Published : 08 Aug 2017 01:06 IST

బాల ఆరోగ్యానికి జపాన్‌ పాఠాలు!

బాల ఆరోగ్యానికి జపాన్‌ పాఠాలు!

పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని అందరమూ కోరుకుంటాం. వాళ్లు బాగా తినాలని, మంచిగా ఎదగాలని ఆకాంక్షిస్తాం. కానీ పిల్లల తింœ విషయంలో ప్రతి ఇల్లూ రోజూ రణరంగాన్నే తలపిస్తుంది. తినటానికి మొండికేసే పిల్లలు కొందరైతే, పెట్టింది పూర్తిగా తినకుండా వదిలేసేవారు ఇంకొందరు. అది కావాలని, ఇది కావాలని గొంతెమ్మ కోరికలతో వేధించేవారు మరికొందరు. దీంతో పిల్లలకు తిండి తినిపించే సరికి చాలామంది తల్లిదండ్రులకు తలప్రాణం తోకకు వచ్చినంత పనవుతుంది. మరోవైపు- సరిగ్గా తినకపోవటం వల్ల తగినన్ని పోషకాలు అందక పిల్లల ఎదుగుదల సైతం కుంటుపడుతోంది. ఒక్క మనదగ్గరే కాదు, చాలాదేశాల్లోనూ ఇలాంటి పరిస్థితి కనబడుతోంది. కానీ జపాన్‌ పిల్లలు మాత్రం చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుండటం విశేషం. మిగతా దేశాలతో పోలిస్తే జపాన్‌ పిల్లల్లో వూబకాయం కూడా చాలా తక్కువే. దీనికి ప్రధాన కారణం అక్కడి జీవనశైలి, ఆహార పద్ధతులేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇంతకీ జపాన్‌ పిల్లల తిండి విషయంలో అక్కడివాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీనిలోని కిటుకులేంటి?
ఆనందిస్తూ తినటం
పిల్లలు ఇష్టపడుతూ, ఆనందంగా తినేలా చేయటం చాలా జపాన్‌లోని ఇళ్లలో తరచుగా కనబడే దృశ్యం. దీంతో ఆహరం కూడా మరింత రుచిగానూ అనిపిస్తుంది. అలాగే ఆదరాబాదరాగా కాకుండా విశ్రాంతిగా, వీలైనంత వరకు తృప్తిగా తినేలా చూడటం మరో ముఖ్య విషయం. పిల్లలకు ఇష్టమైన చిరుతిళ్లు, మిఠాయిల వంటివి ఇచ్చినా.. వాటిని మితంగా, అప్పుడప్పుడు మాత్రమే ఇస్తుంటారు. దీంతో ఉత్త కేలరీలతో కూడిన పదార్థాలను తగ్గించినట్టూ అవుతోంది.
చిన్న చిన్న పళ్లాలు
ఒకేసారి పెద్దమొత్తంలో ఆహారం పెట్టేస్తే పిల్లలకు మొహం మొత్తుతుంది. అదే వారినే ఎంచుకోమంటే? తక్కువ తక్కువగానే తీసుకున్నా కూడా ఎంచుకున్నది ఇష్టంగా తింటారు. అందుకే జపాన్‌లో పిల్లలకు చిన్న పళ్లాలు చేతికివ్వటం, ఇష్టమైనవి తీసుకునేలా ప్రోత్సహించటం మంచి ప్రభావం చూపుతున్నాయి. ఎంత తీసుకోవాలనేది పిల్లలకే వదిలేస్తే తక్కువగా తీసుకోవటానికే ఇష్టపడతారు. దీంతో సమయానికి ఆకలి వేస్తుంది కూడా. ఆహారమూ వ్యర్థం కాదు.
ఆరుబయట ఆటలు
వీడియోగేమ్స్‌ వంటి వాటి నుంచి పిల్లలను దూరంగా ఉంచటం కష్టమే. కానీ వారికి రోజుకు కనీసం 60 నిమిషాల సేపు శారీరక శ్రమ కూడా అవసరమే. అందువల్ల పిల్లలను వీలైనప్పుడల్లా ఆరుబయట ఆడుకునేలా చూడటం మంచిది. జపాన్‌ పిల్లలు ఈ విషయంలో మిగతా దేశాల పిల్లల కన్నా చాలా ముందుంటున్నారు. కొందరు పిల్లలు నడిచి స్కూలుకు వెళ్తుంటే.. మరికొందరు సైకిళ్లను ఎంచుకుంటున్నారు. జపాన్‌ పిల్లల్లో వూబకాయం తక్కువగా ఉండటానికి ఇదీ ఒక కారణమే.
కుటుంబంతో కలిసి భోజనం
వీలైనప్పుడల్లా కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేయటం మంచి సంప్రదాయం. జపాన్‌లో దీన్ని విధిగా పాటిస్తారు. దీంతో పెద్దవాళ్లను చూసి పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఇంట్లో వండిన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వల్ల సహజంగానే చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతోంది. అలాగే పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, మంచి కొవ్వులతో కూడిన చేపలు ఎక్కువగా తీసుకోవటం.. చక్కెర, ఉప్పు తగ్గించటం వంటివి చిన్నప్పటి నుంచే అలవడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు