Published : 25 Sep 2018 01:40 IST

ఓటి గుండెకు మేటి మాటు!

ఓటి గుండెకు మేటి మాటు!  

శిశువు గుండెలో రంధ్రం! ఈ మాట వినగానే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి.
అసలే పిల్లలు కుసుమ కోమలాలు. వారి గుండెలు మహా సున్నితాలు.
అలాంటి లేలేత గుండెలకు ఆపద ముంచుకొచ్చిందంటే ఎవరికైనా మనసు కలుక్కుమంటుంది. పుట్టుకతో తలెత్తే ఈ సమస్యకు ఒకప్పుడు శస్త్రచికిత్స తప్ప మరో మార్గం ఉండేది కాదు. అయితే గొడుగులా విచ్చుకునే పరికరాల రాకతో పరిస్థితి మారిపోయింది. శస్త్రచికిత్స అవసరం లేకుండా బయటి నుంచే గొట్టం ద్వారా రంధ్రాలను మూసేయటం సాధ్యమైంది. కానీ వీటితో గుండె వేగం తగ్గటం వంటి దుష్ప్రభావాలు పొంచి ఉంటుండటం.. పెద్ద రంధ్రాలకు సరిపడకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించిన వైద్య పరిశోధనా రంగం కొంగొత్త పరికరాల రూపకల్పనపై దృష్టి సారించింది. ఇలా పుట్టుకొచ్చిందే ‘కోనార్‌ఎంఎఫ్‌’. కేవలం గుండె రంధ్రాలకే కాదు.. పుట్టుకతో వచ్చే మరికొన్ని సమస్యలకూ ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దటం విశేషం. ఇప్పటికే విదేశాల్లో కొన్నిచోట్ల దీన్ని వినియోగిస్తున్నారు కూడా. మనదేశంలోనూ త్వరలోనే దీని వాడకానికి అనుమతి లభించనుంది. ఈ నేపథ్యంలో గుండెలో రంధ్రాలు, కొత్త పరికరం విశిష్టతలపై ప్రత్యేక కథనం ఈ వారం మీకోసం.
చూడటానికి పిడికెడే గానీ గుండె చేసే పని అంతా ఇంతా కాదు. నిమిషానికి 72 సార్లు.. గంటకు 4,320 సార్లు.. రోజుకు 1,03,680 సార్లు.. ఇలా అనుక్షణమూ లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికీ అవసరమైన ఆక్సిజన్‌ను, పోషకాలను చేరవేస్తుంది. మనం తల్లి కడుపులో పడ్డాక 21వ రోజు నుంచే పని ప్రారంభించే ఇది జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటుంది. కాబట్టే దీనికి ఏ చిన్న సమస్య వచ్చినా జీవితం అతలాకుతలమైపోతుంది. అలాంటిది పుట్టుకతోనే గుండెలోపల రంధ్రం ఉంటే? అది మూసుకుపోకుండా వేధిస్తుంటే? ఓటి గుండెతో పిల్లలు అవస్థలు పడక తప్పదు. పుట్టుకతో వచ్చే గుండెజబ్బుల్లో 30-40% వరకూ కనబడేవి గుండెలో రంధ్రాలే. అసలేంటీ సమస్య? మన గుండెలో నాలుగు గదులుంటాయి. వీటిని కర్ణికలు (పై రెండు గదులు), జఠరికలు (కింది రెండు గదులు) అంటారు. అలాగే గుండెను కుడి ఎడమలుగా రెండు భాగాలుగానూ విభజించుకోవచ్చు. గుండె కొట్టుకునే ప్రతీసారీ- శరీరంలోని వివిధ భాగాల నుంచి వచ్చిన ‘చెడు’ రక్తాన్ని కుడి భాగం తీసుకొని ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. ఇక ఎడమ భాగమేమో ఊపిరితిత్తుల నుంచి వచ్చిన ‘మంచి’ రక్తాన్ని గ్రహించి శరీరంలోని వివిధ భాగాలకు పంపిస్తుంది. ఈ రెండు భాగాల మధ్య  ‘సెప్టమ్‌’ అనే పొర గోడ మాదిరిగా అడ్డుగా నిలుస్తూ.. మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోకుండా నిలువరిస్తుంటుంది. అయితే కొందరిలో పుట్టుకతోనే ఈ మధ్య పొరలో రంధ్రాలు ఉంటుంటాయి. కర్ణికల మధ్య గోడలోని రంధ్రాలను ఏట్రియల్‌ సెప్టల్‌ డిఫెక్ట్స్‌ (ఏఎస్‌డీ) అని.. జఠరికల మధ్య గోడలోని రంధ్రాలను వెంట్రికల్‌ సెప్టల్‌ డిఫెక్ట్స్‌ (వీఎస్‌డీ) అని అంటారు. వీటి గుండా మంచి రక్తం చెడు రక్తంలో కలిసిపోతుంటుంది. అంటే మంచి రక్తం శరీరానికి కాకుండా తిరిగి ఊపిరితిత్తుల్లోకే చేరుకుంటుందన్నమాట. సాధారణంగా చాలామందిలో వయసు పెరుగుతున్నకొద్దీ ఈ రంధ్రాలు వాటంతటవే మూసుకుపోతాయి. కానీ కొందరిలో అలాగే ఉండిపోతుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండె వైఫల్యం వంటి ఇతరత్రా సమస్యలకూ దారితీస్తాయి. కాబట్టి వీరిని నిశితంగా గమనిస్తుండటం, తగు చికిత్స చేయటం అవసరం.
సహజమే కానీ..
నిజానికి గుండెలో కర్ణికల మధ్య రంధ్రం ఉండటమనేది సహజమనే చెప్పుకోవాలి. తల్లి గర్భంలో పిండం ఎదుగుతున్నప్పుడు- తల్లి మాయ నుంచే పిండానికి మంచి రక్తం అందుతుంది. పిండం చెడు రక్తాన్ని తల్లి శరీరమే శుద్ధి చేస్తుంటుంది. ఇది పిండానికి చేరుకోవటానికి కాన్పయ్యే వరకూ పిండం గుండెలోని పై రెండు గదుల మధ్య సహజంగానే ఒక రంధ్రం (ఫొరామినా ఒవేల్‌) ఉంటుంది. బిడ్డ పుట్టి.. శ్వాస పీల్చుకొని, ఊపిరితిత్తులు పనిచేయటం మొదలెట్టాక దీని అవసరం ఉండదు. కాబట్టి ఇది క్రమంగా.. 4-6 వారాల్లో పూర్తిగా మూసుకుపోతుంది. అయితే ఇది కొందరిలో మూసుకుపోకుండా తెరచుకునే ఉంటుంది. అయినా కూడా పెద్ద ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. చాలామందికి మూడేళ్లు వచ్చేసరికి వాటంతటవే మూసుకుపోతాయి కూడా. కానీ కొందరిలో మూసుకుపోకుండా అలాగే ఉండిపోతాయి. కొందరిలో రంధ్రాలు పెద్దగానూ ఉండొచ్చు. ఇవి గుండె వైఫల్యం, న్యుమోనియా, బరువు పెరగకపోటం, ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు వంటి సమస్యలను తెచ్చిపెడతాయి. గుండె కండరానికి ఇన్‌ఫెక్షన్‌ (ఎండోకార్డయిటిస్‌), ఊపిరితిత్తుల్లోకి వెళ్లే రక్తనాళం కింద అదనపు కండరం పెరగటం వంటివీ తలెత్తొచ్చు. అందువల్ల రంధ్రం అదే పూడుకుపోతుందని నిర్లక్ష్యం చేయటం తగదు.
* కొందరికి కింది గదుల మధ్య కూడా రంధ్రాలు ఉండొచ్చు. ఇవి ఉన్నా చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. పాఠశాలలో వైద్య పరీక్షలు చేసినప్పుడో, న్యుమోనియా వంటి సమస్యలతో డాక్టర్‌ దగ్గరికి వెళ్లినపుడు పరీక్షించినపుడో ఇలాంటి రంధ్రాలు బయడపడుతుంటాయి. అయితే ఆయాసం, న్యుమోనియా, గుండె వైఫల్యం వంటి ఇబ్బందులేవీ లేవు కదా అని వీటిని తేలికగా తీసుకోవటానికి లేదు. పరుగెత్తటం వంటి శ్రమతో కూడుకున్న ఆటలు ఆడేటప్పుడు, ఆడవాళ్లయితే పెద్దయ్యాక గర్భం ధరించినపుడు ఇవి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి. పల్మనరీ హైపర్‌టెన్షన్‌కూ దారితీయొచ్చు.
అనుమానిస్తే పరీక్షలు
పిల్లలను స్టెతస్కోప్‌తో పరీక్షించినప్పుడు గుండె చప్పుడులో ఏదైనా తేడా కనబడితే గుండెలో రంధ్రం ఉండొచ్చని అనుమానించటం తప్పనిసరి. డొక్కలు ఎగరేయటం, పాలు ఆపి ఆపి తాగటం, పాలు తాగిన కొద్దిసేపటికే నిద్రపోయి తిరిగి ఆకలితో లేస్తుండటం, చెమటలు ఎక్కువగా పడుతుండటం వంటి గుండె వైఫల్య లక్షణాలు కనబడినా.. బరువు సరిగా పెరగకపోతున్నా ఏమాత్రం తాత్సారం చేయరాదు. కొన్ని పరీక్షలు ద్వారా సమస్యను నిర్ధరించుకోవాల్సి ఉంటుంది.

* ఎక్స్‌రే: గుండె సైజు, ఊపిరితిత్తులకు ఎంత రక్తం వెళ్తోందనేది ఇందులో బయటపడుతుంది. * ఈసీజీ: ఇందులో గుండె గదుల సైజు ఎంత పెరిగిందనేది తెలుస్తుంది.

* ఎకో కార్డియోగ్రామ్‌: ఇందులో సమస్య తీవ్రత, రంధ్రాల సంఖ్య, రంధ్రాల సైజు, ఊపిరితిత్తుల్లోకి చేరుకునే రక్తం మోతాదు, ఊపిరితిత్తుల్లో రక్తపోటు వంటివన్నీ స్పష్టంగా తెలుస్తాయి. వీటిని బట్టి వెంటనే ఆపరేషన్‌ చేయాలా? మందులు ఇవ్వాలా? ఆపరేషన్‌ అవసరం లేకుండా ఇతర పద్ధతులతో చికిత్స చేయొచ్చా? అనేవి నిర్ధరించుకోవటానికి వీలవుతుంది.

చికిత్స

మందులు

  చిన్నప్పుడే గుండె రంధ్రాలను గుర్తించగలిగితే మందులు, ఆహార జాగ్రత్తలతో దుష్ప్రభావాలు ముంచుకురాకుండా చూసుకోవచ్చు. ఫ్రూసిమైడ్‌, అల్డక్టోన్‌, డిగాక్సిన్‌, ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌ వంటి మందులు బాగా ఉపయోగపడతాయి. రక్తక్షీణతతో గుండె వైఫల్యం ఎక్కువయ్యే ప్రమాదముంది కాబట్టి ఐరన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాల్షియం ఇవ్వటమూ అవసరం. అలాగే న్యుమోనియా, ఫ్లూ రాకుండా టీకాలు కూడా ఇప్పించాలి. ఆహారపరంగానూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాలు ఎక్కువగా తాగలేరు కాబట్టి తక్కువ తక్కువగా ఎక్కువసార్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు ఆహారాన్ని ఆరంభించినపుడు తగినంత కేలరీలు, ప్రోటీన్లు అందేలా చూడాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ.. క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉంటే కొంతకాలానికి సుమారు 60% రంధ్రాలు వాటంతటవే మూసుకుపోతాయి. అయితే తరచుగా న్యుమోనియా   బారినపడుతుండటం, గుండె వైఫల్యం వంటివి గుర్తిస్తే ముందుగానే రంధ్రాలను మూసేయాల్సి ఉంటుంది.

సర్జరీ, అంబ్రెల్లా

మందులతో ఫలితం కనబడకపోయినా, రంధ్రం మరీ పెద్దగా ఉన్నా, తరచుగా న్యుమోనియా బారినపడుతున్నా సర్జరీ ద్వారా గానీ అంబ్రెల్లా పరికరంతో గానీ రంధ్రాన్ని మూసేయాల్సి ఉంటుంది. సర్జరీలో ఛాతీని తెరచి.. గుండె చుట్టూరా ఉండే కండరపొరతో  లేదా కృత్రిమ పదార్థంతో రంధ్రాన్ని మూస్తారు. అయితే అంబ్రెల్లా పద్ధతి (ఇంట్రవెన్షనల్‌ డివైస్‌ క్లోజ్డ్‌ ప్రొసీజర్‌) అందుబాటులోకి వచ్చాక ఈ సర్జరీల అవసరం కొంతవరకు తప్పిపోయింది. ఇందులో తొడ దగ్గర్నుంచి రక్తనాళం ద్వారా గొట్టాన్ని పంపించి.. గుండెలోకి చేరుకొని..  గుండె గది గోడలోని రంధ్రం నుంచి చిన్న పరికరాన్ని పంపించి.. గొట్టాన్ని నెమ్మదిగా బయటకు లాగుతారు. దీంతో పరికరం గొడుగు మాదిరిగా విచ్చుకుని.. గుండె గది గోడకు రెండు వైపులా అంటి పెట్టుకొని ఉండిపోతుంది. దీంతో రంధ్రం మూసుకుపోతుంది. ఆరు నెలల తర్వాత అంబ్రెల్లా మీద కండరం వృద్ధి చెందుతుంది. రంధ్రం పూర్తిగా, శాశ్వతంగా మూసుకుపోతుంది. 


కొత్త పరికరం- కొత్త ఆశ

సంప్రదాయ అంబ్రెల్లా పరికరాలతో చిక్కేటంటే- గుండెలో విద్యుత్తును ఉత్పత్తి చేసే వ్యవస్థలోని ఏవీ నోడ్‌ మీద ఒత్తిడి కలగజేయటం. దీంతో గుండె కండరానికి విద్యుత్‌ ప్రచోదనాలు సరిగా అందక గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలను అధిగమించటానికి రూపొందించిందే ‘కోనార్‌ఎంఎఫ్‌’ పరికరం.

ఏంటీ ప్రత్యేకత?
* మామూలు అంబ్రెల్లా పరికరం మాదిరిగా కాకుండా ఇందులో రెండు డిస్కులుంటాయి. వీటి మధ్యలోని సన్నటి తీగ ఈ రెండు డిస్కులనూ గట్టిగా కలిపి ఉంచుతుంది. గుండెలోని ఏవీ నోడ్‌ మీద ఎలాంటి ఒత్తిడీ పడదు.
* దీని లోపలి భాగం శంఖాకారంలో ఉండటం వల్ల రంధ్రంలో అవసరమైన మేరకు చేరుకొని, పూర్తిగా మూసుకుపోయేలా చేస్తుంది. రంధ్రం సైజు అటూఇటూగా ఉన్నా పరికరం సరిగా కుదురుకుంటుంది.
* దీని మధ్యలోని తీగ సగానికన్నా తక్కువ సన్నగా ఉంటుంది. దీంతో పరికరం తేలికగా సాగుతుంది.
* రెండువైపులా స్క్రూలు ఉంటాయి కాబట్టి ఎటునుంచైనా అమర్చొచ్చు.
* దీన్ని సన్నటి గొట్టం ద్వారా కూడా లోపలికి తీసుకెళ్లొచ్చు. ఫలితంగా చిన్నగా ఉండే శిశువులకూ తేలికగా అమర్చటానికి వీలవుతుంది. దుష్ప్రభావాలు తలెత్తటం తక్కువ.
* సంప్రదాయ పరికరాన్ని అమర్చటానికి 20-30 నిమిషాలు పడుతుంది. దీన్నయితే 3 నుంచి 10 నిమిషాల్లోనే అమర్చొచ్చు.
* సన్నటి నిటినాల్‌ లోహంతో రూపొందించటం వల్ల బరువు చాలా తక్కువగా ఉండటమే కాదు.. దృఢంగానూ ఉంటుంది.
ఇతర సమస్యలకు కూడా
కోనార్‌ఎంఎఫ్‌ పరికరం ఒక్క గుండె రంధ్రాలకే కాదు. ఇది ఇతరత్రా సమస్యలకూ ఉపయోగపడుతుంది. గుండె నుంచి శరీరానికి రక్తాన్ని తీసుకెళ్లే బృహద్ధమని, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే పుపుసధమని కలిసిపోవటం (పేటెంట్‌ డక్టస్‌ ఆర్టిరియోసిస్‌).. గుండె కండరానికి రక్తసరఫరా చేసే రక్తనాళాలు గుండెలోకి తెరచుకొని ఉండటం (కరోనరీ ఆర్టీరియో ఫిస్ట్యులా).. బృహద్ధమని, పుపుసధమని ఎక్కడైనా అతుక్కొని వాటి మధ్యలో దారి ఏర్పడటం (అయోర్టో పల్మనరీ విండో).. కవాటం సర్జరీ చేయించుకున్నవారిలో రక్తం లీక్‌ అవటం (ప్యారా వాల్యులార్‌ లీక్‌) వంటి సమస్యలకూ ఈ కొత్త పరికరం ఉపయోగపడుతుంది.

విదేశాల్లో ఇప్పటికే..

కోనార్‌ఎంఎఫ్‌ పరికరాన్ని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌, వియత్నాం వంటి దేశాల్లో సుమారు 200 మంది పిల్లలకు అమర్చారు. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సమర్థంగా పనిచేస్తున్నట్టూ తేలింది. జర్మనీ, ఇటలీలోనూ దీన్ని వినియోగిస్తున్నారు. మనదేశానికి సంబంధించి డీసీజీఐ త్వరలోనే దీనికి అనుమతి ఇచ్చే అవకాశముంది. అప్పుడు విస్తృతంగా అవసరమైన వారందరికీ అందుబాటులోకి రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు