Published : 20 Dec 2016 01:45 IST

వ్యాయామం మేలు

మద్యం
వ్యాయామం మేలు

మద్యంతో క్యాన్సర్‌ వంటి రకరకాల సమస్యల ముప్పు పెరుగుతుంది. అయినా చాలామంది దీన్ని మానటం లేదు. చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటివాళ్లు కనీసం రోజూ వ్యాయామమైనా చేయటం మేలు.
వ్యాయామంతో మద్యం దుష్ప్రభావాలు తగ్గుముఖం పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
ద్యం చాలారకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ల ముప్పునూ పెంచుతుందని వైద్య నిపుణులు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. కానీ చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. చేజేతులా తమ ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకుంటున్నామని తెలిసినా మద్యం తాగటం మానటం లేదు. ఇలాంటివాళ్లు కనీసం వ్యాయామమైనా చేయటం మంచిదని తాజా అధ్యయనం సూచిస్తోంది. దీంతో మద్యం దుష్ప్రభావాలను కొంతవరకైనా తగ్గించుకోవచ్చని చెబుతోంది. మద్యం అలవాటు గలవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా ఎలాంటి కారణంతోనైనా తలెత్తే మరణం ముప్పు తగ్గే అవకాశం ఉంటుండటమే దీనికి కారణం. ముఖ్యంగా క్యాన్సర్‌తో సంభవించే మరణం ముప్పు చాలావరకు తగ్గుతుండటం గమనార్హం. మద్యం తాగటం వల్ల ఒంట్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరూ మందగిస్తుంది. ఈ రెండూ క్యాన్సర్‌ ముప్పును తెచ్చిపెట్టేవే. ఇక వ్యాయామంతో వాపు ప్రక్రియ తగ్గుతుంది, రోగనిరోధకశక్తి పుంజుకుంటుంది. అందువల్ల మద్యం దుష్ప్రభావాలను వ్యాయామం తగ్గిస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే అతిగా మద్యం తాగేవారి విషయంలో వ్యాయామ ఫలితాలు ఏమాత్రం కనబడకపోవటం గమనార్హం. అలాగే గుండెజబ్బుతో సంభవించే మరణం ముప్పును తగ్గించటంలోనూ వ్యాయామం ప్రభావం చూపటం లేదు.
మానకపోతే మితం పాటించాలి
మద్యంతో క్యాన్సర్లు మాత్రమే కాదు. గుండెజబ్బుల ముప్పూ పెరుగుతుంది. రోజుకు ఒక 45 ఎం.ఎల్‌ మద్యం (40% ఆల్కహాలు గలవి) తాగినా గుండె ఎడమ కర్ణిక సైజు పెరుగుతున్నట్టు, గుండెలయ తప్పే ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందువల్ల మద్యం జోలికి వెళ్లక పోవటం ఉత్తమం. ఒకవేళ కుదరకపోతే పరిమితమైనా చేసుకోవాలి. విచిత్రంగా అనిపించినా.. ఎప్పుడెప్పుడు మద్యం తాగారనేది రాసిపెట్టుకోవటం మేలు చేస్తుంది. ఇది వారం మొత్తం ఎంత మద్యం తీసుకున్నారో అంచనా వేసుకోవటానికి తోడ్పడుతుంది. మద్యం అందుబాటులో ఉంటే ఎక్కువగా తాగే అవకాశముంది. కాబట్టి మద్యం సీసాలను ఇంట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు