నడుంనొప్పికి ధ్యానం

ధ్యానంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆందోళన, ఒత్తిడీ తగ్గుముఖం పడతాయి. అయితే దీని ప్రయోజనాలు మనసుకే పరిమితం కావటం లేదు. శారీరకంగానూ మంచి ప్రభావం చూపుతోంది!

Published : 28 Jun 2016 01:40 IST

నడుంనొప్పికి ధ్యానం

ధ్యానంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆందోళన, ఒత్తిడీ తగ్గుముఖం పడతాయి. అయితే దీని ప్రయోజనాలు మనసుకే పరిమితం కావటం లేదు. శారీరకంగానూ మంచి ప్రభావం చూపుతోంది! దీర్ఘకాల నడుంనొప్పితో బాధపడేవారికి ఏకాగ్రతతో కూడిన ధ్యానం ఎంతోగానో తోడ్పడుతున్నట్టు.. నొప్పి నివారణ మందుల కన్నా మెరుగైన ఫలితం చూపుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. నడుంనొప్పితో బాధపడేవారు తరచుగా నొప్పి నివారణ మందులు వేసుకోవటం.. వేడి, చల్లదనం కాపు పెట్టుకోవటం వంటివి చేస్తుంటారు. అయినా ఉపశమనం తాత్కాలికమే. ఇలాంటివారికి ఏకాగ్రతతో కూడిన ధ్యాన పద్ధతులు, ఆలోచనలను మళ్లించే ప్రవర్తన చికిత్స బాగా ఉపయోగపడుతున్నట్టు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం తేల్చింది. ఇందులో భాగంగా కొందరికి మందులతో, మరికొందరికి ధ్యానం, ప్రవర్తన చికిత్సలు చేసి ఏడాది పాటు పరిశీలించారు. మందులు వేసుకున్నవారిలో కన్నా ధ్యానం చేసినవారిలో నొప్పి బాగా తగ్గటం గమనార్హం. ధ్యానం చేస్తున్నప్పుడు మన మనసు ఏదో ఒకదానిపై కేంద్రీకృతమవుతుంది. దీంతో మరింత ప్రశాంతత చేకూరటంతో పాటు నొప్పి కూడా తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా మన ధ్యాస నొప్పి మీదికి మళ్లితే సహజంగానే నొప్పి పెరుగుతుంది. అదే ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీదనో, ఏదైనా శబ్దం మీదనో దృష్టి పెట్టినపుడు నొప్పి మీది నుంచి ధ్యాస మళ్లుతుంది. అలాగే ధ్యానం మూలంగా కండరాలు వదులవుతాయి. గుండె వేగం తగ్గుతుంది. శ్వాస నెమ్మదిస్తుంది. శ్వాస కూడా గాఢంగా తీసుకుంటారు. ఇవన్నీ కూడా నొప్పి తగ్గటానికి తోడ్పడేవే. మంచి విషయం ఏంటంటే.. ధ్యానం ఎవరికి వారు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఖర్చుతో పనిలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని