మోకాళ్లకు వ్యాయామం

మోకాళ్ల నొప్పి బారినపడితే సరిగా నిలబడలేరు, నడవలేరు. అటూఇటూ తిరిగినా తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. వయసుతో పాటు కీళ్లు, ఎముకలు అరిగిపోవటం వంటి సమస్యలు దీనికి దోహదం చేస్తాయి.

Published : 28 Feb 2017 01:55 IST

మోకాళ్లకు వ్యాయామం

మోకాళ్ల నొప్పి బారినపడితే సరిగా నిలబడలేరు, నడవలేరు. అటూఇటూ తిరిగినా తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. వయసుతో పాటు కీళ్లు, ఎముకలు అరిగిపోవటం వంటి సమస్యలు దీనికి దోహదం చేస్తాయి. మోకాళ్ల నొప్పి తలెత్తటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆ భాగానికి రక్తసరఫరా తగ్గటం. ఇలాంటి సమస్యలను తేలికైన వ్యాయామాలతో తగ్గించుకోవచ్చు.

కూచోవటం-లేవటం

ముందుగా కుర్చీలో కూచొని నెమ్మదిగా పైకి లేవాలి. 3-4 సెకన్ల సేపు అలాగే ఉండి తిరిగి నెమ్మదిగా కూచోవాలి. ఈ సమయంలో చేత్తో కుర్చీని పట్టుకోకూడదు. అలాగే మోకాళ్లు శరీరానికి మరీ పక్కలకు విస్తరించకుండా చూసుకోవాలి. ఈ వ్యాయామాన్ని ఒక నిమిషం సేపు చేసి.. ఓపికను బట్టి క్రమంగా సమయం పెంచుకుంటూ రావాలి.

తేలికైన బస్కీలు

కుర్చీ వెనకాల నిలబడి, రెండు చేతులతో కుర్చీని పట్టుకోవాలి. నెమ్మదిగా కూచునే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో కిందికి చూసినప్పుడు పాదాల వేళ్లు కనబడనంతవరకు మోకాళ్లు వంగాలి. తర్వాత నెమ్మదిగా పైకి లేవాలి. దీన్ని 8-10 సార్లు చేయాలి. అలవాటయ్యాక సంఖ్యను పెంచుకోవచ్చు.

మోకాళ్లు వంచటం

ఈ వ్యాయామాలను ఉదయం గానీ సాయంత్రం గానీ చేయొచ్చు. ఇవి మోకాళ్లకు రక్తసరఫరా మెరుగయ్యేలా చేస్తాయి. వాటికి దన్నుగా నిలిచే కండరాలను బలోపేతం చేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గటానికీ తోడ్పడతాయి. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాలి. 

చాప మీద వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను పైకి లేపుతూ పాదాలను పిరుదుల వద్దకు తెచ్చుకోవాలి. చేతులను రెండు పక్కలా చాపకు ఆనించాలి. తర్వాత కాళ్లను ఎడమపక్కకు వంచాలి. ఈ సమయంలో నడుం మెలి తిరిగినట్టు అవుతుంది. 4-5 సెకండ్ల పాటు అలాగే ఉండి, కాళ్లను మధ్యలోకి తేవాలి. అనంతరం కుడిపక్కకు కాళ్లను వంచాలి. ఇది మోకీళ్ల పక్క కండరాలు సాగటానికి, అవి బలోపేతం కావటానికి తోడ్పడతుంది.

మెట్టు ఎక్కటం

ముందుగా మెట్టు దగ్గర నిలబడాలి. ఎడమ కాలును మెట్టుపై పెట్టి లేవాలి. తర్వాత కుడికాలును కూడా అదే మెట్టు మీదికి తేవాలి. అనంతరం ఎడమకాలును, తర్వాత కుడికాలును కిందికి దించాలి. కాస్త ఆయాసం వచ్చేంతవరకు దీన్ని చేయాలి.

కాళ్లు పైకి లేపటం

చాప మీద వెల్లకిలా పడుకోవాలి. కాళ్లను తిన్నగా చాచాలి. అలాగే చేతులను రెండు పక్కలా చాచాలి. ఇప్పుడు ఎడమ పాదాన్ని మోకాలు వద్దకు తెస్తూ కాలును వంచాలి. తర్వాత కుడికాలును నెమ్మదిగా పైకి లేపి, 5 సెకండ్ల పాటు నిలపాలి. తర్వాత ఎడమ కాలుతోనూ ఇలాగే చేయాలి. 5-7 సార్లు ఈ వ్యాయామాన్ని చేయాలి. దీన్ని కుర్చీలో కూచొని కూడా చేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని