Published : 24 Jul 2018 01:23 IST

14 ఏళ్లకే రొమ్ము నుంచి పాలు.. ఎందుకు?

సమస్య - సలహా
14 ఏళ్లకే రొమ్ము నుంచి పాలు.. ఎందుకు?

సమస్య: మా అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. కొద్దిరోజుల నుంచి రొమ్ముల నుంచి పాలు కారుతున్నాయి. దీనికి కారణమేంటి? చికిత్స ఏమైనా ఉందా?

- కె. మల్లేశ్వరరావు (ఈమెయిల్‌ ద్వారా)

సలహా: మీరు చెప్పిన సమస్యకు ప్రధాన కారణం రక్తంలో ప్రొలాక్టిన్‌ అనే హార్మోన్‌ మోతాదులు పెరిగిపోవటం. దీన్నే హైపర్‌ప్రొలాక్టినీమియా అంటారు. పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పత్తయ్యే ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ గర్భధారణ సమయంలో రొమ్ములు పెరగటంలోనూ, పాలు పడటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొందరిలో ఇతరత్రా సమస్యలు, మందుల వంటివీ ప్రొలాక్టిన్‌ మోతాదులు పెరగటానికి దోహదం చేయొచ్చు. మీ పాప రజస్వల అయ్యిందో లేదో మీరు తెలియజేయలేదు. ఒకవేళ రజస్వల అయ్యింటే నెలసరి సరిగా వస్తోందా? లేదా? అనేదీ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉంటే నెలసరి సరిగా రాదు. కొందరికి అసలు నెలసరి రాకపోవచ్చు. వచ్చినా రుతుస్రావం చాలా తక్కువగా ఉండొచ్చు. రెండు, మూడు నెలలకు ఒకసారి కావొచ్చు. దీనికి కంగారు పడాల్సిన పనేమీ లేదు. డొపమైన్‌ యాంటగోనిస్ట్‌ రకం మందులతో మంచి ఫలితం కనబడుతుంది. అయితే వీటిని ఇచ్చేముందు ప్రొలాక్టిన్‌ ఎంత ఉందనేది తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే థైరాయిడ్‌ సమస్య ఉందేమో కూడా పరీక్షించుకోవాలి. థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోయినా ప్రొలాక్టిన్‌ మోతాదులు పెరుగుతాయి. అందువల్ల థైరాయిడ్‌ సమస్య ఉంటే తప్పకుండా చికిత్స తీసుకోవాలి. మూణ్నెళ్ల తర్వాత మళ్లీ ప్రొలాక్టిన్‌, థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకొని.. వీటి మోతాదులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అంతేకాదు.. కొన్ని మందుల మూలంగానూ ప్రొలాక్టిన్‌ మోతాదులు పెరగొచ్చు. ముఖ్యంగా ఛాతీలో మంట తగ్గటానికి వాడే ప్రొటాన్‌ పంప్‌ ఇన్‌హిబిటార్స్‌ రకం మందులు.. అలాగే కొన్ని మానసిక సమస్యలకు వేసుకునే మందులతోనూ ప్రొలాక్టిన్‌ పెరిగిపోచ్చు. కాబట్టి ఇలాంటి మందులేవైనా వాడుతుంటే కొన్నాళ్లు ఆపేసి చూడాల్సి ఉంటుంది. సాధారణంగా రొమ్ముల్లో సమస్యలతో పాలు రావటమనేది ఉండదు. అయినా కూడా రొమ్ముల్లో ఏవైనా సమస్యలున్నాయేమో ఒకసారి చూసుకోవటం మంచిది. అమ్మాయి వయసు తక్కువ కాబట్టి మామోగ్రామ్‌ అవసరం లేదు. అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించుకోవచ్చు. దీంతో రొమ్ముల్లో ఏవైనా సమస్యలుంటే బయటపడతాయి. ఏదేమైనా అసాధారణంగా రొమ్ముల నుంచి పాలు రావటాన్ని తగ్గించేందుకు మంచి మందులున్నాయి. మందుల మోతాదులను బట్టి వీటిని వారానికి ఒకసారి లేదా రెండుసార్లు వాడుకోవాల్సి ఉంటుంది. వీటితో ప్రొలాక్టిన్‌ మోతాదులు తగ్గిపోయి, సమస్య పూర్తిగా నయమవుతుంది. కాబట్టి మీరు గ్రంథుల సమస్యలకు చికిత్స చేసే ఎండోక్రైనాలజిస్టును గానీ గైనకాలజిస్టును గానీ సంప్రతించటం మంచిది. సమస్యను నిర్ధరించి అవసరమైన చికిత్స చేస్తారు.

ఒకవేళ ప్రొలాక్టిన్‌ మోతాదులు 200 నానోగ్రామ్‌ల కన్నా ఎక్కువుంటే పిట్యుటరీ గ్రంథి మీద కణితి ఉందేమో చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంతోనూ ప్రొలాక్టిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. సీటీ స్కాన్‌ పరీక్ష చేస్తే పిట్యుటరీ కణితి ఉంటే బయటపడుతుంది. ఒకవేళ కణితి ఉన్నా కూడా పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు దీనికి తేలికైన, సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు