Stress Reduce: ఇలా చేస్తే ఒక్క నిమిషంలో ఒత్తిడి దూరం!

Tips to reduce stress: ఒత్తిడి లక్షణాలను గుర్తిస్తే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. ఏం చేయాలంటే?

Updated : 28 Jan 2024 16:31 IST

రోజువారీ జీవితంలో ఒత్తిడి (Stress) సహజం. అవసరం కూడా. ఇది మనం మరింత కష్టపడి పనిచేయటానికి, సరైన సమయంలో లక్ష్యాలను పూర్తి చేయటానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు శరీరానికి వెంటనే శక్తి అందేలా చేసి అక్కడ్నుంచి తప్పించుకోవటానికి సాయం చేస్తుంది. కానీ తరచుగా, అదేపనిగా ఒత్తిడి వేధిస్తే.. తలనొప్పి, వెన్నునొప్పి, కడుపునొప్పి, నిద్ర పట్టకపోవటం వంటి సమస్యలకు దారితీస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనం కావటంతో పాటు ఏవైనా జబ్బులుంటే తీవ్రమవుతాయి కూడా. కాబట్టి ఒత్తిడి లక్షణాలను గుర్తిస్తే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. ఇందుకు తేలికైన పద్ధతులూ ఉన్నాయి. వీటిల్లో గాఢంగా శ్వాస తీసుకోవటం ఒకటి. దీన్ని నిమిషం పాటు చేసినా ఒత్తిడి లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాలం ఒత్తిడి బారినపడకుండానూ నివారించుకోవచ్చు.

ఎలా చేయాలి?: ముందుగా ప్రశాంతంగా కూచొని గానీ, పడుకొని గానీ ఒక అరచేతిని ఛాతీ మీద.. మరొక అరచేతిని కడుపు మీద పెట్టుకోవాలి. ముక్కుతో నెమ్మదిగా గాఢంగా శ్వాస తీసుకోవాలి. ఈ సమయంలో కడుపు మీదుండే చేతిని కడుపు నెడుతుండాలి గానీ ఛాతీ మీది చేయి మాత్రం అలాగే ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ముక్కుతో శ్వాసను వదిలేయాలి. ఇలా ఒక నిమిషం సేపు చేసినా మంచి ఫలితం కనబడుతుంది.

ఏం జరుగుతుంది?: ఒక లయ ప్రకారం గాఢంగా శ్వాస తీసుకోవటం వల్ల నాడీ వ్యవస్థ అతిగా స్పందించటం తగ్గుతుంది. వూపిరితిత్తులు సైతం మనం ప్రశాంతంగా ఉన్నామంటూ మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. కడుపు, ఛాతీకి మధ్యన ఉండే విభాజక పటలం (డయాఫ్రం) సంకోచించటం, వ్యాకోచించటం వల్ల శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది. నొప్పీ తగ్గుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని