Published : 11 Sep 2018 02:09 IST

పక్కాగా పసిడిబాట

పక్కాగా పసిడిబాట
ఇది జాతీయ పోషణ మాసం

మన జీవన భవనానికి బాల్యమే పునాది. శారీరక దృఢత్వమే కావొచ్చు.. తెలివితేటలే కావొచ్చు.. అన్నింటికీ తొలి మెట్టు ఇదే! ముఖ్యంగా తొలి వెయ్యి రోజులు మరింత కీలకం! రోగనిరోధకశక్తి పెంపొందటానికి, పెద్దయ్యాక వచ్చే పలు జబ్బులకు బీజం పడేది ఇక్కడే! అతి సున్నితమైన, అతి సంక్లిష్టమైన ఈ సమయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా దాని పర్యవసానాలు జీవితాంతం వెంటాడతాయి. కాబట్టి పుట్టినప్పట్నుంచీ.. ఆ మాటకొస్తే గర్భధారణకు ముందు నుంచే.. జాగరూకతతో వ్యవహరించటం అత్యవసరం. అప్పుడే మనం మంచి బలవంతులైన, సృజనశీలురైన పౌరులను సృష్టించగలం. అందుకే ‘జాతీయ పోషణ మాసం’ కూడా బిడ్డ జీవితంలో తొలి వెయ్యిరోజులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని గట్టిగా నొక్కిచెబుతోంది. ఈ నేపథ్యంలో సంపూర్ణ మానవ వికాసం కోసం తొలి వెయ్యిరోజులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో అన్న దానిపై సమగ్ర కథనం అందిస్తోంది ఈ వారం సుఖీభవ!

ప్రతి బిడ్డా అమూల్యమే! తల్లి కడుపులో చిన్న నలుసుగా ప్రాణం పోసుకొని.. తల్లి జవజీవాలను వినియోగించుకుంటూ.. కొత్త కొత్త అవయవాలను కూడదీసుకుంటూ.. నవమాసాల తర్వాత బయటకు అడుగుపెట్టే ప్రతి శిశువూ అద్భుతవరమే!! కాబట్టే ప్రతి మహిళా గర్భధారణను ఓ మరపురాని ఘట్టంగానే భావిస్తుంది. తన కలల ప్రతిరూపమైన పాపాయి దినదిన ప్రవర్ధమానమవుతూ.. బోర్లాపడుతూ.. పాకుతూ.. బుడిబుడి అడుగులతో ఇల్లంతా సందడి చేస్తుంటే స్వర్గమే దిగివచ్చినంతగా సంబరపడిపోతుంది. తల్లిదండ్రులు తమకు తాము ఇచ్చుకునే, ప్రపంచానికి అందించే అత్యుత్తమ బహుమతి కూడా ఇదే. ఇంతటి అమూల్యమైన, అద్భుతమైన వరాన్ని, బహుమతిని కలకాలం కాపాడుకోవటానికి.. ‘పసి’డి రాగంలో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా ఉండటానికి నిరంతర అప్రమత్తత అవసరం. తొలి వెయ్యి రోజులు.. అంటే కడుపులో నలుసు పడ్డప్పట్నుంచీ (270 రోజులు).. పుట్టిన తర్వాత తొలి ఏడాది (365 రోజులు)... రెండో ఏడాది (365 రోజులు) నిండేంత వరకూ ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. ఇక్కడ ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి. కాబట్టి బిడ్డకు తగినంత పోషణ లభించేలా చూసుకోవటం దగ్గర్నుంచి.. ఎప్పటికప్పుడు మానసిక వికాసాన్ని ప్రేరేపిస్తుండటం, నైతిక విలువలకు పునాది వేయటం వరకూ ప్రతి అడుగునూ ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఇది తల్లిదండ్రులందరి బాధ్యత, కర్తవ్యం కూడా. అప్పుడే మనం శారీరకంగా, మానసికంగా సర్వసన్నద్ధులైన ‘స్మార్ట్‌కిడ్స్‌’ను తయారుచేయగలం. సామాజిక స్పృహ, క్రియాశీలత, సృజనాత్మకతతో నిండిన సమాజానికి బాటలు వేయగలం. ‘లక్ష్య-సహస్ర’ ఉద్దేశం కూడా అదే.

ప్రతి క్షణమూ కీలకమే!  

తొలి వెయ్యిరోజుల్లో ప్రతి క్షణమూ కీలకమే. శరీర ఎదుగుదల శరవేగంగా సాగేది, అవయవాలు పరిపక్వం చెందేది, మేధోశక్తి రూపుదిద్దుకునేది, రక్షణ వ్యవస్థ పెరిగేది ఈ సమయంలోనే. గర్భంలో మొదటి 3 నెలల్లోనే గుండె, మెదడు, కిడ్నీలు, కాలేయం, కాళ్లు, చేతుల వంటి అవయవాలన్నీ ఒక రూపునకు వస్తాయి. ఇక రెండో త్రైమాసికాన్ని బంగారు కాలమని చెప్పుకోవచ్చు. బిడ్డ కదలికలను తల్లి ఆస్వాదించటం ఆరంభించేది ఇప్పుడే. బిడ్డ కాళ్లు చేతులు కదిలిస్తూ లోపల కొడుతూ, తంతూ సుతారంగా కదులుతుంటుంది. భావాలను ప్రదర్శించటమూ మొదలెడుతుంది. మూడో త్రైమాసికంలో అవయవాలు చాలా వేగంగా వృద్ధి చెందుతుంటాయి. గర్భధారణ మొదలైనప్పుడు కంటికి కనిపించనంత చిన్న నలుసుగా ఉండే శిశువు కాన్పయ్యేసరికి సుమారు 50 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. తొలి ఏడాదిలో 75 సెంటీమీటర్లు, రెండో సంవత్సరం వచ్చేసరికి 87 సెంటీమీటర్ల పొడవు అవుతుంది. బరువు కూడా గణనీయంగా పెరుగుతుంది. కాన్పు సమయంలో సుమారు 3 కిలోల బరువుండే శిశువు.. 5 నెలల్లోనే రెట్టింపు బరువు పెరుగుతుంది. సంవత్సరానికి మూడింతలు, రెండేళ్లకు నాలుగింతల బరువు పెరుగుతుంది. తొలి వెయ్యిరోజుల్లో ఎదిగినంత వేగంగా మన శరీరం మరే దశలోనూ వృద్ధి చెందదు. మెదడు శరవేగంగా వృద్ధి చెందేది, నాడీ కణాల మధ్య కొత్త కొత్త అనుసంధానాలు పెద్దమొత్తంలో ఏర్పడేది కూడా ఈ సమయంలోనే.  అంతేకాదు.. పెద్దయ్యాక వచ్చే రక్తపోటు, మధుమేహం, అలర్జీలు, కిడ్నీ జబ్బులు, ఆస్థమా, క్యాన్సర్ల వంటి పలు జబ్బులకూ ఇక్కడే బీజం పడుతుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడే శిశువు ఎదుగుదల, లభించే పోషణను బట్టే జీవనకాలం, జబ్బులు నిర్ధరణ అయిపోతాయి! ఎంత తక్కువ బరువుతో పుడితే అంత ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశముంటుంది. కాబట్టి అవగాహనతోనే సంతానాన్ని కనాలి, అవగాహనతోనే పెంచాలి. తొలి వెయ్యిరోజులను సద్వినియోగం చేసుకోగలిగితే బిడ్డ వందేళ్ల జీవితాన్ని గాడిలో పెట్టినట్టే. ఎలాంటి కష్టనష్టాలు లేకుండా జీవితం సాఫీగా సాగటానికి బాటలు పరచినట్టే. లేకపోతే అనుక్షణం డక్కామొక్కీలు తినక తప్పదు.

గర్భధారణకు ముందు నుంచే..

శిశు పోషణ, సంరక్షణ అనేది గర్భధారణకు ముందు నుంచే ఆరంభం కావాలి. ఎందుకంటే తల్లికి తెలియకముందే గర్భధారణ జరిగిపోతుంది. దీనిపై తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం.. కుటుంబ వాతావరణం వంటివన్నీ ప్రభావం చూపుతాయని తెలుసుకోవాలి. గర్భధారణ అనేది దంపతులు ఇష్టపూర్వకంగా ఎంచుకున్నదే కానీ యాదృచ్ఛిక వ్యవహారంగా భావించకూడదు (బై ఛాయిస్‌ నాట్‌ బై ఛాన్స్‌). శారీరకంగా, మానసికంగా అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఇంట్లో గొడవలేవీ లేని.. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలేవైనా ఉన్నాయేమో ముందుగానే పరీక్షించుకోవాలి. ఆ తర్వాతే గర్భధారణకు ప్రయత్నించాలి. గర్భధారణకు ప్రయత్నించటానికి 3 నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకోవాలి. దీంతో పిల్లల్లో అవయవలోపాలు తలెత్తకుండా చూసుకోవచ్చు. అలాగే ఎక్కువగా కాఫీలు, టీలు, కూల్‌డ్రింకులు తాగొద్దు. జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ఎక్కువ ఉప్పు, ఎక్కువ తీపి తినొద్దు. పురుగుమందులు, కాలుష్యం, జెట్‌ కాయిల్స్‌ వంటి విషతుల్య రసాయనాల ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఇలా గర్భధారణకు ముందు నుంచే సన్నద్ధం కావటం అన్నివిధాలా మంచిది.

తిండి ఒక్కటే కాదు..  

పుట్టుకతో వచ్చే జబ్బులు, సమస్యల్లో తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువుల ప్రభావం 20 శాతమే. మన చుట్టూరా ఉండే వాతావరణమే 80% మేరకు ప్రభావం చూపుతుంది. తినే తిండి, ఎదుర్కొనే ఒత్తిడి, కాలుష్యం, పొగ, మద్యం అలవాట్ల వంటి అంశాలే వీటిని ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాయి. కాబట్టి గర్భిణులకు సమతులాహారం ఒక్కటే సరిపోదు. ఇతరత్రా అంశాలపైనా దృష్టి పెట్టాలి.

* రాత్రి పూట 8 గంటలు, పగటిపూట 2 గంటల సేపు నిద్రపోవాలి. ఎడమవైపునకు తిరిగి పడుకుంటే బిడ్డకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
* మానసిక ఒత్తిడితో నెలలు నిండకముందే కాన్పు కావటం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ముప్పు పెరుగుతుంది. మెదడు ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇందుకు కుటుంబ తోడ్పాటు అవసరం. శిశువు తల్లి కడుపులో ఉండగానే  12 వారాల నుంచి స్పర్శ అనుభవించగలదు. 13 వారాల నుంచి వినగలదు, 14 వారాల నుంచి రుచి, వాసన గ్రహించగలదు. తల్లి భావాలను గ్రహిస్తూ.. వాటిని పెంపొందించుకునే జ్ఞాపకశక్తిని కూడా సంతరించుకుంటుంది. కాబట్టి గర్భం ధరించాక 3, 4 నెలల నుంచే తల్లి తన కడుపును చేతులతో సుతారంగా నిమురుకోవాలి. బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడాలి. మంచి సంగీతం వినాలి. మంచి కథలు చదవాలి. చూసే దృశ్యాలు కూడా ఆహ్లాదకరంగా, ఉండాలి. దీంతో శిశువు మెదడు బాగా ఎదుగుతుంది. కాన్పు సమయంలోనూ జాగ్రత్తలు అవసరం. తల్లి ఒత్తిడికి గురైతే కాన్పు సరిగా కాదు. కొన్నిసార్లు సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది కూడా. కాబట్టి ప్రశాంత వాతావరణంలో కాన్పయ్యేలా చూసుకోవాలి. గర్భిణికి తెలిసినవాళ్లు, ఇంటివాళ్లు ఒకరు వెంట ఉండాలి. భర్త తోడుండే ఇంకా మంచిది. దీంతో భయం తొలగిపోయి భద్రత భావం, ధైర్యం కలుగుతాయి.

తొలి గంట.. తొలి రోజు..

  కాన్పు అయ్యాక తొలి రోజు.. అదీ తొలి గంట చాలా కీలకం. కాన్పయిన వెంటనే ముందే వేడి చేసి పెట్టుకున్న గుడ్డతో బిడ్డను శుభ్రంగా తుడవాలి. బొడ్డుతాడు కత్తిరించకముందే బిడ్డను తల్లి చేతులకు అందించాలి. దీంతో బిడ్డ మెదడులో సానుకూల భావాలు మొలకెత్తుతాయి. తల్లీ బిడ్డల మధ్య ఆత్మీయమైన బంధం ఏర్పడుతుంది. ఒకట్రెండు నిమిషాల తర్వాత బొడ్డుతాడును కత్తిరించాలి. దీంతో వీలైనంత ఎక్కువ రక్తం బిడ్డకు చేరుకుంటుంది. తర్వాత తల్లి ఛాతీ మీద బిడ్డను పడుకోబెట్టి రొమ్మును నోటికి తాకించాలి. వీలైతే బిడ్డతో తల్లి మాట్లాడాలి కూడా. మెదడు సరిగా వృద్ధి చెందటానికివన్నీ ఉపయోగపడతాయి. పుట్టిన తర్వాత దాదాపు గంటవరకు బిడ్డ చాలా చురుకుగా ఉంటుంది. ఆ తర్వాత నిద్రపోతుంది. కాబట్టి బిడ్డ చురుకుగా ఉన్న సమయంలోనే తల్లి బిడ్డను తాకటం, రొమ్ము పట్టటం వంటి పనులన్నీ పూర్తి కావాలి.

* శిశువుకు ముర్రుపాలు అమృత సమానమే! ఇవి జీవితం మొత్తానికి రక్షణనిస్తాయి. ఇదే బిడ్డకు అత్యుత్తమమైన బీమా. మొదటి టీకా! ఇది జబ్బులు మాత్రమే కాదు.. అలర్జీలు, క్యాన్సర్ల వంటివి రాకుండానూ కాపాడుతుంది. పుట్టిన వెంటనే పాలు సరిగా రావు కదా అని అనుకోవద్దు. పాప పుట్టినపుడు జీర్ణాశయం చిన్న రేగు పండంతే ఉంటుంది. ఒక ఎంఎల్‌ ముర్రుపాలు తాగినా చాలు. మూడు రోజులకు పాప జీర్ణాశయం ఉసిరికాయంత అవుతుంది. పది రోజులకు నిమ్మకాయంత, రెండు వారాలకు గుడ్డంత అవుతుంది. కాబట్టి పాలు సరిపోవని అనుకోవద్దు. 5-10 ఎంఎల్‌ పాలు వచ్చినా బిడ్డ కడుపు నిండుతుందని తెలుసుకోవాలి. ప్రతి బిడ్డకు ముర్రుపాలు, తల్లిపాలు తాగే హక్కుందని.. తల్లికి ఇచ్చే బాధ్యత ఉందని గుర్తించాలి. తల్లిపాలు పట్టటం ద్వారా లభించే మరో ప్రయోజనం గర్భాశయం తిరిగి మామూలు స్థాయికి చేరుకోవటం. బిడ్డ రొమ్ము పట్టగానే తల్లి మెదడు నుంచి సంకేతాలు వెలువడి ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది పాలు పడటానికే కాకుండా గర్భాశయం సంకోచించటానికీ తోడ్పడుతుంది. ఇది సంకోచించకపోతే రక్తస్రావం అవుతూనే ఉంటుంది. చాలా మాతృ మరణాలకు రక్తస్రావమే ప్రధాన కారణం కావటం గమనార్హం.

గర్భం ధరించాక.. 

ఒక్క ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రమే కాదు. అయోడిన్‌, ఐరన్‌, విటమిన్‌ బి12, విటమిన్‌ డి వంటివన్నీ బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి గర్భం ధరించిన తర్వాత కూడా 3 నెలల పాటు ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకోవాలి. అయోడిన్‌ కలిపిన ఉప్పునే వాడుకోవాలి. మనదేశంలో 70% మంది స్త్రీలు ఐరన్‌ లోపంతో బాధపడుతున్నవారే. ఇది రక్తహీనత స్థాయికి చేరకముందు నుంచే కొన్ని సమస్యలకు దారితీయొచ్చు. జీవక్రియల వేగం మందగించటం దగ్గర్నుంచి.. మెదడులో రసాయనిక ప్రక్రియలు, నాడీ సమాచార వాహికలు, నాడీ కణాల సైజు, వాటి చివర్ల పొడవు, అనుసంధానాల తీరుతెన్నులన్నీ దెబ్బతినొచ్చు. బిడ్డ మెదడులో తొలి వెయ్యిరోజుల్లోనే సుమారు 3 లక్షల కోట్ల అనుసంధానాలు ఏర్పడతాయి. ఐరన్‌ లోపిస్తే ఇవన్నీ కుంటుపడతాయి. అందువల్ల ఐరన్‌ లోపం తలెత్తకుండా ఆకుకూరలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, బెల్లం, మాంసం వంటివి సమృద్ధిగా తీసుకోవాలి. కణ విభజనకు, మెదడు ఎదుగుదలకు విటమిన్‌ బి12 అత్యవసరం. శాకాహారుల్లో బి12 లోపం ఎక్కువ. కాబట్టి శాకాహారులు పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. తల్లికి విటమిన్‌ డి లోపం ఉంటే అది బిడ్డకూ వస్తుంది. దీంతో కండరాలు, ఎముకలు, మెదడు ఎదుగుదల కుంటుపడుతుంది. అందువల్ల రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి. చేపలు, గుడ్డు, పాలు వంటి వాటితోనూ కొంతవరకు అందుతుంది. మెదడు పెరగటానికి, నాడీ కణాల ఎదుగుదలకు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ముఖ్యం. తవుడు నూనె, అక్రోట్లు, చేపలు, అవిసె గింజల వంటి వాటిల్లో ఇవి దండిగా ఉంటాయి.

 

ఐదు సార్లు తినాలి

* గర్భిణులు మూడు పూటలా భోజనం చేయాలి. రెండు సార్లు అల్పాహారం తీసుకోవాలి. ఇలా రోజుకు ఐదుసార్లు తినాలి. 2 కప్పుల అన్నం లేదా నాలుగు చపాతీలతో పాటు పోషకాల గనులైన కొర్రలు, సామల వంటి చిరుధాన్యాలనూ ఆహారంలో విధిగా చేర్చుకోవాలి. రోజూ 2 కప్పుల దుంపలు (బంగాళాదుంప, క్యారెట్‌, కంద వంటివి).. 2 గుడ్లు లేదా 2 కప్పుల పప్పుధాన్యాలు.. 2 కప్పుల పెరుగు.. 2 పండ్లు.. 2 కప్పుల ఆకుకూరలు, కూరగాయలు.. 2 రకాల నూనెలు (తవుడు నూనె, వేరుశనగ, కొబ్బరినూనె వంటివి మంచివి) ఉండేలా చూసుకోవాలి. అలాగే 2-3 లీటర్ల నీళ్లు తాగాలి.

మొదటి నెల.. మొదటి సంవత్సరం

పిల్లలకు తల్లిపాలను మించిన ఆహారం మరొకటి లేదు. ఆరు నెలల నిండేంతవరకు తల్లిపాలు తప్ప మరేదీ ఇవ్వకూడదు. తల్లిపాలతోనే బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. ఆర్నెళ్లు దాటాక తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలి. బియ్యం, జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రల వంటి వివిధ రకాల ధాన్యాలను వేయించి, పొడి చేసుకోవాలి. దీంతో ఉగ్గు వండి.. అందులో కాస్త నెయ్యి, బెల్లం కలిపి రోజూ తినిపించాలి. మార్కెట్లో దొరికే పొడులే మంచివనుకోవటం తగదు. అలాగే పండ్లను మెత్తగా చేసి తినిపించాలి. 9 నెలల తర్వాత ఇడ్లీ, కిచిడీ వంటి కాస్త గట్టిగా ఉండే ఆహారం అలవాటు చేయాలి. 9-12 నెలల్లో తల్లిదండ్రులు తినే పదార్థాలనే మెదిపి, మెత్తగా చేసి పెట్టాలి.ఏడాది దాటితే అమ్మానాన్న తినే పదార్థాలనే పిల్లలు తినేలా అలవాటు చేయాలి.

* ఏడాదిలోపు పిల్లలకు బర్రె పాలు, ఆవు పాలు, డబ్బా పాలు, డబ్బా తిండి ఇవ్వటం తగదు. ఇవి జబ్బులు తెచ్చిపెట్టే ప్రమాదముంది. వీటితో విరేచనాలు, న్యుమోనియా, జ్వరాలు, మరణాల వంటివి వచ్చే అవకాశం 10 రెట్లు ఎక్కువ.
* ఇక ఏడాది నుంచి రెండు సంవత్సరాలు నిండేంతవరకూ పగటి పూట ఆహారం ఇవ్వటంతో పాటు రాత్రిపూట తల్లిపాలు కూడా ఇవ్వాలి. కనీసం ఐదు సార్లు ఆహారం ఇవ్వాలి. తృణధాన్యాలు, పప్పు గుడ్డు మాంసం సోయా (మాంసకృత్తులు) ఇవ్వాలి. ఆహారంలో రెండు రకాల నూనెలు వాడుకోవాలి. రోజూ 2 కప్పులు ఆకుకూరలు, కూరగాయలు.. 2 పండ్లు ఇవ్వాలి. పాలతో పాటు పెరుగు తినిపించాలి. నీళ్లు తగినన్ని తాగించాలి. పిల్లలకూ ఇష్టాయిష్టాలుంటాయి. వారికి ఇష్టమైన పదార్థాలను వండి పెట్టాలి. పిల్లలు సరిగా తినరేమోననే బెంగ వద్దు. వారికి బలవంతంగా కుక్కి నోట్లో పెట్టొద్దు.

స్పందనల ప్రేరేపణా ముఖ్యమే

 పిల్లలకు తిండి పెడితే వాళ్లే పెరుగుతారనుకోవటం తప్పు. మెదడులో ప్రతిస్పందనలను, మంచి భావోద్వేగాలను ప్రేరేపించటం కూడా ముఖ్యమే. దీంతో మెదడు త్వరగా వృద్ధి చెందుతుంది. మేధో సామర్థ్యం పెంపొందుతుంది. ఆయా వయసులకు తగినట్టుగా పిల్లల మెదడులో స్పందనలను ప్రేరేపించేలా చూసుకోవాలి. ఆయా ఉపకరణాలు అందుబాటులో ఉంచాలి. ఇందుకు తల్లిదండ్రులు పిల్లలకు తగినంత సమయం కేటాయించాలి.

 

* పిల్లలకు రంగు రంగుల దృశ్యాలను చూపిస్తే మెదడులో వాటికి సంబంధించిన ప్రతిస్పందనలు వృద్ధి చెందుతాయి. శిశువులు మొదట గుర్తించేది ఆకుపచ్చ, ఎరుపు రంగులే. అందుకే మనవాళ్లు ఉయ్యాలకు రామచిలుక బొమ్మలను వేలాడదీసేవారు. అదీ కంటికి ఒక అడుగు దూరంలో ఉండేలా. ఎందుకంటే శిశువులు అడుగు దూరంలోని వస్తువులనే చూడగలుగుతారు. క్రమంగా దూరం వస్తువులు చూడటం అలవడుతుంది. అలాగే శ్రావ్యమైన సంగీతం, పాటలు, మంచి కథలు వినిపించాలి. నూనెతో ఒళ్లంతా సుతారంగా మర్దన చేయాలి. వీటితో చూపు, స్పర్శ, వినికిడికి సంబంధించిన స్పందనలు, మార్గాలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఇవన్నీ మనకు కొత్త కాదు. కానీ వీటి విలువలను గ్రహించక, మానసిక బానిసత్వంతో మనమే దూరం చేసుకుంటున్నాం. మళ్లీ వీటిని మనం ఆచరించటం నేర్చుకోవాలి.

* శిశువులు తొలిరోజుల్లో తమకు తామే నవ్వుతుంటారు. బయటి స్పందనలను బట్టి నవ్వటమనేది 6 వారాలకు గానీ అలవడదు. ఇక 10-12 వారాల కల్లా గలగలమనీ నవ్వుతారు. అందువల్ల తల్లి రోజూ బిడ్డ కళ్లలోకి చూస్తూ.. మాట్లాడుతూ.. నవ్వించేందుకు ప్రయత్నించటం మంచిది. ఇది వ్యక్తిగత, సామాజిక అనుబంధాలకు అవసరమైన పునాది వేస్తుంది. కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం అలవడకపోతే పిల్లల్లో ఆటిజమ్‌ వంటి మానసిక సమస్యలు తలెత్తొచ్చు. చిన్నప్పుడు భావోద్వేగాలు పెంపొందకపోతే పెద్దయ్యాక ఇతరులతో సరిగా కలవలేకపోవటం, స్పందించలేకపోవటం వంటి సమస్యలు బయలుదేరొచ్చు.

* 3-4 నెలల కల్లా దగ్గర్లో ఉన్నవాటిని అందుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అందువల్ల చేతికి గలగల శబ్దం చేసే పిడికిలి వంటివి ఇవ్వాలి. 6 నెలల కల్లా వస్తువులను ఒక చేయి నుంచి మరోచేతికి మార్చుకోవాలని చూస్తుంటారు. ఇలా ఆయా వయసులకు, చేసే పనులకు అనుగుణమైన ఉపకరణాలను ఇస్తూ.. ఎప్పటికప్పుడు ప్రేరేపించాలి.

 

 

బిడ్డ పుట్టినపుడు లోపల ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. తల్లిని తాకినపుడు ఆమె నుంచి బిడ్డకు మంచి బ్యాక్టీరియా అందుతుంది. వృద్ధి చెందుతుంది. తొలిసారిగా పేగుల్లోకి చేరుకుని వృద్ధి చెందిన సూక్ష్మక్రిములు శాశ్వతంగా ఉండిపోతాయి. ఇవి జీవితాంతం ప్రభావం చూపుతాయి. రోగనిరోధకశక్తి పెంపొందటానికి, జబ్బుల బారినపడకుండా ఉండటానికివి ఎంతగానో తోడ్పడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు