు. ఎందుకంటే ఇది వారు కావాలని చేస్తున్న పనేమీ కాదు.

సాధారణంగా శిశువులకు మూత్రం నిలుపుకోవటం తెలియదు. అందువల్ల ఎప్పుడంటే అప్పుడు పోసేస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రాశయాన్ని నియంత్రించే నాడుల వ్యవస్థ పరిపక్వం చెందుతూ వస్తుంది. దీంతో మూత్రం వస్తుంటే ఆపుకోవటానికి అవసరమైన పట్టు లభిస్తుంది. ఇలా.. పిల్లలకు ఏడేళ్లు వచ్చేసరికి పక్క తడపటమనేది దాదాపుగా తగ్గిపోతూ వస్తుంది. 90% మంది పిల్లలు రాత్రిపూట పక్క తడపటం పూర్తిగా మానేస్తారు కూడా. కానీ కొందరిలో ఆ తర్వాత కూడా కొనసాగుతూ వస్తుంటుంది. దీనికి పిల్లలు రాత్రంతా మూత్రం ఆపుకోలేకపోవటం, మూత్రాశయం నిండినా మెలకువ రాకపోవటం, రాత్రిపూట పెద్దమొత్తంలో మూత్రం తయారు అవుతుండటం వంటి అంశాలు దోహదం చేయొచ్చు. అంతేకాదు.. కొందరు పిల్లలు పగటి పూట అంతగా మూత్రానికి వెళ్లకుండా బలవంతంగా ఆపుకోవటం కూడా దీనికి కారణం కావొచ్చు. ఇవన్నీ రాత్రిపూట పక్క తడపటానికి దోహదం చేస్తుంటాయి. ఇదొక్కటే కాదు.. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, మలబద్ధకం, వూబకాయం, నిద్రలో శ్వాసకు అడ్డంకి తలెత్తటం, మధుమేహం, మూత్రకోశంలో, నాడీవ్యవస్థలో లోపాల వంటి ఇతరత్రా సమస్యలూ దీనికి దారితీస్తుండొచ్చు. అందువల్ల ఏడేళ్ల తర్వాత కూడా పిల్లలు పక్క తడుపుతుంటే తగు కారణాన్ని గుర్తించి, చికిత్స చేయించటం మంచిది. అంతేగానీ పిల్లలను చిన్నబుచ్చి, నిందిస్తే మాత్రం ఫలితం ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని