Published : 17 Jan 2016 13:12 IST

వెన్ను వంచితేనే దన్ను

వెన్ను వంచితేనే ద‌న్ను

నొప్పి వచ్చే వరకూ తెలియదు.. మనకొక నడుము ఉందని! ఇక ఆ తర్వాత అది మనల్ని క్షణం కూడా మర్చిపోనివ్వదు. అనుక్షణం అదే కలక. కదిలితే బాధ. కదలకపోతే బాధ. నిటారుగా నిలవలేం. తీరుగా కూర్చోలేం. నాలుగు అడుగులు నడవలేం. కనీసం హాయిగా నిద్ర కూడా పోలేం. అదీ... నడుము నొప్పి అంటే! దురదృష్టమేమంటే ఈ సమస్య ఇప్పుడు విపరీతంగా విస్తరించిపోతోంది. కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ దాదాపు అందర్నీ వేధిస్తోంది. అదృష్టమేమంటే చాలాసార్లు ఈ నడుము నొప్పికి తీవ్రమైన జబ్బులు, వెన్ను లోపాలేం కారణం కాదు. ఇది చాలా వరకూ మన స్వయంకృతం! ఆధునిక కాలంలో మనం వెన్నును చాలా ఒత్తిళ్లపాలు చేస్తున్నాం. అస్సలు ఒంటికి వ్యాయామం లేకుండా గంటల తరబడి టీవీలూ, కంప్యూటర్ల ముందు కూర్చోవటం నుంచి నిరంతరం ఉరుకుల పరుగుల జీవనశైలి వరకూ.. ప్రతిదీ నడుము మీద తీవ్రమైన ఒత్తిడి పెంచేదే. ఇదే నేటి నొప్పులకు మూలం! అసలు ఈ వెన్ను నొప్పి రాకుండా చూసుకోవటం అత్యుత్తమం. ఒకవేళ వెన్ను మొరాయిస్తుంటే వెంటనే గుర్తించి దాన్ని గాడిలోకి తెచ్చుకోవటం మరీ ముఖ్యం. ఈ రెంటికీ కూడా వ్యాయామం ఒకటే మార్గం! ఎంత బిజీగా ఉన్నా.. పనుల్లో ఎంత తల మునకలై పోయినా నిత్యం వెన్నును మరింత దృఢతరం చేసే కొన్ని తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి! అప్పుడే మన వెన్ను మనకు దన్నుగా నిలుస్తుంది. అందుకే ఈ సులభ, నిత్య వ్యాయామాలను సవివరంగా మీ ముందుంచుతోంది  సుఖీభవ!

నడుము నొప్పి ఎన్నో కారణాలతో రావచ్చు. కానీ 90-95 శాతం మందిలో మాత్రం దీనికి తీవ్రమైన అనారోగ్య సమస్యలేం కారణం కాదు. చాలామందిలో అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా నడుము మీద ఒత్తిడి పెరిగి 

వచ్చే నొప్పులే ఎక్కువ. దాదాపు 80-85 మంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దీన్ని అనుభవిస్తున్నారని గణాంకాలు చెబుతున్నా నేటి మారుతున్న జీవనశైలి కారణంగా ఇప్పుడీ సమస్య చాలా చిన్నవయసులోనే వేధించటం మొదలుపెడుతోంది. ఇటువంటి వెన్నునొప్పి ఏమంత ప్రమాదకరం కాకపోయినా ఒకసారి మొదలైతే ఇంటి పనులు, ఆఫీసు పనులు, ప్రయాణాలు.. అన్నీ ఇబ్బందికరంగా పరిణమించి జీవితం దుర్భరంగా, నరకంగా మారుతుంది. అందుకే అంతా వెన్నును విస్మరించకుండా దాని మీద కాస్త శ్రద్ధ పెట్టటం అవసరం.

  న వెన్ను లేలేత కొమ్మలా వంగుతుంటుంది, కానీ అదే సమయంలో గట్టి కర్రలా దృఢంగానూ ఉంటుంది. అందుకే ఇదో సంక్లిష్టమైన నిర్మాణం. దీనిలో దండ కట్టినట్టుండే ఎముక పూసలు, వాటి మధ్య మెత్తటి డిస్కులు, వాటిని కదిలించే కండరాలు, వాటికి దృఢత్వాన్నిచ్చే టెండన్లు.. ఇలా రకరకాల భాగాలు అనుసంధానమై, కలిసికట్టుగా కదులుతుంటాయి. వీటిలో దేనిలో సమస్య తలెత్తినా పక్క భాగాలపై ప్రభావం పడుతుంది. అంతిమంగా ఇది వెన్నునొప్పికి దారి తీస్తుంది. వీటి మధ్య డిస్కులు జారినా, నాడులు నొక్కుకున్నా.. ఇలా చాలా కారణాల వల్ల రావచ్చుగానీ ఇటువంటి తీవ్ర సమస్యలు లేకుండా కేవలం దైనందిన జీవితంలో భంగిమలు సరిగా లేకపోవటం, దాని మూలంగా ఈ కండరాలు, టెండన్ల వంటి వాటి మీద ఒత్తిళ్లు పెరగటం, అవి బలహీనపడటం వల్లే చాలామందిలో నొప్పులు వేధిస్తున్నాయి.

మొగ్గలోనే వంచాలి!
జీవనశైలి కారణంగా వచ్చే రకం నడుము నొప్పులు- సాధారణంగా ఒకేసారి హఠాత్తుగా రావు. ఆరంభ దశలో ఏదైనా పని చేస్తున్నప్పుడు కొద్దిపాటి అసౌకర్యంలా మొదలై క్రమేపీ రోజురోజుకూ పెరుగుతుంటాయి. చాలామంది ఇలా అసౌకర్యంగా ఉన్న దశలో నిర్లక్ష్యం చేసి తిరిగేస్తూ, ముదురుతున్న దశలో ఏవో నొప్పుల బిళ్లలు వేసుకుని నెట్టుకొద్దామని చూస్తుంటారు. ఈ ధోరణి వల్ల చివరికి ఏ కాస్త పని చేసినా కూడా తీవ్రమైన నొప్పి వేధించే స్థితికి చేరుకుంటారు. కాబట్టి నొప్పి ముదరక ముందే వెన్ను వ్యాయామాలను ఆశ్రయించటం ఒక్కటే సరైన పరిష్కారం!

భంగిమల మీద దృష్టి
మన రోజువారీ పనులు చూస్తే నిలబడటం, కూర్చోవటం, చాలాసేపు ఒకే భంగిమలో ఉండిపోయి పనిచేస్తుండే ‘స్టాటిక్‌’ భంగిమలు కొన్ని కనబడతాయి. వీటిల్లో వెన్నెముక కదలికలు అంతగా ఉండవు. ఇక నడక, పరుగులు, ఆటలు, బరువులెత్తటం, తొయ్యటం, లాగటం వంటి ‘డైనమిక్‌’ భంగిమలు మరో రకం. వీటిలో వెన్నెముక కదలికలు చాలా ఎక్కువగా ఉంటాయి. వెన్ను ఆరోగ్యంగా ఉండేందుకు రెండింటిలోనూ జాగ్రత్తగా ఉండటం అవసరం. బరువులు ఎత్తేప్పుడు, శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు వంగటం, లేవటం వంటివి సరైన విధంగా చెయ్యకపోతే కండరాలు పట్టేయొచ్చు. అలాగే కూర్చోవటం వంటి ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండిపోయినా వెన్నుపై ఒత్తిడి పెరుగుతుంది. ఉదాహరణకు కూచున్నప్పుడు మన నడుము పూసలపై ఏడు రెట్ల అధిక బరువు పడుతుంది. మన వెన్నెముక మొత్తం.. కటి ఎముక మీద నిలబడి ఉంటుంది. ఇది నిటారుగా నిలబడేందుకు రకరకాల కండరాలు, కండర బంధనాలు తోడ్పడుతుంటాయి. చాలాసేపు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, పని చేస్తున్నప్పుడు సరైన భంగిమలో లేకపోతే వీటిలో కొన్ని కండరాలు వదులు కావటం, మరికొన్ని బిగుసుకుపోవటం జరుగుతుంటుంది. ఇవన్నీ నొప్పికి దారితీసేవే. కాబట్టి ఈ భంగిమల్లో జాగ్రత్త అవసరం. చాలామంది కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు వెన్నెముకని నిటారుగా ఉంచాలని చెబుతుంటారుగానీ వాస్తవానికి ఎక్కువసేపు అలా ఉండటం కష్టం. కాబట్టి ఎవరైనా- చూడటానికి ఎబ్బెట్టుగా లేకుండా, మనకు సౌకర్యంగా అనిపించేలా, ఎక్కువసేపు అలాగే ఉన్నా ఇబ్బంది పెట్టని భంగిమలో ఉండటం ముఖ్యం. ఈ మూడూ ఉంటే దాన్ని సరైన భంగిమే అనుకోవచ్చు. ఇవి చేసే పనులను బట్టి, వ్యక్తులను బట్టి మారిపోతుంటాయి.

వ్యాయామాలే విరుగుడు
నొప్పులు రాకుండా ఉండాలన్నా, మొదలైన నొప్పులు సర్దుకోవాలన్నా నిత్య వ్యాయామాలే కీలకం. నొప్పి వేధిస్తున్నప్పుడు- ఏయే కండరాలు సమస్యకు కారణమవుతున్నాయో గుర్తించి వాటిని బలోపేతం చేసేందుకు వ్యాయామాలు సూచిస్తారు. నొప్పి తీవ్రంగా ఉంటే ముందుగా నొప్పి నివారిణి మాత్రలు, అల్ట్రాసౌండ్‌ థెరపీ, ట్రాక్షన్‌, ఐఎఫ్‌టీ వంటి చికిత్సలతో నొప్పి తగ్గేలా చేసి తర్వాత వ్యాయామాలు చేయిస్తారు. సాధారణ వెన్నునొప్పులు చాలా వరకూ ఈ భంగిమలు, వ్యాయామలతోనే పూర్తిగా తగ్గిపోతాయి.

కొన్నిసార్లు శరీర భాగాలను కదిలిస్తే నొప్పి ఎక్కువవ్వొచ్చు. కదిలించకపోతేనేమో కండరం క్షీణిస్తుంది. ఇలాంటి సమయాల్లో ‘ఐసోమెట్రిక్‌’ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. వీటితో ఆయా కండరాలు బలోపేతం అవుతాయి. వెన్ను నొప్పి విషయంలో ఈ ఐసోమెట్రిక్‌ వ్యాయామాలతో పాటు ఫ్రీ, రెసిస్టెన్స్‌, కోర్‌ వ్యాయామాలూ మంచి ఫలితాలిస్తాయి. వ్యాయామంతో బిగుసుకుపోయిన కండరాలను వదులుగా, వదులైన వాటిని బిగుతుగా, బలహీనంగా ఉన్నవాటిని దృఢంగా చేయొచ్చు. వీటితో నొప్పి దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అయితే నొప్పి తీవ్రంగా ఉంటే దాన్ని తగ్గించుకున్నాకే వ్యాయామాలు ఆరంభించాలి.

జాగ్రత్తలు ముఖ్యం

  * వెన్ను వ్యాయామాలన్నీ అందరికీ సరిపడకపోవచ్చు. ఏదైనా వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పి రాకూడదు. అలా నొప్పి వస్తోందంటే ఆ వ్యాయామం సరిపడదనో లేక సరిగా చెయ్యటం లేదనో అర్థం. నిజానికి వ్యాయామం చేస్తున్నప్పుడు కాస్తయినా ఉపశమనంగా అనిపించాలి. నొప్పి అనిపిస్తే వెంటనే ఆపెయ్యాలి.

* వ్యాయమాలను ఆరంభంలో నెమ్మదిగా, తక్కువసేపు చేస్తూ రోజు రోజుకీ క్రమేపీ సమయం పెంచుకుంటూ వెళ్లాలి. పూర్తిగా అలసిపోయేంత వరకూ చేయరాదు. వ్యాయామం తర్వాత శరీరం తేలికగా అనిపించాలి గానీ నిస్సత్తువ ఆవరించకూడదు.

* ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండరాదు. తరచుగా మారుస్తుండాలి. చాలాసేపు కూచొని పనిచేయాల్సి వస్తే ప్రతి గంటకు లేచి నాలుగు అడుగులు వెయ్యటం మంచిది. దీంతో వెన్నెముక, కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

* బరువు పెరిగిన తర్వాత తగ్గించుకునే తంటాల కన్నా ముందే పెరగకుండా చూసుకోవటం మేలు.

* ప్యాంటు వెనక జేబులో మందపాటి పర్సులు, కాగితాల బొత్తులు పెట్టుకోరాదు. దీనివల్ల భంగిమ కుదరక నొప్పులు మొదలవుతాయి.

* బరువైన బ్యాగుల వంటివి ఎప్పుడూ ఒక భుజమ్మీదే మొయ్యకూడదు. తరచుగా మారుస్తూ ఉండాలి. అలాగే పిల్లలను ఎత్తుకునేప్పుడు కూడా!

* నొప్పి నివారిణి మాత్రల వంటివి ఎవరికి వారే వారం కన్నా ఎక్కువ కాలం వాడకూడదు. వైద్యసహాయం తీసుకోవాలి.

* విశ్రాంతి తీసుకోవటమంటే ఆఫీసులు మానేసి కుర్చీలో కూర్చుని గంటల తరబడి టీవీ చూడటం, ఇంటి దగ్గరే డెస్కు పనులు చెయ్యటం కాదు. దానివల్లా వెన్నెముక మీద చాలా భారం పడుతుంది. విశ్రాంతిగా పడుకోవాలి.

* విశ్రాంతి పేరుతో రోజుల తరబడి పడుకోవటం కూడా మంచిది కాదు. వెన్నునొప్పి తీవ్రంగా ఉంటే తప్ప మిగతా సమయాల్లో 48 గంటల కన్నా ఎక్కువసేపు మంచానికి అతుక్కుపోవటం తగదు. దీంతో మేలు జరగకపోగా వెన్నెముక కదలక పోవటం మూలంగా తలెత్తే ఇబ్బందులే ఎక్కువ.

* ఎక్కువసేపు కూచొని పనిచేసే చోట మెడ, వెన్నెముకలపై ఒత్తిడి పడకుండా సరైన ‘ఎర్గానమిక్స్‌’తో తయారైన కుర్చీలు, టేబుళ్ల వంటివి వాడుకోవాలి.

* కారు నడిపేటప్పుడు మెడను ముందుకు చాపి చూడరాదు. దీంతో వెన్నునొప్పి వచ్చే ప్రమాదముంది. కాబట్టి మెడ, వెన్ను నిటారుగా ఉంచాలి.

* వర్చువల్‌ గేమ్స్‌ ఆడేవాళ్లు కూడా ముందు తప్పనిసరిగా వామప్‌ వ్యాయామాలు చేయాలి. అవి కంప్యూటర్లు, టీవీల్లో చూస్తూ ఆడేవే అయినప్పటికీ వాటివల్ల నిజంగానే గాయాలయ్యే ప్రమాదముంది.

* కొందరు వారమంతా ఎటువంటి వ్యాయామాలూ చెయ్యకుండా వారాంతాల్లో మాత్రం విపరీతంగా బ్యాడ్మింటన్‌ వంటివి ఆడేస్తుంటారు. ఇది సరికాదు. నిత్య వ్యాయామాలతో శారీరక సామర్థ్యం పెంచుకోవాలి.

* చాలామంది పూర్తిగా పనంతా అయిపోయాక ఒకేసారి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటారు. దీంతో వెన్నెముకపై ఒత్తిడి పెరిగిపోతుంది. మధ్యమధ్యలో విశ్రాంతి తప్పనిసరి.

* బిడ్డకు పాలిచ్చే తల్లులు, పరీక్షలు రాసే విద్యార్థులు.. తప్పనిసరిగా సరైన భంగిమలను నేర్చుకుని, పాటించటం వెన్నుకు చాలా అవసరం.

*మెడ, నడుములకు పెట్టుకునే కాలర్‌, లంబార్‌ బెల్టులతో ప్రయోజనం తక్కువ. నొప్పి ఉన్నప్పుడు ఈ భాగాల్లోని కండరాలను బలోపేతం చేయటం ముఖ్యం. ఎక్కువసేపు బెల్టులు పెట్టుకుని తిరుగుతుంటే ఆ కండరాలు బలహీనమయ్యే అవకాశముంది.

వ్యాయామాలు

వ్యాయామాలను కూడా ఒక్కసారే కఠినమైన వాటిని ఎంచుకోవటం, ఎక్కువసేపు చెయ్యటం తగదు. దశల వారీగా చెయ్యాలి. ఒక్కోదశనూ వారం పాటు చేసి.. సౌకర్యంగా ఉంటే తర్వాత దశకు వెళ్లాలి. పైదశకు వెళ్లినా.. రోజూ కింది దశ వ్యాయామాలు చేసిన తర్వాతే పైకి వెళ్లాలి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు