వణుకుడు ఒంటికి వ్యాయామ రక్ష!

పార్కిన్సన్స్‌ బారినపడితే తల, చేతులు అదేపనిగా వణకటమే కాదు......

Published : 11 Apr 2017 01:50 IST

వణుకుడు ఒంటికి వ్యాయామ రక్ష! 

పార్కిన్సన్స్‌ బారినపడితే తల, చేతులు అదేపనిగా వణకటమే కాదు.. శరీర భంగిమ కూడా మారిపోతుంది. మెడ ముందుకు పొడుచుకొస్తుంది. భుజాలు కిందికి జారిపోతాయి. మోచేతులు, మోకాళ్లు కాస్త వంగిపోతాయి. వీటి మూలంగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ముద్ద సరిగా మింగలేకపోవటం, స్పష్టంగా పెద్దగా మాట్లాడలేకపోవటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. కదలికలు, నడక దెబ్బతినటం.. శరీరం స్థిరంగా ఉండలేకపోవటం వంటివీ వేధిస్తాయి. చిన్నపాటి వ్యాయామాలతో ఇలాంటి లక్షణాలను చాలావరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే వీటిని ఒకసారి చేసేసి వూరుకోకుండా.. రోజంతా వీలైనప్పుడల్లా తరచుగా చేస్తుంటే మంచి ఫలితం కనబడుతుంది.

* నడుము, రెక్క గూడు పూర్తిగా గోడకు తాకేలా నిటారుగా నిలబడాలి. అనంతరం తలను గోడ వైపునకు నెమ్మదిగా వెనక్కి లాక్కోవాలి. అయితే తలను వెనక్కి వంచకూడదు. కొద్దిసేపు అలాగే ఉన్నాక.. వీలైనంతవరకు అదే భంగిమలో ముందుకు నడవటానికి ప్రయత్నించాలి.

* ముందుగా కుర్చీలో నిటారుగా కూచోవాలి. వీపు భాగం పూర్తిగా కుర్చీకి ఆనించి ఉంచాలి. కొన్ని సెకండ్ల పాటు అలాగే కూచోవాలి. ఈ సమయంలో వీలైనంతవరకు వెన్ను ముందుకు వంగకుండా చూసుకోవాలి. కుర్చీలో కూచున్న ప్రతిసారీ ఇలా కనీసం మూడు సార్లు చేస్తుండాలి.

* కుర్చీలో విశ్రాంతిగా కూచొని ముందుకు వంగి, చేతులతో పాదాలను పట్టుకోవాలి. అనంతరం వెన్నెముక ముందుకు వంగకుండా చూసుకుంటూ నెమ్మదిగా లేస్తూ.. తిరిగి యథాస్థితికి రావాలి. కొద్ది సెకండ్ల పాటు అలాగే నిటారుగా కూచోవాలి. అయితే.. రక్తపోటు తక్కువగా గలవారు దీన్ని చేయకూడదు.

* ఉదయం పూట నిద్ర లేచాక 5 నిమిషాల సేపు వెల్లకిలా పడుకోవాలి. తల, మెడ వెనక్కి వాలిపోకుండా దిండు పెట్టుకోవాలి. కండరాలన్నింటినీ వదులుగా ఉంచుతూ.. గురుత్వాకర్షణ శక్తికి శరీరం తిన్నగా సాగేలా చూసుకోవాలి.

* మంచం లేదా చాప మీద బోర్లా పడుకోవాలి. చేతులు శరీరం పక్కనే ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా భుజాలను బిగుతుగా చేస్తూ దగ్గరకు లాక్కోవాలి. ఈ సమయంలో తలను, మెడను ఒకే రేఖలో తిన్నగా ఉంచాలి. కొన్ని సెకండ్ల పాటు అలాగే ఉండాలి. అయితే నడుం భాగం పైకి లేవకుండా చూసుకోవాలి.

* కూచున్నప్పుడు లేదా నిలబడినప్పుడు నెమ్మదిగా చుబుకాన్ని వెనక్కి లాక్కుంటూ.. మెడ నిటారు స్థితికి వచ్చేలా చూసుకోవాలి. తలను మాత్రం వెనక్కి వంచకూడదు. ఐదు సెకండ్ల పాటు అలాగే ఉండి, తిరిగి మామూలు స్థితికి రావాలి. ఈ సమయంలో తల మునుపటిలాగా ముందుకు వంగిపోకుండా చూసుకోవటానికి ప్రయత్నించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని