Published : 29 Mar 2016 02:53 IST

సరదాగా సాగనీ ప్రయాణం!

సరదాగా సాగనీ ప్రయాణం!

వేసవి కాలం. సెలవుల కాలం. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు విరామ కాలం. ఇల్లంతా పిల్లల కేరింతలతో మారు మోగుతుంటే.. సంతోషాల హరివిల్లులు విరుస్తుంటే.. వాటికి కొనసాగింపుగా విహారయాత్రలకు వెళ్లాలని మనసూ తహతహలాడుతుంది. ఇలాంటి సరదా ప్రయాణాలు ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ చేకూరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. నడక, పుణ్యక్షేత్రాల్లో మెట్లు ఎక్కటం వంటివి వ్యాయామాన్ని కలగజేస్తాయి. అయితే ఈ విహారయాత్రలు మరింత సంతోషకరంగా, ప్రయోజనకరంగా మారాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి.

* అంతగా నడవాల్సిన అవసరం లేని చోట్లకు వెళ్లినపుడు రోజు మాదిరిగానే వ్యాయామం చేయాలి. ఇది శరీర సామర్థ్యానికి, త్వరగా అలసిపోకుండా ఉండటానికి తోడ్పడుతుంది.
* రోజులో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలను చూడాలనే యావతో నిద్రను నిర్లక్ష్యం చేయరాదు. తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత కొరవడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు.
* విహారయాత్రలనేవి కుటుంబంతో, స్నేహితులతో ఆనందంగా గడపటం కోసమే. కాబట్టి మనసు పాడు చేసే లేనిపోని విషయాల గురించి చింతించటం, ఒత్తిడికి గురికావటం తగదు.
* కనబడినవల్లా నోట్లో వేసుకోకుండా మితంగా తినటం ఉచితం. ముఖ్యంగా మిఠాయిలు, కొవ్వు పదార్థాలు, కేకులు, కుకీలు, పేస్ట్రీల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. పండ్లు ఎక్కువగా తినాలి. అలాగే పరిశుభ్రమైన నీటినే తీసుకోవాలి. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినపుడు అప్పుడే వండిన, వేడిగా ఉన్న పదార్థాలనే తినాలి.
* అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు గలవారు అన్నిరోజులకూ సరిపడినన్ని మందులు వెంట తీసుకెళ్లాలి. మందులకు ఎండ తగలకుండా, తడిచిపోకుండా చూసుకోవాలి.
* పుణ్యక్షేత్రాలను సందర్శించటం, మతపరమైన కార్యక్రమాలకు హాజరుకావటం మంచిది. దీనివల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. హాయిగా ఉన్నామనే భావన సొంతమవుతుంది.
* దయాగుణం ప్రదర్శించండి. ఇతరులకు దాన ధర్మాలు చేసేవాళ్లు ఎక్కువ కాలం.. అదీ ఆరోగ్యంగా జీవిస్తారు.
* ఆత్మీయులను, మిత్రులను కౌగిళించుకునే అవకాశాన్ని వదులుకోకండి. వీలైనంత ఎక్కువమందినీ కలుసుకోవటానికి ప్రయత్నించండి. ఇవి ఆరోగ్యం పెంపొందటానికి దోహదం చేస్తాయి.
* మద్యం అలవాటు గలవారు మితంగానే తీసుకోవాలి. అతిగా తాగి అనర్థాలను కొని తెచ్చుకోవద్దు. ఆనందాన్ని పాడు చేసుకోవద్దు.
* వేరేచోట్లకు వెళ్లినపుడు అనారోగ్యకర అలవాట్లకు త్వరగా ఆకర్షితమయ్యే అవకాశముంది. కాబట్టి ఏం చేయాలో, ఏం చేయకూడదో ముందుగానే గట్టి నిర్ణయం తీసుకోవాలి. వాటిని విధిగా ఆచరించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని