Published : 21 Aug 2018 01:49 IST

పసి తుంటి పదిలమేనా?

పసి తుంటి పదిలమేనా?

ముకల సమస్యలు అనగానే చాలామంది అదేదో పెద్దల వ్యవహారంగానే భావిస్తుంటారు. నిజానికి పిల్లల్లో ఎముకల సమస్యలు తక్కువేమీ కాదు. ఎదుగుతున్న వయసులో వేధించే పలు ఎముకల సమస్యలకు బాల్యంలోనే బీజం పడుతుంది. కానీ మనదగ్గర వీటిపై అంతగా అవగాహన ఉండటం లేదు. దీంతో సమస్యను తొలిదశలో గుర్తించలేకపోతున్నారు. బాగా ముదిరిన తర్వాతే ఆసుపత్రులకు తీసుకువస్తున్నారు. దీంతో సమస్య జటిలమై, గోటితో పోయేది గొడ్డలి దాకా వస్తోంది. పిల్లల్లో ఎముకల సమస్యలు రకరకాలుగా ఉండొచ్చు. కొన్ని పుట్టుకతోనే మొదలైతే.. కొన్ని ఆ తర్వాత ఆరంభం కావొచ్చు. పుట్టుకతో వచ్చే ఎముకల సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తుంటిలో బంతి-గిన్నె కీలు (బాల్‌-సాకెట్‌ జాయింట్‌) తొలగిపోవటం. దీన్నే డెవలప్‌మెంటల్‌ డిస్‌ప్లేసియా ఆఫ్‌ హిప్‌ (డీడీహెచ్‌) అంటారు. నిజానికి దీన్ని తొలిదశలోనే గుర్తిస్తే తేలికగా సరిదిద్దొచ్చు. ఆలస్యమైతే సమస్య ముదిరిపోతుంది. అప్పుడు పెద్ద సర్జరీ చేయాల్సి వస్తుంది. పిల్లల్లో తుంటి కీలు జారిపోవటాన్ని విదేశాల్లో సగటున 3 నెలల్లోపే గుర్తిస్తుండగా మనదేశంలో మాత్రం సగటున 23 నెలల వయసు వచ్చేంతవరకూ పట్టుకోలేకపోతుండటం గమనార్హం. సమస్యపై అవగాహన లేకపోవటమే కాదు.. గిన్నె నుంచి బంతి కీలు తొలగిపోయినా ఎముక అరిగిపోయేంతవరకూ ఎలాంటి నొప్పీ లేకపోవటం వంటివీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఏదైనా తేడా ఉన్నట్టు గుర్తించినా అదే తగ్గుతుందిలే అని నిర్లక్ష్యం చేసేవారు కొందరైతే.. దీనికి చికిత్స ఉందనే విషయం అసలే తెలియనివారు మరికొందరు. అసలు సమస్య కన్నా ఇవే ఎక్కువ హాని చేస్తున్నాయి.

ఏంటీ సమస్య?

 ఎముకల మధ్య ఇరుసులా కదులుతూ శరీర కదలికలు సాఫీగా సాగటానికి కీళ్లు ఎంతగానో తోడ్పడుతుంటాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మోకీళ్లు, తుంటికీళ్ల గురించే. ముఖ్యంగా తుంటికీళ్లు మన శరీర బరువును మోయటమే కాకుండా కాళ్లు ముందుకూ వెనక్కూ.. అటుపక్కకు ఇటుపక్కకు.. ఇలా అన్ని వైపులకూ తేలికగా కదలటానికి తోడ్పడుతుంటాయి. వీటికి తగ్గట్టుగానే తుంటికీలు నిర్మాణమూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఇది గిన్నెలో బంతిలా కదలాడుతుంటుంది. అందుకే దీన్ని బంతి-గిన్నె కీలు (బాల్‌-సాకెట్‌ జాయింట్‌) అనీ అంటారు. మన కటి ఎముక చివరి భాగాన గిన్నె మాదిరిగా లోతైన నిర్మాణం ఉంటుంది. తొడ ఎముక చివర్లో బంతి ఆకారంలో ఉండే కీలు ఈ బంతిలోనే కుదురుగా కూర్చుని.. కాలు అన్ని వైపులకు కదలటానికి తోడ్పడుతుంటుంది. ఈ నిర్మాణంలో ఎలాంటి తేడా వచ్చినా సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. డెవలప్‌మెంటల్‌ డిస్‌ప్లేసియా ఆఫ్‌ హిప్‌ (డీడీహెచ్‌) ఇలాంటి సమస్యే. ఇందులో గిన్నెలో కీలు కుదురుగా ఉండకుండా వెలుపలికి తొలగిపోతుంటుంది (డిస్‌లొకేషన్‌). కొందరికి బంతి కీలు గిన్నె లోపల ఉంటుంది గానీ స్థిరంగా ఉండదు (సబ్‌లక్సేషన్‌).

నిర్ధరణ ఎలా?

 తుంటికీలు స్థిరంగా ఉందా? లేదా? అన్నది తెలుసుకోవటానికి బార్లో, ఓర్టోలని పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. తొడలను పక్క వైపులకు సాగదీయటం ద్వారా బంతిలో గిన్నె కీలు స్థిరంగా ఉందా? ఎంతవరకు కదులుతోంది? అనేవి తెలుసుకోవచ్చు. అలాగే రెండు మోకాళ్లను ఒకదగ్గరికి తెచ్చి తొడ ఎముకను నెమ్మదిగా లాగినపుడు చప్పుడేమైనా వస్తుందేమో చూస్తారు. ‘క్లిక్‌’ మనే చప్పుడు వస్తుంటే కీలు తొలగి ఉండొచ్చని అనుమానిస్తారు. అవసరమైతే ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేస్తారు. వీటితో సమస్యను కచ్చితంగా నిర్ధరించొచ్చు. 3 నెలల లోపు పిల్లలకు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయటమే మంచిది.

ఎందుకు వస్తుంది?

 పుట్టుకతోనే తలెత్తే ఈ సమస్య ప్రతి వెయ్యి కాన్పుల్లో 1-3 మంది పిల్లల్లో కనబడుతుంటుంది. దీనికి కారణాలేంటో కచ్చితంగా తెలియదు. కానీ ఇందుకు కొన్ని అంశాలు దోహదం చేస్తుండొచ్చు.

ఎదురుకాళ్లతో పుట్టటం: ఎదురుకాళ్లతో పుట్టిన పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. సిజేరియన్‌ కాన్పు అయినా మామూలు కాన్పు అయినా కూడా ఎదురుకాళ్లతో ఉన్న పిల్లలకు తుంటి కీలు తొలగిపోయే ముప్పు 10 రెట్లు అధికం కావటం గమనార్హం. ముఖ్యంగా గర్భంలో మోకాళ్లు పైకి చాచుకొని, పాదాలు తల వద్ద ఉండే (ఫ్రాంక్‌ బ్రీచ్‌) పిల్లలకు దీని ముప్పు మరింత ఎక్కువ.

తల్లి హార్మోన్లు: కాన్పు తేలికగా కావటానికి కండర బంధనాలు (లిగమెంట్లు) వదులయ్యేందుకు గర్భిణుల్లో కొన్ని హార్మోన్లు విడుదలవుతుంటాయి. ఇవి శిశువులో తుంటి భాగాన్ని మృదువుగా, సాగేలా చేస్తాయి. ఇదీ కొందరిలో కీలు సమస్యకు దారితీయొచ్చు.

గర్భసంచి ఇరుకు: పిండం కదలటానికి గర్భసంచిలో తగినంత స్థలం లేకపోవటం మూలంగా తుంటికీలు తొలగిపోయే అవకాశముంది. సాధారణంగా తొలి సంతానంలో.. అదీ ఆడపిల్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా చూస్తుంటాం. గర్భసంచిలో ఉమ్మనీరు తగ్గటమూ దీనికి కారణం కావొచ్చు.

గట్టిగా చుట్టటం: పుట్టిన తర్వాత కొందరు పిల్లలను కాళ్లను, చేతులను పొట్ట మీద పెట్టి బట్టతో గట్టిగా చుట్టిపెడుతుంటారు (స్వాడ్లింగ్‌). ముఖ్యంగా తుంటి భాగంలో కాళ్లు కదలటానికి వీల్లేకుండా బట్టను చుట్టిపెడితే తుంటి, మోకీళ్లు వెలుపలికి వంగిపోయి కీలు తొలగిపోవచ్చు.

సెరిబ్రల్‌ పాల్సీ పిల్లల్లోనూ..

  మెదడు దెబ్బతినటం వల్ల తలెత్తే సెరిబ్రల్‌ పాల్సీ సమస్యతో బాధపడే పిల్లల్లో కొందరు చక్రాల కుర్చీకే పరిమితమై పోతుంటారు. ఇలాంటివారికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి తుంటి ఎక్స్‌రే తీయటం మంచిది. ఎందుకంటే వీరిలో 80% మందికి తుంటి కీలు తొలగిపోయే అవకాశముంది. దీన్ని ముందుగానే గుర్తిస్తే తేలికైన చికిత్సలతోనే సరిదిద్దొచ్చు. లేకపోతే పెద్ద ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. కీలు మీది మృదులాస్థి  క్షీణిస్తే సర్జరీ చేసినా ఫలితం ఉండకపోవచ్చు. సమస్య స్వల్పంగా ఉంటే గజ్జల్లో అడక్టర్‌ కండరాన్ని వదులు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. అదే సమస్య కాస్త తీవ్రంగా ఉంటే ఎముకను కాస్త తొలగించి మరమ్మతు చేయాల్సి వస్తుంది. పూర్తిగా తుంటి ఎముక తొలగిపోతే కీలును మరమ్మతు చేయాల్సి వస్తుంది. దీంతో ఇలాంటి పిల్లలను తిరిగి నడిపించలేకపోవచ్చు గానీ చక్రాల కుర్చీలో నొప్పి లేకుండా హయిగా కూచునేలా చూడొచ్చు. ఒకప్పుడు నడిచి తర్వాత చక్రాల కుర్చీకి పరిమితమైనవారు తిరిగి నడవటానికీ వీలవుతుంది. అలాగే వెన్నెముక వంకర పోకుండా చూసుకోవచ్చు కూడా.

లక్షణాలేంటి?

 తుంటి కీలు తొలగిపోవటం సాధారణంగా ఒకవైపునే వస్తుంటుంది. అదీ ఎడమ వైపునే ఎక్కువ. కుడివైపున రావటం అరుదు. కొందరికి రెండు తుంటి కీళ్లూ తొలగిపోయి ఉండొచ్చు. సుమారు 25-30% మంది ఇలాంటివాళ్లు కనబడుతుంటారు. దీన్ని గుర్తించటానికి కొన్ని లక్షణాలు బాగా ఉపయోగపడతాయి.

* పుట్టిన తర్వాత కాళ్లను కదిలించినపుడు ‘క్లిక్‌’ మని చప్పుడు రావటం.
* ఒక కాలు పొట్టిగా ఒక కాలు పొడవుగా ఉండటం. ముఖ్యంగా కీలు తొలగిన కాలు పొట్టిగా ఉంటుంది.
* తొడలు, పిరుదుల వద్ద ఏర్పడే మడతలు రెండు వైపులా ఒకేలా లేకపోవటం.
* మూడు నెలల తర్వాత తుంటి కదలికలు వేర్వేరుగా ఉండటం.
* తుంటి అస్తవ్యస్త కదలికల మూలంగా కాస్త పెద్ద పిల్లల్లో వెన్నెముక వంకర పోవటం.
* పెద్ద పిల్లలు నడుస్తున్నప్పుడు కుంటటం.

చికిత్స మార్గాలేంటి?

 సమస్య స్వల్పంగా ఉంటే పుట్టిన తర్వాత కొద్దిరోజుల్లో దానంతటదే కుదురుకుంటుంది. కానీ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు చికిత్స తప్పనిసరి. 3, 4 నెలల వయసులో సమస్యను గుర్తిస్తే పట్టీలను అమర్చటం ద్వారా తేలికగా సరిచేయొచ్చు. తొడలను వెడల్పుగా చేసి.. తుంటి భాగం స్థిరంగా ఉండేలా చేసే ఈ పట్టీలతో 6-8 వారాల్లో కీలు తిరిగి కుదురుకుంటుంది. పట్టీల మూలంగా శిశువు ఎదుగుతున్నకొద్దీ తుంటి కీలు సరిగా వృద్ధి చెందుతుంది. 90% వరకు దీంతోనే నయమైపోతుంది. అయితే 6 నెలలు దాటిన పిల్లలకు పట్టీలతో అంతగా ప్రయోజనం ఉండదు. కాబట్టి సమస్యను వీలైనంత త్వరగా గుర్తించటం చాలా కీలకం. పట్టీలతో సమస్య కుదురుకోకపోయినా, సమస్య ముదిరినా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఏడాదిన్నర లోపు పిల్లలైతే మత్తు మందు ఇచ్చి గిన్నెలోకి బంతికీలు కుదురుకునేలా నెట్టి.. పట్టీలు వేస్తారు. దీంతో 3-4 నెలల్లో ఎముక సరైన స్థానంలో కుదురుకుంటుంది. అప్పటికీ ఫలితం కనబడకపోతే పెద్ద సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇందులో తుంటి చుట్టూ బిగుతుగా ఉన్న కండరాలను వదులు చేసి, బంతి కీలును గిన్నెలో అమర్చి.. తిరిగి కండరాలను బిగుతుగా చేస్తారు. ఇది 18 నెలలు దాటిన పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. గిన్నెలో బంతి కీలు లేకపోతే గిన్నెలోపల ఆకారం సరిగా వృద్ధి చెందదు. కీలు ఆకారాన్ని బట్టి గిన్నె కీలు కూడా తయారవుతుంది. ఒకవేళ తుంటి కీలు బయట ఉండిపోతుంటే లోపల లోతు తగ్గుతుంది. అప్పుడు తుంటి కీలు పైభాగాన కాస్త కత్తిరించాల్సి ఉంటుంది కూడా. అందువల్ల అవసరమైతే పిల్లలకు 2, 3 ఏళ్లు వచ్చాక గిన్నె కీలు లోతును వెడల్పు చేయటానికి.. లేదా తొడ ఎముకను కత్తిరించటానికి, దాన్ని సరైన స్థానంలో ఉంచటానికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సమస్యను త్వరగా గుర్తిస్తే ఈ సర్జరీని కూడా తేలికగానే చేయొచ్చు. అదే 3, 4 ఏళ్లలో చేయాలంటే కాస్త కష్టమనే చెప్పుకోవాలి. సర్జరీ పూర్తయ్యాక 3 నెలల పాటు పట్టీలు ధరించాల్సి ఉంటుంది. దీంతో 90% మందికి సమస్య పూర్తిగా నయమైపోతుంది. కొందరికి మాత్రం సమస్య మళ్లీ తిరగబెట్టొచ్చు.

ముందే అనుమానించొచ్చా?

 తుంటి కీలు తొలగిపోయే ముప్పు కారకాలు గలవారిని నిశితంగా గమనిస్తే సమస్యను ముందే పట్టుకోవచ్చు. తొలిచూరు పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు దీని ముప్పు ఎక్కువ. తుంటికీలు తొలగిపోయిన ప్రతి 10 మంది పిల్లల్లో  ఆరుగురు తొలి కాన్పులో పుడుతున్నవారే. అలాగే ప్రతి 10 మంది పిల్లల్లో 8 మంది బాలికలే ఉంటున్నారు. కుటుంబంలో ఎవరైనా ఇలాంటి సమస్య బారినపడి ఉన్నా దీని ముప్పు 12% పెరుగుతుంది. అందువల్ల తొలిచూరు పిల్లలు, ఆడపిల్లలు, కుటుంబ చరిత్ర గలవారి విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. తుంటి కదలికల్లో ఎలాంటి తేడా కనబడినా ఎముకల నిపుణులను సంప్రతించటం మంచిది.

మాతృభూమిపై మమకారం

 డాక్టర్‌ కిశోర్‌ మూల్పూరి ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గానూ, బ్రిటిష్‌ కొలంబియా చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గానూ పనిచేస్తున్నారు. అక్కడ ఒక పరిశోధనా విభాగానికీ నేతృత్వం వహిస్తున్న ఆయన ఇప్పటివరకు 100కు పైగా పరిశోధన పత్రాలను సమర్పించారు. ‘ఇంటర్నేషనల్‌ హిప్‌ డిస్‌ప్లేసియా ఇన్‌స్టిట్యూట్‌’కు రీసెర్చ్‌ డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు. కెనడియన్‌ ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌, ఫౌండేషన్‌ల నుంచి ప్రెసిడెన్షియల్‌ అవార్డు, సామ్‌సన్‌ అవార్డులూ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో జన్మించిన ఆయన ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసమంతా విజయవాడలోనే సాగింది. మణిపాల్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ ఆర్థోపెడిక్‌ పూర్తిచేసి.. అనంతరం ఆస్ట్రేలియాలో పీడియాట్రిక్‌ ఆర్థోపెడిక్‌, స్పోర్ట్స్‌ వైద్యంలో ఫెలోషిప్‌ చేశారు. తర్వాత ఫెలోషిప్‌ కోసం కెనడాకు వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు. పిల్లల్లో తుంటి సమస్యలు, సెరిబ్రల్‌ పాల్సీ సంబంధ సమస్యలపై విశేషంగా కృషి చేస్తున్న ఆయన మాతృభూమిపై మమకారంతో ఏటా రెండు సార్లు ఇక్కడికి వచ్చి.. పిల్లలకు ఉచితంగానూ సర్జరీలు నిర్వహిస్తుంటారు.

 

ఏది ఎక్కడ, ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అప్పుడే ఏ పనైనా సజావుగా, సవ్యంగా సాగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా వ్యవస్థ గాడి తప్పిపోతుంది. ఇది మన తుంటిలోని ‘బంతి-గిన్నె’ కీళ్లకూ వర్తిస్తుంది. శరీర బరువును మోసేవీ.. కాళ్లు ముందుకూ వెనక్కూ.. పక్కలకూ కదిలేలా చేసేవీ ఇవే. అందుకే వీటికి చిన్నపాటి సమస్య వచ్చినా శరీరం మొత్తం కుదేలవుతుంది. అలాంటిది అభం శుభం తెలియని పసిపిల్లల తుంటికీళ్లకు సమస్య వస్తే? ఎన్నెన్నో చిక్కులను తెచ్చిపెడుతుంది. కాబట్టే ఇలాంటి సమస్యలపై విశేషంగా దృష్టి పెట్టారు డాక్టర్‌ కిశోర్‌ మూల్పూరి. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ఇటీవల హైద్రాబాద్‌కు వచ్చినపుడు ‘సుఖీభవ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పుట్టుకతో పిల్లల్లో తుంటి కీలు తొలగిపోవటం (డెవలప్‌మెంటల్‌ డిస్‌ప్లేసియా ఆఫ్‌ హిప్‌- డీడీహెచ్‌), సెరిబ్రల్‌ పాల్సీలో తుంటి ఎముక తొలగిపోవటం గురించి సమగ్రంగా వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు