యోగం వందే విశ్వ మాతరం!

మనిషిని కేవలం ఓ మాంసం ముద్దలా కాకుండా... మనసూ-శరీరాల అద్భుత సంగమంగా చూసే అపూర్వమైన పండుగ ఇది! సనాతన భారతీయ యోగ సంప్రదాయానికి అగ్ర పీఠం వేస్తూ.. నేటి ప్రపంచం చేసుకుంటున్న సంపూర్ణ స్వస్థత పండుగ ఇది!

Published : 21 Jun 2016 01:26 IST


ప్రపంచం కొత్త పండుగ చేసుకుంటోంది!

మనిషిని కేవలం ఓ మాంసం ముద్దలా కాకుండా... మనసూ-శరీరాల అద్భుత సంగమంగా చూసే అపూర్వమైన పండుగ ఇది! సనాతన భారతీయ యోగ సంప్రదాయానికి అగ్ర పీఠం వేస్తూ.. నేటి ప్రపంచం చేసుకుంటున్న సంపూర్ణ స్వస్థత పండుగ ఇది!

పొత్తిళ్ల నుంచే ఒత్తిళ్లలో.. ఉంగాఉంగాల నుంచే వూబకాయాల్లో చిక్కుకుపోయి.. రోగాల పుట్టలా మారిపోతున్న నేటి ప్రపంచానికి అత్యవసరమైన పండుగ ఇది!

రుషి ప్రోక్తంగా ఐదు సహస్రాబ్దాలకు పైగా భారతీయ జీవన విధానంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ‘యోగ విద్య’ను నేడు యావత్‌ ప్రపంచం ఆరాధించి.. ఆచరించి.. అక్కునజేర్చుకుంటోంది!

ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పబలంతో ఆరంభమై.. ఐక్యరాజ్యసమితి ప్రోద్బలంతో అధికారికమైన ‘అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని’ యావత్‌ ప్రపంచం నేడు సమధికోత్సాహంతో వూరూరా ఉత్సవంలా జరుపుకొంటోంది.

ఇది సంపూర్ణ ఆరోగ్యానికి నిజమైన స్ఫూర్తి!
పరిపూర్ణ మానవుడి ఆవిష్కారానికి నిజమైన మార్గం!!
ఇది మహ రాజ మార్గం. మన మహద్భాగ్య యోగం.

యోగ సాధన పురాతనమైనదే అయినా.. దీని అవసరం ఈ ఆధునిక కాలంలోనే ఎక్కువ! అభివృద్ధి, ఆధునికతలంటూ మనం ప్రకృతికి దూరమైపోతూ నానాటికీ మరింతగా దిగజారిపోతున్నాం! మనసుకు ప్రశాంతత లేదు, ఒంటికి వ్యాయామం లేదు. నేటి మనం ఎదుర్కొంటున్న సకల రుగ్మతలకూ ఇదే మూలం. నేడు ఒంటికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనసుకు శుద్ధీ అంతే ముఖ్యం. ఏకకాలంలో ఈ రెంటినీ సాధించేందుకు ‘యోగా’ను మించిన ఔషధం లేదు!

ఆరోగ్యం అంటే మనందరం ఇదేదో శరీరానికి సంబంధించినదే అనుకుంటాం! కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా... రెండు పార్శా్వల్లోనూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ‘సంపూర్ణ ఆరోగ్యం’తో ఉన్నట్టు. మనం రకరకాల వ్యాయామాలు చెయ్యొచ్చు. పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు.. మందులేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ కూడా శరీరాన్ని తప్పించి మన మనసును తాకలేవు. మనసును కూడా స్పృశించి.. శరీరాన్నీ, మనస్సునూ సమతౌల్యంలోకి తెచ్చే అమోఘ పనితనం.. ఒక్క ‘యోగాభ్యాసానికి’ మాత్రమే ఉంది. అసలు ‘యోగా’ అంటే అర్థం ఇదే!

యోగమన్న శబ్దం ‘యుజ్‌’ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టుకొచ్చింది. దీనర్థం.. కలయిక, ఐక్యం, జత చేయటం అనే! ఈ దేహాన్నీ, మనస్సునూ ఒక గాడిలో పెట్టి.. రెంటినీ సమతౌల్యంలోకి తెచ్చేదే యోగా!

యోగా అంటే ఒక్క శారీరక ఆసనాలే కాదు. యోగాసనాలు ఎంతో కీలకమైనవీ, ముఖ్యమైనవేగానీ.. దీనికి తోడుగా శ్వాసపై శ్రద్ధ, ధ్యానం వంటివి కూడా జత చేసి... ‘ప్రాణ శక్తి’ని ఉత్తేజితం చెయ్యటం, దాన్ని పొదివిపట్టుకోవటం.. యోగా ప్రత్యేకత. అందుకే యోగాకు ఉన్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర, సాధారణ వ్యాయామాలకూ ఉండవు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇప్పుడు యోగమంటే మోహం పెంచుకుంటోంది.

సాధనకు ముందు
యోగాను ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. అయితే ఇది పూర్తి ఫలితాలు ఇవ్వటానికి కొన్ని పద్ధతులు పాటించటం తప్పనిసరి.
* రాత్రి త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచి.. కాలకృత్యాలు తీర్చుకొని, పళ్లు తోముకొని స్నానం చేశాక యోగాభ్యాసం ఆరంభించాలి.
* స్నానం చేయకపోయినా యోగాభ్యాసం చేయొచ్చు. అయితే యోగా ముగిసిన కొద్దిసేపటి తర్వాత స్నానం చేయాల్సి ఉంటుంది.
* యోగాసనాలను పరగడుపున చేయటం మంచిది. ఒకవేళ భోజనం చేస్తే 4-5 గంటల తర్వాతే చేయాలి. అల్పాహారం తీసుకుంటే 2-3 గంటల సేపు ఆగాకే ఆరంభించాలి.
* యోగాసనాలు వేసేటప్పుడు వదులైన దుస్తులను ధరించాలి. పాదాలకు చెప్పులు, బూట్ల వంటివి ధరించ కూడదు.
* గాలి, వెలుతురు వచ్చే ప్రశాంతమైన ప్రదేశంలో.. లేదా కిటికీలు, తలుపులు తెరిచి ధారాళంగా వెలుతురు వస్తున్న గదుల్లో.. సమతలంగా ఉన్నచోట యోగా చేయాలి.
* ఉదయం సూర్యుడి కిరణాలు పడే ప్రాంతంలో యోగా చేయటం ఎంతో మేలు.
* తివాచీ గానీ, దుప్పటి గానీ, శుభ్రమైన వస్త్రాన్ని గానీ పరిచి దాని మీద కూచొని యోగాభ్యాసం చేయాలి. నేల మీద, గచ్చు మీద, బండల మీద చేయకూడదు.
* యోగా చేస్తున్నప్పుడు మల, మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే బలవంతాన వాటిని ఆపుకోకూడదు. విసర్జనకు వెళ్లి వచ్చాకే యోగా తిరిగి సాగించాలి. అలాగే త్రేన్పులు, తుమ్ములు, దగ్గు వంటి వాటినీ ఆపుకోవటం తగదు. దాహం వేస్తే కొద్దిగా నీళ్లు తాగొచ్చు.
* త్వరత్వరగా కాకుండా నెమ్మదిగా, అలసట లేకుండా తాపీగా యోగా చేయాలి. ఒకవేళ అలసిపోతే శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.
* యోగసాధన వీలైనంత వరకూ రోజూ చెయ్యాలి.
* మనసును పూర్తిగా ఆసనాల మీదే కేంద్రీకరించాలి. యోగాభ్యాస సమయంలో ఇతర ఆలోచనలను మనసులోకి రానివ్వద్దు.
* యోగా చేయటం ముగిశాక తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి.

ఇవి చేయకూడదు
* తీవ్రంగా జబ్బు పడినప్పుడు, ఆపరేషన్‌ చేయించుకున్నప్పుడు, ఎముకలు విరిగి కట్టు కట్టించుకున్నప్పుడు యోగా చేయకూడదు. సమస్యలు తగ్గిన తర్వాత, అదీ నిపుణుల సలహాతోనే తిరిగి మొదలు పెట్టాలి.
* ఎనిమిదేళ్ల వయసు దాటేంత వరకూ పిల్లలతో బలవంతంగా యోగా చేయించటం మంచిది కాదు.
* అపరిశుభ్రంగా ఉన్నచోట, పొగ, దుర్వాసన వచ్చే చోట యోగా చేయరాదు.

నెలసరి సమయంలో...
నెలసరి సమయంలో తలకిందులుగా వేసే ఆసనాలను వేయరాదు. ఎందుకంటే ఇవి సహజ రక్త సరఫరాకు ఆటంకం కలగజేస్తాయి. అయితే సుప్త వీరాసనం, సుప్త బద్ధకోణాసనం, బద్ధకోణాసనం, ఉపవిష్టకోణాసనం, జాను శిరసాసనం, త్రయంగ ముఖైకపాద పశ్చిమోత్తానాసనం వంటివి చేయొచ్చు.

ఏ సమయంలో చేయాలి?
యోగాను రోజులో ఎప్పుడు, ఎంత సేపు చేయాలనేదానికి నిబంధనలేమీ లేవు. కొందరు ఉదయాన్నే చేయటానికి ఇష్టపడితే మరికొందరు సాయంత్రం పూట చేస్తుంటారు. రోజువారీ పనుల మూలంగా సమయం ఎక్కువగా లేనివారు కొద్ది కొద్దిసేపు విభజించుకొని కూడా యోగాసనాలు వేయొచ్చు. కేవలం 10-20 నిమిషాల సమయం మాత్రమే గలవారికి సర్వాంగాసనం, సేతుబంధ సర్వాంగాసనం, విపరీత కరణి బాగా ఉపయోగపడతాయి. అయితే యోగా ఎక్కువసేపు చేస్తే ప్రయోజనమూ ఎక్కువగానే ఉంటుందని గుర్తించాలి.

అవసరాలను గుర్తించాలి
ఇంట్లో సాధన చేసేవారు తమ అవసరాలేంటో గుర్తించాలి. ఏ రకం సమస్యలకు లేదా ఏయే అవయవాల దృఢత్వానికి ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో తెలుసుకొని ఉండటం మంచిది. ఉదాహరణకు నిలబడే ఆసనాలు శరీర దృఢత్వానికి, బలానికి తోడ్పడితే.. ముందుకు వంగి చేసేవి ప్రశాంతతకు దోహదం చేస్తాయి. ఇదొక పద్ధతైతే.. వ్యక్తిగత స్వభావంతో నిమిత్తం లేకుండా ప్రత్యేకమైన ఆసనాలను ఎంచుకొని చేయటం మరొక పద్ధతి. మొదటి పద్ధతి మనిషిని సున్నితంగా తీర్చిదిద్దుతుంది. రెండోది ఆత్మ విశ్వాసాన్ని చేకూరుస్తుంది. రెండు పద్ధతులనూ సాధన చేయటం అవసరం. ఒకవేళ ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. దానికి నిపుణులు ప్రత్యేకమైన ఆసనాలను సూచిస్తే వాటిని క్రమం తప్పకుండా వేయాలి.


యోగ ప్రాశస్త్యం!

యోగాసనాల వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది, శరీరం నుంచి మలినాలు విసర్జితమవుతాయి. అవయవాల పనితీరు బాగుంటుంది. జీవక్రియలన్నీ సజావుగా సాగటానికి యోగాసనాల రూపంలో ఒంటికి వ్యాయామం దొరుకుతుంది. ఇదే సమయంలో మనసును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి.. ఏకాగ్రతతో సాధనచెయ్యటం వల్ల మానసిక ప్రశాంతతే కాదు.. సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యమూ పెరుగుతుంది. అందుకే.. నానా రకాల ఒత్తిళ్లలో కూరుకుపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యకంగా మారింది.


యోగాకూ.. వ్యాయామానికీ తేడా ఏమిటి?

యోగాసనాలు చూడటానికి వ్యాయామాల మాదిరే ఉంటాయిగానీ ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. వ్యాయామాల్లో.. బలానికీ, వేగానికీ ప్రాధాన్యం ఎక్కువ. దీనివల్ల కండరాలు పెరిగి, శారీరక దారుఢ్యం (ఫిట్‌నెస్‌) మెరుగవుతుంది. అయితే మనం ఏ అవయవాలతో వ్యాయామం చేస్తామో దానికి సంబంధించిన కండరాలే పెరుగుతాయి. కానీ యోగా ఇలా కాదు.. శరీరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. కండరాలు పెరగటం కంటే శారీరక కదలికలు, వాటికి దోహదం చేసే బంధనాలు, స్నాయువుల వంటివన్నీ పటిష్ఠంగా తయారవుతాయి. యోగాలో కదలికలు నెమ్మదిగా జరిగితే సాధారణ వ్యాయామాల్లో వేగంగా సాగుతాయి. యోగాలో స్పందనల వేగం, రక్తపోటు స్థిరంగా ఉంటాయి. వ్యాయామంలో ఇవి పెరుగుతాయి. యోగాలో సంకల్పిత, అసంకల్పిత కండరాలు రెంటిపైనా ప్రభావం ఉంటుంది. వ్యాయామంలో మాత్రం సంకల్పిత కండరాల మీదే ప్రభావం ఎక్కువ.

కాబట్టి యోగా, వ్యాయామం ఒకటే కాదు. దేని ప్రయోజనం దానిదే. దేన్నీ తక్కువ చెయ్యటానికి లేదు. యోగా శారీరక-మానసిక ఆరోగ్యాలు రెంటికీ ప్రాధాన్యం ఇస్తే... శారీరక సమర్థతకు, దారుఢ్యానికి వ్యాయామాలు ఉపకరిస్తాయి. కొన్నికొన్ని సందర్భాల్లో కొన్ని అవయవాల పనితీరు మెరుగవ్వటానికి ప్రత్యేక వ్యాయామాలు అవసరమవుతాయి కూడా. యోగసాధనను కేవలం వ్యాయామంగానే కాదు.. సంపూర్ణమైన జీవన విధానంగా గుర్తించాలి.


యోగాతో ప్రయోజనాలేంటి?

చక్కటి ఆరోగ్యం, మంచి రోగనిరోధకశక్తి, బరువు అదుపులో ఉండటం, నిగనిగలాడే చర్మం, మది నిండా ఆహ్లాదం, ఆనందం.. రోజువారీ జీవితంలో మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? ఇలాంటివన్నీ ఒక్క యోగాభ్యాసంతోనే దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు. మన రోజువారీ జీవితంలో యోగా ద్వారా ఎన్నెన్నో ప్రయోజనాలు సొంతం అవుతాయని సూచిస్తున్నారు.

1. సంపూర్ణ సామర్థ్యం
శారీరక సామర్థ్యం కలిగుండటమే కాదు, మానసికంగా దృఢంగా, భావోద్వేగాల విషయంలో సమతుల్యతను సాధించినప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులతో కూడిన యోగా వీటన్నింటినీ సాధించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

2. బరువు తగ్గటం
అధిక బరువును తగ్గించుకోవటానికీ యోగా ఉపయోగపడుతుంది. సూర్య నమస్కారాలు, కపాల భాతి ప్రాణాయామం వంటివి ఇందుకు తోడ్పడతాయి. యోగావల్ల మన శరీరానికి ఎప్పుడు, ఎలాంటి ఆహారం అవసరమనే దాన్ని గ్రహించే గుణం అలవడుతుంది. ఇది కూడా బరువు తగ్గేందుకు తోడ్పడేదే.

3. ఒత్తిడి నుంచి వూరట
యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఒత్తిడి తగ్గటానికి దోహదం చేస్తాయి. అందువల్ల రోజుకు కొద్దిసేపు యోగా చేసినా శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

4. మానసిక ప్రశాంతత
అందమైన ప్రదేశాలను చూడటం ద్వారా ఆనందాన్ని పొందటానికి మనం ఆసక్తి చూపుతుంటాం. కానీ ప్రశాంతత అనేది మన మనసులోనే ఉందన్న సంగతిని గుర్తించం. యోగా ద్వారా దీన్ని సొంతం చేసుకోవచ్చు. కల్లోలానికి గురైన మనసు తిరిగి ప్రశాంతంగా మారటానికి యోగా చక్కటి మార్గం.

5. రోగ నిరోధక శక్తి పెంపు
శరీరంలో ఏదైనా సమస్య బయలుదేరితే అది మనసుపైనా ప్రభావం చూపుతుంది. అలాగే మనసులోని అశాంతి, అసంతృప్తి వంటివీ శరీరాన్ని ప్రభావితం చేసి జబ్బుల రూపంలో బయటపడతాయి. యోగా ద్వారా ఈ రెంటినీ నివారించుకోవచ్చు. ఫలితంగా రోగనిరోధకశక్తి పెంపొంది జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది.

6. చైతన్య జీవనం
మనసు నిరంతరం గతం నుంచి భవిష్యత్తుకూ.. భవిష్యత్తు నుంచి గతానికీ వూగిసలాడుతుంటుంది. వర్తమానంలో మాత్రం ఉండదు. ఈ మానసిక స్థితిని గుర్తిస్తే చాలు. ఒత్తిళ్లతో, పనిభారంతో సతమతం కాకుండా చూసుకోవచ్చు. మనసును నిశ్చితంగా, ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. యోగా, ప్రాణాయామం ఇలాంటి చైతన్యం కలగటానికి ఎంతగానో తోడ్పడతాయి. వర్తమానానికి మనసును తిరిగి తీసుకొస్తాయి. దీంతో ఆనందం, ఏకాగ్రతా దక్కుతాయి.

7. కొత్త శక్తి
ఉదయం హుషారుగా ఉంటాం, సాయంత్రం అయ్యేసరికి ఒంట్లో శక్తంతా హరించుకుపోయికూలబడిపోతుంటాం. రోజూ కొద్దిసేపు యోగా చేయటం వల్ల రోజంతా హుషారుగా ఉండటమే కాదు, ఒంట్లోనూ కొత్త శక్తి పొంగుకొస్తుంది.

8. కదలికలు సులభం
మనం అన్ని పనులను సజావుగా చేసుకోవాలంటే ఎలా కదిలినా శరీరం నొప్పి పెట్టకుండా ఉండటం, తేలికగా కదలటం తప్పనిసరి. నిత్య యోగా తో కండరాలు సాగుతాయి, మరింత బలంగా తయారవుతాయి. కూచున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు శరీరం సరైన భంగిమలో ఉండటానికి కూడా తోడ్పడుతుంది.


స్థాయిని బట్టి సాధన

ఆసనాలు, ప్రాణామాయ సాధన ఆయా వ్యక్తుల స్థాయి, అనుభవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రధానమైన ఆసనాలను మరచిపోకుండా రోజూ చేయాలి. ఆసనాల రకాలను మార్చుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు ఒకరోజు నిలబడే ఆసనాలను చేస్తే, మర్నాడు కూచునే ఆసనాలను సాధన చేయాలి. యోగా చేయటం మొదలెట్టేవారు ఆరంభంలో నిలబడి చేసే ఆసనాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి.


కాస్త జాగ్రత్తగా..

యోగాను ఎవరైనా చేయొచ్చు. కానీ గర్భిణులు నిపుణుల సలహా మేరకే దీన్ని సాధన చేయాలి. అలాగే...
* క్యాన్సర్‌ లేదా క్యాన్సర్‌ రహిత కణితి
* రెటీనా విడివడటం
* మధుమేహం
* మూర్చ
* గుండెజబ్బు
* అధిక రక్తపోటు
* హెచ్‌ఐవీ
* మల్టిపుల్‌ స్లె్కరోసిస్‌
* శారీరక వైకల్యం... ఇలాంటి సమస్యలున్న వారు కూడా నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే యోగాను చేయటం ఉత్తమం.


శ్వాసతో ప్రాణం
శ్వాస ప్రక్రియ మన మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుంది. శ్వాస సరిగ్గా తీసుకోకపోతే మానసిక సామర్థ్యం దెబ్బతింటుంది. కాబట్టే మానసిక ప్రశాంతతను చేకూర్చే ప్రాణాయామానికి యోగ సూత్రాలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. మనం నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకోవాలి. వేగంగా, తక్కువగా శ్వాస తీసుకోవటం వల్ల రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గిపోతాయి. ఇది త్వరగా జబ్బుల బారినపడటం, అకాల వృద్ధాప్యం, రోగనిరోధకశక్తి పడిపోవటం, నిస్సత్తువ వంటి వాటికి దారితీస్తుంది. నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకోవటం వల్ల వూపిరితిత్తులు పూర్తిస్థాయిలో సమర్థంగా పనిచేస్తాయి. దీంతో శరీరంలోని అన్ని కణాలకు తగినంత ఆక్సిజన్‌ అందుతుంది. శ్వాసను వదిలినప్పుడు వ్యర్థాలు, విషతుల్యాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.ఆసన భంగిమల్లో శ్వాస
ముందుకు వంగి పైకి లేస్తూ చేసే ఆసనాలు వేసేప్పుడు.. శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. శ్వాసను వదులుతూ ముందుకు వంగాలి. పైకి లేవటం మొదలెట్టగానే శ్వాసను తీసుకోవటాన్ని ఆరంభించి, పూర్తిగా నిలబడేంతవరకూ దాన్ని కొనసాగించాలి. అలాగే ముందుకు వంగటం మొదలెట్టగానే శ్వాసను వదలటం ఆరంభించి, పూర్తిగా వంగేంతవరకు కొనసాగించాలి. ఆయా భంగిమల్లో ఉన్నప్పుడు శ్వాసను పట్టి ఉంచకూడదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని