Published : 16 Jan 2016 18:53 IST

మహారాజ యోగం!

మ‌హారాజ‌యోగం!

 2014... మన భరత భూమికి ఒక అపురూపమైన సంవత్సరం!  మన సనాత యోగ శాస్త్రానికి ఉన్న విలువనూ, దాని ప్రాశస్త్యాన్నీ అంతర్జాతీయ సమాజం అధికారికంగా గుర్తెరిగిన సంవత్సరంగా.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ 2014.

ఐదు సహస్రాబ్దాలకు పైగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన ‘యోగ విద్య’ను యావత్‌ ప్రపంచం ఎప్పటి నుంచో ఆరాధిస్తోంది, అనుసరిస్తోంది. పాశ్చాత్య సమాజం ఎన్నడో యోగసాధనలో మునిగింది. 

అయితే దీనికి ఇన్నేళ్లుగా అధికారికమైన చేర్పు, ప్రోత్సాహాల్లేవు. అందుకే సెప్టెంబరు 27న ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ ప్రతిపాదన చేశారు. వెనువెంటనే 193 ప్రపంచ దేశాలు దీన్ని ముక్తకంఠంతో.. హార్షామోదాలతో.. స్వాగతించటమే కాదు.. డిసెంబరు 11 కల్లా ఐరాస అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక మీదట యావత్‌ ప్రపంచం ‘జూన్‌ 21’ని ‘అంతర్జాతీయ యోగా దినం’గా జరుపుకోబోతోంది!

యోగ సాధన పురాతనమైనదే అయినా.. దీని అవసరం ఈ ఆధునిక కాలంలోనే ఎక్కువ! అభివృద్ధి, ఆధునికతల పేరుతో పైపైకి ఎదుగుతున్నామనుకుంటూ మనిషి.. నానాటికీ మరింతగా దిగజారిపోతున్నాడు! పొత్తిళ్ల నుంచే ఒత్తిళ్లు. 

ఒంటికి వీసమెత్తు వ్యాయామం లేదుగానీ మనసు నిండా పుట్టెడు వ్యామోహాలూ.. వ్యతిరేక భావాలూ! నేటి మానవుడు ఎదుర్కొంటున్న సకల జబ్బులకూ ఇవే మూలం. నేడు శరీరానికి వట్టి వ్యాయామమే కాదు.. మనసుకు అంతఃశ్శుద్ధి కూడా చాలా అవసరం. దీనికి ‘యోగా’ను మించిన మందేముంటుంది? అందుకే ఇప్పుడు ప్రపంచం యోగా బాట పట్టింది. నిజానికి మన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు రావటం కాదు.. అంతర్జాతీయ సమాజమేమన ‘యోగా’ విలువ, అవసరం తెలుసుకుంది. అందుకే అంతటి అపూర్వ స్వాగతం!

ఈ స్ఫూర్తి మనలోనూ దీక్షను రగిలించాలి. ఆరోగ్య కాంక్షను పెంచాలి. మనం నిరంతర యోగ సాధకులమై.. అంతర్‌, బహిర్‌ లోకాల్లో సుఖశాంతులను సంపాదించుకోవటం మొదలుపెట్టేందుకు..  ఈ కొత్త సంవత్సరాన్ని మించిన ముహూర్తం ఏముంటుంది..?

  ‘ఆరోగ్యం’ అంటే మనందరం ఇదేదో శరీరానికి సంబంధించినదే అనుకుంటాం! కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయి.మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా... రెండు పార్శా్వల్లోనూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ‘సంపూర్ణ ఆరోగ్యం’తో ఉన్నట్టు. మనం రకరకాల వ్యాయామాలు చెయ్యొచ్చు. పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు.. మందులేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ కూడా శరీరాన్ని తప్పించి మన మనసును తాకలేవు. మనసును కూడా స్పృశించి.. శరీరాన్నీ-మనస్సునూ సమతౌల్యంలోకి తెచ్చే అమోఘ పనితనం.. ఒక్క ‘యోగాభ్యాసానికి’ మాత్రమే ఉంది. అసలు ‘యోగా’ అంటే అర్థం ఇదే!

యోగమన్న శబ్దం ‘యుజ్‌’ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టుకొచ్చింది. దీనర్థం.. కలయిక, ఐక్యం, జత చేయటం అనే! ఈ దేహాన్నీ, మనస్సునూ ఒక గాడిలో పెట్టి.. రెంటినీ సమతౌల్యంలోకి తెచ్చేదే యోగా!

యోగ ప్రాశస్త్యం! : యోగా అంటే ఒక్క శారీరక ఆసనాలే కాదు. యోగాసనాలు ఎంతో కీలకమైనవీ, ముఖ్యమైనవేగానీ వీటికి.. శ్వాసపై శ్రద్ధ, ధ్యానం వంటివి కూడా జత చేసి... ‘ప్రాణ శక్తి’ని ఉత్తేజితం చెయ్యటం, దాన్ని పొదివిపట్టుకోవటం.. యోగా ప్రత్యేకత! అందుకే యోగాకు ఉన్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర, సాధారణ వ్యాయామాలకూ ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇప్పుడు యోగం పట్ల మోహం పెంచుకుంటోంది.

యోగాసనాల వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది, శరీరం నుంచి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి, అవయవాల పనితీరు బాగుంటుంది. జీవక్రియలన్నీ సజావుగా సాగటానికి యోగాసనాల రూపంలో ఒంటికి వ్యాయామం అవసరమని యోగా నొక్కి చెబుతుంది. ఇదే సమయంలో మనసును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి.. ఏకాగ్రతతో సాధనచెయ్యటం వల్ల మానసిక ప్రశాంతతే కాదు.. సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యమూ పెరుగుతుంది. అందుకే.. నానా రకాల ఒత్తిళ్లలో కూరుకుపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యకంగా మారింది.

ఏ సమయంలో చేయాలి? : యోగాను రోజులో ఎప్పుడు, ఎంత సేపు చేయాలనేదానికి నిబంధనలేమీ లేవు. కొందరు ఉదయాన్నే చేయటానికి ఇష్టపడితే మరికొందరు సాయంత్రం పూట చేస్తుంటారు. రోజువారీ పనుల మూలంగా సమయం ఎక్కువగా లేనివారు కొద్ది కొద్దిసేపు విభజించుకొని కూడా యోగాసనాలు వేయొచ్చు. కేవలం 10-20 నిమిషాల సమయం మాత్రమే గలవారికి సర్వాంగాసనం, సేతుబంధ సర్వాంగాసనం, విపరీత కరణి బాగా ఉపయోగపడతాయి. అయితే యోగా ఎక్కువసేపు చేస్తే ప్రయోజనమూ ఎక్కువగానే ఉంటుందని గుర్తించాలి.

శ్వాసకు ప్రాధాన్యం : శ్వాస ప్రక్రియ మన మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుంది. శ్వాస సరిగ్గా తీసుకోకపోతే మానసిక సామర్థ్యం దెబ్బతింటుంది. కాబట్టే యోగాసనాల సమయంలో శ్వాసపై దృష్టి పెట్టటం అత్యంత కీలకమైన అంశం.

అవసరాలను గుర్తించాలి : శరీరాన్నీ, స్వభావాన్నీ తెలుసుకుని.. అవసరాన్ని బట్టి ఎటువంటి యోగాసనాలు వెయ్యొచ్చో యోగ గురువుల వద్ద తెలుసుకోవటం ముఖ్యం. వేటికి ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో తెలుసుకొని ఉండటం మంచిది.

పతంజలి సూత్రాలు

యోగా అత్యంత పురాతనమైనది. వేదకాలం నుంచీ యోగ ప్రస్తావన ఉంది. ఈ సూత్రాలన్నింటినీ క్రోడీకరించి ‘అష్టాంగ యోగ’ను సిద్ధం చేశారు పతంజలి మహర్షి. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ అష్ట (8) సూత్రాల్లో మొదటి నాలుగూ బాహ్యమైన శరీరానికి సంబంధించినవి, చివరి నాలుగూ మన అంతరంగానికి, అంటే మనస్సుకు సంబంధించినవి.

1. యమం: యమం అంటే విధులు. సమాజంలో మనమందరం కలిసిమెలిసి ఉండేందుకు.. వ్యక్తులుగా మనం పాటించాల్సిన విధులను తెలియజేస్తుంది ఇది.

2. నియమం: నిత్యజీవితంలో మనం అనుసరించాల్సిన నియమావళి ఇది. శుభ్రంగా ఉండటం, తృప్తితో జీవించటం, ఆహార విహారాల వంటివన్నీ దీనిలోని భాగాలు.

3. ఆసనం: మనం తరచూ చెప్పుకొనే యోగాసనాలివే! యోగాలో కీలకమైన భాగం ఇవి. రకరకాల భంగిమలతో సాగే ఈ వ్యాయామాలు.. శరీరానికి చురుకుదనాన్నే కాదు.. మనసుకు ధైర్యాన్నీ చేకూరుస్తాయి.

4. ప్రాణాయామం: ప్రాణమంటే జీవశక్తి. ఆయామమంటే గాలితో విరామాన్నివ్వటం. శ్వాసను క్రమబద్ధీకరించటం, క్రమపద్ధతిలో స్తంభించటం ద్వారా ఆయుష్షును పొడిగించటం దీని లక్ష్యం.

5. ప్రత్యాహారం: ఇంద్రియాలను అధీనంలోకి తెచ్చుకోవటం ప్రత్యాహారం. శ్వాసపై పట్టుతో ఇంద్రియ స్వాధీనమూ సాధ్యం.

6. ధారణం: మనసును తదేకంగా కేంద్రీకరించటమే ధారణ. ఇది ఏకాగ్రతను సొంతం చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడే సాధన.

7. ధ్యానం: ఆనందమన్నది బయట దొరికేది కాదు. లోలోపలి నుంచి రావాల్సిన భావన. దీనికి యుక్తాయుక్త విచక్షణ, ఆత్మజ్ఞానం పెంచుకోవటం ముఖ్యం. ఇందుకు దోహదం చేస్తుంది ధ్యానం.

8. సమాధి: యోగంలో అత్యున్నత స్థితి ఇది. శారీరక, మానసిక సమతౌల్యాన్ని సాధించి.. జీవాత్మనూ పరమాత్మనూ సమైక్యం చెయ్యటం ద్వారా పొందే అనిర్వచనీయ భావన ఇది. ఇది సాధించినవారే యోగులు!

ఈ అష్టాంగాలను పరిశీలిస్తే మనకు యోగా అన్నది శరీరానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే.. మనస్సును కూడా దానికి జత చేస్తుందని, మనిషిని ఒక వ్యక్తిగానూ, సంఘజీవిగానూ, ముఖ్యంగా సుఖసంతోషాలతో జీవించే ఒక సమగ్ర ప్రాణిగా తీర్చిదిద్దుతుందని అర్థమవుతుంది. అదే యోగ సాధనకున్న బలం!

యోగాకూ.. వ్యాయామానికీ తేడా ఏమిటి?

యోగాసనాలు చూడటానికి వ్యాయామాల మాదిరే ఉంటాయిగానీ ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. వ్యాయామాల్లో.. బలానికీ, వేగానికీ ప్రాధాన్యం ఎక్కువ. దీనివల్ల కండరాలు పెరిగి, శారీరక దారుఢ్యం (ఫిట్‌నెస్‌) మెరుగవుతుంది. అయితే మనం ఏ అవయవాలతో వ్యాయామం చేస్తామో దానికి సంబంధించిన కండరాలే పెరుగుతాయి. కానీ యోగా ఇలా కాదు.. శరీరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. కండరాలు పెరగటం కంటే శారీరక కదలికలు, వాటికి దోహదం చేసే బంధనాలు, స్నాయువుల వంటివన్నీ సరళంగా, అదే సమయంలో పటిష్ఠంగా తయారవుతాయి. యోగాలో శారీరక కదలికలు నెమ్మదిగా ఉంటే.. సాధారణ వ్యాయామాల్లో వేగంగా సాగుతాయి. యోగాలో స్పందనలు, రక్తపోటు స్థిరంగా ఉంటాయి. వ్యాయామంలో ఇవి పెరుగుతాయి. యోగాలో సంకల్పిత, అసంకల్పిత కండరాలు రెంటిపైనా ప్రభావం ఉంటుంది. వ్యాయామంలో మాత్రం సంకల్పిత కండరాల మీదే ప్రభావం ఎక్కువ.

కాబట్టి యోగా, వ్యాయామం ఒకటే కాదు. దేని ప్రయోజనం దానిదే. దేన్నీ తక్కువ చెయ్యటానికి లేదు. యోగా శారీరక-మానసిక ఆరోగ్యాలు రెంటికీ ప్రాధాన్యం ఇస్తే... శారీరక సమర్థతకు, దారుఢ్యానికి వ్యాయామాలు ఉపకరిస్తాయి. కొన్నికొన్ని సందర్భాల్లో కొన్ని అవయవాల పనితీరు మెరుగవ్వటానికి ప్రత్యేకించి వ్యాయామాలే అవసరమవుతాయి కూడా. యోగసాధనను కేవలం వ్యాయామంగానే కాదు.. సంపూర్ణమైన జీవన విధానంగా గుర్తించటం అవసరం.

యోగాలు.. భిన్న రకాలు!

యోగసాధనకు పతంజలి యోగ సూత్రాలే మూలమైనా ఆచరణలోకి వచ్చేసరికి చిన్నచిన్న మార్పుచేర్పులతో ప్రస్తుతం పలు విధానాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

* హఠయోగం: దాదాపు అందరికీ ఉపయోగపడే, విస్తృత ప్రాచుర్యంలో ఉన్న విధానం ఇది. దీనిలో యోగాసనాలు, ప్రాణాయామం.. రెంటికీ ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు చూసే చాలా యోగ ప్రక్రియలకు ఈ హఠయోగమే ఆధారమని చెప్పుకోవచ్చు.

* విన్యాస: ఇది కాస్త వేగంతో కూడిన పద్ధతి. ఇందులో శ్వాసను నియంత్రణలో ఉంచుకుంటూ ఆసనాలను వేగంగా మారుస్తూ ఒకదాని తర్వాత మరోటి వేస్తుంటారు. దీన్ని సాధారణంగా సూర్య నమస్కారాలతో ఆరంభిస్తారు. తర్వాత శరీరాన్ని మరింతగా సాగదీసే ఆసనాలు వేస్తుంటారు.

  * పవర్‌ యోగ: ఇందులో ఒక ఆసనం నుంచి మరొక ఆసనానికి నిరంతరం మారాల్సి ఉంటుంది. దీనికి శరీరం దృఢంగా ఉండటం ముఖ్యం. ఇది బలాన్ని పెంపొందిస్తుంది, కదలికలను మెరుగుపరుస్తుంది.

* అయ్యంగార్‌: యోగాకు అంతర్జాతీయ ప్రాచుర్యం తెచ్చిన ప్రముఖ యోగా గురువు బి.కె.ఎస్‌.అయ్యంగార్‌ రూపొందించిన పద్ధతి ఇది. ఆసనాలను వేగంగా మార్చటం కాకుండా చాలాసేపు నిలకడగా వేయటం దీని ప్రత్యేకత. శరీరాకృతిని సరైన పద్ధతిలో తీర్చిదిద్దటంతో పాటు వ్యాధులను నయం చెయ్యటానికి ప్రత్యేక ఆసనాల మీద దృష్టి సారించారు.

* కుండలిని: కొన్ని రకాల కదలికలను వేగంగా మళ్లీ మళ్లీ చేస్తుండటం, మరింత గట్టిగా శ్వాసను తీసుకోవటం ద్వారా శక్తి స్థాయులను పెంచటం ఇందులో కీలకాంశం. ఇందులో శరీరం మీదనే కాదు ధ్యానం పైనా ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు.
..ఇలా కొన్నికొన్ని ప్రత్యేక అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ కర్మ, జీవన్ముక్తి, భక్తి, సిద్ధ.. ఇలా ఎన్నో రకరకాల పద్ధతులున్నాయి.

మానవలోకంలో మిమ్మల్ని అత్యంత ఆశ్చర్యానికి లోను చేసిందేమిటన్న ప్రశ్నకు బౌద్ధమత గురువు దలైలామా ‘మనిషిని మించిన ఆశ్చర్యకరమైన జీవి మరేముంటుందంటూ’ చెప్పిన ఈ సమాధానాన్ని మీరే చూడండి...

మనిషి మహా చిత్రమైన జీవి! డబ్బు సంపాదన కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడతాడు. తీరా ఆరోగ్యం దెబ్బతిన్నాక దాన్ని బాగుచేసుకునేందుకు సంపాదించిందంతా ఖర్చుపెడతాడు. ఎప్పుడూ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఒకటే ఆందోళన. దాన్లో కూరుకుపోయి వర్తమానాన్ని దుర్భరం చేసుకుంటాడు. ఫలితం.. వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ.. ఎప్పుడూ హాయిగా ఉండలేడు. తనకు మరణమన్నదే లేదన్నంత ధీమాగా జీవిస్తాడు.. చివరికి అస్సలు జీవితమంటే ఏమిటో అనుభవించకుండానే మరణిస్తాడు.’’ ...కాబట్టి మనకు అవసరమైనదేమిటో.. వేరే చెప్పక్కర్లేదుగా!

అధ్యయనాల దన్ను
  సనాతనంగా, సంప్రదాయంగా వస్తున్న యోగా మీద వివిధ దేశాల శాస్త్రవేత్తలు ఈమధ్యకాలంలో ఎక్కువగానే దృష్టి సారిస్తున్నారు. యోగాపై ఎన్నో పరిశోధనలూ చేస్తున్నారు. కొన్నికొన్ని ప్రత్యేకమైన సమస్యల విషయంలో యోగా మరింత ప్రయోజనకరంగా ఉంటోందని వీరు గుర్తిస్తుండటం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం.
వేగస్‌ నాడి బలోపేతం : మన శరీరానికి ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని (వేగల్‌ టోన్‌) పెంపొందించటం ద్వారా నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉండటానికి యోగా తోడ్పడుతున్నట్టు బోస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్‌ స్ట్రీటర్‌, ఆయన బృందం గుర్తించింది. మన శరీరంలో వేగస్‌ నాడి అతిపెద్ద కపాల నాడి. ఇది మెదడు నుంచి మొదలుకొని.. శ్వాస, జీర్ణ, నాడీ వ్యవస్థలను చుట్టుకుంటూ శరీరమంతా ప్రయాణిస్తుంది. శ్వాస ప్రక్రియ, గుండె వేగం, జీర్ణక్రియ, మన అనుభవాలు అన్నీ కూడా వేగస్‌ నాడితో సంబంధం గలవే. అందువల్ల వేగస్‌ నాడి పనితీరు పూర్తిస్థాయిలో మెరుగ్గా ఉంటే ‘వేగల్‌ టోన్‌’ ఎక్కువగా ఉందని భావిస్తుంటారు. అంటే వీరి శరీరం, మెదడు కూడా ఒత్తిడిని అత్యంత సమర్థంగా ఎదుర్కొంటుందని అనుకోవచ్చు. ఇలాంటివాళ్లు ఉత్సుకత, ఆందోళన వంటి వాటి నుంచి తేలికగా మామూలు స్థితికి చేరుకుంటారు. యోగా, ప్రాణాయామం వంటి యోగా పద్ధతులు వేగల్‌ టోన్‌ను పెంచుతున్నట్టు పరిశోధనల్లో గుర్తించారు.

* వాపు మార్పులు తగ్గుదల
గుండెజబ్బు, మధుమేహం, ఆర్థ్రైటిస్‌ వంటి పలు దీర్ఘకాల వ్యాధులకు ఒంట్లో ఇన్‌ఫ్లమేషన్‌ అంటే వాపు సంబంధ మార్పులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఈ వాపు తరహా మార్పులను నెమ్మదించటంలో సూర్య నమస్కారాలు, వీరాసనం వంటి ముందుకు వంగి చేసే ఆసనాలు ఉపయోగపడుతున్నట్టు ఓహియో స్టేట్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. 200 మందిపై మూడు నెలల పాటు నిర్వహించిన అధ్యయనంలో యోగాభ్యాసం అనంతరం వీరిలో 3 రకాల వాపు సూచికలు 10-15% తగ్గినట్టు గుర్తించారు.

* హైబీపీ తగ్గుముఖం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఒత్తిడిని తగ్గించుకోవటం వంటి జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు. యోగా మూలంగా ఒత్తిడి తగ్గటం, ప్రశాంతత చేకూరటం, కండరాలు దృఢంగా, పటిష్ఠంగా అవుతాయి. ఫలితంగా అధిక రక్తపోటు కూడా తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. అధిక రక్తపోటు బాధితులు మందులతో పాటు రోజుకి గంట చొప్పున 11 వారాల పాటు యోగా సాధన చేస్తే.. సిస్టాలిక్‌ రక్తపోటు 142 నుంచి 126కు, డయాస్టాలిక్‌ రక్తపోటు 86 నుంచి 75కు తగ్గినట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది.

ఉత్సాహం ఉరుకులు
శారీరక శ్రమతో మనసులో నిరుత్సాహం తగ్గిపోయి ఉత్సాహం ఉరకలు వేస్తుంది. యోగాతోనూ ఇలాంటి ప్రయోజనాలు కనబడుతున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఒకసారి యోగా చేసినా పురుషుల్లో ఆందోళన, అలసట, కోపం తగ్గినట్టు బయటపడింది. అలాగే స్త్రీలల్లో భావోద్వేగాలు మెరుగుపడినట్టు తేలింది.

* మరింత శక్తి

కొంతమంది వృద్ధులను ఎంచుకొని వారికి ఆరు నెలల పాటు హఠ యోగ శిక్షణ ఇచ్చి పరీక్షించగా.. ఆరోగ్యం మెరుగుపడటం, రోజువారీ పనులను తేలికగా చేసుకోవటం, బలం చేకూరటంతో పాటు నిస్సత్తువ తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. ఒక కాలు మీద నిలబడటం (నియంత్రణ), ముందుకు వంగటం వంటివీ మెరుగైనట్టు తేలింది.

వ్యాధుల్లో వూరట
మణికట్టు వద్ద నొప్పితో బాధించే కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌, నడుము నొప్పి వంటి సమస్యలకు కూడా నిపుణుల శిక్షణలో యోగా చేస్తేఫలితాలుంటున్నాయని గుర్తించారు. అలాగే యువతీయువకుల్లో యోగా వల్ల శారీరక దారుఢ్యం మెరుగవటం, వాలినట్లుండే భుజాలు పైకి పొంగటం వంటి మెరుగైన మార్పులు కనబడ్డట్టు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు