గాఢంగా శ్వాస

శ్వాస తీసుకోవటం అనగానే మనకు వూపిరితిత్తులే ప్రధానంగా గుర్తుకొస్తాయి. కానీ ఛాతీకి కడుపునకు మధ్య ఉండే కండర పొర ‘విభాజక పటలం’ (డయాఫ్రం) కూడా....

Published : 19 Apr 2016 02:20 IST

గాఢంగా శ్వాస

శ్వాస తీసుకోవటం అనగానే మనకు వూపిరితిత్తులే ప్రధానంగా గుర్తుకొస్తాయి. కానీ ఛాతీకి కడుపునకు మధ్య ఉండే కండర పొర ‘విభాజక పటలం’ (డయాఫ్రం) కూడా శ్వాస ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం శ్వాసను పీల్చినప్పుడు ఈ విభాజక పటలం సంకోచించి, కింది వైపునకు కదులుతుంది. దీంతో ఛాతీలో ఖాళీ భాగం ఏర్పడి, వూపిరితిత్తులు బాగా వ్యాకోచించటానికి ఆస్కారం కలుగుతుంది. ఇక శ్వాసను వదిలినపుడు విభాజక పటలం వ్యాకోచించి, పైకి నెట్టుకొని వస్తుంది. ఇలా ఇది గాఢంగా శ్వాస తీసుకోవటంలో ఎంతగానో తోడ్పడుతుంది. అందువల్ల దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ శ్వాస తీసుకుంటే (డయాఫ్రమాటిక్‌ బ్రెతింగ్‌) శరీరానికి ఆక్సిజన్‌ బాగా అందుతుంది. గుండె వేగమూ తగ్గుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇలాంటి శ్వాస ప్రక్రియ సీవోపీడీ సమస్య గలవారికి మరింత మేలు చేస్తుంది. ఎందుకంటే సీవోపీడీ బాధితుల వూపిరితిత్తుల్లో కొంత గాలి బయటకు వెళ్లకుండా లోపలే చిక్కుకుపోతుంటుంది. దీంతో డయాఫ్రం కిందికి నొక్కుకుపోయి, బలహీనమవుతుంది. ఇది పనిచేసే సామర్థ్యమూ తగ్గుతుంది. గాఢ శ్వాసతో దీన్ని తిరిగి బలోపేతం చేసుకోవచ్చు. కాబట్టి డయాఫ్రం పొర సాయంతో గాఢంగా శ్వాస తీసుకునే ప్రక్రియను సాధన చేయటం మంచిది.
* ముందుగా నున్నటి మంచంపై గానీ నేలపై గానీ వెల్లకిలా పడుకోవాలి. అవసరమనుకుంటే తల, మోకాళ్ల కింద దిండు పెట్టుకోవచ్చు.

* ఒక అరచేతిని ఛాతీ మీద, మరో అరచేతిని కడుపు మీద (పక్కటెముకలకు కాస్త కిందుగా) ఆనించాలి.

* కడుపులోకి గాలి వెళ్లేలా మెల్లగా ముక్కుతో గాఢంగా శ్వాస తీసుకోవాలి. ఈ సమయంలో ఛాతీ మీదుండే చేయి అలాగే ఉండాలి. కడుపు మీదండే చేయి పైకి లేవాలి.

* కడుపు కండరాలను బిగపట్టి, కిందివైపు లాక్కుంటూ ముక్కు ద్వారా శ్వాసను వదలాలి. పెదవులను బిగపట్టి ఉంచాలి. ఈ సమయంలో కడుపు మీదుండే చేయి తిరిగి యథాస్థితికి రావాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని