Published : 14 Aug 2018 01:50 IST

టైపు చేస్తుంటే వేళ్ల నొప్పి.. ఎందుకు?

సమస్య - సలహా
టైపు చేస్తుంటే వేళ్ల నొప్పి.. ఎందుకు?

సమస్య: నా వయసు 40 ఏళ్లు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. కంప్యూటర్‌ మీద కనీసం 9-10 గంటలు పనిచేస్తాను. నేను ఎక్కువసేపు కీబోర్డు మీద టైపు చేసినా, మౌస్‌ను ఎక్కువసేపు కదిలిస్తున్నా మునివేళ్లు నొప్పి పుడుతుంటాయి. మొదట్లో కుడి చేయి చూపుడు వేలుకే నొప్పి వచ్చేది. క్రమంగా అన్ని వేళ్లకూ విస్తరించింది. ఒకోసారి నొప్పి సూదులతో పొడుస్తున్నట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు రెండు చేతుల్లో కీళ్లనొప్పులు కూడా వస్తుంటాయి. అలాగే తరచుగా మడమలు, మోకాళ్లు, భుజాల నొప్పులు కూడా వేధిస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి పరిష్కారమేంటి?

-ఎ. వీరేందర్‌, నల్లగొండ

సలహా: మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే ‘కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌’ మాదిరిగా అనిపిస్తోంది. కీబోర్డు, మౌస్‌తో ఒకేరకమైన కదలికలతో కూడిన పనులను ఎక్కువసేపు, తరచుగా చేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల వంటి వారిలో ఇది ఎక్కువగా కనబడుతుంది. ఇలాంటి పనులు చేసేవారిలో మణికట్టు ముందుకు వంగి పోతుండటం, వేళ్లు అదేపనిగా కదులుతూ ఉండటం సమస్యకు దారితీస్తుంది. మన చేతి ఎముకల్లో చిన్న సొరంగం లాంటిది ఉంటుంది. దీన్నే కార్పెల్‌ టన్నెల్‌ అంటారు. కీలకమైన మీడియన్‌ నాడి దీని గుండానే అరచేతిలోకి వస్తుంది. ఈ సొరంగంలో పీడనం పెరిగితే.. నాడి నొక్కుకుపోయి సమస్య మొదలవుతుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. కంప్యూటర్‌ కీబోర్డు మీద తరచూ వేగంగా వేళ్లను కదిలించటం వల్ల సైనోవియం పొర మందంగా తయారు కావటం కూడా దీనికి కారణం కావొచ్చు. దీంతో మణికట్టు, వేళ్లు నొప్పి పుట్టటం, మొద్దుబారటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. మణికట్టు దగ్గర మీడియన్‌ నాడిని కొద్దిగా నొక్కితే ఈ లక్షణాలు వెంటనే తీవ్రమవుతుంటాయి కూడా. సమస్యను గుర్తించటానికి ఇది తేలికైన పరీక్ష. అవసరమైతే నాడుల పనితీరును తెలిపే పరీక్ష చేయాల్సి ఉంటుంది. కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌తో బాధపడేవారికి వేళ్లను, మణికట్టును సాగదీసే వ్యాయామాలతో మంచి ఉపశమనం లభిస్తుంది. వీటితో ఫలితం కనబడకపోతే నొప్పి నివారణ మందుల వంటివి ఉపయోగపడతాయి. అవసరమైతే మణికట్టు దగ్గరి సొరంగంలోకి ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. వీటితో ఎలాంటి ఫలితమూ కనబడకపోతే చివరి ప్రయత్నంగానే సర్జరీ చేయాల్సిన అవసరముంటుంది. దీంతో సమస్య పూర్తిగా తగ్గుతుంది. మీరు మోకీళ్ల నొప్పులు, మడమల నొప్పులని కూడా అంటున్నారు కాబట్టి కీళ్లవాతం (రుమటాయిడ్‌) సమస్య ఏదైనా ఉందేమో కూడా చూసుకోవాలి. ఎందుకంటే కీళ్లవాతం, ఆర్థ్రయిటిస్‌ వంటి సమస్యలూ కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌కు దారితీయొచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఎముకల నిపుణులను, కీళ్లవాతం నిపుణులను సంప్రతించటం మంచిది. అప్పుడే సమస్యను కచ్చితంగా నిర్ధరించి చికిత్స చేయటానికి వీలుంటుంది.

 
మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ 
ఈనాడు ప్రధాన కార్యాలయం, 
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email:  sukhi@eenadu.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు